తన ఇంట్లో ఒక కుర్చీ మీద నిశ్శబ్దంగా కూర్చొని ఉన్న గోమా రామా హజారే ఖాళీగా ఉన్న తన గ్రామ ప్రధాన రహదారివైపు అశ్రద్ధగా చూస్తూ పొద్దుపుచ్చుతున్నారు.
ఆ దారినే పోతూ అప్పుడప్పుడూ తాను ఎలా ఉన్నాడో చూసిపోవడానికి వచ్చేవారితో ఆయన ముచ్చటలాడుతున్నారు. దీర్ఘకాల అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన భార్య చనిపోయి ఒక వారమవుతోంది.
అప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. ఏప్రిల్ నెలలో (2024) సగం గడిచిపోయింది. ఆ రోజు చాలా వేడిగా ఉంది. ఉత్తర గడ్‌చిరోలిలోని ఆర్మొరీ తహసీల్‌లో దట్టమైన వెదురు, టేకు వనాల మధ్యన ఉండే పళస్‌గావ్ గ్రామం చాలా చాలా నిశ్శబ్దంగా ఉంది. గడ్‌చిరోలి-చిమూర్ లోక్ సభ నియోజకవర్గానికి ఇంకొద్ది రోజులలో వోటింగ్ జరగాల్సి ఉంది. బిజెపి ఎమ్‌పి అశోక్ నెతే మరోసారి అదే స్థానం నుండి పోటీ చేస్తున్నాడు. కానీ ఎక్కడా ఎన్నికలన్న ఉత్సాహం కనిపించటంలేదు. నిజానికి, ఆందోళన కనిపిస్తోంది.
గత రెండు నెలలుగా గోమాకు ఎలాంటి పని దొరకలేదు. సాధారణంగా ఇలాంటి సమయాలలో అరవయ్యేళ్ళు దాటి, సొంత భూమి కూడా లేని ఆయనతో సహా చాలామంది అడవిలో మహువా (ఇప్ప) పూలను, తెందూ (బీడీ) ఆకులను సేకరించటమో లేదా పొలాలలో పనిచేస్తూనో ఉంటారు.
"కానీ ఈ ఏడు అలా లేదు," అంటారు గోమా. "ఎవరు మాత్రం తమ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకుంటారు?"
"జనం ఇళ్ళ లోపలే ఉండిపోతున్నారు," గోమా చెప్పారు. రోజులు చాలా వేడిగా ఉన్నాయి. ఎవరం బయటకు పోలేం. గడ్‌చిరోలి నాలుగు దశాబ్దాలుగా సాయుధ సంఘర్షణలతో ఇబ్బందిపడుతూ, భద్రతా దళాలకూ సాయుధ మావోయిస్టులకూ మధ్య జరిగే రక్తపాత కలహాలతో నలిగిపోతున్నందున చాలా గ్రామాలు అటువంటి కర్ఫ్యూలకు అలవాటుపడ్డాయి. కానీ ఇప్పుడొస్తోన్న అతిథులు వేరేవారు, నేరుగా ప్రాణాలకూ జీవనోపాధికీ బెడదగా మారినవారు.
23 అడవి ఏనుగుల మంద ఒకటి, అందులో ఎక్కువగా ఆడ ఏనుగులు, వాటి పిల్లలు, పళస్‌గావ్ చుట్టుపక్కల ప్రాంతాలలో విడిదిచేసి ఉన్నాయి.


