రేఖకు పదిరోజుల క్రితమే, పెళ్లి చేసుకోవడం తప్ప తనకు వేరే గత్యంతరం లేదని అర్థమైపోయింది. ఆమె 15 ఏళ్ళ పిల్ల ఎంత వ్యతిరేకించగలదో అంత వ్యతిరేకత చూపింది కానీ ఆమె అమ్మానాన్న ఆ విషయాన్ని పట్టించుకోలేదు. “ఆమె ఏడ్చి తనకు ఇంకా చదువుకోవాలని ఉంది అని చెప్పింది”, అంది ఆమె తల్లి భాగ్యశ్రీ.
భాగ్యశ్రీ, ఆమె భర్త అమర్, ఇద్దరు వయసురీత్యా 30ల ఆఖరు అంచులో ఉన్నారు, మహారాష్ట్ర లోని బీడ్ జిల్లాలో ఒక పేద గ్రామంలో వారి పిల్లలతో కలిసి బ్రతుకుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ లో వాళ్ళు పశ్చిమ మహారాష్ట్ర లేక కర్ణాటకకు చెరకు పంటను కోయడానికి వెళ్తారు. ఆరునెలలు విపరీతంగా కష్టపడ్డాక వారిద్దరికి కలిపి 80,000 రూపాయిలు వస్తాయి. వారి పేరు మీద భూమి లేదు, చెరకు పంట కోత మాత్రమే వారి కుటుంబ సంపాదన. వీరిది దళిత వర్గానికి చెందిన మాతంగి కులం.
ప్రతిసారి తన తల్లిదండ్రులు వలస వెళ్ళినప్పుడు. రేఖ, ఆమె తోబుట్టువులు(ఒకరికి 12, మరొకరికి 8 ఏళ్ళు) వాళ్ల నాయనమ్మ దగ్గర ఉండేవారు. కానీ ఆమె పోయిన సంవత్సరం మే నెలలో చనిపోయింది. ఈ పిల్లలు ముగ్గురూ ఊరు బయటనున్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. కానీ మార్చ్ 2020 లో వచ్చిన ఈ మహారోగం అన్ని బడులను బలవంతంగా మూయించినప్పుడు, 9వ తరగతి చదువుతున్న రేఖ, ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది. 500 రోజులు గడిచిపోయినా బీడ్ లో బడులు ఇంకా మూతబడే ఉన్నాయి.
“మాకు, బడులు ఇప్పటిలో తెరవరని అర్థమైంది.” అన్నది భాగ్యశ్రీ. “బడి తెరిచి ఉన్నప్పుడు, అక్కడ టీచర్లు, పిల్లలు చుట్టూ ఉండేవారు. ఊరు హడావిడిగా ఉండేది. బడి మూసేసాక, ఆమెని వదిలి ఎక్కడికి వెళ్లలేకపోతున్నాం. జాగ్రత్త పడాలి కదా.”
కాబట్టి భాగ్యశ్రీ, అమర్, రేఖను 22 ఏళ్ళ ఆదిత్యకి ఇచ్చిపెళ్లి చేసేశారు. ఆదిత్య వాళ్ళ ఊరు వీరి ఊరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. వాళ్ళు కూడా వలస కూలి పనికే వెళ్తారు. నవంబర్ 2020లో చెరుకు పంటను కోసే సమయంలో, రేఖ, ఆదిత్య పశ్చిమ మహారాష్ట్రకు వెళ్లారు. ఆమె పేరు మాత్రం స్కూల్ రిజిస్టరులో ఉండిపోయింది.
కౌమార వయసులో ఉన్న రేఖ, ఆమె వంటి చిన్నవయసులో ఉన్న అమ్మాయిలు ఈ మహారోగం వలన బలవంతంగా పెళ్లి లోకి తోసివేయబడుతున్నారు. మార్చ్ 2021 లో విడుదల చేసిన UNICEF నివేదిక లోని కోవిద్ 19: పురోగతికి బాల్యవివాహాల ముప్పు అధ్యాయం, ఈ దశాబ్దపు చివరకు ప్రపంచంలో 10 మిలియన్ల అమ్మాయిలకు బాల్యవివాహ ముప్పు ఉందని చెబుతుంది. బడులు మూతబడడం, పేదరికం పెరగడం, తల్లిదండ్రుల చావు, ఇంకా కోవిడ్ వలన వచ్చే వేరే సమస్యల వలన, “ఇప్పటికే ఘోరంగా ఉన్న అమ్మాయిల పరిస్థితి మరింత ఘోరంగా మారుతోందని” ఆ నివేదిక చెబుతోంది.
గత 10 ఏళ్లుగా, బాల్యవివాహాలు 15 శాతం తగ్గాయి, దగ్గరగా 25 మిలియన్ పెళ్లిళ్లు ఆపగలిగారు, అని UNICEF నివేదిక చెబుతోంది. ఈ మధ్య కాలంలో వచ్చిన ఈ మహారోగం, ఈ పురోగతికి మళ్లీ ముప్పు తెస్తోంది- ముఖ్యంగా మహారాష్ట్ర లో.

బీడ్ లో జరిగే బాల్యవివాహాన్ని అడ్డగిస్తున్న అక్టీవిస్టులు, పోలీసులు
మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఏప్రిల్ 7 నుండి జూన్ 2021 వరకు రాష్ట్రంలో 780 బాల్య వివాహాలను అడ్డగించింది. ఇది సంప్రదాయవాద అంచనా అని తాంగ్డే, కాంబ్లే చెప్పారు
2015 నుండి 2020 వరకు బాల్య వివాహాలలో 4 శాతం తగ్గుదల ఉంది. 2015-16 నేషనల్ ఫామిలీ హెల్త్ సర్వే( NFHS - 4 ) తెలుసుకున్న విషయమేంటంటే, 26 శాతం పైనే 20-24 ఏళ్ళ మధ్య ఉన్నఆడవారికి, 18 నిండే లోపలే - అంటే చట్టరీత్య వారికి వివాహ వయసు రాకముందే పెళ్లి చేస్తున్నారు. 2019-2020( NFHS - 5 )లో ఈ నిష్పత్తి 22 శాతం ఉండేది. అదే సమయంలో 10.5 శాతం మంది 25-29 వయసున్న మగవారికి, 21 రాకముందే- అంటే చట్టరీత్యవారికి వివాహ వయసు రాక ముందే పెళ్లి జరిగింది.
బాల్య వివాహాల గురించి ఇంత సమాచారం ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం వీటిని అరికట్టడానికి ఏ విధమైన చర్యలూ తీసుకోలేదు. 34 ఏళ్ళ తత్వశిల్ కాంబ్లీ, బీడ్ లో సామాజిక ఉద్యమ కార్యకర్త, పిల్లల, యువత విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆన్లైన్ క్లాసుల మీదనే దృష్టి సారించారని, అవి కూడా ఇటువంటి సౌకర్యాలు, అంటే ఇంటర్నెట్, కనెక్టివిటీ అందిపుచ్చుకోగల పిల్లలకు మాత్రమే సాధ్యపడుతున్నాయని చెబుతున్నారు.
మహారాష్ట్రలో 18.5 శాతం గ్రామీణ కుటుంబాలకు మాత్రమే ఇంటర్నెట్ సౌకర్యం ఉంది, అని 2017-18 నేషనల్ శాంపిల్ సర్వేలో ఒక నివేదిక తెలుపుతోంది. గ్రామీణ మహారాష్ట్రలో దగ్గరగా 17 శాతం మనుషులకు(5 ఏళ్లు లేక దాని పైబడిన వారు) మాత్రమే ఇంటర్నెట్ వాడడం తెలుసు, అని ఆ నివేదిక చెబుతుంది, కానీ ఇందులో కూడా ఆడవారి నిష్పత్తి 11 శాతం మాత్రమే ఉంది.
చాలామంది ఇంటర్నెట్ అవకాశం లేనివారు వెనుకబడిన తరగతులకు చెందినవారై ఉంటారు. ఇక్కడ పేదరికం, ఆర్ధిక ఆలంబన లేకపోవడం వలన ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేస్తారు. పైగా స్కూళ్లను మూసివేయడం వలన పరిస్థితి ఇంకా ఘోరంగా మారింది. బీడ్ లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది.
బీడ్ లో దగ్గరగా 20-24 ఏళ్ళ మధ్య ఉన్న 44 శాతం ఆడవారికి, వారికి 18 ఏళ్ళు రాకముందే పెళ్లిళ్లు జరిగాయని 2019-2020లో చెప్పారు (NFHS -5). దీనికి ప్రధాన కారణం ప్రజలు చెరుకు పంటను కోసే పనికి వలస కూలీలుగా వెళ్లడమేనని - అది కూడా జిల్లాలో విపరీతమైన కరువు, వ్యవసాయ సంక్షోభం ఉండడం వలనేనని చెబుతున్నారు .
చెరకు పంట కోతకు పనివారిని పెట్టుకున్న కాంట్రాక్టర్లు పెళ్ళైన జంటలను ఈ పనికి తీసుకోవడానికి చూస్తారు. ఎందుకంటే ఈ పనికి ఇద్దరు మనుషులు కావాలి. ఒకరు చెరకును కొస్తే ఇంకొకరు వాటిని మోపులుగా కట్టి ట్రాక్టర్ మీద వేస్తారు. ఈ జంటను ఒక జట్టుగా చూస్తారు, దీనివలన వీరికి డబ్బు చెల్లించడం తేలికవుతుంది, అదే తెలియని ఇద్దరైతే మళ్లీ ఎవరికెంత ఇవ్వాలని వంతులతో గొడవలు సాగొచ్చు. అమ్మాయైతే పెళ్ళయ్యాక తన భర్త తో పాటుగా ప్రయాణించి అక్కడికి చేరుకొని పని సంపాదించుకోవచ్చు. ఈ రకంగా ఆమె తన భర్త తో భద్రంగా ఉండొచ్చు, పైగా వారి ఆర్ధిక భారం కూడా తగ్గుతుంది.
ఈ మహారోగ సమయంలో ఇంట్లో ఉండిపోతున్న పిల్లలను చూసి తల్లిదండ్రులు రెండు రకాలుగా స్పందిస్తున్నారు. “ఒకవేళ అది అబ్బాయైతే, బాల కార్మికుడిగా మార్చేస్తారు. అమ్మాయైతే బాల్య వివాహం చేసేస్తారు.” అన్నారు తత్వశిల్ కాంబ్లే. అవసరంలో ఉన్న పిల్లల రక్షణను చూసుకునే శిశు సంక్షేమ కమిటీ సభ్యుడిగా, కాంబ్లే బీడ్ లోని ఎన్నో బాల్యవివాహాలను అరికట్టగలిగారు.

తల్లిదండ్రులు ఆర్ధిక భారం వదిలించుకోవడానికి 12 ఏళ్ళ వయసున్న అమ్మాయిలకు కూడా పెళ్లి చేసేస్తున్నారు
బీడ్ తాలూకా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ(బాల్యవివాహాలను బాలకార్మికులను అరికట్టే సంఘం)లో సభ్యుడైన అశోక్ తాంగ్డేతో కలిసి కాంబ్లే 100కు పైగానే బాల్యవివాహాలను, మార్చ్ 2002 తరవాత, కోవిడ్-19 విజృంభిస్తున్న సమయంలో అరికట్టారు. “ఇవన్నీ మేము సరైన సమయానికి వెళ్లడం వలన ఆపగలిగాము”, అన్నారు 53 ఏళ్ళ తాంగ్డే. “వేళ్ళ సందులల్లోంచి జారిపోయిన కేసులెన్నో తెలీదు.”
