మహువా ( మధూక లాంగిఫోలియా - విప్ప/ఇప్ప పువ్వు) పూల కాలం చాలా చిన్నది, రెండు నుంచి మూడు నెలల వరకూ ఉంటుంది. మధ్య భారతదేశంలో పెరిగే ఈ పొడవాటి చెట్లు వేసవికాలం ప్రారంభంలో తమ విలువైన పూలను రాలుస్తాయి.
లేత పసుపువన్నెలో ఉండే ఈ పూలను సేకరించడం ఒక వేడుక సందర్భం. ఇక్కడ ఛత్తీస్‌గఢ్‌లో చిన్న పిల్లలతో సహా కుటుంబాలకు కుటుంబాలు అడవి నేలపై రాలిన ఈ పూలను ఏరుతుండటాన్ని మనం చూస్తాం. "ఇది చాలా కష్టమైన పని," అంటారు భూపిందర్. "పొద్దుపొద్దున్నే ఒకసారి, మళ్ళీ సాయంత్రం మరోసారి మేం మహువా ను సేకరిస్తాం." ధమతరీ జిల్లాలోని చనాగాఁవ్‌కు చెందిన ఈయన తన తల్లిదండ్రులతో పాటు సహాయం చేయటానికి ఇక్కడకు వచ్చారు. అనేకమంది జనం ఉండటంతో అక్కడంతా పండుగ కోలాహలం నెలకొంది.
ఈ పూలకాలంలో, మహువా పరిమళం ఆ ప్రాంతాన్నంతా సుగంధ భరితం చేస్తుంది. రాయ్‌గఢ్ జిల్లాలోని ధరమ్‌జయ్‌గఢ్ నుంచి ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్ వరకూ, వందలాది మహువా చెట్ల కింద రాలిన పూలను ఏరుతూ గ్రామస్థులు తీరికలేకుండా ఉన్నారు. ఎండబెట్టి నిలువచేసిన ఆ పూలతో పిండి, మద్యం వంటివాటిని తయారుచేస్తారు.
"మేం అడవి నుంచి సేకరించే వస్తువులలో మహువా అన్నిటికంటే ముఖ్యమైనది. కరవుకాలంలో అది ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు కొంత మహువా ను అమ్ముకోవచ్చు," అంబికాపుర్‌కు చెందిన సామాజిక కార్యకర్త, ఆదివాసీ నాయకుడైన గంగారామ్ పైంకరా అన్నారు. కూలిపనులు ఏమీ దొరకని కరవు కాలంలో ప్రజలు ఈ పూలపైన ఎలా ఆధారపడతారో ఆయన ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
‘మేం అడవి నుంచి సేకరించే వస్తువులలో ఇప్పపూవు అన్నిటికంటే ముఖ్యమైనది. కరవుకాలంలో అది ఆహారంగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు కొంత ఇప్పపూవును అమ్ముకోవచ్చు’
"ఆదివాసీ ప్రజలు ఈ పూలనుంచి తయారుచేసిన మద్యాన్ని తాగటాన్ని చాలా ఇష్టపడతారు. మా పూజా విధానాలలో అది ఒక తప్పనిసరి భాగం," చెప్పారు గంగారామ్.
కిందపడిన పూలను అనేక గంటలపాటు ఏరటంలో దానికుండే సమస్యలు దానికుంటాయి, "మాకు వీపులో కాళ్ళలో చేతులలో మోకాళ్ళలో నడుములో నొప్పి వస్తుంటుంది," భూపిందర్ పేర్కొన్నారు.
ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఎండిన మహువా పూల మద్దతు ధరను ఒక కిలోకు రూ. 30, లేదా ఒక క్వింటాల్ ఇప్పపువ్వు ఖరీదును రూ. 3000గా ప్రకటించింది.
మధ్య భారతదేశంలోని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో పాటు మహువా మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలోనే కాక మయన్మార్, నేపాల్, శ్రీలంక వంటి దూరప్రాంతాలలో కూడా కనిపిస్తుంది.

ఆమ్ గాఁవ్‌కు సమీపంలో ఉన్న అడవిలో ఇప్పపువ్వును సేకరించడంలో మునిగిపోయిన ఉష (కుడి చివర), ఆమె తోబుట్టువులైన ఉమ, సరిత

తాను సేకరించిన ఇప్ప పూలతో తొట్టిని నింపుతోన్న ఉష

కుటుంబంలో అందరికంటే పెద్దబిడ్డ సరిత (పసుపు రంగు దుస్తులు) బి.ఎ. రెండవ సంవత్సరం చదువుతోంది. ఆమె చిన్నపిల్లగా ఉన్నప్పటినుంచీ ఈ పూలకాలంలో వాటిని సేకరిస్తూనే ఉంది. పోయిన ఏడాది సేకరించిన ఇప్పపూలను అమ్మడం ద్వారా తాము రూ. 40,000 సంపాదించామని ఆమె చెప్పింది. ఆమె తల్లిదండ్రులు, తాత అమ్మమ్మలతో సహా మొత్తం కుటుంబమంతా ఈ పూల సేకరణలో పాల్గొంటారు. వెనుక నిల్చొనివున్నది ఆమె చెల్లెలు ఉమ (ఎరుపు రంగు దుస్తులు)

ఇప్ప పూలను ఏరుతోన్న సరిత (పసుపు రంగు దుస్తులు), ఉమ (ఎరుపు రంగు దుస్తులు)

చెట్టు నుంచి వేలాడుతోన్న ఇప్పపూల గుత్తి

నేలపై రాలివున్న ఇప్పపూల చిత్రం

తన అమ్మమ్మ తాతయ్య, తల్లితో కలిసి ఇప్పపూలను ఏరుతోన్న ఒక చిన్న పాప

పూల కోసం నేలపై వెతుకుతోన్న అదే చిన్న పాప

ఇప్పపూలను ఏరటంలో తీరికలేకుండా ఉన్న 75 ఏళ్ళ ఛెర్కెన్ రాఠియా. తాను చిన్నపిల్లగా ఉన్నప్పటినుంచీ ఈ పని చేస్తున్నట్టు ఆమె చెప్పారు

తమ పొలంలో ఉన్న సొంత ఇప్ప చెట్టు కింద రాలిన పూలను ఏరుతోన్న జలసాయ్ రైఠీ, ఆయన భార్య

ఉదయ సూర్యుని వెలుగులో సంబరంగా తమ పొలంలో రాలిన ఇప్ప పూలను ఏరుతోన్న
జలసాయ్ రైఠీ, ఆయన కుటుంబం
అనువాదం: సుధామయి సత్తెనపల్లి