సూర్యాస్తమయ ప్రారంభంతోనే నవల్‌గవ్హాణ్ గ్రామంలోని చిన్నా పెద్దా అందరూ పాఠశాల క్రీడా మైదానం వైపుకు సాగిపోతారు. వాళ్ళంతా ఆ క్రీడా మైదానాన్ని శుభ్రం చేయడం, రాళ్ళనూ చెత్తనూ తొలగించడం, సున్నపు పొడితో సరిహద్దు గీతలను గీయడం, ఫ్లడ్‌లైట్‌లను తనిఖీ చేయడం వంటి పనుల్లో మునిగిపోతారు.
8 నుంచి 16 ఏళ్ళ వయసున్న పిల్లలు తమ నీలి రంగు జెర్సీలను ధరించి తయారైపోతారు. వారు ఒక్కో జట్టులో ఏడుగురు ఆటగాళ్ళు ఉండేట్టుగా జట్లుగా విడిపోతారు.
కబడ్డీ కబడ్డీ కబడ్డీ!
ఆట మొదలవుతుంది, మిగిలిన సాయంత్ర సమయంతో పాటు, కొంత రాత్రి సమయం కూడా ఆటగాళ్ళ ఉత్సాహంతో కూడిన కేకలు గాలిని నింపేస్తాయి. ఈ చురుకైన దేశీయ క్రీడను మరాఠ్వాడాలోని హింగోలి జిల్లాలోని ఈ గ్రామంలో ఆటగాళ్ళకు చెందిన కుటుంబ సభ్యులు, స్నేహితులు వీక్షిస్తారు.
ఒక ఆటగాడు ఊపిరి బిగపట్టి, కబడ్డీ కబడ్డీ అంటూ కోర్టులోని ప్రత్యర్థి జట్టు వైపుకు వెళ్తాడు. తన సొంత జట్టు దగ్గరకు తిరిగి రావడానికి ముందు వీలైనంత ఎక్కువమంది ఆటగాళ్ళను తాకి, ఔట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అతను తిరిగి తన జట్టు వైపుకు వచ్చేవరకు 'కబడ్డీ' అనటాన్ని ఆపకూడదు. ప్రత్యర్థి జట్టు చేతిలో చిక్కుకుంటే, అతను ఆట నుండి బయటకు వెళ్ళిపోతాడు.
నవల్‌గవ్హాణ్ ఆటగాళ్ళు నిరాడంబరమైన నేపథ్యాల నుంచి వచ్చినవారు, వారిలో ఎక్కువమంది మరాఠా సముదాయానికి చెందినవారు. వారు బ్రతుకుతెరువు కోసం వ్యవసాయంపై ఆధారపడతారు
అందరూ ఇద్దరు మేటి ఆటగాళ్ళయిన శుభమ్ కోర్డే, కాన్బా కోర్డేలను చూస్తున్నారు. ప్రత్యర్థులు కూడా వారికి భయపడతారు. "వారు తమ సిరల్లో కబడ్డీ ప్రవహిస్తున్నట్లే ఆడతారు," అని గుంపులో ఉన్న ఒకరు మాకు చెప్పారు.
శుభమ్, కాన్బాలు ఈ మ్యాచ్‌లో తమ జట్టుకు విజయం సాధించిపెట్టారు. అందరూ ఒకచోటికి గుమిగూడతారు. ఆట గురించి సూక్ష్మంగా చర్చించి, మరుసటి రోజు కోసం కొత్త ప్రణాళికను రూపొందిస్తారు. అప్పుడు ఇక ఆటగాళ్ళు ఇళ్ళకు వెళతారు.
మహారాష్ట్రలోని నవల్‌గవ్హాణ్ గ్రామంలో ఇదీ సాధారణ దినచర్య. "మా గ్రామంలో చాలాకాలంగా కబడ్డీ ఆడే సంప్రదాయం ఉంది. చాలా తరాలుగా ఈ క్రీడను ఆడుతూనే ఉన్నారు. ఈ నాటికి కూడా మీకు ప్రతి ఇంట్లో కనీసం ఒక క్రీడాకారుడు కనిపిస్తారు,” అని ఆ ఊరి సర్పంచ్ మారోతీరావు కోర్డే చెప్పారు. “ఏదో ఒకరోజున మా నవల్‌గవ్హాణ్ పిల్లలు పెద్ద పెద్ద చోట్ల ఆడతారు. అదే మా కల."
భారత ఉపఖండంలో కబడ్డీని అనేక శతాబ్దాలుగా ఆడుతున్నారు. 1918లో ఈ క్రీడకు దేశీయ క్రీడ హోదా వచ్చింది.1936లో జరిగిన బెర్లిన్ ఒలింపిక్స్‌లో ఈ క్రీడ అంతర్దేశీయంగా వెలుగులోకి వచ్చింది. 2014లో ప్రొ-కబడ్డీ సమాఖ్య సమారంభంతో ఈ ఆట మళ్ళీ ప్రజాదరణ పొందింది.
ఈ గ్రామానికి చెందిన ఆటగాళ్ళు చాలా నిరాడంబరమైన నేపథ్యాల నుంచి వచ్చినవారు. చాలా కొద్ది కుటుంబాలు మినహాయించి, ఈ గ్రామ ప్రజలంతా మరాఠా సముదాయానికి చెందినవారే. వారు తమ జీవిక కోసం వ్యవసాయంపై ఆధారపడతారు. ఈ ప్రాంతమంతా అక్కడక్కడా రాళ్ళతో నిండిన ఎర్రని కంకర రాతి నేలలే.


ఎడమ: 2024 మాతృత్వ సన్మాన్ కబడ్డీ టోర్నమెంట్‌లో ప్రథమ, ద్వితీయ బహుమతులను గెల్చుకొన్న శుభమ్, కాన్బా కోర్డేలు. కుడి: నవల్‌గవ్హాణ్‌కి చెందిన కబడ్డీ క్రీడాకారులు గెల్చుకొన్న ట్రోఫీలు, అవార్డులు


ఎడమ: భారత ఉపఖండంలో గత కొన్ని శతాబ్దాలుగా కబడ్డీ ఆడుతున్నారు. ఈ క్రీడ ప్రసిద్ధి చెందటానికి 2014లో ప్రారంభమైన ప్రొ-కబడ్డీ సమాఖ్య దోహదపడింది. కుడి: అభ్యాసం పూర్తయిన తర్వాత, ఆట గురించి చర్చించుకునేందుకు నేలపై కూర్చొని ఉన్న క్రీడాకారులు
శుభమ్ కూడా రైతు కుటుంబానికి చెందినవాడే. తనకు ఆరేళ్ళ వయసప్పటి నుంచే శుభమ్ కబడ్డీ ఆడుతున్నాడు. "మా గ్రామ వాతావరణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. నేను రోజూ ఇక్కడకు వచ్చి కనీసం ఒక అరగంటైనా ప్రాక్టీస్ చేస్తాను," 6వ తరగతి చదువుతోన్న 12 ఏళ్ళ శుభమ్ చెప్పాడు. నేను పుణేరీ పలటన్ [ఒక ప్రొ-కబడ్డీ లీగ్ జట్టు]కు చాలా పెద్ద అభిమానిని. భవిష్యత్తులో నేను ఆ జట్టుకు ఆడాలని ఆశపడుతున్నాను," అంటాడు శుభమ్.
శుభమ్, కాన్బాలు తమ పొరుగు గ్రామమైన భాండేగావ్‌లోని సుఖ్‌దేవానంద్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. కాన్బా పదవ తరగతిలో ఉన్నాడు. వారితోపాటు వృద్ధిలోకి వస్తోన్న ఆటగాళ్ళయిన వేదాంత్ కోర్డే, ఆకాశ్ కోర్డే కూడా ఉన్నారు. వీరు ఒక్కసారికే 4-5గురు ఆటగాళ్ళను ఔట్ చేయగలరు. "బ్యాక్ కిక్, సైడ్ కిక్, సింహాచీ ఉడీ [పైకెగిరి పట్టు నుంచి విడిపించుకోవటం] ఈ ఆటలో మాకు నచ్చిన అంశాలు," అంటారు వాళ్ళు. వీరంతా ఈ ఆటలో ఆల్‌రౌండర్లే.
నవల్‌గవ్హాణ్‌లో బరువుపై ఆధారపడి జట్లను తయారుచేస్తారు. 30 కిలోల లోపు, 50 కిలోల లోపు, మూడవది ఓపెన్ గ్రూపు.
కైలాస్ కోర్డే ఓపెన్ గ్రూపు జట్టు కెప్టెన్. "ఇప్పటివరకూ మేం అనేక ట్రోఫీలను గెలుచుకున్నాం," అంటాడు 26 ఏళ్ళ కైలాస్. వాళ్ళు 2024లో మాతృత్వ సన్మాన్ కబడ్డీ టోర్నమెంట్‌ను, వసుంధర ఫౌండేషన్ కబడ్డీ చషక్‌ను 2022, 2023లలో గెల్చుకున్నారు. సుఖ్‌దేవానంద్ కబడ్డీ క్రీడా మండల్ నిర్వహించిన రాష్ట్రస్థాయి టోర్నమెంట్లను కూడా వాళ్ళు గెల్చుకున్నారు.
"జనవరి 26, రిపబ్లిక్ డే రోజున నిర్వహించే ఆటలు చాల పెద్ద ఎత్తున జరిగే పోటీలు. గ్రామాల నుండి మా ఆటను చూడటానికి జనం, మాతో పోటీ పడటానికి జట్లు వస్తాయి. మేం కూడా అవార్డులనూ, నగదు బహుమతులనూ గెల్చుకుంటాం." ఇంకా ఎక్కువ పోటీలు జరగాలని అతను భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ పోటీలు ఏడాదిలో రెండు లేదా మూడు సార్లు మాత్రమే జరుగుతున్నాయి. యువ క్రీడాకారులకు ఇటువంటి పోటీలు మరిన్ని అవసరమని కైలాస్ అంటాడు.


ఎడమ: నవల్‌గవ్హాణ్‌లోని యువ కబడ్డీ బృందానికి నాయకుడు, శిక్షకుడు కైలాస్ కోర్డే. గత ఏడాది పుణేలో జరిగిన 10 రోజుల శిక్షణా శిబిరంలో అతను పాల్గొన్నాడు. కుడి: చిన్న పిల్లలకు శిక్షణనిస్తూ, పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధపడుతోన్న నారాయణ్ చవాన్. శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవటానికి కబడ్డీ ఆడటం తనకు ఉపయోగపడిందని అతనంటాడు
కైలాస్ పోలీసు ఉద్యోగం కోసం సిద్ధపడుతున్నాడు. ప్రతిరోజూ అతను 13 కోలోమీటర్ల దూరంలో ఉన్న హింగోలీకి ప్రయాణించి అక్కడ ఒక స్టడీ రూమ్‌లో చదువుకుంటాడు. ఆ తర్వాత క్రీడల మైదానానికి వెళ్ళి ఎక్సర్‌సైజులు చేసి, శారీరక శిక్షణ తీసుకుంటాడు. క్రీడలు, ఎక్సర్‌సైజ్, చదువు పట్ల అతనికున్న అంకితభావం అనేకమంది యువ విద్యార్థులకు స్ఫూర్తినిచ్చింది.
"నవల్‌గవ్హాణ్, దాని చుట్టుపక్కల గ్రామాలైన సాటంబా, భాండేగావ్, ఇంచా గ్రామాలకు చెందిన అనేకమంది యువకులు తమ జీవనోపాధి మార్గాలను ఏర్పరచుకోవటంలో కబడ్డీ సహాయం చేసింది," అంటాడు నారాయణ్ చవాన్. కైలాస్ లాగే ఈ 21 ఏళ్ళ యువకుడు కూడా పోలీస్ రిక్రూట్‌మెంట్ పరీక్షలకు సిద్ధపడుతున్నాడు. తన శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవటానికి కబడ్డీ ఆడటం అతనికి ఉపయోగపడుతోంది. "మాకు కబడ్డీ అంటే చాలా ఇష్టం. మేం చిన్నపిల్లలంగా ఉన్నప్పటినుంచే దీన్ని ఆడుతున్నాం."
హింగోలిలోని అనేక చిన్న పట్టణాలలో వివిధ వయసులలో ఉన్న పిల్లల కోసం వార్షిక కబడ్డీ పోటీలు జరుగుతుంటాయి. వీటిని శ్రీపత్‌రావు కాట్కర్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. ఈ పోటీలను 'మాతృత్వ సన్మాన్ కబడ్డీ పోటీ' అని పిలుస్తారు. కాట్కర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజయ్ కాట్కర్ ఈ కార్యక్రమాలతో పాటు కబడ్డీ శిక్షకులకు శిక్షణను కూడా నిర్వహిస్తున్నారు. స్థానికంగా వాణిజ్యాన్నీ వ్యాపారాన్నీ ప్రోత్సహించడం కోసం, దీర్ఘకాలికంగా వలసలను నిరోధించడానికి గ్రామీణ వర్గాలతో కలిసి పనిచేయాలని ఈ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. వారు హింగోలి జిల్లాలోని అన్ని తాలూకాల లో కబడ్డీ టోర్నమెంట్‌లను నిర్వహించడంలో పేరుపొందారు
విజయ్ కోర్డే, కైలాస్ కోర్డేలు 2023లో 10 రోజులపాటు పుణేలో నిర్వహించిన అటువంటి శిక్షణకు హాజరయ్యారు. ఈ రోజున వారు నవల్‌గవ్హాణ్‌లోని పిల్లలకూ యువకులకూ శిక్షణనిస్తున్నారు. "నా చిన్నప్పటి నుండి నాకీ క్రీడ పట్ల అమితమైన ప్రేమ. నేను దీని గురించి మరింత మరింత తెలుసుకోవాలనే ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉంటాను. ఈ చిన్నవాళ్ళకు మంచిగా శిక్షణ ఇచ్చి, వాళ్ళు మంచిగా ఆడేలా తయారుచేయాలనుకుంటున్నాను," అన్నాడు విజయ్.


ఎడమ: ప్రతి సాయంత్రం నవల్‌గవ్హాణ్‌లోని పిల్లా పెద్దా తరలివచ్చే జిల్లా పరిషద్ పాఠశాల మైదానం. కుడి: ఆటకు సిద్ధంగా ఉన్న నీలి రంగు దుస్తులు ధరించిన అబ్బాయిలు!
ఇక్కడి పిల్లలకు గొప్ప సామర్థ్యం ఉందని, వాళ్ళు దేశీయ, అంతర్దేశీయ స్థాయిలో ఆడగలరని అతను భావిస్తున్నాడు. కానీ వారికి అన్ని వాతావరణ పరిస్థితులలో ఆడగలిగిన సౌకర్యాలతో కూడిన ఆట మైదానం లేదు. "వర్షం పడినప్పుడు మేం ప్రాక్టీస్ చేయలేం," అని విజయ్ చెప్పాడు.
వేదాంత్, నారాయణ్ కూడా తమ సమస్యలను పంచుకున్నారు. "మాకు మైదానం లేదు. ఇతర ఆటగాళ్ళకు ఉన్నట్టు మేం కూడా మ్యాట్‌ల మీద శిక్షణ ఇవ్వగలిగితే, మేం తప్పకుండా ఇంకా బాగా ఆడతాం," అంటారు వాళ్ళు.
అయితే నవల్‌గవ్హాణ్‌లోని కబడ్డీ ఆట సంప్రదాయం అమ్మాయిలకు తగిన స్థానాన్ని ఇవ్వటంలేదు. అనేకమంది బాలికలు పాఠశాల స్థాయి వరకు ఆడతారు, కానీ వారికి ఎటువంటి సౌకర్యాలు కానీ, చివరకు శిక్షకులు కూడా లేరు.
*****
కబడ్డీ వంటి ఏ క్రీడ అయినా దానితో పాటు కొన్ని సవాళ్ళను కూడా తెస్తుంది. ఆ సంగతి పవన్ కోర్డేకి బాగా తెలుసు.
పోయిన ఏడాది హోళీ రోజున నవల్‌గవ్హాణ్‌లో ఆటలు జరిగాయి. ఆటను చూడటానికి మొత్తం గ్రామమంతా తరలి వచ్చింది. పవన్ కోర్డే 50 కిలోల లోపు జట్టులో ఆడుతున్నాడు. "నేను మా ప్రత్యర్థి జట్టు ప్రాంతంలోకి ప్రవేశించి కొంతమంది ఆటగాళ్ళను ఔట్ చేశాను. తిరిగి నా జట్టు వద్దకు వస్తుండగా ఉన్నట్టుండి పట్టు కోల్పోయి వెల్లకిలా పడిపోయాను," చెప్పాడు పవన్. అతను తీవ్రంగా గాయపడ్డాడు.


ఎడమ: ఆడుతుండగా వెన్నులో తీవ్రంగా గాయపడిన కబడ్డీ ఆటగాడు పవన్ కోర్డే. ఆరు నెలల తర్వాత మాత్రమే అతడు నడవగలిగి, నెమ్మదిగా పరుగెత్తగలిగాడు. కుడి: తనను తాను పోషించుకునేందుకు ఆడటం మానేసి ఒక సెకండ్-హ్యాండ్ టెంపోను కొనుక్కున్న వికాస్ కోర్డే. అందులో అతను తన గ్రామం నుంచి హింగోలికి వ్యవసాయ ఉత్పత్తులను చేరవేస్తుంటాడు
అతడ్ని వెంటనే హింగోలికి తరలించినప్పటికీ, శస్త్ర చికిత్స అవసరం కావడంతో అతడిని నాందేడ్‌కు తీసుకువెళ్ళమని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికి అంతకుముందులా అతను ఆడలేడని వైద్యులు హెచ్చరించారు.
"ఈ సంగతి విన్న తర్వాత మేం కలవరపడ్డాం," అన్నాడతను. కానీ అతను జంకలేదు. శస్త్రచికిత్స నుంచి కోలుకున్న తర్వాత, పవన్ శిక్షణ తీసుకోవటం మొదలుపెట్టాడు. ఆరు నెలల తర్వాత అతను నడవటాన్నీ, పరుగెట్టడాన్నీ చేయగలుగుతున్నాడు. "అతను పోలీసు రిక్రూట్‌మెంట్ పరీక్ష ఇవ్వాలనుకుంటున్నాడు," అని పవన్ తండ్రి చెప్పారు.
అతని వైద్యపరమైన ఖర్చులన్నిటినీ కాట్కర్ ఫౌండేషన్ భరించింది.
కబడ్డీ ఆట విషయంలో నవల్‌గవ్హాణ్ గర్వపడుతున్నప్పటికీ, అందరూ దానిని చేపట్టలేకపోతున్నారు. బతకడానికి సంపాదించాల్సి రావటంతో వికాస్ కోర్డే కబడ్డీ ఆటను మానేశాడు. "నాకు కబడ్డీ ఆడటమంటే చాలా ఇష్టం, కానీ ఆర్థిక సంక్షోభం, పొలం పనుల వలన నేను చదువునూ ఆటనూ కూడా వదిలిపెట్టాల్సివచ్చింది," అన్నాడు 22 ఏళ్ళ వికాస్. పోయిన సంవత్సరం వికాస్ ఒక టెంపో కొన్నాడు. "వ్యవసాయ ఉత్పత్తులను [పసుపు, సోయా చిక్కుళ్ళు, తాజా ఉత్పత్తులు] మా ఊరి నుంచి హింగోలికి రవాణా చేసి కొంత డబ్బు సంపాదిస్తున్నాను," అన్నాడతను.
తమ గ్రామం కబడ్డీచ్ గావ్ , అంటే కబడ్డీ గ్రామంగా పేరొందాలని నవల్‌గావ్హాణ్ కోరుకుంటోంది. ఆ గ్రామ యువతకు, "కబడ్డీయే అంతిమ లక్ష్యం!"
అనువాదం: సుధామయి సత్తెనపల్లి