ఈ మహారోగ సమయంలో ప్రజల కొనుగోలు సామర్ధ్యం తగ్గిపోయిన అంశం కూడా బాల్యవివాహాలలో పాత్ర పోషిస్తోంది. “పెళ్లికొడుకుల తల్లిదండ్రులు కట్నం ఎక్కువ కోసం విసిగించడం లేదు.” అన్నారు తాంగ్డే. పెళ్లిళ్లు చవక అయిపోయాయి అన్నారు. “ తక్కువ మంది చుట్టాలని పిలిచి పని అయిపోగొట్టేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ మందిని అతిధులుగా ఒప్పుకోవడం లేదు.”
ఇంకోవైపు, కోవిడ్ వలన వారు చనిపోతే ఆడపిల్లలు ఏమవుతారో అని తల్లిదండ్రులు భయపడుతున్నారు. వీటన్నిటి వలన బాల్యవివాహాలు పెరిగిపోయాయి. “కొంతమంది అమ్మాయిలకు 12 ఏళ్లకే పెళ్లిళ్లు అవుతున్నాయి.” అన్నారు తాంగ్డే.
మహారాష్ట్ర ప్రభుత్వ మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ ఏప్రిల్ 7 నుండి జూన్ 2021 వరకు రాష్ట్రంలో 780 బాల్య వివాహాలను అడ్డగించింది. ఇది సంప్రదాయవాద అంచనా అని తాంగ్డే, కాంబ్లే చెప్పారు. ఎందుకంటే బీడ్ లో 40 పెళ్లిళ్లు అరికట్టామని డిపార్ట్మెంట్ ఇచ్చిన సంఖ్య కన్నా, క్షేత్రస్థాయిలో వారిద్దరూ కలిసి ఇంకా ఎక్కువ పెళ్లిళ్లనే అరికట్టామని తాంగ్డే చెప్పారు.
సంప్రదాయ అంచనాల ప్రకారం వెళ్లినా కూడా ఈ మహారోగ సమయంలో ఇన్ని బాల్యవివాహాలు జరగడం పరిస్థితిని ఎత్తి చూపిస్తోంది. జనవరి 2019 నుండి సెప్టెంబర్ 2019 వరకు, రాష్ట్ర ప్రభుత్వ డేటా ప్రకారం, 187 బాల్యవివాహాలను నివారించగలిగారు. అంటే కోవిడ్ మహారోగం తరవాత సగటు నెలలో జరిగే బాల్యవివాహాలు 150 శాతం పెరిగాయన్న మాట.
కాంబ్లే, తాంగ్డేలకు ఈ పెళ్లిళ్లు నివారించడానికి సమాచారాన్ని ఇచ్చేవారుంటారు. “ఆశ వర్కర్లు కానీ గ్రామ సేవకులు గాని మాకు ఉప్పు అందిస్తారు”, అన్నారు కాంబ్లీ. “ కానీ వాళ్ళు కూడా అదే ఊరిలో ఉంటారు కాబట్టి, చాలాసార్లు భయపడతారు. పెళ్లి చేస్తున్న కుటుంబాలకు ఈ విషయం తెలిస్తే, సమాచారం ఇచ్చిన వారిని చాలా ఇబ్బందిపెడతారు.”


ఎడమ: కుటుంబం లేని పిల్లలతో తత్వశిల్ కాంబ్లే. కుడి: బీడ్ లో రేషన్ కిట్స్ ను పంచుతున్న కాంబ్లీ, అశోక్ తాంగ్డే(కుడి)
ఊరిలో ఉన్న వైషమ్యాలు కూడా పని చేస్తాయి. “కొన్నిసార్లు, వారికి వ్యతిరేకంగా ఉన్నవారు మాకు సమాచారం అందిస్తారు. కొన్నిసార్లు పెళ్లి కుదిరిన అమ్మాయిని ప్రేమించిన అబ్బాయి మాకు సమాచారం ఇస్తాడు.”
పెళ్లి గురించి సమాచారం అందిన వెంటనే వారిని ఎదుర్కోవడం పెళ్ళిని నిరోధించడానికి మెదటి అడుగు. పెళ్లిళ్లు జరిపించే కుటుంబాలు కొన్నిసార్లు రాజకీయ ప్రభావాన్ని వాడదామని చూస్తారు. “మమ్మల్ని బెదిరించడం, దాడి చేయడం కూడా జరిగింది.” అన్నారు కాంబ్లీ. “ప్రజలు మాకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారు. కానీ మేము పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి సిద్ధంగా ఉంచుతాము. కొంతమంది వెంటనే లొంగుతారు. కొంతమంది గొడవపడ్డాక గాని ఊరుకోరు.”
అక్టోబర్ 2020లో కాంబ్లీ, తాంగ్డే 16 ఏళ్ళ స్మితకు పెళ్లి జరుగుతుందని తెలుసుకున్నారు. పెళ్లి మండపం బీడ్ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పెళ్లి జరిగే ప్రదేశానికి వెళ్లే సమయానికే పెళ్లి రివాజులన్నీ మొదలుపెట్టేసారు. ఆమె తండ్రి విఠల్ పెళ్లి ఆపడానికి ఒప్పుకోలేదు. “ఆయన మా మీద అరిచాడు. ‘ఆమె నా కూతురు, నాకు కావలసిన్నట్టు చేయగలను.’ అన్నారు తంగ్డే . పెళ్లి ఆపకపోతే ఏమి జరగవచ్చో అర్థం చేసుకోవటానికి అతనికి కాస్త సమయం పట్టింది. మేము అతనిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అతని మీద ఫిర్యాదు నమోదు చేయించాము.”
స్మిత చాల బాగా చదువుతుందని ఆమె మేనమామ కిషోర్ చెప్పారు. “కానీ ఆమె తల్లిదండ్రులు బడికి వెళ్ళలేదు, వారికి దాని అవసరం తెలీదు. ఈ మహారోగం వలన వారు రోజుకు రెండు పూటలా తినడానికి కష్టపడుతున్నారు.” విఠల్, అతని భార్య పూజ, 30ల నడిమి వయసులో ఉన్నారు. వారు ఇటుక బట్టీలలో పనిచేస్తారు, నాలుగు నెలలు పనిచేస్తే వారిద్దరికి కలిపి 20,000 రూపాయిలు వస్తాయి. “కూలిపని ఆగిపోయింది. స్మితకు పెళ్లి చేస్తే ఒకరోజులో రెండు పూటలా ఒక మనిషి తినే భోజనం గురించి ఆందోళన చెందే అవసరం ఉండదు.” వివరించాడు కిశోర్.
అన్నిటికన్నా పెద్ద సవాలు ఈ తల్లిదండ్రులు మళ్ళీ ఆగిపోయిన పెళ్లిని తలకెత్తుకోకుండా ఉండడం. “ఇదివరకు బడులు నడుస్తున్నప్పుడు, టీచర్లు బడికి రాని పిల్లల గురించి వాకబు చేసి, ఒకవేళ వారికి పెళ్ళిచేస్తుంటే మాకు సమాచారం అందించేవాళ్ళు. కానీ ఇప్పుడు బడులు కూడా మూతబడ్డాయి. కాబట్టి మాకు సమాచారం రావడం కూడా కష్టమవుతోంది.”
విఠల్ ని ప్రతి రెండు నెలలకు పోలీస్ స్టేషన్ లో రిపోర్ట్ చేయమని అడిగారు పోలీసులు. “మేము అతనిని నమ్మలేము” అన్నాడు తాంగ్డే, ఎందుకంటే వయసురాని అతని కూతురికి మళ్ళీ పెళ్లి చేసే పని తలకెత్తుకుంటాడేమోనని.


ఎడమ : అశోక్ తాంగ్డే, తత్వశిల్ కాంబ్లీ(కుడి), పని మానేసిన వలస కూలీతో (మధ్యలో). కుడి: విద్యార్థులతో బాల్య వివాహాలపై మాట్లాడుతున్న కాంబ్లే
స్మిత తన మేనమామ కిశోర్ ఇంట్లో పెళ్లి ఆగిపోయిన తరవాత ఒక రెండు నెలలు ఉంది. ఆ సమయం లో ఆమె చాలా మౌనంగా ఉంది, అని ఆమె మేనమామ చెప్పాడు. “ఆమె ఎక్కువ మాట్లాడేది కాదు, ఒకత్తే ఉండేది. తన పని తాను చేసుకునేది, పేపర్ చదివేది, మాకు ఇంటి పనులలో సాయం చేసేది. ఆమెకు అంత త్వరగా పెళ్లి చేసుకోవడం మీద ఆసక్తి ఏమి లేదు.”
ఆడవారి ఆరోగ్యం మీద బాల్య వివాహాల ప్రభావాల గురించి పరిశోధనలు జరిగాయి. ఇందులో బాల్యవివాహానికి ప్రసూతి మరణాలకు ఉన్న లంకె గురించి కూడా ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ వారి నివేదిక లో, 2011 సెన్సస్ ని తీసుకుని భారతదేశంలో బాల్య వివాహాల పై గణాంక విశ్లేషణ లో, 10-14 లోపు పెళ్లి అయిన అమ్మాయి గర్భధారణ లేక ప్రసూతి సమయంలో మరణించడానికి 20-24 ఏళ్ళ మధ్య పెళ్లి అయిన వారికన్నా ఐదు సార్లు ఎక్కువ ప్రమాదం ఉందని తెలుస్తోంది. ఒకవేళ తల్లి గర్భధారణకు ముందు తరవాత, బలహీనంగా ఉంటే పుట్టిన బిడ్డలు కూడా బలహీనంగా పుడతారు
ఇక రేఖ విషయంలో, పోహకాహార లేమి లక్షణమైన శారీరక బలహీనత వలన ఆమె అత్తగారింటి వారు ఆమెను పుట్టింటికి పంపించారు. “జనవరి 2021లో ఆమె భర్తతో వెళ్లిన 2-3 నెలల తరవాత మళ్లీ పుట్టింటికీ వచ్చింది.” అంది భాగ్యశ్రీ
చెరకుని కోయడం, వాటిని మోపులుగా కట్టి 25 కిలోల బరువును నెత్తి మీద పెట్టుకోవడం ఉండవలసిన బరువుకన్న తక్కువ బరువున్న రేఖకు కష్టం. “ఆమె అంత కష్టమైనా కూలిపని చేయలేదు. దానివలన ఆమె భర్త ఆదాయం తగ్గిపోయింది.” అన్నది భాగ్యశ్రీ. “అందుకని ఆమె అత్తమామలు పెళ్లిని తెంపులు చేసేసి ఆమెని తిరిగి ఇంటికి పంపేశారు.”
వెనక్కి వచ్చాక రేఖ వారింట్లో కొన్నిరోజులే ఉంది. “కానీ ఒక అమ్మాయి అత్తింటి నుంచి పెళ్ళైన కొన్ని నెలలకే వెనక్కి వచ్చేస్తే, ఊర్లో మనుషులు ప్రశ్నలు అడుగుతారు. అందుకని ఆమె ఎక్కువగా తన అత్తింట్లోనే ఉంటుంది.” చెప్పింది ఆమె తల్లి
చెరకు కోతకాలం మళ్ళీ దగ్గరపడుతోంది. భాగ్యశ్రీ, అమర్ మళ్లీ వలస వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. రేఖ భవిష్యత్తుకు మళ్లీ ప్రణాళిక వేస్తున్నారు. ఒకటే తేడా- ఈసారి రేఖ వ్యతిరేకించట్లేదు- మళ్లీ పెళ్లి చేసుకోడానికి ఒప్పుకుంది.
ఈ కథనంలో పిల్లలు వారి తల్లిదండ్రుల పేర్లను గోప్యంగా ఉంచాలన్న కారణంతో పేర్లు మార్చాము.
ఈ కథ పులిట్జర్ సెంటర్ మద్దతు ఇచ్చే సిరీస్‌లో భాగం.
అనువాదం: అపర్ణ తోట