రుబేల్ షేక్, అనిల్ ఖాన్‌లు డ్రైవింగ్ చేస్తున్నారు... కానీ వాళ్ళెక్కడా భూమికి దగ్గరగా లేరు. భూమికి దాదాపు 20 అడుగుల ఎత్తులో, అది కూడా దాదాపు లంబంగా 80 డిగ్రీల వాలులో ఉన్నారు. అగర్తలాలోని ఆ మేళా లో ఉన్న పెద్ద జనసమూహం చప్పట్లు కొడుతూ కేకలు వేస్తూ వారిని ప్రోత్సహిస్తోంది. రుబేల్, అనిల్‌లు కారు కిటికీల నుంచి బయటకు వచ్చి జనం వైపు చేతులూపుతున్నారు.
వాళ్ళిద్దరూ మౌత్-కా-కువాఁ (మృత్యు కూపం)ను - కారు, బైక్‌లను 'గోడ' లేదా వేదిక పక్క భాగంలో నిట్టనిలువుగా నడిపిస్తూ చేసే అనేక విస్మయపరిచే విన్యాసాలు - ప్రదర్శిస్తున్నారు.
10 నిమిషాల నిడివి గల ఆటలుగా విభజించిన ఈ ప్రదర్శనలు అనేక గంటలపాటు కొనసాగుతాయి. ఈ ప్రదర్శన చెక్క పలకలతో నిర్మించిన ఒక బావిలాంటి నిర్మాణం లోపల జరుగుతుంది. మేళాల లో దీన్ని ఏర్పాటు చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. వాటి నిర్మాణం వారి ప్రదర్శన, భద్రత విషయంలో చాలా కీలకమైనది కాబట్టి, చాలామంది సవారీ చేసేవాళ్ళే ఈ ప్రదేశాన్ని నిర్మించడంలో పాలు పంచుకుంటారు.
అశుభాన్ని సూచించే 'మౌత్-కా-కువాఁ ' అనే పేరున్న ఈ ప్రమాదకరమైన ప్రదర్శన 2023 అక్టోబర్‌లో త్రిపురలోని అగర్తలాలో జరిగే దుర్గాపూజ సందర్భంగా జరిగే మేళా లో నిర్వహించే అనేక ఆకర్షణలలో ఒకటి. ఫెర్రిస్ వీల్, రంగులరాట్నం, బొమ్మ రైళ్ళు మొదలైనవి ఇతర ఆకర్షణలు.

బావిలాంటి నిర్మాణాన్ని కూడా వాహనాలను నడిపేవాళ్ళే ఏర్పాటు చేసుకుంటారు. త్రిపురలోని అగర్తలాలో 2023 అక్టోబర్‌లో దుర్గాపూజ మేళా ఏర్పాట్లలో ఉన్న పంకజ్ కుమార్ (ఎడమ), రుబేల్ షేక్ (కుడి)

మేళా త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో చివరి నిమిషంలో పూర్తి చేస్తోన్న కొన్ని చిన్నచిన్న పనులు
"మేం గోడ మీద ఏ కారునైనా నడపగలం, కానీ మారుతి 800 మాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దాని కిటికీలు పెద్దవిగా ఉంటాయి, [ప్రదర్శన సమయంలో] మేం బయటకు వెళ్ళడం సులభం," అని స్టంట్‌మ్యాన్ రుబేల్ చెప్పారు. తాము నాలుగు యమహా ఆర్‌ఎక్స్-135 బైక్‌లను కూడా ఉపయోగిస్తామని అతను చెప్పారు: "మేం పాత బైక్‌లను ఉపయోగిస్తాం, కానీ వాటిని చక్కగా మెయిన్‌టెయిన్ చేస్తాం."
పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా నుండి వచ్చిన అతను, తన బృందానికి నాయకత్వం వహిస్తారు. వాహనాలన్నీ అతనివే. తాను 10 సంవత్సరాలకు పైగా ఇవే మోటార్‌సైకిళ్ళను ఉపయోగిస్తున్నట్టు రుబేల్ చెప్పారు, కానీ "వాటికి క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాను," అన్నారతను.
ఈ ప్రదర్శనలు గ్రామీణ ప్రాంత యువకులను ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన మొహమ్మద్ జగ్గా అన్సారీ తాను ఈ ప్రదర్శనల్లోకి ఎలా వచ్చాడో వివరించాడు: “నా చిన్నతనంలో మా ఊరికి ఇలాంటి జాతరలు వచ్చినప్పుడు నేను ఇష్టంగా చూసేవాణ్ని.” దాంతో అతను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే సర్కస్‌లో చేరాడు. మొదట్లో చిన్న చిన్న పనులలో సహాయంగా ఉండేవాడు. "నెమ్మదిగా, నేను వాహనాలను నడపడం నేర్చుకోవడం మొదలుపెట్టాను," అని 29 ఏళ్ళ ఆ ప్రదర్శనకారుడు చెప్పాడు, "ఈ పని వల్ల నేను చాలా ప్రదేశాలకు వెళుతున్నా, అందుకే ఇదంటే నాకు ఇష్టం."
బిహార్‌లోని నవాదా జిల్లాలోని వారిస్అలీగంజ్ గ్రామానికి చెందిన పంకజ్ కుమార్ కూడా చిన్న వయసులోనే ఈ ప్రదర్శనల్లో చేరాడు: "నేను 10వ తరగతి తర్వాత చదువు వదిలిపెట్టి, డ్రైవింగ్ నేర్చుకోవడం ప్రారంభించాను."
అన్సారీ, పంకజ్‌లలాగే ఇతర ప్రదర్శనకారులు, ఈ ప్రదర్శనా వేదికలను నిర్మించేవాళ్ళు భారతదేశం నలుమూలల నుంచి వచ్చారు. వాళ్ళు తమ బృందంతో కలిసి వివిధ మేళాల కు తరలి వెళుతుంటారు. వారు సాధారణంగా ప్రదర్శనలు జరిగే జాతర సమీపంలోని డేరాలలోనే ఉంటారు. రుబేల్, అన్సారీ వంటి కొందరు తమ కుటుంబాలతో సహా ప్రయాణిస్తారు, పంకజ్ మాత్రం పని లేనప్పుడు ఇంటికి తిరిగి వెళతాడు.

ప్రదర్శన ఇచ్చే సమయంలో నోటితో నోట్ల కట్టను పట్టుకుని, ఒక ప్రేక్షకుడి చేతి నుండి డబ్బును తీసుకుంటోన్న ఇరవై తొమ్మిదేళ్ల అన్సారీ. ఝార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాకు చెందిన అన్సారీ, 'ఈ స్టంట్ చేసే సమయంలో ప్రజలు ఇచ్చేదే మాకు ముఖ్యమైన ఆదాయ వనరు,’ అన్నాడు
బావిలాంటి నిర్మాణంతో ‘ మౌత్-కా-కువాఁ ’ను ఏర్పాటు చేయడం ప్రారంభమవుతుంది. "దీన్ని మొత్తం నిర్మించడానికి 3-6 రోజుల మధ్య పడుతుంది, కానీ ఈసారి మాకు ఎక్కువ సమయం లేదు కాబట్టి మేం మూడు రోజుల్లోనే పూర్తిచేయాల్సి వచ్చింది" అని రుబేల్ చెప్పారు. తమకు సమయం ఉంటే నెమ్మదిగా పని చేస్తామని అతనన్నారు.
చివరకు రాత్రి సుమారు 7 గంటలకు ప్రదర్శనను ప్రారంభించే సమయమైంది. అగర్తలాలో టిక్కెట్లు కొనడానికి జనం బారులు తీరారు. టిక్కెట్ ధర మనిషికి రూ. 70, పిల్లలకు ఉచితం. రెండు కార్లు, రెండు మోటార్‌సైకిళ్ళపై కనీసం నలుగురు వ్యక్తులు విన్యాసాలు చేసే ఒక్కో ప్రదర్శన 10 నిమిషాల పాటు కొనసాగుతుంది. వారు ఒక రాత్రిలో కనీసం 30 ప్రదర్శనలు ఇస్తారు. మధ్యలో 15-20 నిమిషాల విరామం ఉంటుంది.
అగర్తలాలో జరిగిన ఈ మేళా లో వీరి ప్రదర్శన చాలా ప్రజాదరణ పొందడంతో, వారు తమ ప్రదర్శనలను ఐదు రోజుల నుంచి మరో రెండు రోజులు పొడిగించారు.
“మా రోజువారీ వేతనం రూ. 600-700 ఉంటుంది, కానీ ప్రదర్శన సమయంలో ప్రజలు ఇచ్చేదే మాకు ముఖ్యమైన ఆదాయ వనరు," అని అన్సారీ చెప్పాడు. ఒక నెలలో అనేక ప్రదర్శనలు విజయవంతమైతే వాళ్ళు నెలకు సుమారు రూ. 25,000 సంపాదిస్తారు.
అయితే ఏడాది పొడవునా ఈ ప్రదర్శనను నిర్వహించలేమని రుబేల్ తెలిపారు: "వర్షాకాలంలో దీన్ని ప్రదర్శించడం చాలా కష్టం." ఈ పని చేయలేని సమయంలో, రుబేల్ తన గ్రామానికి తిరిగి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు.
ఈ ప్రదర్శనలో ప్రమాదాలు ఉంటాయి కదా అంటే పంకజ్ కొట్టి పారేస్తాడు: “ప్రమాదాలకు నేను భయపడను. మనకు భయం లేకుంటే, భయపడాల్సిన పని లేదు.” తాము ప్రదర్శన ఇస్తున్నప్పుడు ఎన్నడూ ఎలాంటి ఘోరమైన ప్రమాదాలు జరగలేదని ఆ బృంద సభ్యులు తెలిపారు.
" మేం ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల ఆనందాన్ని చూస్తే, అదే నాకు ఆనందం," అంటారు రుబేల్.

జాతర జరిగే మైదానంలో పరిచి ఉన్న ‘బావి’ గోడ నిర్మాణంలో ఉపయోగించే చెక్క పలకలు. వాటిని 80 డిగ్రీల వాలులో దాదాపు లంబంగా, 20 అడుగుల ఎత్తు వరకు ఏర్పాటు చేస్తారు

పూజా పండాల్ (మండపం) వెనుక గుడారాన్ని ఏర్పాటు చేసిన జగ్గా అన్సారీ (కుడి). మేళా జరిగే సమయంలో ఈ బృందం ఇక్కడే నివసిస్తుంది

ప్రేక్షకుల గ్యాలరీని ఏర్పాటు చేస్తున్న బిహార్‌లోని నవాదా జిల్లా వారిస్అలీగంజ్ గ్రామానికి చెందిన పంకజ్ కుమార్ (నల్ల చొక్కా), సహాయం చేస్తున్న రుబేల్ షేక్

నిర్మాణం పూర్తయిన తర్వాత గుడారం పైకప్పు కోసం స్తంభాన్ని పైకి ఎత్తుతున్న పనివాళ్ళు

విన్యాసాల కోసం ఉపయోగించే నాలుగు యమహా ఆర్‌ఎక్స్-135 బైక్‌లు. వీటిని మేళా జరిగే రోజులలో వాటిని నడిపేవాళ్ళు నివసించే తాత్కాలిక శిబిరం పక్కన ఉంచుతారు. ఈ మోటార్‌సైకిళ్ళను తాను 10 సంవత్సరాల పైనుంచే ఉపయోగిస్తున్నట్టూ, అయితే వాటిని బాగా మెయిన్‌టెయిన్ చేస్తాననీ, క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తాననీ రుబేల్ షేక్ తెలిపారు

'మృత్యు కూపం' లోపల విన్యాసాలు చేసే సమయంలో తాము నడిపే బైక్‌లలో ఒకదానితో ఫొటోకు పోజులిచ్చిన జగ్గా అన్సారీ (ఎడమ), పంకజ్ కుమార్ (కుడి)

మేళా ప్రవేశ ద్వారం వద్ద వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించే పలు తాత్కాలిక దుకాణాలు

2023 అక్టోబర్‌లో త్రిపురలోని అగర్తలాలో జరిగే ఈ దుర్గాపూజ మేళాలోని అనేక ఆకర్షణలలో మౌత్-కా-కువాఁ ఒకటి. ఫెర్రిస్ వీల్, రంగులరాట్నం, బొమ్మ రైళ్ళు ఇక్కడి ఇతర ఆకర్షణలు

మౌత్-కా-కువాఁ టిక్కెట్ ధర రూ.70-80 ఉంటుంది. ఈ ధరను ప్రేక్షకుల డిమాండును బట్టి నిర్ణయిస్తారు, అయితే పిల్లల్ని మాత్రం ఉచితంగా అనుమతిస్తారు

మౌత్-కా-కువా ప్రేక్షకుల గ్యాలరీ నుండి చూస్తే కనిపించే జాతర మైదానం

ఒక్కొక్కటి 10 నిమిషాలుండే విన్యాసంలో, గోడ మీద కనీసం రెండు బైకులను, కార్లను నడుపుతారు; కొన్నిసార్లు మూడు బైక్‌లను కూడా ఉపయోగిస్తారు

విన్యాసాన్ని వీడియో తీస్తున్న ఒక ప్రేక్షకుడు. చాలామంది ఇష్టపడే ఈ ప్రదర్శన ఈ మేళాలో బాగా ప్రాచుర్యం పొందింది. దాంతో ఈ ప్రదర్శనలను ఐదు రోజుల నుంచి మరో రెండు రోజులు పొడిగించారు

ఒక ప్రదర్శన అనంతరం పంకజ్ కుమార్, జగ్గా అన్సారీ, అనిల్ ఖాన్‌లతో ఫోటో తీయించుకుంటున్న ఒక కుటుంబం

ఒక విన్యాసం తర్వాత తన కొడుకుతో ఆడుకుంటున్న రుబేల్ షేక్. సాధారణంగా, వాహనాలను నడిపేవారు రెండు విన్యాసాల మధ్య 15-20 నిమిషాల విరామం తీసుకుంటారు. ఒక రాత్రిలో వాళ్ళు కనీసం 30 ప్రదర్శనలు ఇస్తారు

ప్రదర్శన ఇస్తోన్న పంకజ్ కుమార్. 'నేను 10వ తరగతి తర్వాత చదువు మానేసి, డ్రైవింగ్ నేర్చుకోవడం మొదలుపెట్టాను’ అన్నాడతను

ప్రదర్శన చివరలో ఒక చిన్న ద్వారం నుంచి బయటకు వస్తున్న పంకజ్ కుమార్

'మేం ప్రదర్శన ఇచ్చేటప్పుడు ప్రజలు సంతోషంగా ఉంటే అదే నాకు ఆనందం,’ అంటారు రుబేల్

ప్రదర్శనను ఏడాది పొడవునా నిర్వహించలేమని రుబేల్ పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను నిర్వహించలేని సమయంలో, అతను తన గ్రామానికి తిరిగి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటారు
అనువాదం: రవి కృష్ణ