గణేశ్ శిందే దగ్గరున్న విలువైన ఆస్తి ఆయన 2022లో కొనుగోలు చేసిన ఒక ఎర్రని ట్రాక్టర్. మహారాష్ట్ర, పర్‌భణీ జిల్లాలోని ఖలీ గ్రామానికి చెందిన శిందే, తన సొంతానికున్న రెండెకరాల భూమిని సాగుచేస్తున్నారు. కానీ ఇటీవలి సంవత్సరాలలో పత్తి ధరలు బాగా పడిపోతుండటంతో, అదనపు ఆదాయ వనరుల కోసం వెతుక్కోవటం శిందేకు తప్పనిసరైంది. అది ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు నుంచి రూ 8 లక్షలు అప్పు తీసుకొని ఒక ట్రాక్టర్ కొనడానికి దారితీసింది.
"నేను మా ఇంటికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగాఖేడ్ వద్దకు ట్రాక్టర్‌ను నడుపుకుంటూ వెళ్ళి అక్కడి జంక్షన్‌లో ఎదురుచూస్తూ ఉంటాను," అన్నారు 44 ఏళ్ళ వయసున్న ఈ రైతు. అక్కడికి సమీపంలో ఏమైనా నిర్మాణ పనులు జరుగుతుంటే, ఇసుక వంటి వస్తువులను రవాణా చేయడానికి వాహనం అవసరమైనవారు నా ట్రాక్టర్‌ను ఉపయోగించుకుంటారు. అలా నాకు పని దొరికిన రోజుల్లో నేను 500 నుండి 800 రూపాయల వరకూ సంపాదిస్తాను." పొద్దున్నే గంగాఖేడ్‌కు బయలుదేరే ముందు, శిందే తన పొలంలో కనీసం రెండు గంటలైనా గడుపుతారు.
బడ్జెట్ 2025ను ఆయన చాలా శ్రద్ధగా విన్నారు. ఆ వినటం ప్రత్యేకించి బడ్జెట్ మీద పెద్ద ఆశలు ఉండి కాదనీ, తన ట్రాక్టర్ సేవలకోసం వచ్చే జనం కోసం ఎదురుచూస్తూ, మరి చేసే పనేమీ లేక విన్నానని శిందే చెప్పారు. "ఎమ్ఎన్‌ఆర్‌ఇజిఎ (మహాత్మా గాంధీ దేశీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, 2005) కోసం కేటాయింపులనేమీ పెంచలేదు," అన్నారాయన. ఖలీ గ్రామ మాజీ సర్పంచ్ అయిన శిందే, ఎమ్ఎన్‌ఆర్‌ఇజిఎ వల్ల గ్రామంలో పెద్ద మార్పేమీ రాలేదన్నారు. “ఉపాధిని కల్పించడానికి ఆ డబ్బు పెద్దగా ఉపయోగపడలేదు. అదంతా కాగితాల పైన మాత్రమే ఉంది.”

తన ట్రాక్టర్ సేవల కోసం ఎవరైనా వస్తారేమోనని గంగాఖేడ్ జంక్షన్ వద్ద ఎదురుచూస్తోన్న శిందే
పత్తి ధరలు పడిపోతుండటం వలన శిందే వంటి రైతులు నిలదొక్కుకోవటం కష్టంగా మారింది. ఉదాహరణకు, 2022లో ఒక క్వింటాలు పత్తి ధర రూ. 12,000 ఉంది. అదే 2024లో మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో ఈ ధర మరీ ఘోరంగా రూ. 4,000కు పడిపోయింది.
ప్రస్తుత బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదేళ్ళ కాల పరిమితితో "మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ"ని ప్రతిపాదిస్తూ, 2025-26 సంవత్సరానికి జౌళి మంత్రిత్వ శాఖకు 5,272 కోట్లను కేటాయించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ కేటాయింపు 19 శాతం పెరిగింది. "ఇది రైతుల ఆదాయాన్ని పెరిగేలా చేస్తుందనీ, నాణ్యమైన పత్తి సరఫరా నిరాటంకంగా కొనసాగుతుందనీ," ఆవిడ చెప్పుకుంటోంది.
"బడ్జెట్ కేవలం పేదల కోసమే అన్నట్లు నటిస్తుంది, కానీ ధనవంతులకు మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది," ప్రతిపాదిత మిషన్ గురించి ఏమాత్రం ఆశ లేని శిందే అన్నారు. "ఇంధనం మరింత మరింత ఖరీదైపోతున్నది. మా ఆదాయంలో ఏమాత్రం పెరుగుదల లేకపోగా తగ్గిపోతూవుంది," అన్నారతను. "ఇలాంటి పరిస్థితులలో రైతులు ఎలా బతకాలి?"
అనువాదం: సుధామయి సత్తెనపల్లి