“దేవుడు మమ్మల్ని ఇన్నిసార్లు ముక్కలు ముక్కలుగా చంపే బదులు ఒకేసారి చంపేసుంటే బావుండేది.” అని మే 26న సముద్రపు ఉప్పెన వలన, సుందర్బన్లలో మౌసుని ద్వీపంలో తన ఇంటిని కోల్పోయిన అజార్ ఖాన్ అన్నాడు.
ఆ రోజు సాయంత్రం బంగాళాఖాతంలో ఎగసిన ఉప్పెన వలన మురిగంగ నదిలో మామూలు కన్నా 1-2 మీటర్ల ఎత్తున్న పెద్ద అలలు వచ్చాయి. నీళ్లు ఒడ్డును దాటి దిగువ ప్రాంతంలో ఉన్న ద్వీపాలను ముంచెత్తి, ఇళ్ళని, పొలాలని నాశనం చేసేశాయి.
సైక్లోన్ యాస్ వలన మే 26 మధ్యాహ్నం లోపల మౌసునికి నైరుతి దిశలో 65 నాటికల్ మైళ్ళ దూరం లో ఉన్న ఒడిశా లోని బాలాసోర్ వద్ద కొండచరియ విరిగిపడిన తరవాత ఈ ఉప్పెన వచ్చింది. తీవ్రమైన ఈ తుఫాను లో గాలి 130-140 కిలోమీర్ల వేగంతో వీచింది.
“మేము సముద్రం పోటెత్తడం చూసాను. మాకు మా వస్తువులను భద్రమైన చోటుకు మార్చుకునే సమయం, ఉందనుకున్నాం, కానీ నీళ్లు ఒక్కసారి గా ముంచెత్తాయి”, అన్నది బాగ్దంగా మౌజా ( ఊరి)లో ఉండే మజుర బిబి. “మేము ప్రాణాలను చేతిలో పెట్టుకుని పరిగెత్తాము, కానీ మా వస్తువులను కాపాడుకోలేకపోయాము. మాలో చాలా మంది ప్రాణాలను రక్షించుకోవడానికి చెట్లను ఎక్కాము.”
ఎడతెరపి లేని వానల వలన బాగ్దంగా, బాలియారా, కుసుంతలా, మౌసుని- ఈ నాలుగు ఊర్లలో మూడురోజులుగా లాంచీలను పడవలను నడపడం నిలిపివేశారు. నేను 29న మౌసునికి చేరే సమయానికి ఆ ప్రాంతం ఇంకా చాలావరకు నీళ్లలోనే మునిగి ఉంది.
“మా భూమి ఇప్పుడు ఉప్పు నీటిలో మునిగి ఉంది,” అన్నాడు బాగ్దంగా ఆశ్రయంలో కలిసిన అభిలాష్ సర్దార్. “మా రైతులు వారి జీవనోపాధిని కోల్పోయారు. నేను నా పొలంలో ఇంకో మూడేళ్లు సేద్యం చేయలేను. మళ్లీ ఈ భూమి సారవంతమవడానికి ఇంకో ఏడేళ్లు పడుతుంది.“ అని చాలా బాధపడుతూ అన్నాడు.

