“నాకు సిక్స్ ప్యాక్ కండలు అలా వచ్చేశాయంతే, నేను ఎప్పుడూ వ్యాయామం చేయలేదు. ఇక షాహ్‌బాజ్ కండరపుష్టిని చూడండి!" యువకుడైన ఆదిల్ నవ్వుతూ తన సహచర కార్మికుడిని చూపించాడు.
మహమ్మద్ ఆదిల్, షాహ్‌బాజ్ అన్సారీలు మీరట్‌లోని జిమ్, ఫిట్‌నెస్ పరికరాల పరిశ్రమలో కార్మికులు. వాళ్ళు ఒక్క రోజులోనే, జిమ్‌కు వెళ్ళేవాళ్ళు వారం మొత్తంలో ఎత్తే బరువుల కంటే ఎక్కువ బరువులు ఎత్తుతారు. ఈ భారీ బరువులను ఎత్తడం అనేది వాళ్ళ ఫిట్‌నెస్ లక్ష్యమేం కాదు, అది ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ నగరంలో ముస్లిమ్ కుటుంబాలకు చెందిన యువకుల ముఖ్య జీవనోపాధి. నిజానికి, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఈ జిల్లా మొత్తం క్రీడా వస్తువుల ఉత్పత్తికి ముఖ్య కేంద్రంగా ఉంది.
"కొన్ని రోజుల క్రితమే, ఇక్కడ అబ్బాయిలు తమ కండరపుష్టిని, యాబ్స్ [పొట్ట కండరాలు]ను సరిచూసుకుంటూ ఒక ఫోటోషూట్ చేసారు," అని మహమ్మద్ సాకిబ్ చెప్పారు. వ్యాపారవేత్త అయిన 30 ఏళ్ళ సాకిబ్, తన జిమ్ పరికరాల షోరూమ్‌లో కౌంటర్ వెనుక కూర్చుని ఉన్నారు. ఈ షోరూమ్‌ను అతని కుటుంబం అద్దెకు తీసుకుంది. ఈ షోరూమ్ మీరట్‌లో కిలోమీటరు పొడవున వ్యాపించి ఉండే క్రీడా పరికరాల మార్కెట్‌కు కేంద్రమైన సూరజ్‌కుండ్ రోడ్‌లో ఉంది.
"ఇళ్ళల్లో గృహిణులు ఉపయోగించే సాధారణ డంబెల్ నుంచి క్రీడా నిపుణులు ఉపయోగించే క్లిష్టమైన సెటప్ వరకు, ఈ రోజు ప్రతి ఒక్కరూ జిమ్, ఫిట్‌నెస్ పరికరాలను కోరుకుంటున్నారు," అని అతను చెప్పారు.
మేం మాట్లాడుతుండగానే ఇనుప కడ్డీలు, గొట్టాలతో పాటు పూర్తిస్థాయి హోమ్ జిమ్ పరికరాలు, ఇనుప కమ్మీలను నింపుకున్న పలు మూడు చక్రాల విద్యుత్‌వాహనాలు (స్థానికంగా వీటిని ‘మినీ మెట్రో’ అంటారు) రద్దీగా ఉన్న రహదారిలో రాకపోకలు సాగిస్తున్నాయి. "జిమ్ యంత్రాలను ముందు విడి భాగాలుగా తయారుచేసి, ఆ తరువాత వాటన్నటినీ కలిపి బిగిస్తారు," షోరూమ్ గాజు తలుపులలోంచి ఇనుప వస్తువుల రాకపోకలను చూస్తూ సాకిబ్ వివరించారు.


ఎడమ: మీరట్‌లోని సూరజ్‌కుండ్ రోడ్‌లో, అద్దెకు తీసుకున్న తమ జిమ్ పరికరాల షోరూమ్‌లో మహమ్మద్ సాకిబ్. కుడి: రో మెషీన్‌ను ఎలా ఉపయోగించాలో వివరిస్తున్న షోరూమ్‌లోని సహాయకుడు ఉజైఫ్ రాజ్‌పుత్
ఇనుప పనులలో మీరట్ పేరు ప్రఖ్యాతలు కొత్తేమీ కాదు. "ఈ నగరం కైంచీ (కత్తెర) పరిశ్రమకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది," అని సాకిబ్ PARIతో చెప్పారు. 2013లో, దాదాపు మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన మీరట్ కత్తెర పరిశ్రమ, భౌగోళిక సూచిక (GI) ట్యాగ్‌ను పొందింది.
మీరట్‌లో జిమ్ పరికరాల తయారీ చరిత్ర ఇటీవల కాలం నాటిది, ఇది 1990ల ప్రారంభంలో మొదలైంది. "ముందుగా పంజాబీ వ్యాపారవేత్తలు, జిల్లాలోని క్రీడా వస్తువుల పరిశ్రమలో బాగా స్థిరపడిన స్థానిక సంస్థలు దీన్ని ప్రారంభించాయి," అని సాకిబ్ చెప్పారు. "నైపుణ్యం కలిగిన ఇనుప కార్మికులు ముందు నుంచీ ఇక్కడున్నారు. జిమ్ పరికరాల తయారీలో ఉపయోగించే రీసైకిల్ చేసిన ఇనుప గొట్టాలు, కడ్డీలు, రేకుల వంటి ముడి పదార్థాలు కూడా నగరంలోని లోహమండి [ముడి పదార్థాల హోల్‌సేల్ మార్కెట్]లో సులభంగా దొరుకుతాయి."
కమ్మరి పని చేసేవాళ్ళు, ఇనుము పోత పోసే కార్మికులలో ( లోహే కీ ఢలాయీ కర్నేవాలే )ఎక్కువమంది తక్కువ ఆదాయ కుటుంబాల నుండి వచ్చిన ముస్లిమ్‌లు. "కుటుంబంలోని మగపిల్లలలో పెద్దవాడు చిన్న వయస్సులోనే శిక్షణ పొందుతాడు," అని సాకిబ్ చెప్పారు. "సైఫీ/లోహార్ (ఇతర వెనుకబడిన తరగతి) ఉప కులానికి చెందినవాళ్ళకు ఈ వృత్తిలో అత్యంత నైపుణ్యం ఉంటుందని భావిస్తారు," అన్నారతను. సాకిబ్ కుటుంబం రాష్ట్రంలో ఒబిసి జాబితాలో ఉన్న ముస్లిమ్ నేత కార్మికుల ఉప కులమైన అన్సారీ వర్గానికి చెందినది.
"అనేక యూనిట్లు ఇస్లామాబాద్, జాకీర్ హుస్సేన్ కాలనీ, లిసాడీ గేట్, జైదీ ఫామ్ లాంటి ముస్లిమ్‌లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో ఉన్నాయి" అని సాకిబ్ చెప్పాడు. మీరట్ జిల్లాలో ముస్లిమ్‌ల జనాభా దాదాపు 34 శాతం ఉంది – రాష్ట్రంలో అత్యధిక జనాభా (జనగణన 2011) రీత్యా ఇది ఏడవ స్థానం.
ఇక్కడ ఇనుము పనిచేసే కార్మికులైన ముస్లిమ్‌లు ఎక్కువగా ఉండటం మీరట్‌కు మాత్రమే ప్రత్యేకం కాదు. దేశంలోని ముస్లిమ్ వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిపై 2006లో వెలువడిన నివేదిక ( సచార్ కమిటీ నివేదిక ) ప్రకారం, ముస్లిమ్ కార్మికులు సాపేక్షంగా పెద్ద సంఖ్యలో ఉన్న మూడు తయారీ విభాగాలలో లోహ ఉత్పత్తుల తయారీ విభాగం ఒకటి.


తతీనా సానీలోని తమ కర్మాగారంలో ఆసిమ్, సాకిబ్. మీరట్ నగరం మాత్రమే కాదు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని ఈ జిల్లా మొత్తం క్రీడా వస్తువుల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది
సాకిబ్, ముప్పయ్యవవడిలో ఉన్న అతని సోదరులు మహమ్మద్ నాజిమ్, మహమ్మద్ ఆసిమ్‌లు నగరంలోని ఇనుప పరిశ్రమలలో కార్మికులుగా తమ జీవితాన్ని ప్రారంభించారు. 2000వ దశకం ప్రారంభంలో తమ తండ్రి హోల్‌సేల్ బట్టల వ్యాపారంలో భారీ నష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు, దాంతో వాళ్ళు పనులకు వెళ్ళారు.
నాజిమ్ ఆటో విడిభాగాల తయారీ వ్యాపారంలో పనికి కుదరగా, ఆసిమ్ అహ్మద్ నగర్ ప్రాంతంలోని తమ ఇంట్లో డంబెల్ ప్లేట్లు తయారు చేయడం ప్రారంభించారు. సాకిబ్ ఒక మెటల్ ఫాబ్రికేషన్ కార్ఖానా లో, కారీగర్ ఫఖ్‌రుద్దీన్ అలీ సైఫీ మాస్టర్ దగ్గర సహాయకుడిగా పని చేశారు. "ఇనుము నుండి వివిధ వస్తువులను తయారు చేయడాన్ని ఆయన నాకు నేర్పించాడు. లోహాలను కత్తిరించడం, వంచటం, వెల్డింగ్ చేయటం, అసెంబుల్ చేయటం వంటి పనుల ద్వారా జిమ్ పరికరాలు, ఝూలే [ఊయలలు], జాలీ గేట్లు [అల్లిక పని చేసిన గేట్లు] లాంటి వివిధ రకాల వస్తువులను ఎలా తయారుచేయాలో ఆయన నాకు నేర్పించాడు," అని సాకిబ్ చెప్పారు.
ఇప్పుడు, ఈ సోదరులు తతీనా సానీ గ్రామంలో తమ సొంత ఫిట్‌నెస్, జిమ్ పరికరాల తయారీ కర్మాగారాన్ని నడుపుతున్నారు. ఈ గ్రామం నగరంలోని వారి షోరూమ్‌కు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న సెటిల్మెంటు. ఇనుముతో చేసిన కళాఖండాల తయారీకి కూడా మీరట్ ప్రసిద్ధి. వివిధ రకాల పనిముట్లు, కత్తెరలు, ఇనుప ఫర్నిచర్ ఈ జిల్లా నుండి ఎగుమతి చేస్తున్న ముఖ్యమైన వాటిలో కొన్ని(2011 జనగణన).
“మీరట్‌లో నాకంటే ఎక్కువ నైపుణ్యం కలిగిన అనేకమంది ఇనుముతో పనిచేసే కార్మికులున్నారు. ఒకే ఒక్క తేడా ఏమిటంటే, నేను కార్మికుడి నుండి యజమానిగా మారాను, కానీ చాలామంది పరిస్థితి అది కాదు,” అని సాకిబ్ చెప్పారు.
తన సోదరులు పొదుపు చేసిన డబ్బుతో అతనికి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ (ఎమ్‌సిఎ) చదివే అవకాశం రావడంతో అతని ఈ ప్రయాణం సుసాధ్యమైంది. "నా సోదరులు మొదట సంకోచించేవాళ్ళు, కానీ ఎమ్‌సిఎలో నేను పొందిన జ్ఞానం అప్పటికే స్థిరపడివున్న జిమ్, ఫిట్‌నెస్ పరికరాల పరిశ్రమలో మా స్వంత వ్యాపార అభివృద్ధికి సహాయపడుతుందని వాళ్ళు నమ్మారు," అని సాకిబ్ చెప్పారు.
*****


ఎడమ: లోహపు ముక్కలను కత్తిరించి, వెల్డింగ్ చేసి, బఫ్ చేసి, ఫినిషింగ్ చేసి, రంగులు వేసి, పౌడర్-కోటింగ్ చేసి విడి భాగాలుగా ప్యాక్ చేస్తారు. తరువాత వీటిని అసెంబుల్ చేసి, పరికరంగా బిగించేస్తారు. కుడి: పొడవాటి స్థూపాకారపు ఇనుప దిమ్మెను తక్కువ బరువున్న ప్లేట్‌లుగా కోస్తున్న బ్యాండ్‌సా కట్టింగ్ మెషీన్

ఎలక్ట్రిక్ యంత్రాలతో ఇనుప వస్తువులను కోస్తున్నపుడు నిప్పురవ్వలు ఎగుస్తాయి. యంత్రాలను నడిపిస్తోన్న రంగురంగుల టి-చొక్కాలు ధరించిన ఫ్యాక్టరీ కార్మికులు
“జిమ్ పరికరాలను తయారుచేయటానికి లోహపు భాగాలను కత్తిరించడం, వెల్డింగ్ చేయడం, బఫ్ చేయడం, ఫినిషింగ్ చేయడం, రంగులు వేయడం, పౌడర్ కోట్ వేసి, ప్యాక్ చేయడం చేయాలి. తరువాత చిన్న చిన్న భాగాలను ఒకదానితో ఒకటి అసెంబుల్ చేసి, బిగిస్తారు,” మేం ఫ్యాక్టరీ అంతా చూస్తూ తిరుగుతుండగా సాకిబ్ వివరించారు. "మీరు కర్మాగారానికి వచ్చినప్పుడు ఏ భాగాన్ని తయారు చేస్తున్నారో తెలుసుకోలేరు. ఎందుకంటే మీరొక అనుకూల శీతోష్ణస్థితి ఉన్న ప్రదేశంలో (జిమ్‌లో) అమర్చివున్న ఫ్యాన్సీ పరికరాలను మాత్రమే చూసి ఉంటారు కాబట్టి."
అతను వివరించిన జిమ్‌లకు, మేం చూస్తున్న కర్మాగారానికి ఏ మాత్రం సంబంధం లేదు. మూడు వైపులా గోడలు, రేకుల పైకప్పుతో ఉన్న తతీనా సానీలోని కార్ఖానాని పనిపరంగా మూడు భాగాలుగా విభజించారు - ఫాబ్రికేషన్ ప్రదేశం, రంగులువేసే ప్రదేశం, ప్యాకింగ్ ప్రదేశం. ఒక వైపు గోడలేమీ లేకపోవడం వలన లోపలికి కొంత గాలి ప్రసరిస్తోంది. వేసవికాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలను దాటి, దాదాపు 45 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువకు చేరతాయి కాబట్టి ఆ మాత్రపు గాలి ఇక్కడ చాలా అవసరం.
ఆ కర్మాగారమంతా కలియతిరుగుతున్నప్పుడు, మనం నేల మీద ఎక్కడ అడుగు పెడుతున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి.
15 అడుగుల పొడవున్న ఇనుప కడ్డీలు, గొట్టాలు, 400 కిలోగ్రాములకు పైగా బరువుండే స్థూపాకార ఘన ఇనుము, వెయిట్ ప్లేట్‌లను కత్తిరించడానికి ఉపయోగించే బరువైన, చదునైన లోహపు రేకులు, విద్యుచ్ఛక్తితో పనిచేసే పెద్ద యంత్రాలు, వివిధ దశలలో తయారై ఉన్న జిమ్ పరికరాలు అక్కడ నేలపై పడి ఉన్నాయి. వాటిమధ్య నడిచేందుకు ఇరుకైన బాట ఉంది. మీరు కనుక ఆ బాటలోనే వెళ్ళకుండా పక్కకు అడుగేస్తే ఏదైనా పదునైన అంచు తగిలి మీ కాలికి గాయమవటం, లేదా ఏదైనా బరువైనది పాదాలపై పడితే ఎముకలు విరిగే ప్రమాదమూ ఉంది.
కదలకుండా పడివున్న గోధుమ, బూడిద, నల్లని వన్నెలలోని ఈ బరువైన ముడి పదార్థాల మధ్య ఉన్న ఏకైక చైతన్యం అక్కడ పనిచేస్తోన్న కార్మికుల కదలికలు మాత్రమే. రంగురంగుల టి-చొక్కాలను ధరించిన వాళ్ళు విద్యుత్ యంత్రాలతో లోహాన్ని తాకించినపుడు నిప్పురవ్వలు వెలువడుతున్నాయి.


ఇనుప గొట్టాన్ని కోత యంత్రంపై ఉంచడానికి తన ఎడమవైపు ఖాళీగా ఉన్న నేలపైకి నెడుతున్న ఆసిఫ్; అతను 8 స్టేషన్ల మల్టీ-జిమ్‌ను తయారుచేయడానికి అవసరమైన 15 అడుగుల పొడవైన ఇనుప గొట్టాన్ని (కుడి) ముక్కలుగా కోస్తున్నాడు


ఎడమ: కర్మాగారంలో లేత్ యంత్రాన్ని నడిపించే టెక్నీషియన్ మహమ్మద్ నౌషాద్; స్థూపాకార ఇనుమును, వృత్తాకార లోహపు రేకు ముక్కలను కోయటం, వాటికి ఒక ఆకృతి వచ్చేలా చేయడం అతని బాధ్యత. కుడి: నౌషాద్ పనిచేసే చోటు వద్ద, బరువును బట్టి ఒకదానిపై ఒకటి పేర్చివున గుండ్రటి బిళ్ళల ఆకారంలోని అనేక ఇనుప ముక్కలు
ఇక్కడ పని చేస్తున్నవారిలో మహమ్మద్ ఆసిఫ్ మాత్రమే తతీనా సానీకి చెందినవాడు; మిగిలినవారంతా మీరట్ నగరం, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుండి వచ్చారు. “నేను ఇక్కడ రెండున్నర నెలలుగా పని చేస్తున్నాను, కానీ ఇది నా మొదటి ఉద్యోగం కాదు. నేను ఇంతకుముందు మరో జిమ్ పరికరాలు తయారుచేసే కార్ఖానాలో పనిచేశాను,” అని ఇనుప గొట్టాల కోతలో నిపుణుడైన 18 ఏళ్ళ ఆసిఫ్ చెప్పాడు. అతను చెదురుముదురుగా పడివున్న కుప్పలోంచి ఒక 15 అడుగుల పొడవైన గొట్టాన్ని తీసి, దానిని గొట్టాల కోత యంత్రంపై ఉంచేందుకు తన ఎడమవైపు ఖాళీగా ఉన్న నేల మీదకు నెడుతున్నాడు. జిమ్ పరికరాల తయారీలో పొడవు, ఆకృతి అవసరాలకు అనుగుణంగా ఎక్కడ కోయాలో గుర్తించడానికి అతను అంగుళాల టేప్‌ను ఉపయోగిస్తాడు.
"మా నాన్న అద్దెకు తీసుకున్న ఆటో నడుపుతాడు," ఆసిఫ్ కొనసాగించాడు, "ఆయన సంపాదన సరిపోదు కాబట్టి నేను చాలా చిన్నప్పుడే పనిలోకి దిగాను." అతను నెలకు రూ. 6,500 సంపాదిస్తాడు.
కర్మాగారంలోని మరో భాగంలో, మహమ్మద్ నౌషాద్ ఒక రంపపు-కోత యంత్రంపై స్థూపాకారంలోని ఘన ఇనుమును ముక్కలుగా కోస్తున్నారు. నౌషాద్ (32) ఇక్కడ లేత్ యంత్రాన్ని నడిపించే టెక్నీషియన్, 2006 నుండి ఈయన ఆసిమ్‌తో కలిసి పని చేస్తున్నారు. "వీటన్నిటినీ బరువులెత్తే వివిధ రకాల జిమ్ పరికరాలకు జోడిస్తారు," గుండ్రటి బిళ్ళల ఆకారంలో ఉన్న ఇనుప ముక్కలను చూపుతూ చెప్పారు నౌషాద్. వాటిని అతను పనిచేసే చోట బరువును బట్టి ఒకదానిపై ఒకటి అమర్చారు. నౌషాద్ నెలకు రూ.16,000 సంపాదిస్తారు.
నౌషాద్ పనిప్రదేశానికి ఎడమవైపున 42 ఏళ్ళ మహమ్మద్ ఆసిఫ్ సైఫీ, 27 ఏళ్ళ ఆమిర్ అన్సారీ కూర్చునివున్నారు. కుప్వారా (జమ్మూ కశ్మీర్)లోని ఆర్మీ క్యాంప్‌కు రవాణా చేయాల్సిన ఎనిమిది స్టేషన్ల మల్టీ-జిమ్ తయారీలో వారు నిమగ్నులై ఉన్నారు.
వారి కంపెనీ వినియోగదారులలో శ్రీనగర్, కట్రా (జమ్మూకశ్మీర్), అంబాలా (హర్యానా), బీకానేర్ (రాజస్థాన్), షిలాంగ్ (మేఘాలయ)లోని భారత సైనిక ఎస్టాబ్లిష్మెంట్‌లు ఉన్నాయి, “వ్యక్తిగత జిమ్‌లను ఏర్పాటు చేసుకునేవారి జాబితా మణిపుర్ నుండి కేరళ రాష్ట్రం వరకు ఉంటుంది. మేం నేపాల్, భూటాన్‌లకు కూడా ఎగుమతి చేస్తాం,” అని సాకిబ్ చెప్పారు.


ఎడమ: కేబుల్ క్రాస్ఓవర్ ఎక్సర్‌సైజ్ ఆధారంగా మల్టీ-జిమ్ రెండు చివరల మధ్య దూరాన్ని కొలుస్తున్న ఆసిఫ్ సైఫీ. కుడి: అతను మల్టీ-జిమ్ బేస్ మీద పని చేయడానికి ఆర్క్ వెల్డర్‌ను ఉపయోగిస్తారు


చేతితో పనిచేసే డ్రిల్లింగ్ మెషీన్(ఎడమ)ను ఉపయోగించి ఒక ప్లేట్‌లో రంధ్రం చేస్తున్న ఆమిర్. దానిని తిరిగి మల్టీ-జిమ్‌కు వెల్డింగ్‌ద్వారా అతికిస్తారు. ఇక్కడ ఒక ఆర్క్ వెల్డర్(కుడి)ను ఉపయోగించి రెండు లోహపు ముక్కలను కలుపున్నాడు
ఆర్క్ వెల్డింగ్ నిపుణులైన వీరు చిన్న భాగాలను తయారు చేయడంతో పాటు పెద్ద పరికరాల అసెంబ్లింగ్ కూడా చేస్తారు. ఆర్డర్‌లు, తయారు చేసే యంత్రాల సంఖ్యను బట్టి వాళ్ళు నెలకు రూ. 50 వేల నుంచి 60,000 వరకూ సంపాదిస్తారు.
"ఆర్క్ వెల్డింగ్ మెషీన్ ముందు భాగంలో సన్నని ఎలక్ట్రోడ్ ఉంటుంది, అది మందంగా ఉన్న ఇనుములోనికి చొచ్చుకుపోయి దానిని కరిగిస్తుంది," అని ఆమిర్ వివరించాడు. "రెండు లోహపు ముక్కలను కలిపే ప్రక్రియలో ఎలక్ట్రోడ్‌ను చేతితోనే కదిలించాలి. దీన్ని నేర్చుకోవడం, దీనిలో నైపుణ్యం సాధించడం చాలా కష్టమైన పని.’’
"ఆమిర్, ఆసిఫ్‌లు ఠేకా [కాంట్రాక్ట్] పద్ధతి మీద పని చేస్తున్నారు," అని సాకిబ్ వారి వేతనాలు ఎలా ఉంటాయో వివరించారు. "తక్కువ నైపుణ్యం అవసరమయ్యే పనుల్లా కాకుండా అత్యున్నత నైపుణ్యం అవసరమయ్యే పనులను ఠేకా పద్ధతిలో చేయించుకుంటాం. ఈ నిపుణులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మెరుగైన వేతనాల కోసం వాళ్ళకు బేరసారాలు చేసే శక్తి ఉంటుంది,” అని అతను వివరించారు.
ఉన్నట్టుండి ఆ పనిప్రదేశాన్ని ఆవరించి ఉన్న వెలుతురు మసకబారింది. విద్యుత్ సరఫరా ఆగిపోయింది; కర్మాగారంలోని జనరేటర్‌ను ఆన్ చేసి, పని తిరిగి మొదలు కావడానికి కొన్ని సెకన్ల సమయం పట్టింది. జనరేటర్ శబ్దానికి ఎలక్ట్రికల్ మెషీన్‌ల శబ్దం కూడా తోడు కావడంతో తాము మాట్లాడేది వినిపించడానికి కార్మికులు గట్టిగా కేకలు వేయాల్సి వస్తోంది.
తర్వాతి పనిప్రదేశంలో 21 ఏళ్ళ ఇబాద్ సల్మానీ జిమ్ పరికరాల జాయింట్లను మెటల్ ఇనర్ట్ గ్యాస్ (ఎమ్ఐజి) వెల్డర్‌తో బలోపేతం చేస్తున్నాడు. "సన్నని, మందపాటి ముక్కలను వెల్డింగ్ చేయడానికి ఎంత ఉష్ణోగ్రత కావాలో తెలీకపోతే ఇనుము కరిగిపోతుంది," అని ఇబాద్ చెప్పాడు. అతను నెలకు రూ. 10,000 సంపాదిస్తాడు.
లోహపు ముక్కపై పని చేయడానికి క్రిందికి వంగిన ఇబాద్, వెల్డింగ్ చేస్తున్నప్పుడు వెలువడే నిప్పురవ్వల నుంచి తన కళ్ళను, చేతులను రక్షించుకోవడానికి హ్యాండ్ షీల్డ్‌ను అడ్డుగా పెట్టుకున్నాడు. "మా దగ్గర అన్ని రక్షణ పరికరాలు ఉన్నాయి. ఏవి సురక్షితమైనవి, ఏవి సురక్షితం కాదు, ఏవి అనుకూలమైనవి, ఏవి అసౌకర్యంగా ఉంటాయి అన్న తమ సొంత అంచనాల ప్రకారం కార్మికులు వాటిని ఉపయోగిస్తారు,” అని సాకిబ్ చెప్పారు.


ఎడమ: ఒక మెటల్ ఇనర్ట్ గ్యాస్ (ఎమ్ఐజి) వెల్డర్‌తో జిమ్ పరికరాల భాగాల జాయింట్లను బలోపేతం చేస్తూ హ్యాండ్ షీల్డ్‌ను ఉపయోగిస్తున్న ఇబాద్ సల్మానీ. కుడి: చివరి సాంకేతిక ప్రక్రియ అయిన బఫింగ్ చేస్తోన్న కర్మాగారంలోని అత్యంత పెద్ద వయసు కార్మికుడైన 60 ఏళ్ళ బాబూ ఖాన్
“కొన్నిసార్లు మా వేళ్ళు కాలతాయి; ఇనుప గొట్టాలు మా పాదాలపై పడతాయి. ఇక తెగడం అన్నది మామూలు గాయం కింద లెక్క,” అని ఆసిఫ్ సైఫీ చెప్పారు. ఆ తర్వాత చాలా మూమూలుగా, “మాకు చిన్నప్పటి నుండి అలవాటైపోయింది. ఈ పని విడిచిపెడితే మాకు ప్రత్యామ్నాయం లేదు," జోడించారు.
అక్కడున్నవాళ్ళలో అత్యంత పెద్ద వయసు కారీగర్ (కార్మికుడు) అయిన బాబూ ఖాన్ (60), తన ముంజేతులను నూలు గుడ్డతో కప్పుకుని, మిగిలిన శరీరాన్ని, కాళ్ళను నిప్పురవ్వల నుండి రక్షించుకోవడానికి నడుము చుట్టూ ఇంకో పెద్ద గుడ్డను కట్టుకున్నారు. "నా చిన్నప్పుడు నేను వేరొక జిమ్ పరికరాల ఫ్యాక్టరీలో ఇనుప కడ్డీలను వెల్డింగ్ చేసేవాడిని, కానీ ఇప్పుడు నేను బఫింగ్ పని చేస్తున్నాను," అని అతను చెప్పారు.
"బఫింగ్ అనేది కోత, వెల్డింగ్ ప్రక్రియల తర్వాత గరుకుగా ఉన్న లోహపు ఉపరితలాన్ని నునుపుగా చేసే చివరి సాంకేతిక ప్రక్రియ," అని సాకిబ్ వివరించారు. బాబూ ఖాన్ నెలకు రూ.10 వేలు సంపాదిస్తారు.
ఉపరితలాన్ని నున్నగా చేసిన తర్వాత, షాకిర్ అన్సారీ (45) పరికరాల భాగాల జాయింట్లను కప్పి ఉంచడానికి బాడీ ఫిల్లర్ పుట్టీని పట్టించే బాధ్యతను తీసుకుంటారు. వాటిని రెగ్‌మాల్ (ఇసుక కాగితం)తో మరింత నున్నగా చేస్తారు. సాకిబ్ బావ అయిన షాకిర్ గత ఆరేళ్ళుగా ఇక్కడ పని చేస్తున్నారు. అతను ఠేకా పని చేస్తూ నెలకు రూ.50 వేల వరకు సంపాదిస్తున్నారు. “నాకు డీజిల్‌తో నడిచే ఆటోలకు ఇనుప నాజిల్‌లు తయారుచేసే వ్యాపారం ఉంది. కానీ సిఎన్‌జి (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ఆటోలు మార్కెట్లోకి వచ్చాక నా వ్యాపారం పడిపోయింది,” అని అతను చెప్పారు.
షాకిర్ పరికరాలపై ప్రైమర్‌ను పూసి, రంగు వేయడం పూర్తిచేసిన తర్వాత దాని మీద యాంత్రిక పద్ధతిలో పౌడర్ కోటింగ్ ఇస్తారు, "దీని వల్ల వాటి మన్నిక పెరిగి, అవి తుప్పు పట్టకుండా ఉంటాయి," అని సాకిబ్ వివరించారు.


ఎడమ: పరికరాల భాగాల జాయింట్లను కప్పి ఉంచడానికి బాడీ ఫిల్లర్ పుట్టీని పట్టిస్తున్న షాకిర్ అన్సారీ. కుడి: జిమ్ పరికరాల భాగాలను ప్యాక్ చేస్తున్న సమీర్ అబ్బాసీ (గులాబీరంగు టి-చొక్కా), మొహ్‌సీన్ ఖురేషి
కొత్తగా తయారుచేసిన అన్ని పరికరాల భాగాలను గేట్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతంలో విడివిడిగా ప్యాక్ చేసి, అక్కడి నుండి వాటిని ట్రక్కుల్లోకి ఎక్కించి రవాణా చేస్తారు. 17–18 సంవత్సరాల మధ్య వయస్సున్న ప్యాకర్లు, ఫిట్టర్‌ల బృందంలోని మొహమ్మద్ ఆదిల్, సమీర్ అబ్బాసీ, మొహ్‌సిన్ ఖురేషి, షాహ్‌బాజ్ అన్సారీ ఒక్కొక్కరు నెలకు రూ. 6,500 సంపాదిస్తారు.
సైన్యం కోసం జిమ్ పరికరాలను కుప్వారాకు తీసుకువెళ్ళే ట్రక్ వచ్చింది. వారిప్పుడు పరికరాలను అందులోకి నింపడాన్ని మొదలుపెట్టాలి.
"ఆర్డర్ ట్రక్కులో ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఆ పరికరాలను అసెంబ్లింగ్ చేయడానికి మేం అక్కడికి రైలులో వెళ్తాం," అని సమీర్ చెప్పాడు. "ఈ పని వల్లనే మేం కొండలను, సముద్రాలను, ఎడారిని చూడగలిగాం.”
అనువాదం: రవి కృష్ణ