ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు, నారింజ రంగులు - వారు జెండాలు ఎత్తి పట్టుకొని, వేదిక దాటి నడిచారు. పచ్చని దుపట్టా లతో తలలు కప్పుకున్న మహిళా రైతుల బృందం కవాతు చేస్తూ వచ్చింది. ట్రాక్టర్‌లపై అనేక మంది పురుషుల బృందం వచ్చారు, వారి తలపాగాలు ఆఫ్-వైట్ - మెరూన్, పసుపు-ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. భుజాలపై జెండాలు పట్టుకుని వివిధ సమూహాలు రోజంతా వేదికపైకి నడిచాయి - ప్రతి రంగు ఒక పురాణంలోని పద్యంలా మెరుస్తూ ఉంది.
నవంబర్ 26, 2020 నుండి పూర్తి సంవత్సరం పూర్తయింది, పార్లమెంటు ఆమోదించిన మూడు చట్టాలను వ్యతిరేకిస్తూ వారిలో చాలా మంది ఢిల్లీ గేట్‌లకు చేరుకున్నారు. ఈ వార్షికోత్సవంతో వారొక మైలురాయిని దాటారు. ఈ సందర్బంగా, రైతులు, వారి మద్దతుదారులు గత శుక్రవారం సింగు, తిక్రి, ఘాజీపూర్‌లలో నిరసన ప్రదేశాలను చేరారు.
ఇది విజయవంతమైన రోజు. కన్నీళ్లు, జ్ఞాపకాలు, భవిష్యత్తు ప్రణాళికల రోజు. మూడు చట్టాలను రద్దు చేస్తామని నవంబర్ 19న ప్రధాని చేసిన ప్రకటన పై సింగులో ఉన్న 33 ఏళ్ల గుర్జీత్ సింగ్, ఇది యుద్ధంలో గెలుపు మాత్రమే, అంతిమ విజయం కాదు, అన్నారు. ఈయన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలోని జిరా తహసీల్‌లోని తన గ్రామమైన అరయన్‌వాలాలో సింగ్ 25 ఎకరాలు సాగు చేస్తున్నారు.
'ఈ విజయం ప్రజలదే. మేము ఒక మొండి నిర్వాహకుడిని ఓడించినందుకు సంతోషంగా ఉన్నాము,” అని 45 ఏళ్ల గుర్జీత్ సింగ్ ఆజాద్ అన్నారు, ఆ రోజు ఆజాద్ కూడా సింగులో ఉన్నారు. గురుదాస్‌పూర్ జిల్లాలోని కహ్నువాన్ తహసీల్‌లోని ఆజాద్ గ్రామమైన భట్టియాన్‌లో, అతని మేనమామలు అతనికి ఉన్న రెండు ఎకరాల్లో గోధుమలని, వరిని సాగు చేస్తారు. "ఈ యుద్ధం నవంబర్ 26న ప్రారంభం కాలేదు. ఆ రోజు, అది ఢిల్లీ సరిహద్దులకు చేరుకున్నదంతే," అన్నారాయన. “బిల్లులు చట్టాలుగా మారకముందే రైతులు నిరసనలు ప్రారంభించారు. సెప్టెంబరు 2020లో మూడు వ్యవసాయ చట్టాలు ఆమోదించబడిన తర్వాత, ఢిల్లీకి రావాలని పిలుపు ఇచ్చారు. మేము ఆ పిలుపును అనుసరించాము.”
అతను గత సంవత్సరం జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నాడు: “మేము మా రాజధాని వైపు వెళ్ళినప్పుడు, ప్రభుత్వం నీటి ఫిరంగులను ఉపయోగించింది. వారు కందకాలు తవ్వారు. కానీ కంచెలు ముళ్ల తీగలతో ఆపేంత అవసరం లేదు. మేమేమి ఆవేశపూరిత యుద్ధానికి రావడం లేదు. (గత సంవత్సరం, 62 ఏళ్ల జోగరాజ్ సింగ్ నాతో చెప్పాడు, తనలాంటి రైతులే పోలీసులకు ఆహారం ఇస్తారు, అందుకని పోలీసులు కూడా వారి పిల్లలే - కాబట్టి వారి లాఠీలకు కూడా 'తినిపించడం' అవసరమైతే, అప్పుడు రైతులు వారి వీపుని అందించడానికి సిద్ధంగా ఉన్నారు.)