గాయన్ కుటుంబం, తుఫాను వలన బాగ్దంగా లోని వారి ఇంటిని కోల్పోయింది. “మా ఇల్లు కూలిపోయింది, మీరే చూస్తున్నారుగా. ఈ పడిపోయిన ముక్కలతో తిరిగి ఏమి కట్టలేము.”
పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ 24 పరగనాస్ జిల్లాలోని నామ్‌ఖానా బ్లాక్‌లో, చుట్టూ నదులు, సముద్రమూ ఉన్న మౌసుని ద్వీపానికి యాస్ తుఫాను వలన చాలా నష్టం కలిగింది.
ఒక సంవత్సరం క్రిందట, అంటే, మే 20, 2020 లో అంఫాన్ తుఫాను సుదర్బన్లను నాశనం చేసింది. దానికి ముందు బుల్ బుల్ (2019), అలియా(2009) ఈ ద్వీపాలను చిందరవందర చేశాయి. మౌసుని లో 30-35 శాతం భూమిని అలియా నాశనం చేసి, ఉప్పునీటిలో భూమిని ముంచేసి దక్షిణ కోస్తా భూమిని వ్యవసాయానికి పనికిరాకుండా చేసింది.
గ్లోబల్ వార్మింగ్ కు సూచికగా సముద్ర ఉపరితలం పై ఉష్ణోగ్రత మారడం మాత్రమే కాదు, కోస్తా ప్రాంతాలలో పెరుగుతున్న ఉపరితల ఉష్ణోగ్రతలు కూడా ఈ తుఫాన్ల తీవ్రతను ప్రభావితం చేస్తాయని నిపుణులు గమనించారు . ఈ తీవ్రత రేటు పెరిగి ఉప్పెనగా మారే పరిస్థితి మే, అక్టోబరు, నవంబరు నెలలలో పెరుగుతాయి అని ఇండియన్ మెటియోరియోలాజికల్ డిపార్టుమెంటు(IMD) వారు 2006 లో జరిపిన స్టడీ నోట్స్ చెబుతోంది.
యాస్ కు ముందు 70 శాతం ద్వీపపు భూమి, అంటే 6,000 ఎకరాలు సేద్యానికి అనుకూలంగా ఉండేది, “కానీ ఇప్పుడు 70-80 ఎకరాల భూమి మాత్రమే ఉప్పునీటిలో మునగకుండా ఉంది.” అంటాడు సరల్ దాస్. ఇతనికి బాగ్దంగాలో ఐదు ఎకరాల భూమి ఉంది.
ఇంచుమించుగా ఆ ద్వీపం లో నివసిస్తున్న 22,000 మంది (సెన్సెస్ 2011) సైక్లోన్ వలన ఇబ్బందులపాలయ్యారు అన్నాడు దాస్. ఇతను బాగ్దంగా లోని కో-ఆపరేటివ్ స్కూల్ లో పని చేస్తున్నాడు. “దగ్గరగా 400 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి, 2000 ఇల్లు పాడయ్యాయి.” అన్నాడు. కోళ్లు, చేపలతో కలిపి చాలావరకు పశువులు నష్టపోయామని చెప్పాడు.

బాగ్దంగా లో నివసించే వ్యక్తి, వరిపొలంలోని వరద నీటి మధ్య లోంచి త్రాగేనీటి డ్రమ్ముని తాడుతో లాక్కుంటూ వెళ్తున్నాడు.
ఇక్కడున్నవారు మామూలుగా బావులలో నీరు తోడుకొని తాగుతారు. కానీ మౌసాని లో ఇప్పుడు అది కూడా కష్టమైపోయింది. “చాలావరకు బావులు మునిగిపోయాయి. మేము ఇంచుమించుగా 5 కిలోమీటర్లు నడుములోతు బురదలో నడిస్తే కానీ ఒక తాగునీటి బావి దొరకడం లేదు.” అన్నాడు జెనాల్ సర్దార్.
మౌసునిలో ఉన్నవారు ఇలాంటి విపత్తులతో జీవించడం నేర్చుకోవాలి అని అన్నారు జ్యోతిరీంద్రనారాయణ్ లాహిరి. ఈయన ఒక కన్సర్వేషనలిస్ట్, సుదర్బన్లలో ప్రజలకొరకు సుధు సుందర్బన్ చర్చ అనే త్రైమాసిక పత్రికకు సంపాదకుడుగా కూడా పనిచేస్తున్నారు. “వాళ్ళు వరదలను తట్టుకోగలిగే ఇళ్లను కట్టుకోవడం వంటి కొత్త పద్ధతులు అలవర్చుకోవాలి.”అన్నాడు.
“వాళ్ళు విపత్తులకు సరైనా పద్ధతిలో సిద్ధపడితే బతకగలరు.” అంటారు లాహిరి. ఇటువంటి విపత్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాల ప్రజలు ప్రభుత్వం ఇచ్చే పరిహారాల పై ఆధారపడరు.
పశ్చిమ బెంగాల్ గవర్నమెంట్ అంచనా ప్రకారం రాష్ట్రం లో కనీసం 96,650 హెక్టార్ల (238,830 ఎకరాలు) పంట వరదలో మునిగిపోయింది. మౌసుమి లో వ్యవసాయమే ముఖ్యమైన జీవనోపాధి. ఇప్పుడు చాలా వరకు ఉన్న సారవంతమైన భూమి ప్రస్తుతం ఉప్పునీటిలో మునిగిపోయింది. కాబట్టి రాబోయే రోజులు ఇంకా ఘోరం గా ఉండబోతున్నాయి.
ఈ ద్వీపవాసులు నెమ్మదిగా యాస్ తుఫాను వలన జరిగిన నష్టాన్ని అంగీకరించేంతలో, IMD జూన్ 11న బంగాళాఖాతం లో రాబోయే ఇంకో తుఫానును సూచిస్తుంది . దీనివలన సుదర్బన్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
బాగ్దంగాలో బీబీజాన్ బిబి కి ఇవన్నీగాక ఆందోళన కలిగించే విషయం మరొకటి ఉంది. “నీరు వెనక్కు మరలగానే, గోఖ్రా (ఇండియన్ కోబ్రా/నాగుపాము) ఇళ్లలోకి వస్తుంది. మాకు చాలా భయంగా ఉంది.”