మహారాష్ట్ర, పళస్‌గావ్‌కు చెందిన భూమిలేని రైతు గోమా రామ హజారే (ఎడమ). ఒకవైపు లోక్ సభ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ, ఒక అడవి ఏనుగుల మంద తన గ్రామం చుట్టుపక్కలనే తిరుగుతుండటంతో ఆయన తన వేసవికాలపు జీవనోపాధిని వదులుకోవాల్సి వచ్చింది. అడవికి వెళ్ళి మహువా పూలను, తెందూ ఆకులను సేకరించకపోవటం వల్ల ఈ వేసవికాలం రెండు నెలలూ వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సుమారు రూ. 25,000 చొప్పున నష్టపోతారు


ఎడమ: ఖాళీగా ఉన్న పళస్‌గావ్ వీధిలో నడుస్తూ వెళ్తోన్న హజారే. కుడి: ఏప్రిల్ నెల నడిమధ్యకల్లా ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో ఊరంతా నిర్మానుష్యంగా కనిపిస్తోంది. కొన్ని ఇళ్ళలో మహువా పూలను ఎండలో ఎండబెడుతున్నారు; ఈ పూలను దగ్గరలో ఉన్న పొలాలలో ఉన్న ఇప్పచెట్ల నుంచి సేకరిస్తారు. మామూలుగానైతే ఈ కాలంలో మహువా పూలతోనూ, తెందూ ఆకులతోనూ నిండివుండే ఈ ఊరు, ఈ ఏడాది వెలవెలబోతోంది
ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుండి తరలి వచ్చిన ఈ మంద దాదాపు నెల రోజులుగా ఇక్కడి పొదలనూ, వెదురు అడవులనూ, వరి పంటలనూ విందుచేసుకుంటూ గ్రామస్తులను, జిల్లా అటవీ అధికారులను గందరగోళ స్థితిలో పడేసింది. ఉత్తరాన జరుగుతోన్న గనుల తవ్వకాలు, అటవీ నిర్మూలన వంటి పనులు వాటి సహజ నివాసాలను, అవి తిరిగే తావులను ప్రభావితం చేస్తుండటంతో, సుమారు నాలుగు సంవత్సరాల క్రితం ఈ క్షీరదాలు అక్కడి నుండి మహారాష్ట్రలోని తూర్పు విదర్భ ప్రాంతంలోకి ప్రవేశించాయి.
మునుపటి 'దండకారణ్యం'లో భాగమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లాతో పాటు మహారాష్ట్రలోని గోందియా, గడ్‌చిరోలి, చంద్రపూర్ జిల్లాలంతటా తిరుగుతోన్న ఈ ఏనుగులు రాష్ట్ర వన్యప్రాణి సముదాయంలోకి కొత్తగా వచ్చి చేరాయి. ఛత్తీస్‌గఢ్‌లోని ఒక పెద్ద మంద నుంచి ఇవి వేరుపడి వచ్చివుంటాయని నిపుణులు భావిస్తున్నారు.
గడ్‌చిరోలి జిల్లాలోని దక్షిణ ప్రాంతాలలో కొన్ని శిక్షణ పొందిన ఏనుగులు అటవీ శాఖకు వారి రవాణా పనిలో సహాయపడుతున్నాయి, అయితే మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతాలు మాత్రం ఒకటిన్నర శతాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత అడవి ఏనుగులు తిరిగి ఈ ప్రాంతానికి రావడాన్ని చూస్తున్నాయి. పశ్చిమ కనుమల్లో అడవి ఏనుగుల సంచారం సర్వసాధారణం.
ఇలా వచ్చిన అతిథులు మరో ప్రాంతానికి వలసపోయేవరకూ పళస్‌గావ్ గ్రామస్థులు - వారిలో ఎక్కువ ఆదివాసీ కుటుంబాలు - ఇళ్ళలోనే ఉండిపోవాలని అటవీ అధికారులు చెప్పారు. ఆ విధంగా ఈ ఊరికి చెందిన 1400 మంది (2011 జనగణన) భూమిలేని ప్రజలు, సన్నకారు రైతులు, విహీర్‌గావ్ వంటి పొరుగు గ్రామాల ప్రజలు కూడా తమ అటవీ ఆధారిత జీవనోపాధిని వదులుకోవాల్సి వచ్చింది.
పంట నష్టానికైతే రాష్ట్ర అటవీ శాఖ వెంటనే నష్టపరిహారం చెల్లిస్తుంది కానీ అటవీ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఆదాయాన్ని నష్టపోతే మాత్రం అందుకు నష్టపరిహారం ఉండదు.
"నా కుటుంబం వేసవికాలమంతా మహువా , తెందూల మీదే ఆధారపడి బతుకుతుంది," అన్నారు గోమా.
ఇప్పుడు ఆ ఆదాయ వనరు లేకుండాపోవటంతో, మళ్ళీ తమ పనుల్లోకి వెళ్ళటానికి వీలుగా ఏనుగులు అక్కడి నుండి వెళ్ళిపోవాలని పళస్‌గావ్ ప్రజలు ఆశిస్తున్నారు.


ఎడమ: పనులను తిరిగి మొదలుపెట్టే ముందు ఏనుగులు వేరే ప్రదేశానికి వెళ్ళేవరకు వేచి ఉండాలని పళస్‌గావ్ గ్రామస్థులను అటవీ అధికారులు కోరారు. కుడి: గత పంటకాలంలో నష్టపోయిన పళస్‌గావ్‌కు చెందిన ఫుల్‌చంద్ వాఘెడే అనే రైతు. తన మూడు ఎకరాల వ్యవసాయ భూమిని ఏనుగులు పూర్తిగా నేలమట్టం చేసేశాయని ఆయన చెప్పారు
"గత మూడు వేసవికాలాల్లో చేసినట్లుగా ఈ మంద ఈసారి చత్తీస్‌గఢ్‌కు వెళ్ళలేదు," అన్నారు గడ్‌చిరోలిలోని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(CCF) ఎస్. రమేశ్‌కుమార్. "కొన్ని రోజుల క్రితం ఒక ఆడ ఏనుగుకు పిల్ల పుట్టింది. బహుశా అందువలన కావచ్చు."
ఆ మందలో రెండు పిల్ల ఏనుగులున్నట్టు ఆయన చెప్పారు. ఏనుగులు మాతృస్వామ్యమైనవి.
గత సంవత్సరం (2023), పళస్‌గావ్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోందియా జిల్లా, అర్జునీ మోర్‌గావ్ తహసీల్ లో 11 ఇళ్ళున్న నంగల్-డోహ్ అనే కుగ్రామం గుండా అదే ఏనుగుల మంద దూసుకెళ్ళింది, కొన్ని నెలల పాటు అక్కడి దట్టమైన అడవులలో ఉండిపోయింది.
"ఆ రాత్రి ఆ ఏనుగుల ఆగ్రహానికి ఒక్క గుడిసె కూడా తప్పించుకోలేకపోయింది," అని ఇప్పుడు భారనోలీ గ్రామం సమీపంలో ఒక ఆక్రమణకు గురైన భూమిలో నివసిస్తున్న విజయ్ మడావి గుర్తు చేసుకున్నారు. "అవి అర్ధరాత్రివేళ అన్నిటినీ మట్టగిస్తూ వచ్చాయి," అని అతను గుర్తుచేసుకున్నారు.
ఆ రాత్రి నంగల్-డోహ్ మొత్తాన్నీ ఖాళీ చేయించి భారనోలీలో ఉన్న జిల్లా పరిషద్ పాఠశాలకు జనాన్ని తరలించారు, 2023 వేసవికాలం వరకూ వారక్కడే ఉన్నారు. వేసవికాలపు సెలవుల తర్వాత బడిని తిరిగి తెరవడంతో, ఆ గ్రామ శివార్లలో ఉన్న అడవిని కొంత ఖాళీచేసి తాత్కాలికంగా గుడిసెలు కట్టుకున్నారు. వాటికి విద్యుత్ గానీ, నీరు గానీ లేవు. మహిళలు అక్కడికి కొన్ని మైళ్ళ దూరాన ఉన్న ఒక పొలంలోని బావి దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి నీరు తెచ్చుకుంటారు. కానీ ఆ చిట్టడవులను ఖాళీ చేయగానే, గ్రామస్థులంతా తాము అంతకుముందు సాగు చేసుకుంటూ ఉన్న చిన్న చిన్న చెలకలను పోగొట్టుకున్నారు.
"మా సొంత ఇల్లు మాకెప్పుడు వస్తుంది?" అక్కడినుంచి ఖాళీ చేసి వచ్చిన ఉషా హోలీ అడిగింది. వారంతా ఒక పునరావాస పాకేజ్ కోసం, ఒక పక్కా ఇంటి కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ మూడు జిల్లాల్లో ఏనుగులు తమ స్థానాన్ని మార్చుకుంటూ ఉండడంతో రైతులు పంట నష్టాలతో అల్లాడుతున్నారు. మామూలుగా జరిగే పంట నష్టం ఇంతకుముందు ఎప్పుడూ ఇంతగా వారికి సమస్య కాలేదు.


గత వేసవిలో (2023) గోందియా జిల్లా, అర్జునీ మోర్‌గావ్ తహసీల్‌లోని నంగల్-డోహ్ కుగ్రామంలో నివసించేవారి గుడిసెలన్నిటినీ అడవి ఏనుగులు ధ్వంసం చేశాయి. సమీపంలోని భారనోలీ గ్రామంలోని అటవీ భూమిలో ఆ 11 కుటుంబాలు తాత్కాలికంగా గుడిసెలు వేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పునరావాసం, పరిహారం ప్యాకేజీ కోసం వారు ఎదురు చూస్తున్నారు
ఉత్తర గడ్‌చిరోలి ప్రాంతంలో అడవి ఏనుగుల గుంపును అదుపు చేయడంలో ఉన్న సంక్లిష్టతను ఎత్తిచూపుతూ రమేశ్‌కుమార్, దక్షిణ ప్రాంతం కంటే భారతదేశ ఉత్తర ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్నదని చెప్పారు. ఇక్కడ అతిపెద్ద సమస్య పంట నష్టం. ఏనుగులు సాయంత్రం పూట తమ తావుల నుండి బయటకు వచ్చి, అవి తినకపోయినా సరే, పొలాలలో ఉన్న పంటను తొక్కి నాశనం చేస్తాయి.
అటవీ అధికారుల వద్ద డ్రోన్లు, థర్మల్ ఇమేజింగ్ సహాయంతో ఇరవైనాలుగు గంటలూ మందను అనుసరించి, క్షేత్రంలో త్వరత్వరగా ప్రతిస్పందించే జాడలను కనిపెట్టే బృందాలూ, ముందస్తు హెచ్చరికలు చేసే సమూహాలూ ఉన్నాయి. ఏనుగులు తిరుగుతున్నప్పుడు ఎలాంటి ఘర్షణ లేదా ప్రమాదవశాత్తు ఘర్షణ జరగకుండా ఉండేందుకు గ్రామస్తులను వీరు అప్రమత్తం చేస్తారు
సాయంత్రమయ్యేసరికి, పళస్‌గావ్‌లో ఏడు ఎకరాల భూమి ఉన్న రైతు నితిన్ మానే, మరో ఐదుగురు గ్రామస్తుల బృందం రాత్రి జాగరణ కోసం హల్లా బృందంలో చేరారు. ఫారెస్ట్ గార్డు యోగేశ్ పాండారామ్ నేతృత్వంలో, అతను అడవి ఏనుగుల జాడలను కనిపెడుతూ అడవుల చుట్టూ తిరుగుతున్నారు. అడవి ఏనుగుల నిర్వహణలో నిపుణులైన హల్లా బృందాలను పశ్చిమ బెంగాల్ నుండి తీసుకువచ్చి స్థానిక అధికారులకు సహాయం చేయడానికి, ఈ మంద నిర్వహణలో గ్రామ యువకులకు శిక్షణ ఇవ్వడానికి నియమించారు. ఆకాశం నుండి ఏనుగులను గుర్తించేందుకు వారు రెండు డ్రోనులను నడుపుతారని నితిన్ చెప్పారు. వాటి ఉనికిని గుర్తించిన తర్వాత అవి వాటి చుట్టూ తిరుగుతాయని చెప్పారాయన.
ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినప్పుడు వాటిని దూరంగా తోలేయడానికి కొంతమంది గ్రామీణులను హల్లా బృందాలలోకి తీసుకుంటారు," పళస్‌గావ్ మొదటి మహిళా సర్పంచ్, మానా ఆదివాసీ అయిన జయశ్రీ దఢమల్ అన్నారు. "కానీ అది నాకు తలనొప్పిగా మారింది; జనం ఏనుగుల గురించి నాకు ఫిర్యాదు చేస్తారు, తమ అసహనాన్ని నాపై చూపిస్తారు," అంటారామె. "ఏనుగులకు నేను జవాబుదారీని ఎలా అవుతాను?"


ఎడమ: పళస్‌గావ్‌కు చెందిన యువ రైతు నితిన్ మానే. ఈయన అటవీ విభాగం ఏర్పాటు చేసిన చురుకుగా వ్యవహరించే హల్లా బృందంలో సభ్యుడు. అడవి ఏనుగుల జాడలను డ్రోన్ల సాయంతో కనిపెట్టి, అవి గ్రామం లోపలికి రావడానికి ప్రయత్నించినపుడు వాటిని అవతలికి తోలిపారేసే పనులను ఈ బృందం చేస్తుంది. కుడి: రాత్రి కాపలాకి సన్నద్ధమవుతోన్న అటవీ అధికారులు, హల్లా బృందం సభ్యులు


తన పొలం నుంచి ఒక బుట్ట నిండా మహువా పూలను ఏరి తెచ్చే పళస్‌గావ్ సర్పంచ్ జయశ్రీ దఢమల్. కానీ ఇప్పుడు అడవి ఏనుగులు తిరుగాడుతుండటంతో అటవీ ఉత్పత్తులను సేకరించేందుకు ఆమె అడవిలోకి వెళ్ళలేకపోతున్నారు
ప్రస్తుతం పళస్‌గావ్‌లో అంతా సాధారణ స్థితికి వచ్చినా, ఏనుగులు తిరుగుతుండే సమీప గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి మొదలవుతుంది. ఇప్పుడు కొత్తగా బతకడంలో భాగంగా ఈ ప్రాంతంలోని గ్రామాలన్నీ అడవి ఏనుగులతో ఎలా వ్యవహరించాలో నేర్చుకోవాలని, అలవాటు చేసుకోవాలని అటవీ శాఖ అధికారులు ఊదరగొడుతున్నారు.
ఈ సంవత్సరం అడవి నుండి మహువా సేకరణను తాను కూడా మానేయవలసి వచ్చినందున జయశ్రీకి గ్రామస్థుల పట్ల సానుభూతి ఉంది. "ఏనుగుల కారణంగా మేం తెందూ ఆకులను సేకరించలేకపోవచ్చు," అని ఆమె చెప్పారు. ఈ రెండు నెలల్లో ఒక్కో కుటుంబం కనీసం రూ.25,000 నష్టపోతుందని ఆమె తన సంపాదన ఆధారంగా అంచనా వేశారు.
పహిలేచ్ మహాగయీ డోక్యావర్ ఆహే, ఆతా హత్తీ ఆలే. కా కరావ్ఁ ఆమ్హీ?" అడుగుతారు గోమా. "ద్రవ్యోల్బణం ఇప్పటికే ఒక సమస్యగా ఉంది, ఇప్పుడు ఈ ఏనుగులు వచ్చిపడ్డాయి, మేమేం చేయాలి?"
ఇప్పుడంతా సులభంగా ఇవ్వగలిగే జవాబులేమీ లేవు, మరిన్ని ప్రశ్నలే ఉన్నాయి.
వారికి అతిముఖ్యమైనది, పార్లమెంటులోకి ఎవరు ప్రవేశిస్తారనేది కాదు, ఎవరు త్వరగా అడవులను విడిచిపోతారా అన్నది.
(షెడ్యూల్డ్ తెగలకు (ఎస్‌టి) కేటాయించిన గడ్‌చిరోలి-చిమూర్ లోక్‌సభ స్థానానికి ఎన్నికల మొదటి దశలో ఏప్రిల్ 19న వోటింగ్ జరిగింది. ఇక్కడ 71.88 శాతం వోటింగ్ నమోదయింది.)
అనువాదం: సుధామయి సత్తెనపల్లి