నవంబర్ 26న రైతులు గత ఏడాది నుండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో అలానే వేడుకలు కూడా జరుపుకున్నారు. నృత్యాలు చేశారు, పాడారు, లడ్డూలు పంచారు
పాటియాలా జిల్లా దౌన్ కలాన్ గ్రామానికి చెందిన రాజిందర్ కౌర్ కూడా గత వారం సింగు వద్ద ఉన్నారు - ఆమె 26 సార్లు నిరసన ప్రదేశాలకు వచ్చింది. "ఈ నిరసన ప్రారంభమైనప్పటి నుండి, నేను పాటియాలాలోని ఒక టోల్ ప్లాజాలో స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను, ఏ రైతు టోల్ చెల్లించనవసరం లేదు" అని 48 ఏళ్ళ రాజిందర్ అన్నారు. ఆమె కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఉంది. “మొదట, అతను [ప్రధాన మంత్రి] చట్టాలను విధించాడు. ఇప్పుడు అతను వాటిని రద్దు చేశాడు. మధ్యలో, మేము భారీ నష్టాన్ని [ప్రాణాలు, జీవనోపాధిని కోల్పోయి] భరించాము. అసలు అతను చట్టాలను తీసుకురాకూడదు, తెచ్చినా ఇంతకాలం ఆగకుండా ఎప్పుడో ముందుగానే వాటిని రద్దు చేసి ఉండాలి.”
12 నెలలుగా, ప్రధానమంత్రి చట్టాలను రద్దు చేయనప్పుడు, ఎముకలు తినేసే చలిని, ప్రభుత్వ నిరాకరణని ధైర్యంగా ఎదుర్కున్నారు. వేసవిలో మండే ఢిల్లీ ఎండలను ధైర్యంగా ఎదుర్కొన్నారు, వారు తుఫానులను, వర్షాలకు, రహదారులపై తమ గుడారాలను ఎగిరిపోయినా తట్టుకుని నిలబడ్డారు. నీరు, విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని బెదిరించబడినా నిలబడ్డారు. వారు మరుగుదొడ్ల, స్నానాల గదుల కొరతను, మహారోగం వలన జరిగిన ప్రమాదాలను భరించారు.
"ప్రభుత్వం మమ్మల్ని అలసిపోయేలా చేస్తే వెళ్ళిపోతామనుకుంది. కానీ మేము వెళ్ళలేదు,” అని ఆజాద్ అన్నారు. రైతులు కృతనిశ్చయంతో నిరసనను కొనసాగించారు, కానీ ప్రధాన స్రవంతి మీడియాలోని అనేక వర్గాలు వారిని దూషించాయి. ఆజాద్ రైతుల కోసం అంకితం చేయబడిన ప్రసిద్ధ సోషల్ మీడియా హ్యాండిల్‌తో స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, రైతులను చదువుకోనివారు, ఖలిస్తానీలు అంటూ మరెన్నో రకాలుగా పిలుస్తున్న మీడియా కథనాలను ఎదుర్కోవాలని ఆయన అన్నారు. "మేము నిరక్షరాస్యులమని, మా గురించి ఆలోచించుకునే సామర్థ్యం మాకు లేదని వారు చెప్పారు. నేను దానిని సవాలుగా తీసుకుని అవన్నీ ఖండిస్తూ రాశాను.” అన్నారు ఆయన.
"ఈ ఉద్యమం మాకు చాలా విషయాలు నేర్పింది, అది ఎంత కఠినంగా ఉన్నా, సత్యం కోసం యుద్ధంలో విజయం సాధించవచ్చు. అలానే ఇది దేశంలోని ప్రజల పై అటువంటి చట్టాన్ని బలవంతంగా అమలు చేసే ముందు వెయ్యి సార్లు ఆలోచించమని ఈ నిరసన చట్టసభ సభ్యులకు నేర్పింది.” అని గుర్జీత్ సింగ్ తెలిపారు.
"మేము విజయం సాధించడానికి వచ్చాము, విజయం మా స్వంతం అయ్యాకనే వెళతాము" అని సుఖ్‌దేవ్ సింగ్ అన్నారు. ఫతేఘర్ సాహిబ్ జిల్లాలోని ఖమనోన్ తహసీల్‌లోని మోహన్ మజ్రా గ్రామానికి చెందినఈ 47 ఏళ్ల రైతు తన ఎడమ కాలును, 15 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో కోల్పోయాడు. “[రద్దు] ప్రకటన చేసిన తర్వాత కూడా, మమ్మల్ని ఇంటికి పంపడంపైనే దృష్టి పెట్టారు. రద్దు కోసం పార్లమెంటరీ ప్రక్రియ పూర్తయ్యే వరకు, బిజిలీ బిల్లు [విద్యుత్ (సవరణ) బిల్లు, 2020] ఉపసంహరించబడే వరకు మేము వెనక్కి వెళ్ళడం లేదు.”
నవంబర్ 26న రైతులు గత ఏడాది నుండి ఎంత ప్రశాంతంగా ఉన్నారో అలానే వేడుకలు కూడా జరుపుకున్నారు. నృత్యాలు చేశారు, పాడారు, బూందీ లడ్డూ, బర్ఫీ, అరటిపండు, ఇలా స్వీట్లు, పండ్లు పంచారు. లంగర్ వంటి సేవలు ఎప్పటిలానే కొనసాగుతున్నాయి.

తను ప్రశాంతంగా చనిపోవాలంటే ఈ చారిత్రాత్మకమైన రోజును హాజరు కావాలని నిశ్చయించుకుని, 87 ఏళ్ల ముఖ్తార్ సింగ్ తన కొడుకును నిరసన ప్రదేశానికి తీసుకెళ్లమని కోరాడు. ఇక్కడ, అతను తన మనవడు- హర్యానాలోని కర్నాల్‌కు చెందిన రైతు-కవి, దేవి సింగ్‌తో కలిసి ఉన్నాడు
నవంబర్ 26న సింగు, తిక్రి సరిహద్దుల్లోని వేదికలు, రైతులను అభినందించేందుకు అక్కడికి వచ్చిన వివిధ రంగాల, వృత్తుల వారితో పోటెత్తాయి. చాలా మంది ఏడ్చారు కూడా.
పలువురు వ్యవసాయ నాయకులు వేదికపై ఉన్నారు, ముందు కూర్చున్న, నిలబడి ఉన్న మహిళలు, పురుషులు ప్రతి నినాదానికి ఉద్వేగంతో, గర్వంగా స్పందించారు. వేదికపై నుంచి మాట్లాడిన ప్రతి వ్యక్తి గత ఏడాది పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు 700 మంది రైతులకు నివాళులర్పించారు.
"వావార్షికోత్సవానికి వచ్చిన రైతులు విజయ సంబరాల కోసమే రాలేదు, అమరవీరులకు నివాళులర్పించడానికి కూడా వచ్చారు" అని ఆజాద్ అన్నారు. "మేము సంతోషంగా ఉన్నామా లేక విచారంగా ఉన్నామా అనేది మాకు తెలియదు" అని గుర్జీత్ జోడించారు. "ఈ కారణం వలన మరణించిన తోటి నిరసనకారుల గురించి ఆలోచిస్తే మా కళ్ళు ఇప్పటికీ తడిబారుతున్నాయి. మేము వారికి నివాళులర్పిస్తున్నాము. ”
ఈ చారిత్రాత్మక రోజున హాజరు కావాలని నిశ్చయించుకుని, 87 ఏళ్ల ముఖ్తార్ సింగ్ అమృత్‌సర్‌లోని అజ్నాలా తహసీల్‌లోని సెహన్స్రా గ్రామం నుండి సింగు వద్దకు వచ్చాడు, అక్కడ అతనికి తొమ్మిది ఎకరాల భూమి ఉంది. అతను నడవలేడు, మాట్లాడలేడు. సగం వంగి కర్ర పట్టుకుని వేదికవైపు చిన్నగా అడుగులు వేశాడు. చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు, అతను తన కుమారుడు సుఖ్‌దేవ్ సింగ్ (36)ని నిరసన ప్రదేశానికి తీసుకెళ్లమని కోరాడు. తన జీవితమంతా రైతుల కోసం (యూనియన్ సభ్యునిగా) పనిచేశానని, నిరసనను చూసి ప్రశాంతంగా చనిపోవాలని ఉందని అతను సుఖ్‌దేవ్‌తో చెప్పాడు.
గురుదాస్‌పూర్‌లోని బటాలా బ్లాక్‌లోని హర్చోవాల్ గ్రామానికి చెందిన రైతు కుల్వంత్ సింగ్, 58 ఏళ్ల నిరీక్షణ సమయంలో, చట్టాలు రద్దు చేయబడతాయో లేదో అనిశ్చితంగా ఉండేవాడు. "అప్పుడు నేను మళ్లీ మంచినే ఆలోచించాలని నాకు నేనే చెప్పుకునే వాడిని - చార్డీ కలాన్ [ఆశాజనకంగా ఉండటానికి ఒక పంజాబీ భాషలోని పదబంధం]."
రైతులు తమ పంటలకు MSP (కనీస మద్దతు ధర) చట్టబద్ధమైన హక్కు, లఖింపూర్ ఖేరీలో మరణించిన రైతులకు న్యాయం చేయడం, వంటి ఇతర డిమాండ్‌ల గురించి మాట్లాడారు. వీటితోపాటు ఇంకా ఇతర సమస్యలపై పోరాటం కొనసాగుతుందని చెప్పారు. ఇప్పటికి, ఒక సంవత్సరం గడిచిపోయింది, ఇటువంటి సమయంలో కవి ఇక్బాల్ మాటలు గుర్తుకు వస్తున్నాయి:
"రైతుల రోజువారీ రొట్టెలు పండని పొలాన్ని కనిపెట్టండి
ప్రతి పండిన గోధుమ పరకను కొలిమిలో సేకరించండి!"

ఇది తిక్రి (ఈ ఫోటోలో), సింగు, ఘాజీపూర్‌లో- యువకులు, పెద్దలు అందరూ కలిసి విజయాన్ని, జ్ఞాపకాలను పంచుకున్న రోజు

తిక్రీలోని సంయుక్త కిసాన్ మోర్చా వేదిక దగ్గర ఈ రైతు వంటి వారెందరో, ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని రికార్డ్ చేశారు

వేదికపై నుండి మాట్లాడిన ప్రతి వ్యక్తి గత సంవత్సరం నిరసనలో ప్రాణాలు కోల్పోయిన 700 మందికి పైగా రైతులకు నివాళులర్పించారు (ఈ ఫోటో తిక్రిలో తీయబడింది)

నవంబర్ 26న సింగు, టిక్రి సరిహద్దుల్లోని వేదికలు రైతులను అభినందించేందుకు వివిధ రంగాల ప్రజలతో పోటెత్తాయి. చాలా మంది ఏడ్చారు కూడా

పలువురు రైతు నాయకులు వేదికపై ఉన్నారు, ముందు నిలబడ్డ, కూర్చున్న రైతులు ప్రతి నినాదానికి ఉద్వేగంతో, గర్వంగా స్పందించారు
![During the difficult year, said Kulwant Singh, sometimes he was uncertain if the laws would be repealed:' Then, I would again struggle to regain optimism and tell myself – chardi kalan [remain hopeful].](/media/images/_MG_5737.max-1400x1120.jpg)

కష్టతరమైన ఈ సంవత్సరంలో, కుల్వంత్ సింగ్ (ఎడమవైపు), చట్టాలు రద్దు చేయబడతాయో లేదో అని అనిశ్చితంగా ఉండేవాడు: "అప్పుడు నేను మళ్లీ మంచినే ఆలోచించాలని నాకు నేనే చెప్పుకునేవాడిని - చార్డీ కలాన్ [ఆశాజనకంగా ఉండటానికి ఒక పంజాబీ భాషలోని పదబంధం].". కుడి: సింగు సరిహద్దు వద్ద విజయ సంకేతాలు

'మేము గెలుపొందాలని వచ్చాము, విజయం మాది అయినప్పుడు మాత్రమే వెళ్లిపోతాము' అని చాలా సంవత్సరాల క్రితం ఎడమ కాలు కోల్పోయిన సుఖ్‌దేవ్ సింగ్ అన్నారు

జెండాలు, వేదిక (ఎడమ) నుండి ప్రసంగాలు, నినాదాలు మరియు చప్పట్ల మధ్య మిఠాయిలు

వార్షికోత్సవ రోజు గుర్తుగా రైతులు ఫోటోలకు పోజులిచ్చారు


ఎడమ: గత వారం సింగు వద్ద రాజిందర్ కౌర్ (ఎడమ నుండి నాల్గవది, పాటియాలాలో తీసిన ఫోటోలో) - ఆమె 26 సార్లు నిరసన ప్రదేశాలకు వచ్చారు. కుడి: గుర్జీత్ సింగ్ ఆజాద్ (గత సంవత్సరపు ఫోటో) ఇలా అన్నారు: 'ప్రభుత్వం మమ్మల్ని అలిసిపోయేలా చేస్తే, వెళ్లిపోతామని అనుకున్నది. మేము వెళ్ళలేదు'


ఎడమ: వేడుకలను చూసేందుకు వచ్చిన ఢిల్లీకి చెందిన ఓ ఇంజినీర్. కుడి: దేవి సింగ్, హర్యానాలోని కర్నాల్‌లోని బరాగావ్‌కు చెందిన రైతు-కవి

'సామ్రాజ్యవాదం పతనం కావచ్చు' అని రాసి రాసి గోడ ముందు విశ్రాంతి తీసుకుంటున్న రైతుల సమూహం

మహిళా కార్మికులు నిరసన స్థలం నుండి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్-ట్రాలీపై అరటి తొక్కలను లోడ్ చేస్తున్నారు
అనువాదం: అపర్ణ తోట