శ్రామికవర్గ ప్రజలు పూర్తిగా అరిగిపోయిన చెప్పులను కూడా దాచిపెట్టుకుంటారు. సామాన్ల బరువులెత్తేవారి చెప్పులు గుంటలు పడి, అరిపాదాలు ఆనేచోట లోపలికి అరిగిపోయి ఉంటాయి. కట్టెలు కొట్టేవారి చెప్పులు ముళ్ళతో నిండివుంటాయి. నా సొంత స్లిప్పర్లు ఊడిపోకుండా ఉండేందుకు వాటికి తరచుగా పిన్నీసులు పెడుతుంటాను.
భారతదేశమంతటా నేను చేసే ప్రయాణాలలో అదేపనిగా నేను పాదరక్షల చిత్రాలను తీశాను, ఆ ఫోటోలలో ఈ కథనాలను వెతకడం మొదలుపెట్టాను. అటువంటి పాదరక్షల కథనాల ద్వారా నా సొంత ప్రయాణం కూడా ఆవిష్కృతమవుతుంది.
ఇటీవల పనిమీద ఒడిశాలోని జాజ్‌పూర్‌కు వెళ్ళినపుడు బారాబంకి, పురాణమందిర గ్రామాలలో ఉన్న పాఠశాలలకు వెళ్ళే అవకాశం నాకు దొరికింది. మేం వెళ్ళినచోటల్లా, ఆదివాసీ సముదాయాల ప్రజలు గుమిగూడిన గది బయట శ్రద్ధగా అమర్చిన పాదరక్షలను నేను ఆసక్తిగా చూస్తుండేవాడిని.
మొదట్లో నేను పెద్దగా పట్టించుకోలేదు, కానీ మూడు రోజులు ప్రయాణించిన తర్వాత, నేను పూర్తిగా అరిగిపోయిన చెప్పులను, కొన్నిటికి రంధ్రాలు కూడా ఉండటాన్ని, గమనించటం మొదలుపెట్టాను.


పాదరక్షలతో నా స్వంత అనుబంధం నా జ్ఞాపకాలలో ముద్రించుకుపోయింది. తిరిగి మా ఊరి సంగతి చూస్తే, ప్రతి ఒక్కరూ వి-ఆకారపు పట్టీలున్న చెప్పులు కొనుక్కునేవారు. నాకు సుమారు 12 ఏళ్ళ వయసున్నపుడు, మదురైలో వీటి ధర కేవలం 20 రూపాయలు మాత్రమే ఉండేది. అయినా కూడా పాదరక్షలు మా జీవితాల్లో చాలా కీలక పాత్ర వహిస్తాయి కాబట్టి, వాటిని కొనే స్తోమతను పెంచుకోవటం కోసం మా కుటుంబాలు చాలా కష్టపడేవి.
మార్కెట్‌లోకి ఒక కొత్త చెప్పుల మోడల్ వచ్చినప్పుడల్లా, మా ఊరిలోని ఎవరో ఒక అబ్బాయి అది కొనుక్కునేవాడు. మిగిలిన అబ్బాయిలమంతా పండుగలకు, ఏదైనా ప్రత్యేక సందర్భాలలో, లేదంటే పట్టణం బయట ఊళ్ళకు వెళ్ళినప్పుడో వేసుకోవటానికి అతని దగ్గర ఆ కొత్త చెప్పుల్ని అప్పు తీసుకునేవాళ్ళం.
నా జాజ్‌పూర్ ప్రయాణం తర్వాత నా చుట్టుపక్కల పాదరక్షలను మరింత ఎక్కువగా గమనించటం మొదలుపెట్టాను. కొన్ని చెప్పుల జతలు నాకు సంబంధించిన గత సంఘటనలతో ముడిపడి ఉండేవి. నేను, నా సహాధ్యాయులు షూ వేసుకోనందుకు మాకు వ్యాయామ శిక్షణనిచ్చే ఉపాధ్యాయుడు మమ్మల్ని మందలించిన సందర్భాలు నాకు గుర్తున్నాయి.
ఒక ముఖ్యమైన మార్పుకు గురుతుగా పాదరక్షలు నా ఫోటోగ్రఫీని కూడా ప్రభావితం చేశాయి. అణగారిన వర్గాలు పాదరక్షలు వేసుకోవడానికి చాలాకాలం పాటు అనుమతి ఉండేదికాదు. ఈ విధమైన ఆలోచన, పాదరక్షల ప్రాముఖ్యం గురించి నేను మళ్ళీ మదింపు వేసుకోవడానికి ఆజ్యం పోసింది. ఆ ఆలోచన నా పనికి బీజం వేసింది. శ్రామికవర్గ ప్రజల పోరాటానికి, పగలూ రేయీ కష్టపడే వారి పాదరక్షలకూ ప్రాతినిధ్యం వహించాలనే నా లక్ష్యానికి ప్రోత్సాహాన్నిచ్చింది.




















అనువాదం: సుధామయి సత్తెనపల్లి