"ప్రతి సంవత్సరం బడ్జెట్‌పై జరిగే ఈ హంగామా మా జీవితాలను కొద్దిగానైనా మారుస్తుందా?" అని ఇద్దరు పిల్లల ఒంటరి తల్లి కె. నాగమ్మ అడిగారు. ఆమె భర్త 2007లో సెప్టిక్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ మరణించారు. ఈ విషాదం ఆమెను సఫాయి కర్మచారి ఆందోళన్ వారి చెంతకు చేర్చగా, ఇప్పుడామె దాని కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. ఆమె పెద్ద కుమార్తె శైల నర్సు గాను, చిన్న కూతురు ఆనంది తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగంలోనూ ఉన్నారు.
“మాకు ‘బడ్జెట్’ అనేది కేవలం ఒక అలంకార పదం మాత్రమే. మేం సంపాదించేదానితో మా ఇంటి బడ్జెట్‌ను కూడా నిర్వహించలేం, అలాగే ప్రభుత్వ ప్రణాళికలలో కూడా మాకు చోటు ఉండదు. అయినా ఈ బడ్జెట్ ఏంటి? నా కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడానికి అదేమైనా సహాయం చేస్తుందా?”
నాగమ్మ పుట్టకముందే ఆమె తల్లిదండ్రులు చెన్నైకి వలస రావటంతో, ఆమె చెన్నైలోనే పుట్టి పెరిగారు. నాగమ్మ తండ్రి, స్వగ్రామమైన నాగులాపురంలో నివాసముంటోన్న తన సోదరి కుమారుడితో 1995లో నాగమ్మకు వివాహం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా పామూరు సమీపంలోని ఆ గ్రామంలో ఆమె భర్త కణ్ణన్ తాపీ మేస్త్రీగా పని చేసేవారు. మాదిగ సముదాయానికి చెందిన ఈ కుటుంబాలు షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉన్నాయి. "2004లో, ఇద్దరు పిల్లలు పుట్టాక, మా ఆడపిల్లల చదువుల కోసం చెన్నైకి రావాలని నిర్ణయించుకున్నాం," అని నాగమ్మ గుర్తు చేసుకున్నారు. అలా వచ్చిన మూడేళ్ళకే కణ్ణన్ చనిపోయారు .


తన కుమార్తెలు శైల, ఆనందిలతో కె. నాగమ్మ
చెన్నైలో గిండీ సమీపంలోని సెయింట్ థామస్ మౌంట్ ఇరుకైన సందులలో ఉండే ఒక ఇరుకైన ఇంట్లో నివసిస్తోన్న నాగమ్మ జీవితంలో, నేను ఐదేళ్ళ క్రితం ఆమెను చివరిగా కలిసినప్పటికంటే పెద్ద మార్పులేమీ కనిపించలేదు. “కాసు బంగారం ధర రూ.20,000-30,000 ఉన్నప్పుడే, ఒకటో రెండో కాసుల బంగారాన్ని కొనడానికి కొంచెం డబ్బు ఆదా చేయాలని నేననుకున్నాను. [కాసు: సుమారు 8 గ్రాములు]. ఇప్పుడు, ఒక కాసు బంగారం ధర రూ.60,000-70,000 మధ్య ఉంటే, నేను నా బిడ్డల పెళ్ళిళ్ళు ఎలా చెయ్యాలి? పెళ్ళిళ్ళలో బంగారం భాగం కానప్పుడే బహుశా మేం పెళ్ళిళ్ళు చేయగలమేమో," అన్నారామె.
కొద్దిసేపు ఆలోచిస్తూ కూర్చున్న తర్వాత, ఆమె నెమ్మదిగా: “బంగారం సంగతి ఎలాగున్నా, తిండి సంగతేమిటి? గ్యాస్ సిలిండర్లు, బియ్యం, అత్యవసరమై కొనాలంటే ఒక అతి చవకరకం పాల ప్యాకెట్ కూడా అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఒక ఏడాది క్రితం నేను వెయ్యి రూపాయలకు కొన్న బియ్యానికి ఇప్పుడు రూ. 2,000 చెల్లిస్తున్నా. కానీ మా ఆదాయం మాత్రం పెరగలేదు," అన్నారామె.
ఏ కార్మికుల పోరాటాలకోసమైతే ఆమె పూర్తికాల కార్యకర్తగా మారిందో, ఆ పారిశుద్ధ్య కార్మికుల పోరాటాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె గొంతులో నిరుత్సాహం మరింత గాఢమయింది. "వాళ్ళ విషయంలో మెరుగుపడిందేమీ లేదు," అన్నారామె. “ఎస్ఆర్ఎమ్ఎస్ (SRMS*), NAMASTE అయింది, కానీ ప్రయోజనం ఏమిటి? కనీసం ఎస్ఆర్ఎమ్ఎస్ కింద మేం గ్రూపులుగా ఏర్పడి కొంత గౌరవంగా జీవించేందుకు రుణాలు పొందే అవకాశం ఉంది. కానీ NAMASTE కింద, వాళ్ళు మాకు మెషీన్లు ఇస్తారు - అతిముఖ్యంగా, నా భర్త ఏ పని చేస్తూ మరణించాడో, అదే పనిని మేం బలవంతంగా చేసేలా చేస్తున్నారు. నాకో విషయం చెప్పండి, ఒక యంత్రం మాకు గౌరవాన్ని ఇవ్వగలదా?”
ఎస్ఆర్ఎమ్ఎస్ (SRMS): పారిశుద్ధ్య కార్మికుల పునరావాస స్వయం ఉపాధి పథకం, 2007. 2023లో దీని పేరును NAMASTE - నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్‌గా మార్చారు. కానీ నాగమ్మ పేర్కొన్నట్లుగా, ఇది పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను మార్చడానికి బదులుగా వాళ్ళను ఆ పనిలోనే మగ్గిపోయేలా చేస్తోంది.
అనువాదం: రవి కృష్ణ