నిరంజన్ మండల్ బురదలో నడుస్తూ ఇంటికి తాగునీటిని బావి నుంచి తీసుకువెళ్తున్నాడు.

“నా కూతురు మౌసీని లో ఉంటుంది. నేను ఆమెను రెండు రోజుల పాటు ఫోన్ లో కూడా అందుకోలేకపోయాను,” అన్నది నాముఖానలో ఉండే ప్రతిమ మండల్. ఆమె కూతురు ఇల్లు ఖచ్చితంగా నెలలో మునిగిపోయుంటుందని ఆమె నమ్ముతుంది. “ఆమె ఎలా ఉందో కనుక్కోవడానికి వెళ్తున్నాను.” అన్నది.

మౌసుని ద్వీపానికి చేరడానికి ఫెర్రీలు, పడవల్లోనే వెళ్లగలము. నాముఖాన నుండి ఈ సేవలను మూడు రోజుల క్రితం నుంచే సైక్లోన్ యాస్ వలన ఆపేశారు. మే 29 నుంచి ఫెర్రీలు తిరగడం మొదలుపెట్టాక ద్వీపవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

మౌసుని లో వరద ప్రాంతం నుంచి వారి పాడిని కష్టపడి బాగ్దంగాకి తెస్తున్న ఒక కుటుంబం

మౌసునిలో దిగువ ప్రాంతాలలో ఉండే ఎందరో వారి ఇళ్లలో సామానుని ఖాళీ చేయవలసి వచ్చింది.

తన ఇంట్లోకి నీళ్లు వచ్చేశాయని బాగ్దంగా లో ఉండే ఈ ఆడమనిషి చెబుతోంది. ఆమె తన సామానుని కాపాడుకోలేకపోయింది.

“ఈ పక్షి,నా బెస్ట్ ఫ్రెండ్, దీనిని రక్షించుకోగలిగినందుకు సంతోషంగా ఉంది.” అన్నది ఆ చిన్న పిల్ల.

వరద నీరు వెనక్కి మరలితే ఇంటికి వెళ్లొచ్చని ఎదురు చూస్తున్న బగ్దానంగా షెల్టర్లోని ఆడవారు.

ఆ ఊరి ప్రాధమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లో కూడా వరద నీరు చేరింది.

మసాద్ లో తన సంవత్సరమంటా పొదుపు చేసిన ఆదాయాన్ని ఈ వరద లో పోగొట్టుకున్నాడు. “నా వద్ద ఉంచుకున్న 1200 కిలోల బియ్యం నాశనం అయింది. వరి ధాన్యం ఉప్పునీటిలో నానితే ఇక తినడానికి పనికిరాదు. నేను ఇప్పుడు 40 బాగులని పడెయ్యాలి.”

ఇమ్రాన్ పాడయిన ఇటుకలను పైకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు. అలలు మొరింగా నది తీరాన్ని దాటి నేల మీదకు వచ్చాయి

నది ఒడ్డునే ఉండే మంజూర బిబి ఇల్లు అలల తాకిడి కి కూలిపోయింది. “నీళ్లు ఇంట్లోకి రాగానే మేము పరిగెత్తాము. ఒక్క రూపాయి గాని ఒక్క కాగితం కానీ తీసుకోలేకపోయాము.” అన్నది. ప్రస్తుతం ఆమె ఒక గుడారం లో ఉంటోంది.

అదే ఒడ్డున ఉండే రుక్సానా, వరదలో తన స్కూల్ టెక్స్ట్ బుక్కులు పోగొట్టుకుంది.

ఈ పసివాడు వరద నీటిలో దాదాపు కొట్టుకుపోయాడు. “మా అల్లుడు చెట్టు ఎక్కి బాబుని పట్టుకోగలిగాడు.” అని బాబు నాయనమ్మ ప్రోమీత చెప్పింది. “అతనికి ఎనిమిది నెలలే, వేసుకోడానికి బట్టలే లేవు. అన్నీ కొట్టుకుపోయాయి.”

నీటిలో మునగకుండా మిగిలిన పేపర్లు, పుస్తకాలు, ఫోటోలు ఎండలో ఆరబెట్టారు

ఎనిమిదో తరగతి చదువుతున్న జహానారా తన పుస్తకాలు, డాక్యూమెంట్లు అన్నీమే 26న వచ్చిన వరదలో పోగొట్టుకుంది

గంగ నది పాయైన మురిగంగ నది ఒడ్డు దాటింది. మౌసుని ద్వీప దక్షిణ కొనన ఈ నది బంగాళాఖాతాన్ని కలుస్తుంది.
అనువాదం - అపర్ణ తోట