"ఎడమవైపు మొదటి మలుపును తీసుకోండి. ఇంకొంచం దిగువకు పోతే ఒక నల్లని స్తంభం మీద మీకు ఫౌజీ ఫోటో కనిపిస్తుంది. అదే ఇల్లు." రామ్‌గఢ్ సర్దారాఁలోని ఆ పెద్దవయసు సైకిల్ మెకానిక్, వీధి చివరన ఉన్న మలుపు వైపు చూపిస్తూ చెప్పారు. గ్రామప్రజలు అజయ్ కుమార్‌ను ఫౌజీ (సైనికుడు), లేదా అమరవీరుడు అని పిలుస్తారు.
భారత ప్రభుత్వం దృష్టిలో, అతను ఆ రెండింటిలో ఏదీ కాదు.
ఆ 23 ఏళ్ళ యువకుడు జమ్మూ కశ్మీర్ తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలలో తన రక్తం చివరి చుక్క వరకూ ధారపోసి ఈ దేశ సరిహద్దులను రక్షించాడు. దళితులూ, భూమిలేని, వృద్ధులైన అతని తల్లిదండ్రులు తమ కుమారుడి పింఛను గురించి, అమరవీరుని హోదా గురించీ కలలో కూడా ఊహించలేరు. మాజీ సైనికుల సహాయక ఆరోగ్య పథకం కింద ఎలాంటి ప్రయోజనాలకు, క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్ డిస్కౌంటులకు కూడా వారు అర్హులు కాదు. అధికారిక రికార్డులలో, అజయ్ కుమార్ సైనికుడు, లేదా అమరవీరుడు కాదు.
అతను కేవలం ఒక అగ్నివీర్ మాత్రమే.
లుధియాణా జిల్లాకు చెందిన ఈ గ్రామానికి ప్రభుత్వ రికార్డులలో పెద్దగా విలువలేదు. గ్రాండ్ ట్రంక్ రోడ్ నుండి 45 నిమిషాల ప్రయాణం, ఆవ పువ్వులు విరబూసిన అందమైన పొలాలు మిమ్మల్ని రామ్‌గఢ్ సర్దారాఁకి తీసుకెళ్తాయి. అక్కడి గోడలు ఇప్పటికే తమ రికార్డును రాసుకున్నట్లు అనిపిస్తుంది. ఆలివ్ ఆకుపచ్చ రంగు సైనిక దుస్తులు ధరించిన అందగాడైన అజయ్ ఫోటోలు ఉన్న హోర్డింగ్‌లను వారు ఎలాంటి అరమరికలు లేకుండా అమరవీరుడు భగత్ సింగ్ సరసన ఉంచారు. తొమ్మిది దశాబ్దాల క్రితం తన సహచరులతో కలిసి ఉరికంబం ఎక్కిన భగత్‌సింగ్‌కు కూడా ఆ తర్వాత వరుసగా వచ్చిన ప్రభుత్వాలేవీ ఇంకా అమరవీరుని హోదా ఇవ్వలేదు.
ఒక హోర్డింగ్ మీద ఇలా రాసి ఉంది:
నవ్‌జవాన్ జద్ ఉఠ్‌దే నే
తాన్ నిజామ్ బదల్ జాన్‌దే నే
భగత్ సింగ్ అజ్జీ వి పైదా హూందే నే
బస్ నామ్ బదల్ జాందే నే…
[యువత ఉవ్వెత్తున
లేచినపుడు,
కిరీటాలు కూలిపోతాయి.
ప్రతి కొత్త రోజునా
ఒక భగత్ సింగ్ పుడుతూనే ఉంటాడు
ప్రపంచం వారిని
పలురకాల పేర్లతో పిలుస్తుంది...]


ఎడమ: అజయ్ కుమార్ ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఒక నల్ల స్తంభంపై ఉన్న అతని ఫోటో. కుడి: రామ్‌గఢ్ సర్దారాఁ గ్రామంలో ఒక హోర్డింగ్ పై రాసివున్న పై పద్యం
అజయ్ కుమార్ తన జీవితాన్ని జమ్మూ కశ్మీర్‌లో, జనవరి 2024లో త్యాగం చేశారు. తన తాతగారైన హవల్దార్ ప్యారే లాల్‌ని స్ఫూర్తిగా తీసుకున్న అజయ్ తన చిన్నతనం నుండే భారత సైన్యంలో చేరాలని కోరుకున్నాడు. "పదవ తరగతి పూర్తిచేసిన తర్వాత అతను తన సన్నాహాలను ప్రారంభించాడు," అజయ్ తండ్రి చరణ్‌జిత్ సింగ్ చెప్పారు.
"అయితే, తాను సైన్యంలో చేరే సమయానికి అతనికి అగ్నివీర్‌కీ, సైనికుడికీ మధ్య ఉన్న తేడా తెలియదు," అన్నారాయన. ఇప్పుడు, అతని బలిదానం తర్వాత, అతని కుటుంబానికే కాక, ఆ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులకు కూడా ఒక 'ఒప్పంద సైనికుడు' అంటే అర్థం ఏమిటో తెలుసు.
"మాకు జరిగిన అన్యాయాన్ని చూసి, యువకులు నిరుత్సాహానికి గురువుతారు," అజయ్ ఆరుగురు అక్కచెల్లెళ్ళలో చిన్నదైన 22 ఏళ్ల అంజలీ దేవి మాతో చెప్పారు. వీరమరణం పొందిన తర్వాత కూడా ఒక అగ్నివీర్ కుటుంబానికి ఇతర సైనికులకు ఇచ్చే సౌకర్యాలు ఇవ్వడం లేదని వారికి తెలిసింది.
ఆమె కోపంతోనూ బాధతోనూ విరుచుకుపడ్డారు. “వాళ్ళు అగ్నివీరులను కవచంగా ఉపయోగించుకుంటున్నారు, ఎందుకంటే ఒక అగ్నివీర్ చనిపోయినా ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత ఉండదు కాబట్టి. అక్కడికీ అగ్నివీరులేదో తక్కువ రకం మానవులన్నట్టు."
బ్రిటిష్ రాజ్ కాలం నుండి సైన్యంలో చేరేందుకు కుటుంబాలు తమ పిల్లలను పంపడానికి పేరుగాంచిన ఈ రాష్ట్రంలోని ఔత్సాహికుల మనోభావాలను అగ్నివీర్‌లకు సంబంధించిన ఇటువంటి కథనాలు నీరుగారుస్తున్నాయి. 106 సంవత్సరాల క్రితం, 1918లో మొదటి ప్రపంచ యుద్ధం ముగిసే నాటికి బ్రిటిష్ ఇండియన్ సైన్యంలోని ప్రతి రెండవ సైనికుడు పంజాబ్ - ప్రస్తుత హరియాణా, ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న పశ్చిమ పంజాబ్ - కు చెందినవాడే అయుండేవాడు. 1929లో మొత్తం సైనిక బలం 1,39,200 ఉండగా, అందులో 86,000 మంది పంజాబీ సైనికులు ఉండేవారు.
కొన్నేళ్ళ క్రితం వరకు ఇదే ధోరణి కొనసాగింది. మార్చి 15, 2021న పార్లమెంటు ముందు ఉంచిన రక్షణ మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, భారత సైన్యానికి సైనికులను పంపుతున్న రాష్ట్రాల్లో పంజాబ్ 89,000 మంది కొత్త సైనికులతో రెండవ స్థానంలో ఉంది. [పంజాబ్ జనాభా కంటే ఏడున్నర రెట్లు ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ మొదటిది]. భారతదేశ మొత్తం జనాభాలో పంజాబ్ జనాభా కేవలం 2.3 శాతం ఉన్నప్పటికీ, మొత్తం సైనిక సిబ్బందిలో పంజాబ్ వాటా 7.7 శాతం. భారతదేశ జనాభాలో యుపి జనాభా 16.5 శాతం ఉన్నప్పటికీ, సైనికుల్లో వారి వాటా 14.5 శాతంగా ఉంది.

