ఫ్ఫా….ట్!
అది తుప్కీ నుంచి పెంగ్ పండు తుపాకీ గుండు పేలిన శబ్దం! ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ పట్టణంలో జరిగే గొంచా ఉత్సవంలో ఈ రెండూ కలసి వేడుకగా గౌరవ వందనం చేస్తాయి
తుప్కీ అంటే వెదురు గొట్టంతో తయారు చేసే ఒక 'తుపాకీ'. ఇందులో పెంగ్ అనే అడవి పండును తుపాకీ గుండుగా ఉపయోగిస్తారు. ఈ ప్రసిద్ధ పండుగ సందర్భంగా భగవాన్ జగన్నాథుని ' రథం ' చుట్టూ ఈ 'తుపాకులు ' పేల్చి వందనం చేస్తారు. జూలై నెలలో జరిగే ఈ పండుగకు రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతం నుండి వేలాది మంది ప్రజలు తరలివస్తారు.
"గొంచా పండుగకు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలు ఖచ్చితంగా ఈ తుప్కీ ని కొంటారు," అని జగదల్‌పూర్ నివాసి వనమాలి పాణిగ్రాహి చెప్పారు. ఈ తుప్కీ ని ఉపయోగించకుండా రథం ఊరేగింపు జరిగిన సంఘటన ఏదీ ఆయనకు గుర్తులేదు.
ఈ వెదురు తుపాకీలో తుపాకీ గుండుగా ఉపయోగించే పెంగ్ అనే ఒక చిన్న, గుండ్రని ఆకుపచ్చ కలిసిన పసుపు వన్నె పండు- సమీపంలోని అడవులలో పెరిగే మల్కాంగిని (సెలాస్ట్రస్ పానిక్యులాటస్ వైల్డ్) అనే పొడవాటి తీగకు గుత్తులు గుత్తులుగా కాస్తుంది.
ఈ గొంచా పండుగ పూరీలో కూడా జరుగుతుంది కానీ తుప్కీ , పెంగ్ లతో వందనం చేయటం ఒక్క బస్తర్ ప్రాంతానికి మాత్రమే ప్రత్యేకం. ఈ వెదురు ‘తుపాకీ’ని అడవులలోని జంతువులను తరిమేయడానికి ఉపయోగిస్తారు.




పైన ఎడమ: జగన్నాథుని రథం నుంచి దింపుతోన్న ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ ఆలయ పూజారులు. పైన కుడి: రథం చుట్టూ సందడిచేస్తోన్న జనం. క్రింద ఎడమ: తుప్కీ చుట్టూ వెదురు ఆకులను చుట్టి అలంకరిస్తోన్న సోన్‌సాయ్ బఘేల్. క్రింద కుడి: తుప్కీ , పెంగ్‌లను ధరించి పేల్చడానికి సిద్ధంగా ఉన్న ఒక భక్తుడు !
నలబయ్యవ వడిలో ఉన్న సోన్‌సాయ్ బఘేల్ జమవాడా గ్రామంలో నివసిస్తున్న ఒక రైతు, వెదురు హస్తకళాకారుడు కూడా. ధుర్వా ఆదివాసి అయిన ఈయన తన భార్యతో కలిసి, జూలైలో జరిగే పండుగకు కొన్ని వారాల ముందుగానే, జూన్ నెల నుండి తుప్కీ లను రూపొందించే పనిలో ఉంటారు. “ప్రతి సంవత్సరం పండుగకు ముందే మేం తుప్కీ లను తయారుచేయడం మొదలెడతాం. (ముందుగానే) వెదురును అడవి నుండి సేకరించి, ఎండబెడతాం” అని ఆయన చెప్పారు.
ఒక వెదురు కొమ్మను గొడ్డలి, కత్తి ఉపయోగించి బోలుగా తొలిచి తుప్కీ ‘తుపాకీ’ని తయారుచేస్తారు. ఆ తర్వాత రంగురంగుల ఆకులు, కాగితాలతో తుప్కీ ని అలంకరిస్తారు.
"పక్వానికి వచ్చిన పెంగ్ ను మేం అడవుల నుండి సేకరిస్తాం. మార్చి నెల తర్వాత ఈ పండు లభిస్తుంది. దాదాపు వంద పండ్లు ఉండే ఒక గుత్తిని పది రూపాయలకు అమ్ముతారు. ఇది ఔషధ గుణాలున్న పండు. ఈ పండు నుంచి వచ్చే నూనె ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులకు చక్కగా పనిచేస్తుందని చెప్తారు." అన్నారు సోన్‌సాయ్. ఇది తుపాకీ గుండుగా కూడా చక్కగా సరిపోతుంది.
తుప్కీ లను తయారుచేసి అమ్మడం, ఈ ప్రాంతం లోని అనేకమందికి ఏటా లభించే ఒక ఆదాయ వనరు. అదేవిధంగా పండుగ సమయంలో ప్రతి గ్రామంలోనూ తుప్కీలు తయారుచేసేవారు పుట్టుకొస్తారు. ఒక తుప్కీ వెల 35-40 రూపాయలుంటుంది. వీటిని అమ్మేందుకు, తన ఊరికి 12 కిలో మీటర్ల దూరంలో ఉన్న జగదల్‌పూర్‌కు భగేల్ వెళ్తుంటారు. మూడు దశాబ్దాల క్రితం ఒక తుప్కీ ధర రెండు రూపాయలు ఉండేదని భగేల్ చెప్పారు.
బఘేల్ బస్తర్ జిల్లా, జగదల్‌పూర్ బ్లాక్‌లో ఉన్న తన నాలుగెకరాల భూమిలో వర్షాధార వరి పంటను పండిస్తారు. 780 కుటుంబాలు నివసించే అతని గ్రామమైన జమవాడలో 87 శాతం మంది ధుర్వా, మారియా ఆదివాసీ సముదాయాలకు చెందినవారే (2011 జనగణన).

గొంచా ఉత్సవంలో పనస్ కుఆ (పనసపండు తొనలు) అమ్ముతోన్న మహిళలు. ఇది జగన్నాథునికి అర్పించే ప్రసిద్ధ నైవేద్యం


ఎడమ: జగదల్‌పూర్ పట్టణంలో కొత్త రథాన్ని నిర్మిస్తోన్న శిల్పులు. రథాలను సాల , టేకు వృక్షాల కలపతో నిర్మిస్తారు. కుడి: జగదల్‌పూర్‌లోని శిరాసర్ భవనాన్ని సమీపిస్తున్న రథం వైపుకు పరుగులు తీస్తున్న భక్తులు
జగన్నాథునికి సంబంధించిన ఒక కథలో ఈ గొంచా ఉత్సవపు మూలాలున్నాయి. చాళుక్య వంశానికి చెందిన బస్తర్ రాజు పురుషోత్తమ్ దేవ్ జగన్నాథునికి బంగారం, వెండి సమర్పించడానికి పూరీకి వెళ్తాడు. ఈ నైవేద్యాలకు సంతోషించిన పూరీ రాజు సూచన మేరకు, జగన్నాథ ఆలయ పూజారులు 16 చక్రాల రథాన్ని పురుషోత్తమునికి బహుమతిగా ఇస్తారు.
ఆ తర్వాత సాల , టేకు వృక్షాల కలపతో నిర్మించిన ఆ పెద్ద రథాన్ని విడదీసి, నాలుకు చక్రాలను బస్తర్‌లో ఉన్న జగన్నాథునికి కానుక చేశారు. బస్తర్‌లో గొంచా ఉత్సవంగా పిలిచే రథ యాత్ర కు మూలం ఇదే. (మిగిలిన 12 చక్రాల రథాన్ని దంతేశ్వరి మాతకు అర్పించారు.)
పురుషోత్తం దేవ్ ఒక తుప్కీ ని చూసి దానిని గొంచా పండుగలో ఉపయోగించడానికి అనుమతించాడు. ఈ పండుగ సందర్భంగా, జన్నాథునికి పనస్ కుఆ ను నైవేద్యంగా పెడతారు. పనస పండును హల్బీ భాషలో పనస్ కుఆ అంటారు. జగదల్‌పూర్ నగరంలోని గొంచా ఉత్సవంలో సమృద్ధిగా లభించే పనస పండు ఒక అదనపు ఆకర్షణ.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి