ఈ కథనం, 2019 పర్యావరణ రిపోర్టింగ్ విభాగంలో, రామ్‌నాథ్ గోయెంకా అవార్డును గెలుచుకున్న వాతావరణ మార్పులపై PARI ప్రచురించిన కథనాల వరుసలోనిది.
ప్రతి రోజు వాళ్లు ఉదయం 3 గంటలకే నిద్ర లేస్తారు. ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని 5 కల్లా పనిలోకి చేరాల్సి ఉంటుంది. వాళ్లు పని చేసే చోటు అనంతమైనది, ఎంతో తడితో కూడుకుని ఉన్నది, దానిని చేరుకోవడానికి కొంత సేపు నడిస్తే చాలు. తమ ఇళ్లలో నుండి బయటకు వచ్చి, సముద్రం దాకా నడిచి, అందులోకి దూకుతారు.
కొన్నిసార్లు దగ్గర్లోని దీవులకు పడవల్లో వెళ్లి, అక్కడ సముద్రంలోకి దూకుతారు. ఇలా, ఆ తర్వాతి ఏడు-పది గంటల వరకు దూకుతూనే ఉంటారు, ప్రతి ఒక్కసారి సముద్రపు నాచును ఎంతో జాగ్రత్తగా ఒడిసిపట్టుకుని పైకి వస్తారు - ఎందుకంటే, అదే వారి జీవానాధారం కాబట్టి. తమిళనాడులోని రామనాథపురం జిల్లా, భారతీనగర్ అనే మత్స్యకారుల వాడలో నివసించే ఈ మహిళలకు ఇలా సముద్రంలోకి దూకి, అందులోని మొక్కలను, నాచును వెలికి తీయడం అనేది ప్రధాన ఆదాయ మార్గం.
పని ఉన్న రోజుల్లో, బట్టలు, వల సంచులతో పాటు 'రక్షణా సామాగ్రి'ని కూడా తీసుకు వెళ్తారు. సముద్రపు నాచు లభించే దీవుల వద్దకు ఈ మహిళలు బోట్లలో వెళ్తారు. తమ చీరలను ధోతీల లాగా కాళ్ల మధ్య కట్టుకుని, వల సంచులను నడుము చుట్టూ అమర్చుకుని, చీరల మీద టీ-షర్టులను వేసుకుంటారు. వారి రక్షణా సామాగ్రిలో కళ్లకు గాగుల్స్, వేళ్ల చుట్టూ బట్ట ముక్కలు చుట్టుకుని లేదా సర్జికల్ గ్లవ్స్ వేసుకుని, పదునైన రాళ్ల వల్ల తమ పాదాలకు గాయాలు తగలకుండా రబ్బర్ చెప్పులు వేసుకుంటారు. సముద్రంలోకి దిగినప్పుడే కాక, దీవుల వద్ద కూడా వాళ్లు ఇవే వేసుకుంటారు.
సముద్రపు నాచును వెలికితీసే పని, ఈ ప్రాంతంలో తల్లుల నుండి కూతుళ్లకు వంశపారపర్యంగా వచ్చే ఒక సాంప్రదాయం. ఒంటరిగా ఉన్న లేదా పేదరికంలో ఉన్న కొందరు మహిళలకు ఇదొక్కటే జీవనాధారం.
సముద్రపు నాచు ఎక్కువగా దొరక్క, ఈ ఆదాయం కూడా సన్నగిల్లుతోంది. దీని వెనుక, గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతోన్న సముద్రపు నీటి స్థాయి, మారుతోన్న వాతావరణం, అలానే ఈ వనరును మితిమీరి కొల్లగొట్టడం అనే కారణాలు ఉన్నాయి.
“సముద్రపు నాచు లభ్యత చాలా క్షీణించింది,”అని పి. రక్కమ్మ (42) చెప్పారు. ఇక్కడ పని చేసే ఇతర మహిళల లాగానే, ఆమె కూడా తిరుప్పుళని బ్లాక్‌లోని మాయాకుళం గ్రామంలోని భారతీనగర్ వాడలో నివసిస్తారు. “ఇంతకు ముందు దొరికినంతగా ఇప్పుడు దొరకడం లేదు. ఈ మధ్య కాలంలో నెలకు 10 రోజుల పని మాత్రమే ఉంటోంది.” సంవత్సరంలో అయిదు నెలల్లో మాత్రమే క్రమపద్ధతిలో ఈ మహిళలు నాచును సేకరిస్తారు కాబట్టి, ఈ సమయంలోనూ నాచు లభించకపోవడం పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు. 2004 డిసెంబరులో వచ్చిన “సునామీ తర్వాత, అలలు మరింత ఉధృతమయ్యాయి, సముద్రంలో నీటి స్థాయి మరింత పెరిగింది” అని రక్కమ్మ అభిప్రాయపడ్డారు.

సముద్రపు నాచును వెలికితీసే పని, ఈ ప్రాంతంలో తల్లుల నుండి కూతుళ్లకు వంశపారపర్యంగా వచ్చే ఒక సాంప్రదాయం వంటిది; ఈ ఫోటోలో యు. పంచవరం, సముద్రపు నేల నుండి సముద్రపు నాచును వెలికితీస్తున్నారు
ఈ మార్పుల వల్ల, నాచు సేకరించే కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతోంది. వారిలో తన ఎనిమిదేళ్ల వయసు నుండి నాచు సేకరిస్తోన్న ఎ. మూకుపొరి అనే మహిళ ఒకరు. చిన్నవయస్సులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె బంధువులు, మద్యానికి బానిసైన ఒక వ్యక్తితో ఆమెకు పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న మూకుపొరి, తన భర్త, ముగ్గురు కూతుళ్లతో నివసిస్తున్నారు. అయితే, ఆమె భర్త ఏ కొంత కూడా సంపాదించలేని, కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నారు.
తన కుటుంబాన్ని పోషించే ఏకైక వ్యక్తిగా, “సముద్రపు నాచును సేకరించడం వల్ల వచ్చే ఆదాయం ఇప్పుడు సరిపోవడం లేదు” అని ఆవిడ చెప్పారు. ఆ ఆదాయంతోనే తన ముగ్గురు కూతుళ్లను చదివించాలి. ఆమె పెద్ద కూతురు B. Com డిగ్రీ పూర్తి చేసే దశలో ఉంది. రెండవ కూతురు కాలేజీలో చేరేందుకు వేచి చూస్తోంది. చిన్న కూతురు 6వ తరగతి చదువుతోంది. తన పరిస్థితి “మెరుగయ్యే దాఖలాలు కనిపించడం లేదు” అని మూకుపురి భయపడుతున్నారు.
ఆమెతో పాటు, ఈ పని చేసే ఇతర కార్మికులు ముత్తురాయర్ కులానికి చెందిన వారు, వీరిని తమిళనాడు రాష్ట్రంలో మోస్ట్ బ్యాక్‌వర్డ్ కమ్యూనిటీగా (ఎం. బి. సి) వర్గీకరిస్తారు. తమిళనాడుకు ఉన్న 940 కిలోమీటర్ల తీరం గుండా ఉన్న నాచు సేకరణ కార్మికురాళ్ల సంఖ్య 600కు మించి ఉండదని రామనాథపురం మత్స్య కార్మికుల యూనియన్ అధ్యక్షులు అ. పల్సామి అంచనా వేశారు. అయినప్పటికీ వారి కష్టం, ఈ రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎందరో ప్రజలను చేరుతోంది.
“మేము వెలికితీసే సముద్రపు నాచు అగర్ తయారీలో ఉపయోగపడుతుంది,” అని పి. రాణియమ్మ (42) వివరించారు. అది ఒక జెలాటిన్ పదార్థం, దానిని ఆహారాలలో థిక్కెనర్‌గా ఉపయోగిస్తారు.
ఇక్కడి నుండి వచ్చే సముద్రపు నాచు ఆహార పరిశ్రమలలో, రసాయనిక ఎరువులలో, అలాగే ఫార్మా పరిశ్రమలలో మందుల తయారీలోనే కాక ఇతర ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతోంది. ఈ మహిళలు సేకరించి ఎండబెట్టిన నాచును మదురై జిల్లాలోని కర్మాగారాలకు ప్రాసెసింగ్ కోసం పంపుతారు. ఈ ప్రాంతంలో రెండు రకాల నాచు లభిస్తుంది, అవి మట్టకోరై (గ్రేసిలారియా) మరియు మరికొళుందు (గెల్డియం అమాన్సీ). గెల్డియంను కొన్నిసార్లు, సలాడ్‌లు, పుడ్డింగ్‌లు, జామ్‌ల వంటి ఆహార పదార్థాలలో చేర్చుతారు. ఈ నాచు, డైట్ పాటించే వారికి ఉపయోగకరంగా ఉంటుందని, మలబద్ధకాన్ని నయం చేస్తుందనీ కొందరు నమ్ముతారు. మట్టకోరైని (గ్రేసిలారియా) దుస్తులకు రంగులద్దడంతో పాటు ఇతర పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.
అయితే, ఈ నాచుకు ఎన్నో పరిశ్రమలలో ఉన్న ఉపయోగాల వల్ల, దీన్ని మితిమీరి సేకరించడం జరుగుతోంది. నాచు వెలికితీతను క్రమబద్ధీకరించకుండా ఎడాపెడా సేకరించడం వల్ల దీని లభ్యత బాగా తగ్గిందని కేంద్ర ఉప్పు మరియు సముద్ర రసాయనాల పరిశోధనా సంస్థ (మండపం క్యాంప్, రామనాథపురం) పేర్కొంది.

మరికొళుందు అనే ఆహార రకానికి చెందిన సముద్రపు నాచుతో పి. రాణియమ్మ
ఈ తగ్గుదల వల్ల వారు సేకరించగలిగే నాచు పరిమాణం బాగా సన్నగిల్లింది. “అయిదేళ్ల క్రితం, ఏడు గంటలు సేకరిస్తే కనీసం 10 కిలోల మరికొళుందు లభించేది. కానీ ఇప్పుడు, రోజుకు మూడు, నాలుగు కిలోలకు మించి దొరకడం లేదు. అంతే కాక, సముద్రపు నాచు సైజు కూడా ఒక్కో ఏడాది తగ్గుతూ వస్తోంది” అని ఎస్. అమృతం (45) చెప్పారు.
అందువల్ల, ఈ నాచు మీద ఆధారపడ్డ పరిశ్రమలు కూడా క్షీణించసాగాయి. 2014 దాకా మదురైలో 37 అగార్ యూనిట్లు ఉండేవి అని ఎ. బోస్ చెప్పారు. ఈయన ఆ జిల్లాలో నాచు ప్రాసెసింగ్ పరిశ్రమలలో ఒకదానికి అధిపతి. నేడు కేవలం ఏడు యూనిట్లు మిగిలాయి, అవి కూడా 40% సామర్థ్యంతో పని చేస్తున్నాయని ఆయన చెప్పారు. బోస్, ఆల్ ఇండియా అగర్ మరియు ఆల్గినేట్ తయారీదారుల సంక్షేమ సంఘానికి ప్రెసిడెంట్‌గా పని చేసే వారు. అయితే గత రెండేళ్లుగా సభ్యులు లేని కారణంగా ఆ సంఘం మనుగడలో లేకుండా పోయింది.
“మాకు పని దొరికే రోజులు బాగా తగ్గిపోయాయి,” అని ఎమ్. మారియమ్మ (55) చెప్పారు. ఆవిడ నాలుగు దశాబ్దాలుగా సముద్రపు నాచును వెలికితీస్తున్నారు. “ఆఫ్-సీజన్‌లో మాకు ఇతర ఉపాధి అవకాశాలేవీ దొరకవు.”
1964లో మారియమ్మ జన్మించినప్పుడు, మాయాకుళం గ్రామంలో సంవత్సరంలోని 179 రోజులలో ఉష్ణోగ్రత 38 డిగ్రీల సెల్సియస్ లేదా అంత కంటే ఎక్కువగా ఉండేది. 2019లో అలాంటి ఉష్ణోగ్రతలు ఉండే రోజుల సంఖ్య 271కి, అంటే యాభై శాతం కంటే పైగా పెరిగింది. వచ్చే 25 ఏళ్లలో ఈ ప్రాంతంలో అటువంటి రోజులు 286 నుండి 324 వరకు ఉండే అవకాశం ఉందని ఈ జులై నెలలో న్యూయార్క్ టైమ్స్ దినపత్రిక ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన వాతావరణ మరియు గ్లోబల్ వార్మింగ్ ఇంటరాక్టివ్ టూల్ లెక్కించింది. సముద్ర జలాలు కూడా వేడెక్కుతున్నాయనడంలో సందేహం లేదు.
దీని ప్రభావం భారతీనగర్‌లోని మత్స్యకారుల మీద మాత్రమే పడడం లేదు. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లయిమేట్ చేంజ్ (IPCC) తాజా రిపోర్ట్‌లో సముద్రపు నాచు ద్వారా వాతావరణంలో మార్పును నిరోధించవచ్చనే పరిశోధనలను ఆమోదించకుండా ప్రస్తావించింది. “సముద్రపు నాచు సంబంధింత ఆక్వా కల్చర్‌పై మరిన్ని పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది" అని ఆ రిపోర్ట్ అంగీకరించింది.
ఆ రిపోర్ట్ ప్రధాన రచయితలలో కోల్‌కతా జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర పరిశోధనల విభాగానికి చెందిన ప్రొఫెసర్ తుహిన్ ఘోష్ ఒకరు. నాచు లభ్యత తక్కువగా ఉంటోందంటోన్న మత్స్యకారుల అభిప్రాయంతో ఆయన ఏకీభవిస్తున్నారు. “ఒక్క సముద్రపు నాచు మాత్రమే కాదు, [మైగ్రేషన్] వంటి ఎన్నో ప్రక్రియల వేగంపై ప్రభావం పడుతోంది,” అని ఆయన PARIతో జరిపిన ఫోన్ సంభాషణలో పేర్కొన్నారు. “ చేపల దిగుబడితో పాటు , రొయ్యల బీజాలు, పీతలు, తేనెపట్లు, మొదలైనటువంటి, సముద్రానికి నేలకు సంబంధం కలిగిన ఎన్నో రకాల ప్రాణుల దిగుబడి, అలాగే వాటి మైగ్రేషన్ కూడా ప్రభావితమయ్యాయి ( సుందర్బన్ల లాగా ).”

“కొన్నిసార్లు, ఇక్కడి నుండి దగ్గర్లోని దీవులకు ఈ మహిళలు ఒక పడవలో ప్రయాణించి వెళ్లి అక్కడ సముద్రంలోకి దూకుతారు"
మత్స్యకారుల మాటల్లో నిజముందని ప్రొఫెసర్ ఘోష్ చెప్పారు. “అయితే, చేపల విషయానికొస్తే, మారుతోన్న పర్యావరణం మాత్రమే కాక – ట్రాలర్లు మితిమీరి చేసే సేకరణ మరియు పరిశ్రమలు పెద్ద మొత్తంలో చేసే ఫిషింగ్ వల్ల కూడా ఎంతో ప్రభావం పడుతోంది. ఈ చర్యల వల్ల, మత్స్యకారులు సాంప్రదాయ పద్ధతులలో చేపలు పట్టే సాధారణ ఛానెళ్లలో తీవ్రమైన కొరత ఏర్పడింది.”
ట్రాలర్ల వల్ల సముద్రపు నాచుపై ప్రభావం పడకపోయినా, పరిశ్రమల కోసం మితిమీరి సేకరించడం వల్ల తప్పకుండా ప్రభావం పడింది. ఈ ప్రక్రియలో తమ పాత్ర గురించి భారతీనగర్‌కు చెందిన మహిళలు, ఇతర కార్మికులు ఆలోచించినట్లు కనబడుతోంది. తగ్గుముఖం పట్టిన దిగుబడులను చూసి ఆందోళన చెందిన ఈ మహిళలు, తమలో తాము సమావేశాలు ఏర్పరుచుకుని ఈ విషయాన్ని చర్చించి, క్రమం తప్పకుండా సేకరించే వ్యవధిని జులై నుండి కేవలం అయిదు నెలలకు మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించుకున్నారని, వారితో కలిసి పని చేసే సామాజిక కార్యకర్తలు, పరిశోధకులు తెలియజేశారు. ఆ తర్వాత మూడు నెలల పాటు, వారు సముద్రంలోకి అడుగు కూడా పెట్టరు. తద్వారా, సముద్రపు నాచు తిరిగి పెరిగేందుకు సమయం ఇస్తారు. మార్చి నుండి జూన్ వరకు, నాచును నెలలో కొన్ని రోజులు మాత్రమే సేకరిస్తారు. సరళంగా చెప్పాలంటే, ఈ నాచు సేకరణ ప్రక్రియపై ఈ మహిళలు స్వీయ నియంత్రణను నెలకొల్పుకున్నారు.
అది సమంజసమైన చర్యే కానీ దాని వల్ల వారికి ఎంతో నష్టం కలుగుతోంది. “మత్స్యకారులైన మహిళలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) ప్రకారం పని కేటాయించరు,” అని మారియమ్మ చెప్పారు. “నాచు సేకరించే సీజన్‌లో కూడా మేము రోజుకు రూ. 100 - 150 కూడా సంపాదించలేము.” ఈ సీజన్‌లో, ఒక్కో మహిళ రోజుకు 25 కిలోగ్రాముల సముద్రపు నాచును సేకరించగలరు కానీ దానికి వారికి అందే రేటు (అది కూడా తగ్గుతోంది) ఆ నాచు రకాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
వీటన్నిటికీ తోడుగా, నిబంధనలు మరియు చట్టాలలో వచ్చిన మార్పులు మరిన్ని కష్టాలను తీసుకొచ్చాయి. 1980 వరకు నల్లతీవు, చల్లి, ఉప్పుతణ్ని వంటి సుదూర దీవులకు వెళ్లగలిగే వారు. వాటిలో కొన్నింటిని చేరుకోవడానికి బోట్ ద్వారా రెండు రోజులు పడుతుంది. అలా ప్రయాణించి వెళ్లి, ఒక వారం పాటు సముద్రపు నాచును సేకరించి ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేవాళ్లు. కానీ ఆ సంవత్సరంలో, వారు వెళ్లే వాటిలో 21 దీవులు గల్ఫ్ ఆఫ్ మరీనా మెరైన్ నేషనల్ పార్క్‌లో భాగమయ్యాయి, తద్వారా అవి అటవీ శాఖ అధికారిక పరిధిలోకి వచ్చాయి. ఆ దీవులలో బస చేయడానికి ఈ శాఖ వారికి అనుమతిని నిరాకరించడమే కాక, వాటిని ఉపయోగించనివ్వకుండా నిషేధించింది. నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేసినా ప్రభుత్వం నుండి ఏ కదలికా రాలేదు. దీవుల వైపు వెళ్తే రూ. 8,000 నుండి 10,000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందనే భయంతో వాళ్లు వాటి వైపు వెళ్లడం దాదాపు ఆపివేశారు.

సముద్రపు నాచును సేకరించడానికి ఈ మహిళలు ఉపయోగించే వల సంచులు; ఇలా సేకరించేటప్పుడు వారికి తరచుగా గాయాలై రక్తం కారుతుంది, అయితే ఒక సంచి నిండితే దాని వల్ల వచ్చే ఆదాయంతో తమ కుటుంబాలను పోషించుకోవచ్చు
అందువల్ల ఆదాయం కూడా తగ్గింది. “ఆ దీవులలో ఒక వారం పాటు శ్రమిస్తే కనీసం రూ. 1,500 నుండి 2,000 వరకు సంపాదించేవాళ్లం,” అని ఎస్. అమృతం చెప్పారు. ఆవిడ తన 12 ఏళ్ల వయస్సు నుండి సముద్రపు నాచును వెలికితీసేవారు. “మట్టకోరై, మరికొళుందు సముద్రపు నాచు రెండూ మాకు లభించేవి. ఇప్పుడు ఒక వారంలో రూ. 1,000 సంపాదించడం కూడా కష్టమవుతోంది.”
ఈ కార్మికులకు గ్లోబల్ వార్మింగ్ గురించిన పలు అభిప్రాయాలు తెలియకపోవచ్చు కానీ దాని ప్రభావం గురించి కొద్దో గొప్పో తెలుసుకున్నారు, సొంతంగా చవి చూశారు. తమ జీవితాలలో అలాగే వృత్తిలో పలు మార్పులు జరుగుతున్నాయని వారు గ్రహించారు. సముద్రంలో అలల ఉధృతి, అలాగే ఉష్ణోగ్రతలు, వాతావరణం వంటి వాటిలో జరిగే మార్పులను వారు గమనించారు, ప్రత్యక్షంగా అనుభవించారు కూడా. జరుగుతోన్న ఎన్నో మార్పుల వెనుక గల మానవ ప్రమేయం గురించి (తమతో సహా) కూడా అర్థం చేసుకున్నారు. మరో వైపు, సంక్లిష్టమైన ఈ ప్రక్రియలలో తమకున్న ఒకే ఒక్క జీవనోపాధి చిక్కుకుపోయింది. తమకు మరో మార్గమేదీ చూపడం లేదని వారికి తెలుసు, తమను MGNREGA పథకం నుండి మినహాయించడం గురించి మారియమ్మ చెప్పిన మాటలు వింటే ఆ విషయం స్పష్టమౌతోంది.
మధ్యాహ్నం నుండి నీటి స్థాయి పెరుగుతుంది, అందువల్ల ఆ రోజు పనిని అప్పటితో ముగించేస్తారు. కొన్ని గంటలలో, వారు సేకరించిన సముద్రపు నాచును, అక్కడికి వెళ్లిన బోట్లలోనే తిరిగి తీసుకు వచ్చి ఒడ్డు వద్ద ఆ వల సంచులను పరుస్తారు.
వారు చేసే పని ఎంతో క్లిష్టమైనది, రిస్క్‌తో కూడుకున్నది. ఇటీవలి రోజుల్లో సముద్రంలోని అలలు ఉధృతంగా మారుతున్నాయి, కొన్ని వారాల క్రితం, ఈ ప్రాంతంలోని తుఫానులో ఇరుక్కుని నలుగురు మత్స్యకారులు మరణించారు. వారిలో ముగ్గురి మృతదేహాలను మాత్రమే వెలికితీయగలిగారు. నాలుగవ మృతదేహం కూడా దొరికిన తర్వాతనే, సుడి గాలులు, అలలు శాంతరూపం దాలుస్తాయని స్థానికులు నమ్ముతారు.
సముద్రపు పని సాఫీగా సాగాలంటే వీచే గాలి తోడ్పాటు ఉండాల్సిందే అని స్థానికులు నమ్ముతారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల పర్యావరణంలో మార్పులు వచ్చే కొద్దీ, రోజు రోజుకీ వాతావరణం అనూహ్యంగా మారుతోంది. అయినప్పటికీ, ఈ మహిళలు తమ జీవనోపాధికి ఒకే ఒక్క ఆధారం అయిన ఈ సముద్రంలోకి రోజూ దూకుతారు. ఇలా చేయడానికి తమ ప్రాణాల కోసం ఎదురీదాల్సి వచ్చినా కూడా లెక్క చేయరు.

సముద్రపు నాచు కోసం పడవను సముద్రంలోకి తీసుకెళ్లడానికీ - వీచే గాలి సరైన దిశలో ఉండకపోతే, సముద్రంలో ఏ పనైనా చేయడం కష్టం. శీతోష్ణ స్థితిలో వచ్చే భారీ మార్పుల వల్ల, చాలా రోజుల్లో వాతావరణం అనూహ్యంగా మారుతోంది

సముద్రపు నాచును వెలికితీయడానికి చిరిగిన గ్లవ్స్‌తోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి, దీని వల్ల రాళ్ల నుండి, తేమ నుండి అరకొరగా మాత్రమే రక్షణ ఉంటుంది

వలలను సిద్ధం చేయడం: ఈ మహిళల రక్షణా సామాగ్రిలో ఇవి ఉంటాయి - గాగుల్స్, చేతులకు రబ్బరుతో లేదా బట్టతో చేసిన గ్లవ్స్, పాదాలు పదునైన రాళ్లకు తగిలి గాయాలు కాకుండా రబ్బర్ చెప్పులు

అలల ఉధృతికి ఎదురోడి ఈదుతూ, రీఫ్‌లను చేరుకోవడానికి ప్రయత్నిస్తోన్న ఎస్. అమృతం

సముద్రపు నాచును సేకరించడానికి వాడే వలల సంచిని తాడుతో బిగిస్తోన్న ఎమ్. మారియమ్మ

దూకడానికి సిద్ధం

ఆ తర్వాత దూకడమే, సముద్రం లోపలి నేలను చేరుకునేందుకు ముందుకు సాగే ప్రయత్నం

అనంతమైన అంతరాళంలోకి పయనం - ఈ మహిళలు పని చేసుకునే స్థలం, కాంతి కూడా చేరుకోలేని, చేపలు, ఇతర జీవులు నివసించే సముద్ర గర్భం

పొడవైన ఆకులు గల ఈ సముద్రపు నాచును మట్టకొరై అంటారు, దీనిని ఎండబెట్టి దుస్తులకు రంగులద్దడంలో ఉపయోగిస్తారు

రాణియమ్మ 'మరికొళుందు'ను సేకరించడానికి, సముద్రపు నేల మీద ఉండి ఎన్నో క్షణాల పాటు తన ఊపిరిని బిగబట్టి ఉండాలి

ఆ తర్వాత, తమ కష్టార్జితమైన నాచును చేతబట్టి, ఎగిసే అలల మధ్యకు తేలి వస్తారు

పెద్ద అల వస్తోంది, అయినా కూడా మధ్యాహ్నం వరకు ఈ మహిళలు పని చేస్తూనే ఉంటారు

ఒకసారి దూకి పైకి తేలి వచ్చిన తర్వాత సముద్రపు నాచును వెలికితీసే ఒక మహిళ తన సామాగ్రిని శుభ్రపరుచుకుంటున్నారు

అలసట వల్ల నీరసించిపోయి, తిరిగి ఒడ్డుకు చేరుకుంటున్నారు

తాము సేకరించిన సముద్రపు నాచును ఒడ్డు వరకు మోసుకెళ్తున్నారు

వలల సంచులలో ఆ రోజు సేకరించిన ముదురు ఆకుపచ్చ రంగు నాచును పోగేస్తోన్న ఇతరులు

సముద్రపు నాచును లోడ్ చేసిన ఒక చిన్న పడవ ఒడ్డును చేరుకుంటోంది, ఒక కార్మికురాలు యాంకర్ వేయడంలో సహాయం చేస్తున్నారు

వెలికి తీసిన సముద్రపు నాచును అన్‌లోడ్ చేస్తోన్న కార్మికులు

ఆ రోజు సేకరించిన నాచును తూకం వేస్తున్నారు

సముద్రపు నాచును ఎండబెట్టేందుకు సిద్ధం అవుతున్నారు

ఎండబెట్టడానికి పరచిన సముద్రపు నాచు ఇరువైపులా ఉండగా, తాము సేకరించిన నాచును ఇతరులు మోసుకుని వెళ్తున్నారు

గంటల తరబడి సముద్రం వద్ద, సముద్రం లోపలా పని చేసిన తర్వాత, నేల మీద ఉండే తమ ఇళ్లకు తిరిగి వస్తారు
కవర్ ఫోటో: వల సంచీని లాగుతోన్న ఎ. మూకుపొరి (35). ఆమె 8 ఏళ్ల వయస్సప్పటి నుండి సముద్రపు నాచును సేకరిస్తున్నారు. (ఫోటో: ఎమ్. పళని కుమార్/PARI)
ఈ వార్తా కథనాన్ని రాయడంలో ఉదారంగా సాయం అందించిన ఎస్. సెంథలిర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
సాధారణ ప్రజల జీవితాలపై గ్లోబల్ వార్మింగ్ వల్ల కలిగిన ప్రభావాన్ని వారి దృక్పథం నుండే అందరికీ తెలియజేయాలని UNDP సంకల్పించింది. అందులో భాగంగా, గ్లోబల్ వార్మింగ్‌పై దేశవ్యాప్తంగా PARI చేపట్టిన రిపోర్టింగ్‌కు UNDP మద్దతిస్తోంది.
ఈ వార్తా కథనాన్ని పునఃప్రచురించాలని అనుకుంటున్నారా? అయితే namita@ruralindiaonline.org అడ్రస్‌ను ccలో చేర్చి zahra@ruralindiaonline.org అడ్రస్‌కు ఈమెయిల్ పంపండి.
అనువాదం: శ్రీ రఘునాథ్ జోషి