అది సెప్టెంబర్ నెల మొదటి వారం. ఘోరామారా రేవు కోలాహలంగా వుంది. ఆడ, మగ, పిల్లలు, పశువులతో సహా అందరూ త్వరత్వరగా పడవ దిగి తమ రోజువారీ పనులలోకి వెళ్ళడానికి హడావుడి పడుతున్నారు. అలలు ఎగసిపడే ఉప్పెన సమయంలో వేరే చోట - తరచుగా బంధువుల దగ్గర - తలదాచుకున్న వాళ్ళందరూ నీరు తగ్గిపోగానే తిరిగి ద్వీపం లోని తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. కనీసం నెలకు రెండుసార్లు అటూ ఇటూ తిరిగే ఆ పడవ (ఫెర్రీ) ప్రధాన భూభాగమైన కాక్‌ద్వీపం నుండి సుందరవనాలలోని డెల్టాప్రాంత ద్వీపానికి చేరుకోవడానికి 40 నిమిషాల సమయం పడుతుంది. ఘోరామారా పశ్చిమ బెంగాల్, దక్షిణ 24 పరాగణాల జిల్లాలోని ఒక చిన్న ద్వీపం. కేవలం నెలకు రెండుసార్లు సాగే ఈ ప్రయాణం, వారి చిన్న ద్వీపంలో జీవించడానికి ఘోరామారా ప్రజలు చేస్తున్న సుదీర్ఘ జీవన పోరాటాన్ని అర్థంచేయించలేదు.
తరచుగా వచ్చే తుఫానులు, పెరుగుతున్న సముద్ర మట్టం, భారీ వర్షాలు - ఇటువంటి వాతావరణ మార్పులన్నీ కలిసి ఘోరామారా ప్రజల జీవనాన్ని కష్టతరం చేసాయి . దశాబ్దాల వరదలు, భూమి కోతల వల్ల వారి మాతృభూమి హుగ్ల్లీ నదీ ముఖంలో ఒక తేలియాడే భూభాగంగా మారిపోయింది.
మే నెలలో వచ్చిపడ్డ యాస్ తుఫాను వల్ల ఘోరంగా నష్టపోయిన సుందరవన ప్రాంతాల్లో సాగర్ బ్లాక్ లోని ఘోరామారా ఒకటి. మే 26 న, అధికమైన ఆటుపోట్లతో తుఫాను కట్టలు తెంచుకుని కేవలం 15-20 నిమిషాలలోనే ద్వీపాన్ని ముంచెత్తింది. అంతకుముందు అంఫాన్ (2020) , బుల్బుల్ (2019) తుఫానుల ప్రభావాన్ని భరించిన ద్వీపవాసులు మళ్లీ ఈ విధ్వంసాన్ని ఎదుర్కొన్నారు. వారి ఇళ్లు కూలిపోయాయి. నిల్వపెట్టుకున్న వరి, తమలపాకు పంటలు, పొద్దుతిరుగుడు పొలాలు మొత్తం కొట్టుకుపోయాయి.
తుపాను బీభత్సానికి ఖాసిమారా ఘాట్ సమీపంలోని అబ్దుల్ రవూఫ్ ఇల్లు ధ్వంసమైంది. "మాకు ఆ మూడు రోజులు ఆహారం లేదు వర్షపునీటితో బతికాం.ప్లాస్టిక్ షీట్లే మమ్మల్ని కాపాడాయి." అని అక్కడికి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొల్‌కతాలో టైలర్‌గా పనిచేసే రవూఫ్ చెప్పారు. అతనూ, అతని భార్య అనారోగ్యానికి గురైనప్పుడు, "మాకు కోవిడ్ వచ్చిందేమోనని అందరూ అనుమానించారు. చాలా మంది గ్రామం నుండి వెళ్లిపోయారు," అని అతను చెప్పారు. "అనారోగ్యం కారణంగా మేము సురక్షిత ప్రాంతానికి వెళ్లలేకపోయాము”. బ్లాక్ డెవలప్మెంట్ అధికారి చెప్పిన తరవాత మాత్రమే రవూఫ్‌కీ, అతని భార్యకీ వైద్య సహాయం అందింది. "బిడిఒ మమ్మల్ని ఎలాగైనా చేసి కాక్‌ద్వీపం చేరుకోమన్నాడు. అక్కడినుంచి ఆయన అంబులెన్సు ఏర్పాటు చేశాడు. మాకు మొత్తం 22వేల రూపాయలు ఖర్చయ్యింది ( వైద్యం కోసం)". అప్పటి నుంచి రవూఫ్, అతని భార్య ద్వీపం లోని ఒక ఆశ్రయంలో నివసిస్తున్నారు.
ఇళ్లు ధ్వంసమైన పలువురిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించారు. మందిర్‌తలా గ్రామస్థులకు ద్వీపంలోకల్లా ఎత్తైన ప్రదేశం అయిన మందిర్‌తలా బజార్ (బజార్) సమీపంలోని ట్యాంక్ గ్రౌండ్‌లో ఆశ్రయం ఏర్పాటుచేశారు. వీరిలో కొందరు సమీపంలోని ఇరుకైన రహదారిపై నివాసం(క్యాంప్) ఏర్పరుచుకున్నారు. ద్వీపంలోని హాత్‌ఖోలా, చూన్‌పురి, ఖాసిమారా ప్రాంతాల నుండి, 30 కుటుంబాలు ఘోరామారాకు దక్షిణాన ఉన్న సాగర్ ద్వీపంలో తాత్కాలికంగా ఆశ్రయం పొందాయి. వీరికి పునరావాసం కోసం అక్కడ భూమిని కేటాయించారు.

యాస్ తుపాను ధాటికి ఖాసిమారాలోని రెజాఉల్ ఖాన్ ఇల్లు దెబ్బతిన్నది. అతను,అతని కుటుంబం సాగర్ ద్వీపంలో పునరావాసం పొందారు
అందులో రెజాఉల్ ఖాన్ కుటుంబం ఒకటి. ఖాసిమారాలోని అతని ఇల్లు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. "నేను ద్వీపం వదిలి వెళ్ళాలి, కానీ ఎందుకు?" అని ఆ తుఫాను రోజున, తుఫానులో దెబ్బతిని చీకటిగా ఉన్న మసీదు అటకపై కూర్చొని ఉన్న అతను, నాతో అన్నారు. “నా చిన్ననాటి స్నేహితుడైన గణేష్ పారువాను వదిలి ఎలా వెళ్ళగలను? అతని తోటలోని కాకరకాయలే మేము నిన్న రాత్రి వండుకున్నది".
తుఫాను తెచ్చిన నష్టం నుండి గ్రామస్తులు ఇంకా కోలుకోకముందే, జూన్‌లో వచ్చిన యాస్ తుఫాను వల్ల ఏర్పడ్డ అలలు ఘోరామారాను ముంచెత్తడం ప్రారంభించాయి. ఆపై రుతుపవనాల రాక వల్ల కురిసిన వానల ప్రళయం. ఈ సంఘటనల వినాశకరమైన పరిణామాల గురించి భయపడిన రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రాణ నష్టాన్ని నివారించడం కోసం ద్వీపవాసులని పునరావాసం కోసం తరలించడం ప్రారంభించింది.
"ఆ రోజుల్లో [తుఫాను తర్వాత] నా దుకాణంలో ఉప్పు, నూనె తప్ప ఇంకేమీ లేవు," అని మందిర్‌తలాలోని కిరాణా దుకాణం యజమాని అమిత్ హల్దార్ అన్నారు. “అంతా అలల్లో మునిగిపోయాయి. ఈ దీవిలోని మా పెద్దలెవరూ ఇంతకు ముందు ఇంతటి భారీ అలలను చూసివుండలేదు. అవి ఎంత పెద్దవిగా వున్నాయంటే మేం ప్రాణాలు కాపాడుకోవడానికి ఎత్తైన చెట్లు ఎక్కాం. కొందరు ఆడవాళ్లయితే అలల ధాటికి కొట్టుకుపోకుండా వుండటానికి (దీవిలోని) ఎత్తయిన ప్రదేశాలకు వెళ్లి తమని తాము చెట్లకు కట్టేసుకున్నారు. వాళ్ళ గొంతు దాకా నీళ్ళొచ్చేశాయి." అని హల్దార్ అన్నారు." చాలా పశువుల్ని కాపాడుకోలేకపొయ్యాం.”
సుందరవనాలలో వాతావరణ మార్పుల వల్ల వచ్చిన సంక్షోభంపై 2014లో జరిగిన అధ్యయనం ప్రకారం, పెరుగుతున్న సముద్ర మట్టాలు, సంక్లిష్ట హైడ్రో-డైనమిక్ పరిస్థితులు ఘోరామారాలో తీవ్రమైన తీరప్రాంత కోతకు కారణాలు. 1975లో 8.51 చదరపు కిలోమీటర్లు వున్న భూభాగం నుండి 2012 నాటికి 4.43 చదరపు కిలోమీటర్లకు తగ్గింది. పదేపదే నివాసాల్ని మార్చాల్సి రావడం, దెబ్బతిన్న పర్యావరణ వ్యవస్థ వల్ల ద్వీపం నుండి వలసల రేటు ఎక్కువగా ఉందని అధ్యయనం గుర్తించింది. ఈ అధ్యయనం ప్రకారం 2001 -2011 మధ్య కాలంలో ఘోరామారా జనాభా 5,236 నుండి 5,193కి తగ్గింది. దీనికి వలస పోవడమే కారణమని చెప్పవచ్చు.
ఎంత దురదృష్టం వెంటాడుతున్నప్పటికీ , ఘోరామారా ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కలిసే వున్నారు. ఆరు నెలల వయసున్న అవిక్ అన్నప్రాశనకు - బిడ్డకు మొదటిసారి అన్నం తినిపించేటప్పుడు చేసే పండగ- హాత్‌ఖోలా ఆశ్రయంలో వున్న ప్రతి ఒక్కరు సహాయం చేశారు. కుంచించుకుపోతున్న వారి భూభాగం, ఈ పర్యావరణ శరణార్థులను అనూహ్యమైన జీవనంతో రాజీపడక తప్పని స్థితిలోకి నెడుతోంది. అందువల్ల వాళ్ళు తమ ఇళ్ళని తిరిగి కట్టుకుంటారు, లేదా కొత్త ఆశ్ర యాన్ని వెతుక్కుంటారు.

అధిక ఆటుపోట్ల తర్వాత ప్రధాన భూభాగమైన
కాక్‌ద్వీపం నుండి పడవలో తిరిగివస్తున్న ఘోరామారా వాసులు

ఈ ఏడాది మే 26న, యాస్ తుఫాను అధిక ఆటుపోట్లతో కట్టలను బద్దలు కొట్టి, ద్వీపాన్ని ముంచెత్తింది

వరదలకు గురయ్యే ద్వీపంలోని నివాసితులు తమ జీవితాలను పునర్నిర్మించుకోవాలనే
ఆశతో జీవిస్తున్నారు

షేక్ సనుజ్ ఘోరామరాను విడిచిపెట్టి సాగర్ ద్వీపానికి మకాం
మార్చే ముందు ఖాసిమారాలోని తన ఇంటి గురించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు

ఖాసిమారా ఘాట్‌లో ఆహారం కోసం వేచి వున్న ప్రజలు; యాస్ తుఫాను
వల్ల తమ ఇళ్లు ధ్వంసమైన తర్వాత వారు ఈ ఆహారంతోనే బతుకుతున్నారు

ఖాసిమారా ఘాట్‌కు పడవలో చేరుతున్న ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసరాలు

ఇంటికి తిరిగి రావాలనే ఆత్రుతలో ఫెర్రీ నుండి దిగుతున్న పురుషులు,
మహిళలు, పిల్లలు, పశువులు

మందిర్‌తలా బజార్ సమీపంలోని ట్యాంక్ గ్రౌండ్‌లో తాత్కాలిక
ఆశ్రయం, ఘోరమారా లో ఎత్తైన ప్రదేశం ఇదే. దాదాపు మూడొంతుల మంది గ్రామస్తులు ఇక్కడ ఆశ్రయం
పొందారు

దెబ్బతిన్న తన ఇంటి దగ్గర నిలబడి వున్న అమిత్ హల్దార్. మందిర్‌తలా
బజార్ సమీపంలోని తన కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన వస్తువులన్నీఆయన పోగొట్టుకున్నారు

ఖాసిమారా ఘాట్ సమీపంలోని ఓ ఇంటిని నివాసయోగ్యంగా చేసేందుకు
తడి నేలపై మట్టిని పోస్తున్నారు

హాత్‌ఖోలాలోని తాత్కాలిక ఆశ్రయం దగ్గర వల నేస్తున్నఠాకూర్‌దాసీ
ఘరుయీ. ఆమెకూ, ఆమె కుటుంబానికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది

హాత్‌ఖోలాలోని క్యాంప్‌లో కాకలి మండల్ (నారింజ రంగు చీరలో).
సాగర్ ద్వీపానికి తరలించబడిన 30 కుటుంబాలలో ఆమె కుటుంబం కూడా ఒకటి

సాగర్ ద్వీపంలో తనకు కేటాయించిన భూమి పత్రాలను చూపిస్తున్న ఖాసిమారాకు
చెందిన అబ్దుల్ రవూఫ్

సెప్టెంబరు 9న తన అన్నప్రాశన వేడుకకు ముందు హత్‌ఖోలా షెల్టర్
వద్ద తల్లితో పసివాడు అవిక్ . శిబిరంలోని ఇతరులు వంటలో సహాయం చేస్తున్నారు

మందిర్‌తలా బజార్ సమీపంలోని ట్యాంక్ గ్రౌండ్ షెల్టర్ వద్ద
మధ్యాహ్న భోజనం కోసం భారీ క్యూలో నిరీక్షిస్తున్న జనం

ఖాసిమారా ఘాట్ వద్ద పడవ నుండి ఆహార పొట్లాలు తీసుకోవడం కోసం వర్షంలో గుమిగూడిన ప్రజలు

ఒక స్వచ్ఛంద సంస్థ
పంపిణీ చేస్తున్న చీరల కోసం ఖాసిమారా ఘాట్ వద్ద మహిళలు

ఒక వైద్య బృందం వారానికి ఒకసారి కొల్‌కతా నుండి మందిర్‌తలా
సమీపంలోని ఘోరామారా లోని ఏకైక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తుంది. ఇతర సమయాల్లో,
ప్రజలు వైద్య సహాయం కోసం ఆశా కార్యకర్తలపై ఆధారపడతారు

సెప్టెంబర్ 9న పిఎచ్‌సిలో జరుగుతోన్న కోవిడ్ టీకాలు వేసే కార్యక్రమం.
ఇది ఘోరామారాలో నిర్వహించబడిన 17వ క్యాంపు

ఘోరామారాలోని మడ్ పాయింట్ పోస్ట్ ఆఫీస్ పోస్ట్‌మాస్టర్. ఆ పేరు బ్రిటీష్ వాళ్ళు పెట్టినది. ఆయన తన కార్యాలయానికి చేరుకోవడానికి రోజూ 75 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. పోస్ట్ ఆఫీసులో ఫైళ్లు, కాగితాలు గాలిలోని అధిక తేమ వల్ల తడిగా అయిపోతాయి. అవి ఆరడం కోసం ఇలా బయట పరచి ఉంచుతారు

అహల్య శిశు శిక్షా కేంద్రలోని ఒక తరగతి గదిలో ఇప్పుడు పడకలు అమర్చారు. కూరగాయలు నిల్వ చేసే ప్రదేశంగా కూడా పనిచేస్తోంది. కోవిడ్ -19 వ్యాప్తి చెందినప్పటి నుండి మందిర్‌తలా లోని ఈ పాఠశాల పనిచేయడం లేదు

ఖాసిమారాలోని రేషన్ దుకాణం వెనుక ఉన్నతమలపాకు పొలంలో ఆరబెడుతున్న
బియ్యం, గోధుమ బస్తాలు. ఉప్పునీటిలో తడవడం వల్ల ఇవి పాడయిపోయాయి. కుళ్లిపోయిన పంటల
దుర్వాసన ద్వీపం అంతటా వ్యాపించి వుంది

తుఫాను కారణంగా నేలకొరిగిన చెట్టులో మిగిలిన భాగాల్ని జాగర్త
చేసుకుంటున్న ఖాసిమారా ఘాట్ సమీపంలోని గ్రామస్థులు

చేపలు పట్టేందుకు వలలు విసురుతున్న చూన్‌పురి ప్రాంత వాసులు.
ఘోరామారాలో కొనసాగుతున్న బతుకు పోరాటం
అనువాదం: వి. రాహుల్జీ