సంగ్రూర్ జిల్లా లెహరాగాగాలోని ఫిజికల్ అకాడమీలో సాయుధ బలగాలలో చేరేందుకు 2022లో శిక్షణ పొందినవారి ఫోటో. రెండు సంవత్సరాల క్రితం అగ్నివీర్ ప్రారంభించిన తర్వాత ఈ అకాడమీ మూతపడింది
అయితే, అగ్నివీర్ పథకం ప్రారంభించిన తర్వాత, క్షేత్రస్థాయిలో పరిస్థితి అనూహ్యంగా మారిపోయినట్లు కనిపిస్తోంది. సాధారణంగా రాష్ట్రం అంతటా చిన్న, పెద్ద పట్టణాలలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణా కేంద్రాలు కనిపిస్తాయి. అయితే సాయుధ బలగాలలో చేరాలనుకునే ఆశావహుల సంఖ్య ఒక్కసారిగా తగ్గిపోవడంతో గత రెండేళ్ళలో ఇవి చాలా వరకు మూతపడ్డాయి.
దాదాపు ఒక దశాబ్దం పాటు సంగ్రూర్ జిల్లాలోని లెహరాగాగా పట్టణంలో తాను నడిపిన సాయుధ దళాల రిక్రూట్‌మెంట్ శిక్షణా కేంద్రమైన ‘ఫిజికల్ అకాడమీ'ని సురీందర్ సింగ్ మూసివేశారు. ప్రతి సంవత్సరం పటియాలా, సంగ్రూర్, బర్నాలా, ఫతేగఢ్ సాహిబ్, మాన్సా జిల్లాలకు చెందిన సుమారు వెయ్యిమంది యువకులకు, అనేక బ్యాచ్‌లలో, శారీరక శిక్షణను తమ అకాడమీ అందజేసేదని ఆయన PARIకి తెలిపారు. కానీ అగ్నివీర్ పథకం ప్రారంభించిన సంవత్సరమే ఔత్సాహికుల నుండి ప్రశ్నల సంఖ్య కేవలం 50కి తగ్గిపోయింది. "మాకు ఖర్చులు కూడా రాలేదు, అందుకే కేంద్రాన్ని మూసేశాం," అని ఆయన విచారంగా చెప్పారు.
2011లో తమ కేంద్రాన్ని ప్రారంభించి, 2022 చివరిలో మూసివేసే వరకూ ఈ మధ్యకాలంలో, "ఇక్కడ శిక్షణ పొందిన సుమారు 1,400 నుండి 1,500 మంది యువకులు భారత సాయుధ దళాలలో చేరారు," అని ఆయన చెప్పారు.
పంజాబ్, రాజస్థాన్, హరియాణాలలోని ఇతర ఫిజికల్ ట్రైనింగ్ సెంటర్ల పరిస్థితి కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదని సురీందర్ సింగ్ చెప్పారు. "వాటిలో 80 శాతం కేంద్రాలు మూతపడ్డాయి," అన్నారాయన. ఇప్పటికీ నడుస్తున్న 20 శాతం కేంద్రాలు తమ దృష్టిని పోలీసు, పారామిలటరీ బలగాల రిక్రూట్‌మెంట్‌పైకి మళ్ళించాయి.
"ఇంతకుముందు ఒక గ్రామం నుంచి 50 నుండి 100 మంది యువకులు సైనిక బలగాలలో చేరాలనే ఆసక్తితో ఉండేవారు. ఇప్పుడా సంఖ్య రెండు నుంచి ఐదుమందికి పడిపోయింది. అగ్నివీర్ పథకం అంతటి భారీ ప్రభావాన్ని వేసింది," అన్నారతను.
2023లో 60 మంది విద్యార్థులు సాయుధ దళాల రాత పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని పటియాలా జిల్లాలోని నాభా పట్టణంలో ఒకప్పుడు న్యూ సైనిక్ పబ్లిక్ అకాడమీని నడిపిన కరమ్‌జీత్ సింగ్ చెప్పారు. అయితే, వారిలో కొంతమంది మాత్రమే శారీరక శిక్షణ కోసం వచ్చారు, ఎందుకంటే ఈ కొత్త పథకంలోని చిక్కులు వారికిప్పుడు తేటతెల్లమయ్యాయి. చివరకు ఈ అకాడమీ మూతపడింది.


సాయుధ బలగాలలో చేరాలనుకునే ఆశావహుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోవటంతో, గత రెండేళ్ళలో సంగ్రూర్‌లోని ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణా కేంద్రాల వంటి అనేక కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా మూతపడ్డాయి
సంగ్రూర్ జిల్లాలోని అలీపూర్ ఖాల్సా గ్రామానికి చెందిన జగ్‌సీర్ గర్గ్ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులలో ఉన్నప్పటికీ, శారీరక పరీక్షకు వెళ్లలేదు. కారణం? “నాలుగేళ్ళ ఉద్యోగం కోసం నా జీవితాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని నా తల్లిదండ్రులు చెప్పారు. ఏదైనా అనుకోనిది జరిగితే, కుటుంబానికి వచ్చేదేమీ ఉండదు. రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఫిజికల్ టెస్ట్‌కు వెళ్ళనివారు అకాడమీలో నా బ్యాచ్‌వారు చాలామంది ఉన్నారు,” అని ఆయన చెప్పారు. జగ్‌సీర్ ఇప్పుడు ఉపయోగించిన మోటార్‌బైక్‌లను కొనడం, అమ్మడం చేసే వ్యాపారంలో ఉన్నారు.
సాయుధ దళాలకు పిల్లలను పంపే దీర్ఘకాల సంప్రదాయం కారణంగా పంజాబ్‌లోని అన్ని పెద్ద నగరాలు, చిన్న పట్టణాలలో రిక్రూట్‌మెంట్ అకాడమీలు ఉన్నాయి. సురీందర్ సింగ్ పేర్కొన్నట్టుగా, ప్రస్తుతం వీటిలో చాలా వరకు మూతబడ్డాయి, లేదా పోలీసు రిక్రూట్‌మెంట్ శిక్షణా కేంద్రాలుగా మారాయి. మొదటగా, మార్చి 2020 నుండి మార్చి 2022 మధ్య రిక్రూట్‌మెంట్‌పై నిషేధం విధించటంతో ఈ కేంద్రాలకు పెద్ద దెబ్బ తగిలింది - ముందుగా కోవిడ్ కారణంగా, ఆ వెంటనే ప్రశ్నపత్రం లీక్ అయిన కారణంగా.
ఆ తర్వాత ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చింది. జూన్ 14, 2022న కేంద్ర మంత్రివర్గం దీనిని ‘ఆకర్షణీయమైన’ రిక్రూట్‌మెంట్ పథకంగా ప్రకటించింది. దీని ప్రకారం, కనీస సర్వీస్ 15 సంవత్సరాలు ఉన్న సాధారణ కేడర్‌కు బదులుగా కేవలం నాలుగు సంవత్సరాల పాటు పనిచేసేలా యువతను సైన్యంలో నియమించుకుంటారు.
ప్రభుత్వం ఈ పథకాన్ని "మూడు సాయుధ బలగాలలోని మానవ వనరుల విధానంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుంది," అంటూ ప్రచారం చేసింది. PARI రిపోర్టర్లు మునుపటి కథనాలలో పేర్కొన్నట్లుగా: 2020 వరకు, సాయుధ దళాలలో సగటు వార్షిక నియామకాలు దాదాపు 61,000గా ఉన్నాయి. అగ్నిపథ్ పథకం కింద ఇది దాదాపు 46,000 మంది యువకులకు పడిపోయింది.
ఈ పడిపోవటం, సైన్యంలో జీవితకాలం పనిచేయాలని కలలు గనే చాలామంది గ్రామీణ యువకుల కలలు కల్లలు కావటాన్ని సూచిస్తోంది. ఇప్పుడు వారికి కేవలం నాలుగు సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉంటుంది, ఆ తర్వాత వారిలో నాలుగింట ఒక వంతు మందిని మాత్రమే సైన్యంలోని సాధారణ కేడర్‌లో విలీనం చేస్తారు.
పంజాబీలు సాయుధ బలగాలలో చేరడానికి ఉత్సాహం చూపడం వెనుక గ్రామీణ సమాజంలో సాయుధ దళాలకు దక్కే గౌరవమే కాకుండా, అనుకూలంగా ఉండే ఉపాధి పరిస్థితులు ప్రధాన కారణం అని పటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ విభాగం మాజీ అధిపతి డాక్టర్ ఉమ్రావ్ సింగ్ చెప్పారు.


సాయుధ దళాలకు పిల్లలను పంపటమనేది ఒక దీర్ఘకాల సంప్రదాయంగా ఉండటం కారణంగా, పంజాబ్‌లోని పెద్ద నగరాలు, చిన్న పట్టణాలలో రిక్రూట్‌మెంట్ అకాడమీలు ఎల్లప్పుడూ ఉనికిలో ఉంటూనేవున్నాయి
“అగ్నివీర్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత, ఈ ఉద్యోగానికి ఒకప్పుడున్న గౌరవం దెబ్బతింది. వారిని ఇప్పుడు ఠేకే వాళే ఫౌజీ , లేదా ఒప్పంద సైనికులు అని పిలుస్తున్నారు. ఈ విధంగా ఆ గౌరవం అణగదొక్కబడటంతో, ఆశావహుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అగ్నివీర్ ఆరంభమైన తర్వాత విదేశాలకు వెళ్ళే యువకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. అయితే ఇప్పుడు కెనడాతో సంబంధాలు దెబ్బతినడంతో ఆ అవకాశానికి కూడా తెర పడింది. ఇప్పటికే వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయివున్న పంజాబ్ గ్రామీణ సమాజం ఒక మహావిపత్తు వైపుకు వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది," అని డాక్టర్ సింగ్ చెప్పారు.
రిక్రూట్లలో అత్యధికులు వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చినవారు, లేదా భూమిలేని దళితులు. మాన్సా జిల్లాలోని రంగ్‌రియల్ గ్రామంలో సైన్యంలో చేరాలనుకునే ఔత్సాహికులను రాత పరీక్ష కోసం సిద్ధం చేస్తోన్న యాదవిందర్ సింగ్ ఇలా పేర్కొన్నారు: “ఇంతకుముందు, ఐదు నుంచి ఏడు ఎకరాల భూమి ఉన్న కుటుంబాలకు చెందిన అబ్బాయిలలో కూడా చాలా ఉత్సాహం ఉండేది, కానీ వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబాలకు చెందిన యువతలో ఇప్పుడది కనిపించడం లేదు. ఇప్పుడు ప్రధానంగా వేరే ఏ గత్యంతరం లేని దళిత కుటుంబాలకు చెందిన యువకులు మాత్రమే ఈ పనికి ఆసక్తి చూపుతున్నారు.
అజయ్ కుమార్ అటువంటి భూమిలేని దళిత కుటుంబానికి చెందినవారే. "తన కలను నిజం చేసుకోవడానికి అతను అనేక సంవత్సరాల పాటు రోజువారీ కూలీగా పనిచేశాడు. అతని తల్లి భూస్వాముల పశువుల కొట్టాలను శుభ్రం చేయటం మొదలుకొని MGNREGA పనుల వరకూ చేసేది," అన్నారు అజయ్ తండ్రి చరణ్‌జీత్ సింగ్. "తిరిగి మాకేం దక్కింది? డబ్బా? డబ్బుదేముంది, అలా గాలిలో కలిసిపోతుంది." [ఇక్కడాయన బీమా ద్వారా వచ్చిన డబ్బును గురించి చెప్తున్నారు. అజయ్‌కు దేనికీ అర్హత లేదు కాబట్టి, సైనికుడికి రావలసిన పరిహారం గురించి కాదు].
వారికి మిగిలినదేమిటో చరణ్‌జీత్ చూపించారు: తెల్లటి పెయింట్‌తో, 'అగ్నివీర్ అజయ్ కుమార్' అని వంపుతిరిగిన అక్షరాలతో రాసి ఉన్న సైన్యానికి చెందిన నల్లటి పెట్టె. ఈ మూడు పదాలు అజయ్‌వి మాత్రమే కాకుండా, మొత్తం పంజాబ్ యువతరం భగ్నమైన కలల కథను చెబుతున్నట్టుగా ఉన్నాయి.


ఎడమ: అతని ఇంట్లో అగ్నివీర్ అజయ్ కుమార్ చిత్రం. కుడి: అజయ్ కుటుంబానికి అతను పోరాడిన 25వ ఇన్‌ఫాంట్రీ డివిజన్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్, మేజర్ జనరల్ గౌరవ్ ఋషి పంపిన సంతాప సందేశం


ఎడమ: అతని గదిలో ఉంచిన అగ్నివీర్ అజయ్ కుమార్ పెట్టె. కుడి: మాతృభూమి, త్యాగం గురించి ఒక పద్యం ((క్రింది చరణాన్ని చూడండి) రాసి ఉన్న ఫ్లెక్స్ బోర్డ్‌తో అగ్నివీర్ అజయ్ కుమార్ తల్లిదండ్రులు చరణ్‌జిత్ సింగ్, మన్‌జీత్ కౌర్‌లు
అజయ్ ఇంటిలో కొత్తగా కట్టిన గది చాలా త్వరలోనే గతంలో కలిసిపోయినట్లు కనిపిస్తోంది. తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు, ఆరుగురు అక్కచెల్లెళ్ళ - వారిలో ఇద్దరు అవివాహితులు - ఏకైక సోదరుడైన అజయ్ ఇస్త్రీ చేసిన యూనిఫామ్, జాగ్రత్తగా ఉంచిన తలపాగా, పాలిష్ చేసివున్న షూస్, పటం కట్టి ఉన్న అతని ఫోటోలు...
దీర్ఘమైన నిశ్శబ్దాల మధ్య సంభాషణను కొనసాగిస్తూ, అజయ్ తండ్రిని మేం ఒక స్పష్టమైన ప్రశ్న అడిగాం: ఆయన ఇప్పటికీ గ్రామంలోని ఇతర అబ్బాయిలకు సైన్యంలో చేరమని సలహా ఇస్తారా? “నేనెందుకు అలా చేస్తాను? నా బిడ్డ నాకు కాకుండా పోయాడు. ఇతరుల పిల్లలకు కూడా ఎందుకు అదే గతి పట్టటం?” ఆయన అడిగారు.
ఆయన వెనుక ఉన్న గోడ మీద అజయ్ ఫోటోతో ఉన్న ఫ్లెక్స్ ఇలా చెప్తోంది:
లిఖ్ దేవ్ లహూ నాల్ అమర్ కహాణీ, వతన్ ది ఖాతిర్
కర్ దేవ్ కుర్బాన్ ఎహ్ జవానీ, వతన్ ది ఖాతిర్
[మాతృభూమిపై ప్రేమతో మీ రక్తంతో అమర గాథలను రాయండి
మాతృభూమిపై ప్రేమతో,
మీ యవ్వనాన్ని త్యాగం చేయండి...]
ఆలోచనా సముద్రంలో మునిగివున్న చరణ్‌జీత్ కళ్ళు ఒక ప్రశ్నను అడుగుతున్నట్టుగా ఉన్నాయి: మాతృభూమి తిరిగి వారికేమి ఇచ్చింది?
తాజా కలం:
జనవరి 24, 2025 న త్రివర్ణ పతాకంతో చుట్టివున్న మరొక మృతదేహం పంజాబ్ లోని మాన్సా జిల్లా, అక్లియా గ్రామంలోని ఒక చిన్న రైతు ఇంటికి చేరుకుంది. ఆ శరీరం 24 ఏళ్ళ లవ్ ప్రీత్ సింగ్ ది. గత 15 నెలల్లో తమ దేశ సరిహద్దులను రక్షించే క్రమంలో ప్రాణాలను కోల్పోయిన పంజాబ్ కు చెందిన మూడవ అగ్నివీరుడితను.
వీరంతా కశ్మీర్ లో తమ ప్రాణాలు కోల్పోయారు. వారిలో మొదటి వ్యక్తి, అగ్నివీర్ అమృతపాల్ సింగ్ అక్టోబర్ 2023 లో ప్రాణాలు కోల్పోయాడు. అతని తర్వాత జనవరి 2024 లో మరణించిన అజయ్ కుమార్ పై కేంద్రీకరించినదే పై కథనం. అజయ్ కుమార్ కుటుంబానికిలాగే లవ్ ప్రీత్ తండ్రి బియాంత్ సింగ్ కు కూడా జ్ఞాపకాలే మిగిలాయి.
“ లవ్ ప్రీత్ కి ఇంటికి ఒక కొత్త గడియారం వచ్చింది; తాను తిరిగి వచ్చిన తర్వాత దానిని ధరించటం కోసం అతను ఎదురుచూస్తున్నాడు. కానీ ఇప్పుడింక అది జరగదు,” అని మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బియాంత్ దుఃఖపడ్డారు. మరో కుటుంబానికి కాలం స్తంభించినట్టయింది. ఏదేమైనా, ఒరిగిపోయిన ప్రతి యువకుడి కోసం, అగ్నివీరుల గౌరవం, వారికి న్యాయం జరగటం కోసం పంజాబ్ లో రోజురోజూ ఆక్రోశం పెరుగుతూనే ఉంటుంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి