చక్కగా అల్లిన కమల్‌కోశ్ చాపను కొద్దిమంది మాత్రమే మెచ్చుకోగలరు.
చాలా కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ ఆ చాపను అల్లగలరు.
పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ జిల్లాలో తయారుచేసే ఈ అత్యంత సవిస్తరమైన పేము చాపలను బిరుసుగా ఉండే సన్నటి పేము చీలికలతో అల్లుతారు. వాటిపై ఉండే సాంస్కృతిక కళాకృతుల వలన ఇవి ఇతర చాపల నుండి ప్రత్యేకంగా నిలుస్తాయి.
"సంప్రదాయక కమలకోశ్ , కోలా గాచ్ [అరటి చెట్టు], మయూర్ [నెమలి], మంగళ్ ఘట్ [కొబ్బరికాయ కలశం], స్వస్తిక్ [శ్రేయస్సుకు ప్రతీక] వంటి మంగళకరమైన కళాకృతులతో అలంకరించి ఉంటుంది," అని ప్రభాతి ధర్ చెప్పారు.
వీటిని కమల్‌కోశ్ చాపలుగా అల్లగల కొద్దిమంది అల్లికదారులలో ప్రభాతి కూడా ఒకరు. ఆమె 10 సంవత్సరాల చిన్న వయస్సు నుంచే ఈ చాపలను అల్లుతున్నారు. "ఈ గ్రామం [ఘెగిర్‌ఘాట్ గ్రామం]లోని ప్రతి ఒక్కరూ చాలా చిన్న వయస్సు నుండే చాపలు అల్లడం ప్రారంభిస్తారు," అని ఈడుకు మించిన బుద్ధి కావొచ్చునేమో అనే సూచనను తోసిపుచ్చుతూ చెప్పారు 36 ఏళ్ళ ప్రభాతి. "మా అమ్మ కమల్‌కోశ్ ను భాగాలుగా మాత్రమే అల్లగలదు, కానీ మా నాన్నకు మాత్రం డిజైన్‌పై మంచి పట్టు ఉంది. 'ఈ డిజైన్‌ను ఇలా అల్లడానికి ప్రయత్నించండి' అని బాగా వివరిస్తాడు కూడా. ఆయన స్వయంగా అల్లలేనప్పటికీ, ఆయన వివరణాత్మక వివరణల నుండి తాను చాలా ఎక్కువ గ్రహించినట్టు ప్రభాతి భావిస్తున్నారు.
మేం ఘెగిర్‌ఘాట్‌లోని ఆమె ఇంటి వరండాలో కూర్చొని ఉన్నాం. చుట్టూ మూసివున్న ఆ వసారాలో ఆ ప్రాంతంలోని చాలామంది అల్లిక కార్మికులు పనిచేయడానికి ఇష్టపడతారు. ఈ కళకు సంబంధించిన వివిధ పనుల్లో సహాయం చేస్తూ ఆమె కుటుంబమంతా ఆమె చుట్టుపక్కలే ఉంటారు. చాప అల్లికలో వచ్చే కళాకృతులను ఆమె మాత్రమే ఊహించి, రూపొందిస్తారు. "మా జ్ఞాపకశక్తితోనే వీటిని చేయడం మాకు అలవాటైపోయింది," అని ఆమె తన డిజైన్ ప్రక్రియ గురించి చెప్పారు.


పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, కూచ్‌బిహార్ జిల్లాలో కమల్‌కోశ్ అల్లగలిగిన కొద్దిమందిలో ఒకరైన ప్రభాతి ధర్. ఆమె, ఆమె కుటుంబం పేము చాపలను అల్లే పనిచేసుకునే ఘెగిర్‌ఘాట్ గ్రామంలోని ఆమె ఇంటి వరండా, ప్రాంగణం

పూర్తయిన చాపను చూపిస్తోన్న ప్రభాతి, ఆమె భర్త మనోరంజన్
కృష్ణ చంద్ర భౌమిక్ ప్రక్కనే ఉన్న ధాలియాబారి పట్టణానికి చెందిన వ్యాపారి. అతను తరచుగా ప్రభాతి నుండి కమల్‌కోశ్ ను ఆర్డర్ చేస్తుంటారు. “ కమల్‌కోశ్ హోలో ఏక్టీ షొకీన్ జినీష్ [కమల్‌కోశ్ అనేది రసజ్ఞులైనవారే విలువ కట్టగల వస్తువు]. ఒక మంచి పాటీ విలువ కేవలం ఒక బెంగాలీ వ్యక్తికి మాత్రమే అర్థమవుతుంది. అందుకే వారు నాణ్యత కలిగిన ఖరీదైన చాపలను కొనుగోలు చేసే ప్రధాన కొనుగోలుదారులు,” అని అతను PARIకి చెప్పారు.
ధర్ కుటుంబం దాదాపుగా మొత్తం అల్లిక పనివారు మాత్రమే నివసించే ఘెగిర్‌ఘాట్ గ్రామంలో నివసిస్తోంది. నిజానికి మొత్తం కూచ్ బిహార్-1 బ్లాక్‌లోనే ఎక్కువగా అల్లిక పనివారు నివసిస్తున్నారు. వీరు బంగ్లాదేశ్ మూలాలను కలిగి ఉన్న పాటీ అల్లిక పనివారు. వీరిలో ప్రతి ఒక్కరూ వారు ఎక్కడి నుండి వచ్చారు అనే దానిపై ఆధారపడి ఆ ప్రదేశానికి చెందిన ఒక ప్రత్యేక శైలినీ నైపుణ్యాన్నీ కలిగి ఉంటారు. కానీ అది త్వరలో రాబోయే మరొక కథ.
స్థూలంగా చెప్పాలంటే, చాపలను పాటీ (చీలికలు) అల్లికగా వర్గీకరించారు. అవి మోటా పాటీ (ముతక చాపలు) నుండి అత్యుత్తమమైన, అరుదైన కమల్‌కోశ్ వరకు ఉంటాయి. పేము ( Schumannianthus dichotomus ) ఇక్కడ పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బిహార్ ప్రాంతంలో కనిపించే ఒక స్థానిక రకం.
కమల్‌కోశ్ చాపలను తయారుచేయడానికి, పేము కర్ర బయటి పొరను జాగ్రత్తగా బేత్ అని పిలిచే సన్నని చీలికలుగా (పేము చీలికలు) చేయాలి. ఆ తర్వాత వాటిని మెరుపు కోసం, తెల్లదనం కోసం గంజిలో ఉడకబెట్టాలి, ఈ ప్రక్రియ ద్వారా మెరుగైన అద్దకం వేయడానికి వీలవుతుంది.
అల్లికను మొదలుపెట్టడానికి ముందు చేసే ఈ క్లిష్టమైన పనిని ఆమె భర్త మనోరంజన్ ధర్ చేస్తున్నారు. తనకు పెళ్ళయిన తర్వాత, నవ వధువుగా ఉన్న తాను చక్కటి చాపలు అల్లగలనని, అయితే దానికి తగిన ముడిసరుకు అవసరమని తన భర్తకు ఎలా చెప్పిందో ప్రభాతి గుర్తుచేసుకున్నారు. “నా భర్త క్రమంగా కమల్‌కోశ్ అల్లడానికి అవసరమైన సన్నని పేము చీలికలను చేయడాన్ని నేర్చుకున్నాడు."


ఎడమ: ప్రభాతి అద్దకం వేయడానికి ఉపయోగించే సాల హద్దుగోడకు ఆనుకుని ఉన్న తాజాగా అల్లిన శీతల్‌పాటీ. దాని పక్కన చాపలు అల్లడానికి ఉపయోగించే 'పాటీబేత్' అని పిలిచే తాజాగా కోసిన పేము దంట్లను పేర్చారు. కుడి: ఉడకబెట్టడం, అద్దకం వేయడం వంటి ప్రక్రియల కోసం పేము చీలికలను ఇలా మోపుగా కడతారు


ప్రభాతి గంజిలో ఉడికించిన పేము చీలికలను కమల్‌కోశ్ తయారీకి కావలసిన రంగుల్లోకి అద్దకం వేసి (ఎడమ), ఆపై వాటిని ఎండడానికి ఎండలో పెడతారు (కుడి)
ప్రభాతి మాతో మాట్లాడుతున్నపుడు మేం ఆమె చేతులనే చూస్తున్నాం. అక్కడ వినిపిస్తోన్న మరో శబ్దం, అతి చురుకైన ఆమె వేళ్ళ మధ్యన కదులుతోన్న పేము చీలికల మర్మర ధ్వని మాత్రమే. అప్పుడప్పుడు అటుగా వెళ్తోన్న మోటారు వాహనం చప్పుడు తప్ప ఇక్కడంతా దగ్గర దగ్గరగా కట్టిన ఇళ్ళున్న నిశ్శబ్ద పరిసరాలు. అరటి చెట్లు, తమలపాకు తీగలు ఇళ్ళను చుట్టుముట్టి ఉన్నాయి; ఏడడుగుల ఎత్తులో ఉన్న దట్టమైన పేము పొదలు ఇంటి నుండి కనిపిస్తున్నాయి
ఈ నిపుణురాలైన కళాకారిణి సంప్రదాయక చేతి కొలతలనే ఉపయోగిస్తారు. చేతిని ఉపయోగించి కొలిచే ' ఏక్ హాత్ ' (మూర) అంటే సుమారు 18 అంగుళాలు. ఒక రెండున్నర చేతుల వెడల్పు, నాలుగు చేతుల పొడవు ఉంటే, ఆ చాప సుమారు నాలుగడుగుల వెడల్పు, ఆరడుగుల పొడవు ఉంటుంది.
ప్రభాతి కాసేపు చేస్తోన్న పనిని ఆపి, తన వినియోగదారులకోసం తాను అల్లి ఇచ్చిన కొన్ని కమల్‌కోశ్ చాపల ఫోటోలను మాకు చూపించటం కోసం తన మొబైల్‌లో ఉన్న ఫోటోలను తిరగేశారు. " కమల్‌కోశ్ చాపలను ఆర్డర్ల మీద మాత్రమే చేస్తాం. స్థానికంగా ఉండే వ్యాపారులు అడిగినప్పుడే వాటిని అల్లుతాం. ఈ ప్రత్యేకమైన ఈ చాపలు హాట్ [వారపు సంత]లో అమ్ముడుపోవు."
కమల్‌కోశ్ లో పేర్లను, తేదీలను అల్లి చాపలను వ్యక్తిగతీకరించే ధోరణి ఇటీవల పెరుగుతున్నది. “వివాహాల సమయంలో చాపపై అల్లాల్సిన జంట పేర్లను వినియోగదారులు మాకు చెబుతారు. ' శుభొ బిజొయా ' - విజయ దశమి శుభాకాంక్షలు - వంటి పదాలను కూడా అల్లవలసిందని అడుగుతుంటారు." పెళ్ళిళ్ళు లేదా పండుగల వంటి సందర్భాలలో ఈ ప్రత్యేకమైన చాపలను బయటకు తీస్తుంటారని ఆమె చెప్పారు. "బెంగాలీ లిపిలో కంటే ఆంగ్లంలో పదాలను అల్లడం చాలా సులభం," అంటారు ప్రభాతి. వంపు తిరిగి దీర్ఘంగా ఉండే బంగ్లా అక్షరాలను అల్లటం ఆమెకొక సవాలు.


సంతోషకర సందర్భాన్ని సూచించేందుకు నెమళ్ళ చిత్రాలతో పాటు పెళ్ళి జంట పేర్లను కూడా అల్లి, ఆ జంటకు బహుమతిగా ఇచ్చిన చాప

కూచ్ బిహార్, ఘుఘుమారిలోని పాటీ మ్యూజియంలో ఉన్న ఒక కమల్‌కోశ్
ఇది అరుదైన నైపుణ్యం అని కూచ్ బిహార్-1వ బ్లాక్‌లోని పాటీ శిల్ప సమవాయ్ సమితి కార్యదర్శి ప్రదీప్ కుమార్ రాయ్ ధృవీకరించారు. స్వయంగా అల్లికదారుడైన ఆయన ఇలా అంటారు, “కూచ్ బిహార్ జిల్లాలో సుమారు 10,000 మంది చాపలు అల్లేవారు ఉన్నారు. అయితే, ఈ ప్రాంతం మొత్తమ్మీద అరుదైన కమల్‌కోశ్ చాపలను అల్లేవారు 10-12 మంది మాత్రమే ఉన్నారు.”
1992 నుంచి పనిచేస్తోన్న ఈ సమితిలో 300 మంది అల్లకందారులున్నారు. చాపలు అల్లడంలో ఈ ప్రాంతంలో అగ్రగామి సహకార సంఘం అయిన ఈ సమితి, ఘుఘుమారిలో రెండు వారాల పాటు పాటీ హాట్ (చాపల వారపు సంత)ను నిర్వహిస్తుంది. కూచ్ బిహార్ ప్రాంతంలోని ఏకైక చాపల బజారైన ఈ సంతలో ఒక్క రోజులోనే సుమారు వెయ్యిమంది అల్లకందారులు, దాదాపు 100 మంది వ్యాపారులు కనిపిస్తారు.
ఈ ప్రాంతంలో చివరిగా కమలకోశ్ అల్లిక వృత్తిని నిర్వహిస్తున్న వారిలో ప్రభాతి ఒకరు. ఈ బాధ్యతను ఆమె చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. “మా అమ్మ రోజూ అల్లుతుంది. ఒక్కరోజు కూడా ఆమె సెలవు తీసుకోదు. మేం ఏదైనా పని కోసం బయటకు వెళ్ళాల్సి వస్తేనో, లేదంటే మా తాత ఇంటికి వెళ్ళాల్సి వస్తే మాత్రమే ఆమె సెలవు తీసుకుంటుంది,” అని ప్రభాతి కుమార్తె మందిర చెప్పింది. ఈమె తనకు ఐదేళ్ళ వయసప్పటి నుండి ఈ అల్లికను చూస్తూ తన నైపుణ్యాన్ని పెంచుకుంది.
ప్రభాతి, మనోరంజన్ దంపతులకు ఇద్దరు పిల్లలు - 15 ఏళ్ళ మందిర, ఏడేళ్ళ పియూష్ (ప్రేమగా తోజో అని పిలుస్తారు). ఈ ఇద్దరూ బడి అయిపోయిన తర్వాత ఈ కళను చాలా చురుకుగా నేర్చుకుంటున్నారు. ప్రభాతి తల్లిదండ్రుల వద్ద నివసిస్తోన్న మందిర, వారంలో రెండుసార్లు ఇంటికి వచ్చి చాపల అల్లికలో తన తల్లికి సాయంచేస్తుంది. చిన్నవాడూ శక్తిశాలీ అయిన తోజో కూడా అల్లికకు అవసరమైన పేము చీలికలను సిద్ధం చేస్తూ ఈ కళను చక్కగా నేర్చుకుంటున్నాడు. చుట్టుపక్కల తన స్నేహితులంతా క్రికెట్ ఆడుతుంటే తోజో మాత్రం ఈ పనిలోనే ఉంటాడు.


ఎడమ: పొద్దుపొద్దున్నే చాప అల్లుతోన్న ప్రభాతి, ఆమె కుమార్తె మందిర. పేము కర్రలను తరుగుతోన్న కొడుకు పీయూష్. ఈ ప్రక్రియను బేత్ షోలై అని పిలుస్తారు. పీయూష్ తన పనిని పూర్తి చేయగానే క్రికెట్ ఆడటానికి వేచి చూస్తోన్న అతని స్నేహితుడు


ఎడమ: కథలు చెప్పే చాపలను ఎలా నేయాలో నేర్చుకునేందుకు ఇరుగుపొరుగు పిల్లలు ప్రభాతి ఇంటికి వస్తారు. చాప అంచులవైపున అల్లుతూ ప్రభాతికి సహాయం చేస్తోన్న గీతాంజలి భౌమిక్, అంకితా దాస్, మందిర ధర్ (ఎడమ నుండి కుడికి). కుడి: పాటీ నేసే ప్రభాతి కుటుంబం: భర్త మనోరంజన్ ధర్, కొడుకు పీయూష్ ధర్; కుమార్తె మందిరా ధర్, ప్రభాతి ధర్; ఆమె పొరుగున ఉండే అంకితా దాస్
ప్రభాతి అల్లిక నైపుణ్యం, ప్రయోగాలు చేసే అవకాశాన్ని అందిస్తుందని భావించే ఇరుగుపొరుగుల పిల్లలు ఆ కళను తమకు నేర్పించమని ఆమెను ఒత్తిడి పెడుతుంటారు: "మా పొరుగింటివారి అమ్మాయి నాతో, ' కాకీ [అత్త], నాకు కూడా నేర్పించు!' అని అడుగుతోంది." సెలవులు, వారాంతాల్లో ఆమె ఇల్లు ఒక సృజనాత్మక ప్రదేశంగా మారుతుంది. “నెమళ్ళను, చెట్లను ఎలా అల్లాలో నేర్చుకునేందుకు పిల్లలు చాలా ఆసక్తిగా ఉంటారు. అయితే, వారు వెంటనే దానిని అల్లలేరు. అందువల్ల, నేను చాప అంచులను అల్లమని, నేను నమూనాలను అల్లుతున్నప్పుడు గమనించమని వారికి చెప్తుంటాను. క్రమంగా నేను వారికి నేర్పిస్తాను,” అని ఆమె చెప్పారు.
కమల్‌కోశ్ అల్లకాన్ని నేర్చుకుంటున్నప్పటికీ మందిరకు ఎక్కువ జీతం, విరామ సమయం ఇచ్చే వృత్తి కావాలనే నిశ్చయం ఉంది. "బహుశా నేను నర్సింగ్ కోసం శిక్షణ తీసుకుంటాను," అని ఆమె చెప్పింది. “చాపలు అల్లడంలో చాలా శ్రమ ఉంటుంది. ఒకరు ఉద్యోగం చేస్తే, [మరొకరు] కూర్చొని కొంత విశ్రాంతి పొందవచ్చు, సంపాదించవచ్చు. నిత్యం శ్రమించాల్సిన అవసరం లేదు. అందుకే [నా తరంలో] ఎవరూ చాపలు అల్లడానికి ఇష్టపడరు
తన అభిప్రాయాన్ని నిరూపించుకోవడానికి ఆమె తన తల్లికి ప్రతిరోజూ ఎలా గడుస్తుందో ఇలా పేర్కొంది: “మా అమ్మ రోజూ ఉదయం 5:30 గంటలకు మేల్కొంటుంది. ఇంటిని ఊడ్చి శుభ్రం చేస్తుంది. ఆ తర్వాత ఒక గంటసేపు చాప అల్లడానికి కూర్చుంటుంది. మేం పొద్దున్నే తినేందుకు మాకోసం వంట కూడా చేస్తుంది. ఆమె కూడా తినేసి, మళ్ళీ మధ్యాహ్నం వరకు అల్లి, స్నానం కోసం విరామం తీసుకుంటుంది. మళ్ళీ ఇల్లు ఊడ్చి, మధ్యాహ్నం నుంచి అల్లడానికి కూర్చుంటుంది. అలా రాత్రి 9 గంటల వరకు అల్లడాన్ని కొనసాగిస్తుంది. మళ్ళీ వంట చేస్తుంది. ఆ తర్వాత మేం తినేసి నిద్రపోతాం.
"ఇంటి దగ్గర పని చాలా ఉంటుంది కాబట్టి మా అమ్మానాన్నలు మేళా లకు వెళ్ళరు. మేం ప్రతిరోజూ ఒక పాటీ ని తయారుచేయడానికి ప్రయత్నించాలి, అప్పుడు మాత్రమే నెలలో మా రోజువారీ ఖర్చులకు అవసరమైన 15,000 రూపాయల కుటుంబ ఆదాయాన్ని పొందగలుగుతాం,” అని మందిర చెప్పింది.


ప్రభాతి చాపలను అల్లడంతో పాటు తన ఇల్లు, కుటుంబ బాగోగులను కూడా చూసుకుంటారు
*****
పాటీ తయారుచేసే ప్రక్రియను స్థానికంగా సమస్తిగత కాజ్ - కుటుంబం, సమాజాల సమష్టి కృషి - అని పిలుస్తారు. “ ఎటా అమాదేర్ పాటీశిల్పీర్ కాజ్ టా ఏకోక్ భాభే హోయే నా. టాకా జోడాతే గెలే సబాయ్ కే హాత్ దీతే హోయ్ [చాప అల్లడమనే మా వృత్తి ఒక్కరితో జరగదు. నెలాఖరులో మంచి ఆదాయాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ పూనుకోవాలి]" అని చాపల అల్లిక కోసం తన కుటుంబంపై ఆధారపడే ప్రభాతి చెప్పారు.
ఈ పనిని " మాఠీర్ కాజ్ [బయటి పని], బారీర్ కాజ్ [ఇంట్లో చేసే పని]గా విభజించారు," అని ఈ కళలో నైపుణ్యం ఉండి, ఇదే అల్లిక పని చేసే కుటుంబానికి చెందిన కంచన్ డే చెప్పారు. పురుషులు పేము మొక్కను ఎలా నరికి, అల్లడం కోసం దానిని కత్తిరించి, మెత్తని చీలికలుగా ఎలా ముక్కలు చేస్తారో; అలాగే మహిళలు ఎలా పేము చీలికలను గంజిలో ఉడకబెట్టి, ఎండబెట్టి, చాప అల్లుతారో అతను వివరిస్తారు. చివరకు చిన్న పిల్లలు కూడా పనులలో జెండర్ విభజనను తీసుకుంటారు - అమ్మాయిలు ఆమె అల్లడాన్ని చూడటానికి వస్తారు, అబ్బాయిలు తాము కూడా పేమును చీల్చే పనిని చేయడానికి ప్రయత్నిస్తారు. కంచన్ డే, పొరుగున ఉన్న గంగలేర్ కుఠీ గ్రామానికి చెందిన ఒక గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయుడు.
6x7 అడుగుల ప్రామాణిక పరిమాణంలో ఉండే ఒక పాటీ [చాప] అల్లడానికి 160 పాటీబేత్ [పేము చీలికలు] అవసరమవుతాయి. ఈ చీలికలను వంగే విధంగా తయారుచేయడానికి రెండు రోజుల సమయం పడుతుంది, దీనిని పురుషులే చేస్తారు. బేత్ షోలై , బేత్ తోలా అని పిలిచే ఈ రెండంచెల ప్రక్రియలో పేము దంటును అనేక చీలికలుగా విడదీయడం, కర్ర లోపలి చేవను తొలగించడం, ఆపైన ప్రతి సన్నని చీలికను 2 మిమీ, 0.5 మిమీ మందం ఉండేలా జాగ్రత్తగా విభజించడం వంటివి ఉంటాయి. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ. చక్కటి చీలికలు చేయటం కోసం అనుభవం, ఖచ్చితత్వం ఉన్న చేయి చాలా అవసరం


తన పొలంలో పేమును కోస్తున్న మనోరంజన్ ధర్ (ఎడమ). తన కొడుకు పియూష్ (కుడి)తో కలిసి పేము చీలికలను సిద్ధం చేస్తున్నారు. బేత్ షోలై తయారుచేస్తున్న పియూష్. పేమును అనేక చీలికలుగా ముక్కలు చేసి, కర్ర లోపలి చేవను తొలగించడం అనే ప్రాథమిక ప్రక్రియను బేత్ షోలై అంటారు. బేత్, బుకా, చోటూ అనే మూడు పొరలను కలిగి ఉండే చీలికల నుండి నాణ్యమైన పేము చీలికను తీసే బేత్‌తోలా ప్రక్రియను చేస్తున్న మనోరంజన్. చాపను అల్లడానికి అన్నిటికంటే పైపొర అయిన బేత్‌ని మాత్రమే ఉపయోగిస్తారు


తయారైన చాపను పరీక్షిస్తోన్న మనోరంజన్. పాటీ తయారుచేసే ప్రక్రియ కుటుంబం, సమాజాల సమష్టి కృషి. 'నెల చివరకు మంచి ఆదాయాన్ని పొందాలంటే ప్రతి ఒక్కరూ పూనుకోవాలి,' అని చాపల తయారీలో తన కుటుంబంపై ఆధారపడే ప్రభాతి అంటారు
అల్లిక పూర్తయ్యాక చాపను ఎండబెట్టడం. మామూలు చాపలను వాటి సహజ రంగులో ఉన్న పేము చీలికలను ఉపయోగించి అల్లుతారు, కానీ కమల్‌కోశ్ ను మాత్రం సాధారణంగా రెండు రంగులతో అల్లుతారు,” అని ఈ నైపుణ్య కళాకారిణి అంటారు. ఈమె చాపను అల్లేటపుడు గంటల తరబడి గొంతుక్కూర్చుంటారు. కొన్నిసార్లు ఊతం కోసం చెక్క పీడీ (తక్కువ ఎత్తుండే పీట)ని ఉపయోగిస్తారు. అప్పటికే అల్లిన భాగాల అంచులు విడిపోకుండా ఉండేందుకు ప్రభాతి తన పాదాలను ఉపయోగించి బిగించి పట్టుకుంటారు. అల్లిక నమూనా ప్రకారం లెక్కించి, గుండ్రని గుత్తిగా చుట్టివున్న పేము చీలికలను ఎత్తడానికి ఆమె తన రెండు చేతులను ఉపయోగిస్తారు.
ఆమె ఒకేసారి దాదాపు 70 పేము చీలికలను చేతులతో నేర్పుగా తిప్పుతారు. ఆమె అల్లే పేము చాప ప్రతి పూర్తి వరస కోసం, ప్రభాతి ఒకే చీలికను 600 పేము చీలికల గుండా పైకీ క్రిందికీ చేతులతో తిప్పుతూ అల్లుతారు. ఆరు బై ఏడు అడుగుల చాపను అల్లడానికి ఆమె దీన్ని సుమారు 700 సార్లు చేయాలి.
ఒక్క కమల్‌కోశ్ అల్లడానికి పట్టే సమయంలో, 10 మామూలు చాపలను తయారుచేయవచ్చు, ధర కూడా అలాగే ఉంటుదని ప్రభాతి చెప్పారు. " కమల్‌కోశ్ ని తయారుచేయడం చాలా కష్టమైన పని, కానీ దానికి ఎక్కువ డబ్బు వస్తుంది ." కమల్‌కోశ్ కి ఆర్డర్‌లు తక్కువగా ఉన్నప్పుడు, ప్రభాతి మామూలు చాపలను కూడా అల్లుతారు. నిజానికి మామూలు చాపలకే ఎక్కువ గిరాకీ ఉన్నందున తాను ఒక సంవత్సరంలో వాటినే ఎక్కువగా నేస్తానని ఆమె చెప్పారు.


చాపను దగ్గరగా చూసినపుడు పేము చీలికలను ఉపయోగించి నమూనాలను, కళాకృతులను ఎలా పరస్పరం అనుసంధానించారో తెలుస్తుంది. చాప అల్లికలో పేము చీలికలు ఒకదానికొకటి వాలుగా లంబంగా నడుస్తాయి. ఈ అల్లిక లయ అదే - సరళ ఆకృతిలో కాకుండా దానిని భాగాలు భాగాలు అల్లడం. చాపను చదరంగా చేయడానికి మనోరంజన్ (కుడి) మొదట ఒక వైపు చుట్టి, ఆపైన మరొక వైపు చుడతారు


శీతల్‌పాటీ అల్లేటప్పుడు (ఎడమ నుండి కుడికి) కూర్చోవడానికి ఒక తక్కువ ఎత్తున్న పీట లేదా పీడీని; పేము కొమ్మను ముక్కలు చేయడానికి, చీల్చడానికి దావ్ లేదా బోటీ అనే సాధనాన్ని; పేమును కోసేందుకు బేత్‌కటాను; చాపను అల్లడం పూర్తయిన తర్వాత చాప అంచులను, పొడుచుకు వచ్చిన పేము చీలికలను కత్తిరించడానికి ఛురీని ఉపయోగిస్తారు. అల్లకం పూర్తయిన తర్వాత మడతపెట్టి, వ్యాపారికి అందించడానికి సిద్ధంగా ఉన్న కమల్‌కోశ్ పాటీతో ప్రభాతి
ఒక తల్లిగా తన పాత్రను, కమల్‌కోశ్ అల్లికదారుగా నిమ్మళమైన ఖ్యాతిని పొందటాన్ని తాను ఆస్వాదిస్తున్నట్టు నిగర్వి అయిన ప్రభాతి చెప్పారు. “నాకు కమల్‌కోశ్ ను అల్లగల సామర్థ్యం ఉంది కాబట్టే నేను వాటిని తయారుచేస్తున్నాను. అమీ గర్వబోధ్ కొరీ . అందుకు నాకు గర్వంగా ఉంటుంది."
కొద్దిగా సంకోచిస్తూ ఆమె ఇలా అన్నారు, “చాలామంది దీనిని అల్లలేరు. నేను ఈ అరుదైన చాపను అల్లగలను, అందుకే మీరు నా వద్దకు వచ్చారు, అవునుకదా? మీరు మరెవరి దగ్గరకూ వెళ్ళలేదు!"
ఈ కథనానికి మృణాళిని ముఖర్జీ ఫౌండేషన్ (ఎమ్ఎమ్ఎఫ్) ఫెలోషిప్ మద్దతు ఉంది.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి