"వానాకాలం రాకముందే మనం గ్రామ సభ భవనానికి మరమ్మత్తులు చేయించుకోగలిగితే బాగుంటుంది," లుపుంగ్‌పాట్ గ్రామస్థులతో మాట్లాడుతూ అన్నారు సరితా అసుర్.
కొంతసేపటి క్రితం గ్రామం ప్రధాన వీధిలో నిలబడి డోలు వాయిస్తూ ఒక వ్యక్తి సభ జరుగుతుందని ప్రకటించిన తర్వాత, గ్రామ సభ ఇప్పుడే మొదలయింది. స్త్రీ పురుషులంతా తమ ఇళ్ళ నుండి బయటకు వచ్చి గ్రామ సభ సచివాలయం ముందుకు చేరుకున్నారు. ఈ రెండు గదుల భవనం మరమ్మత్తుల కోసమే సరిత నిధుల కోసం అడుగుతున్నారు.
ఝార్ఖండ్ రాష్ట్రం, గుమ్లా జిల్లాలోని ఈ గ్రామ ప్రజలు సరిత ప్రతిపాదనకు వెంటనే తమ ఆమోదం తెలిపారు.
"మా సమస్యలను పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మాదేననీ, గ్రామ సభ ఊరిని అభివృద్ధి చేస్తుందనీ మాకిప్పుడు తెలుసు. ఇది మాకు, ప్రత్యేకించి మహిళలకు, శక్తినిచ్చింది," అని మాజీ జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి అయిన సరిత ఆ తర్వాత ఈ రిపోర్టర్‌తో చెప్పారు.


ఎడమ: లుపుంగ్‌పాట్ గ్రామ సచివాలయం బయట నిల్చునివున్న సరితా అసుర్. కుడి: నీటి పరిరక్షణ, విద్య, ఆరోగ్య సంరక్షణలకు సంబంధించిన విషయాల గురించి గ్రామ సభ చర్చిస్తుంది
గుమ్లా జిల్లాలోని లుపుంగ్‌పాట్‌లో చురుగ్గా పనిచేస్తోన్న ఈ గ్రామ సభ ఝార్ఖండ్‌లో చర్చనీయాంశమైంది. జిల్లా హెడ్‌క్వార్టర్స్‌కు ఒక గంటకుపైగా దూరంలో, ఝార్ఖండ్ రాజధాని రాంచీకి 165 కి.మీ.ల దూరంలో ఉండే ఈ లోతట్టు గ్రామానికి చేరటం అంత సులభమేమీ కాదు. ఇది అడవిలో ఉంది. అక్కడికి చేరాలంటే ఒక కొండ ఎక్కి, ఆ పైనుంచి ఒక కచ్చా రోడ్డులో కిందికి దిగాలి. విశాల ప్రజారవాణాకు చెందిన బస్సులు దొరకటం కష్టం, కానీ అంత తరచుగా కాకపోయినా ఆటోలు, చిన్న వాహనాలు మాత్రం దొరుకుతాయి.
ఈ గ్రామంలో అసుర్ సముదాయానికి చెందిన వంద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ సముదాయం పివిటిజి (Particularly Vulnerable Tribal Group - ప్రత్యేకించి బలహీనమైన ఆదివాసీ సమూహం) కింద జాబితా చేసివుంది. గుమ్లాలోనే కాకుండా, ఝార్ఖండ్‌లోని లోహర్‌దగా, పలామూ, లాతేహార్ జిల్లాలలో కూడా వీరు నివసిస్తున్నారు. రాష్ట్రంలో వీరి మొత్తం జనాభా 22,459 ( భారతదేశంలో షెడ్యూల్డ్ తెగల గణాంకాలు, 2013 ).
సుమారుగా గ్రామంలోని సగంమంది అక్షరాస్యులే. గ్రామ సభ చేసే ప్రతి పనీ నమోదు అవుతుంది. "ప్రతి పనీ దస్తావేజుగా నమోదవుతుంది. చర్చించవలసిన విషయాలను నిశ్చయిస్తారు. మేం ప్రజలకు సంబంధించిన సమస్యలను చేపడుతున్నాం," అన్నారు క్రియాశీల యువ నాయకుడు, మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడైన సంచిత్ అసుర్. "గ్రామ సభ స్త్రీ పురుషులిద్దరికీ చెందినది," అన్నారతను కమిటీలో లింగ సమానతకు ప్రాథాన్యమిచ్చిన సంగతిని ఎత్తిచూపిస్తూ.
ఇంతకుముందరి గ్రామ సభలన్నిటికీ మగవాళ్ళే హాజరయ్యేవాళ్ళని సరిత పేర్కొన్నారు. "(మాకు) మహిళలకు అక్కడేం చర్చించేవారో తెలిసేది కాదు," అన్నారు ఈ మాజీ జాతీయ స్థాయి హాకీ క్రీడాకారిణి. ఆ సమావేశాల్లో ప్రధానంగా గ్రామంలోని కుటుంబ కలహాలనే పరిష్కరించేవారు.
"కానీ ఇప్పుడలా జరగటంలేదు. మేమిప్పుడు గ్రామ సభలో పాల్గొని ప్రతి అంశాన్ని గురించి చర్చిస్తాం, నిర్ణయాలు తీసుకునేటప్పుడు మా అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు," సంతోషంగా చెప్పారు సరిత.


వయసు, జెండర్, స్థాయిలతో సంబంధం లేకుండా గ్రామ సభ సమావేశాలకు అందరూ హాజరవుతారు. కుడి: ఇంతకుముందు గ్రామమంతా నీటి కోసం ఈ సహజసిద్ధమైన నీటి ఊటపై ఆధారపడేది, మహిళలు తమ ఇంటి అవసరాలకు నీటి కోసం రోజూ దూరం వెళ్ళాల్సివచ్చేది


లుపుంగ్‌పాట్‌లో నీరు ఒక ముఖ్య సమస్య, గ్రామసభ పరిశీలించే అంశం కూడా. ఒక పాత బావి (ఎడమ), గ్రామంలో ముఖ్యమైన ఒక నీటి వనరు
గ్రామ సభలో పాల్గొనటం తమకు సంతోషం కలిగించడమే కాకుండా, దానిద్వారా మౌలికమైన సమస్యలను పరిష్కరించుకోగలిగినట్లు గ్రామంలో నివసించే ఇతరులు చెప్పారు. "మేం మా నీటి సమస్యను పరిష్కరించుకున్నాం. ఇంతకు ముందు మా ఊరి మహిళలు నీళ్ళు తెచ్చేందుకు దూరాలు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఊరి వీధిలోనే నీటి సరఫరా ఉంది. రేషన్ తీసుకునేందుకు మేం వేరే గ్రామానికి వెళ్ళేవాళ్ళం, కానీ ఇప్పుడది మా దగ్గరకే వచ్చింది," అన్నారు బెనెడిక్ట్ అసుర్. "ఇదొక్కటే కాదు, మేం మా ఊరిని గనుల కోసం తవ్వకుండా కూడా రక్షించుకున్నాం."
అడవిలో బాక్సైట్ తవ్వకాల కోసం సర్వే చేయడానికి వచ్చిన బయటివాళ్ళను తామెలా పసిగట్టిందీ గ్రామస్థులు గుర్తుచేసుకున్నారు. హెచ్చరికగా ఒక అలారం మోగింది, అనేకమంది గ్రామస్థులు గుమిగూడారు, ఆ వచ్చినవాళ్ళను తరిమికొట్టారు.
గ్రామ సభ సమితితో పాటే లుపుంగ్‌పాట్ గ్రామస్థులు మరో ఏడు సమితులను (కమిటీలను) ఏర్పాటుచేశారు - ప్రాథమిక మౌలిక సదుపాయాల సమితి, ప్రజా సంపద సమితి, వ్యవసాయ సమితి, ఆరోగ్య సమితి, గ్రామ రక్షక సమితి, విద్యా సమితి, నిఘా సమితి.
“ప్రతి సమితి సంబంధిత సమస్యల గురించి, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను గురించి చర్చిస్తుంది. ఆ తర్వాత వారు తమ నిర్ణయాన్ని ప్రాథమిక మౌలిక సదుపాయాల సమితికి పంపుతారు. అక్కడి నుండి అది గ్రామ అభివృద్ధి సమితికి చేరుతుంది,” అని గ్రామసభ సభ్యుడు క్రిస్టఫర్ వివరించారు. "మనం ప్రజాస్వామ్య పద్ధతులను క్షేత్ర స్థాయిలో బలోపేతం చేస్తే సంక్షేమం, సామాజిక న్యాయం వేళ్లూనుకుంటాయి," అని అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌లోని అభివృద్ధి కేంద్రం అధిపతి, ప్రొఫెసర్ అశోక్ సర్కార్ చెప్పారు.
గ్రామసభ సమితి గ్రామస్థులందరికీ చెందినది కాబట్టి, వారు నిర్ణయాలు తీసుకుంటారు; వాటిని గ్రామ పెద్ద, వార్డు సభ్యులు చైన్‌పుర్‌లోని బ్లాక్ కార్యాలయానికి తీసుకువెళతారు.


ఎడమ: పిల్లలను విద్యావంతులను చేయటం చాలా ముఖ్యమైన ప్రాథాన్యం. గ్రామం నుంచి బడికి నడచివెళ్తోన్న ఒక బాలికల బృందం. కుడి: లుపుంగ్‌పాట్ గ్రామం లోపల
"గ్రామానికి సంబంధించిన సామాజిక పింఛన్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులు వంటి ఏ పథకాలు ఉన్నా, ప్రతి ఒక్కటి గ్రామసభ ద్వారా ఆమోదం పొందిన తర్వాత మాత్రమే ఆ తదుపరి చర్యకోసం ముందుకు వెళ్తాయి," అని గుమ్లా జిల్లాలోని చైన్‌పూర్ బ్లాక్‌కు చెందిన బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (బిడిఒ) డాక్టర్ శిశిర్ కుమార్ సింగ్ చెప్పారు.
కోవిడ్-19 సమయంలో వలసపోయిన అనేకమంది ఇళ్ళకు తిరిగివచ్చినపుడు వారికోసం ఒక క్వారంటైన్ కేంద్రం( సచివాలయం )ను గ్రామ సభే ఏర్పాటు చేసి, పౌర సంఘాల సహాయంతో వారికి కావలసిన ఆహారం, నీరు, మందులను అందించింది.
ఏదైనా తప్పుచేసినందుకు, బడినుంచి పంపించివేసిన విద్యార్థుల కోసం గ్రామ సభ కింద పనిచేసే గ్రామ విద్యా సమితి ఒక అపూర్వమైన పరిష్కారంతో ముందుకు వచ్చింది: "గ్రామానికి చెందిన ఒక విద్యావంతుడైన యువకుడు ఆ పిల్లలతో పాటు ఉండి వారికి బోధించాలని మేం నిర్ణయించాం. ఒక్కో విద్యార్థికి ఒక్కో రూపాయి చొప్పున ఆ విద్యార్థి కుటుంబాలే ఈ యువకుడికి చెల్లించాలి," అంటూ క్రిస్టఫర్ అసుర్ వివరించారు.
"ఇంతకుముందు గ్రామసభ పేరుతో బ్లాక్ అధికారులు ఒక రిజిస్టర్‌తో మా గ్రామానికి వచ్చి, పథకాలు, లబ్ధిదారులు మొదలైనవాటి ఎంపికను వారే నిర్వహించి, వారితో పాటే ఆ రిజిస్టర్‌ను తీసుకొని వెళ్ళేవారు" అని క్రిస్టఫర్ చెప్పారు. ఇలా చేయటం ద్వారా చాలామంది అర్హులైనవారికి సామాజిక పథకాల ప్రయోజనాలను వారు నిరాకరించారు.
లుపుంగ్‌పాట్ గ్రామ సభ దీన్నంతటినీ మార్చివేసింది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి