"నా ఎడమ కంటితో నేనేమీ చూడలేకపోతున్నాను. ప్రకాశవంతమైన వెలుతురు బాధపెడుతోంది. చాలా బాధగా ఉంటుంది. దీని కారణంగా నేను సమస్యలతో నిండిన పరిస్థితులలో జీవిస్తున్నాను," పశ్చిమబెంగాల్, దక్షిణ 24 పరగణాల జిల్లోని బన్‌గాఁవ్ పట్టణానికి చెందిన గృహిణి, ప్రమీలా నస్కర్ అన్నారు. తొలి నలబైల వయసులో ఉన్న ప్రమీల కొల్‌కతాలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తల్మాలజీలో వారానికొకసారి నిర్వహించే కార్నియా క్లినిక్‌లో మాతో మాట్లాడుతున్నారు. ఆమె చికిత్స కోసం అక్కడకు వచ్చారు.
నేను ప్రమీలా నస్కర్ ఆవేదనను అర్థంచేసుకోగలను. ఒక కంటికి చూపు కోల్పోవడం కూడా ఒక ఫోటోగ్రాఫర్‌కు భయంకరమైన అనుభవం. 2007లో నా ఎడమ కన్నులో కార్నియల్ అల్సర్ రావటంతో అంధుడిగా మారే పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో విదేశాలలో నివసిస్తున్న నేను చికిత్స కోసం భారతదేశానికి తిరిగి రావలసి వచ్చింది. నేను పూర్తిగా దృష్టిని తిరిగి పొందటానికి ముందు ఒకటిన్నర నెలల పాటు చాలా భాధాకరమైన పునరుద్ధరణ విధానాన్ని భరించాను. ఇప్పటికీ, కోలుకున్న దశాబ్దంన్నర తర్వాత కూడా, అంధుడిని అవుతాననే భయం కలుగుతుంటుంది నాకు. ఒక ఫోటోగ్రాఫర్ తన చూపును కోల్పోవడం ఎంత బాధగా ఉంటుందో నాకు కళ్ళకు కడుతూనే ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా " కనీసం 2.2 బిలియన్ల మంది ప్రజలు హ్రస్వ దృష్టి, లేదా దూర దృష్టి లోపాలను కలిగి ఉన్నారు. ఇందులో కనీసం ఒక బిలియన్ - దాదాపు సగం మంది - కేసులలో, దృష్టి లోపం రాకుండా నిరోధించవచ్చు, లేదా ఇంకా గుర్తించటం జరగలేదు...”
ప్రపంచవ్యాప్తంగా కంటి శుక్లం తర్వాత, అంధత్వానికి రెండవ అత్యంత సాధారణ కారణం శుక్లపటల వ్యాధులు. శుక్లపటల సంబంధిత అంధత్వానికి సంబంధించిన సంక్రమణ విధానం (ఎపిడెమియాలజీ) సంక్లిష్టమైనది. శుక్లపటలం మీద మచ్చలు ఏర్పడటానికి దారితీసే అనేక రకాల కంటి వాపులు, వైరల్ పరిస్థితులను కలిగి ఉంటుంది. ఇది చివరికి క్రియాశీల అంధత్వానికి కారణమవుతుంది. దీనికి తోడు, శుక్లపటల వ్యాధి వ్యాప్తి దేశం నుండి దేశానికి మారుతూ ఉంటుంది.


తేలికపాటి నుండి తీవ్రమైన కంటి నొప్పి ఉండటం శుక్లపటల అంధత్వానికున్న అనేక లక్షణాలలో ఒకటి. కాంతిని భరించలేకపోవటం, కంటిచూపు మసకగా ఉండటం, కంటి నుండి స్రావాలు, నీరు కారడం వంటివి ఇతర విలక్షణమైన లక్షణాలు. ఈ లక్షణాలు ఇతర అనారోగ్యాలకు కూడా సూచన కావచ్చు, మొడట్లో ఎటువంటి లక్షణాలు కూడా ఉండకపోవచ్చు, కాబట్టి కంటి వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ క్లినికల్ ఇన్వెన్షన్ 2018 అధ్యయనం, శుక్లపటల వ్యాధుల కారణంగా ఒక కంటిలో 6/60 కంటే తక్కువ దృష్టి ఉన్నవారు భారతదేశంలో సుమారు 6.8 మిలియన్ల మంది ఉన్నారని, వీరిలో సుమారు ఒక మిలియన్ మందికి రెండింటి ప్రమేయమూ ఉందని అంచనా వేసింది. సాధారణంగా, 6/60 దృష్టి అంటే సాధారణ దృష్టి ఉన్న ఒక వ్యక్తి 60 మీటర్ల దూరం నుండి కూడా చూడగలిగేదాన్ని సమస్య ఉన్న వ్యక్తి 6 మీటర్ల వరకు మాత్రమే చూడగలడు. 2020 నాటికి ఈ సంఖ్య 10.6 మిలియన్లకు చేరుకోవచ్చని కూడా ఈ అధ్యయనం అంచనా వేసింది, కానీ స్పష్టమైన అప్‌డేట్‌లు అందుబాటులో లేవు
"భారతదేశంలో శుక్లపటల వ్యాధికి సంబంధించిన అంధత్వం (CB) 1.2 మిలియన్లమందికి ఉండగా అందులో 0.36 శాతం పూర్తి అంధత్వం కలిగినవారు; ప్రతి ఏటా ఈ సంఖ్యకు 25,000 నుంచి 30,000 మంది పెరుగుతున్నారు," అని ఇండియన్ జర్నల్ ఆఫ్ ఆప్తల్మాలజీ లోని ఒక సమీక్షా వ్యాసం తెలియజేస్తోంది. 1978లో కొల్‌కతా వైద్య కళాశాలలో రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తల్మాలజీ (RIO)ని స్థాపించారు. ఈ సంస్థ ప్రస్తుత సంచాలకులు ప్రొఫెసర్ అసీమ్ కుమార్ ఘోష్ సారథ్యంలో RIO మంచి వృద్ధిని సాధించింది. వారానికి ఒకరోజు నిర్వహించే RIO కార్నియా క్లినిక్‌లో ఆ ఒక్కరోజులోనే 150 మంది రోగులను పరీక్షిస్తారు.
డా. ఆశిస్ మజుందార్, ఆయన సహచరులు నిర్వహిస్తోన్న ఈ క్లినిక్ చాలా అవసరం ఉన్నవారికి సహాయం చేస్తోంది. నా స్వంత కేసు గురించి ప్రస్తావిస్తూ డాక్టర్ ఆశిష్, "నకిలీ కాంటాక్ట్ లెన్స్ ద్రావణం ద్వారా మీకు శుక్లపటల అల్సర్ వచ్చినప్పటికీ, 'శుక్లపటల అంధత్వం' అనే పదం శుక్లపటలం పారదర్శకతను మార్చే మచ్చలు రావటం, అంధత్వం వంటి వివిధ రకాల కంటి పరిస్థితులను వివరిస్తుంది. శుక్లపటల అంధత్వానికి ప్రధానంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, శిలీంధ్రాలు, ప్రోటోజోవా కారణంగా వచ్చే సాంక్రమిక కారణాలున్నాయి. అత్యంత సాధారణమైన ముందస్తు కారకాలు ట్రామా, కాంటాక్ట్ లెన్స్ వాడకం, లేదా స్టెరాయిడ్ మందుల వాడకం. ఇంకా ఇతరంగా వచ్చే వ్యాధులు ట్రాకోమా (కొయ్యకండల వ్యాధి), కళ్ళు పొడిబారటం," అన్నారు.
నడిమి నలభైల వయసులో ఉన్న నిరంజన్ మండల్, RIO కార్నియా క్లినిక్‌లో ఒక మూల నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు. ఆయన నల్ల కళ్ళద్దాలు ధరించారు. "నా ఎడమ కన్ను కార్నియా దెబ్బతింది," అని అతను నాతో చెప్పారు. “నొప్పి పోయింది. కానీ చూపు ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. ఇది పూర్తిగా నయంకాదని డాక్టర్ చెప్పారు. నేను నిర్మాణ సంస్థలో కూలీగా పని చేస్తున్నాను. రెండు కళ్ళూ సరిగ్గా కనిపించకపోతే, ఆ వృత్తిలో కొనసాగడం నాకు కష్టమవుతుంది."
నిరంజన్‌తో మాట్లాడుతూ ఉండగానే, మరో డాక్టర్ మలి ముప్పైల వయసులో ఉన్న షేక్ జహంగీర్ అనే పేషంట్‌ను మెత్తగా మందలించటం వినిపించింది: "నేను చెప్పినా వినకుండా నువ్వు చికిత్స తీసుకోవటం ఎందుకు మానేశావు? ఇప్పుడు తీరిగ్గా రెండు నెలల తర్వాత వచ్చావు. ఇలా చెప్పటానికి విచారిస్తున్నాను, కానీ నీ కుడి కంటి చూపు ఎప్పటికీ పూర్తిగా తిరిగి రాదు."
డాక్టర్ ఆశిష్ స్వరంలోనూ అదే ఆందోళన ప్రతిధ్వనిస్తోంది. ఆయన ఇలా అన్నారు: “మేం చాలా సందర్భాలలో గమనించిందేమిటంటే, రోగి సరైన సమయానికి వస్తే కంటిని రక్షించవచ్చు. శుక్లపటలం దెబ్బతిన్నపుడు దాని నుండి కోలుకోవడం సుదీర్ఘమైన, దుర్భరమైన ప్రక్రియ. మధ్యలో చికిత్సను నిలిపివేయడం అంధత్వానికి దారి తీస్తుంది."


ఎడమ: కొల్‌కతాలోని రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆప్తల్మాలజీ లో చికిత్స కోసం వచ్చిన నిరంజన్ మండల్. ఆయన ఇలా రావటం వరుసగా ఇది నాలుగవసారి. కుడి: తన గదిలో ఒక రోగిని పరీక్ష చేస్తోన్న RIO సంచాలకులు డా. అసీమ్ కుమార్ ఘోష్
కానీ రోగులు RIOకి సక్రమంగా రాకపోవటం వెనుక కొన్ని వశంకాని కారణాలు ఉన్నాయి. మలి యాభైల వయసులో ఉన్న నారాయణ్ సన్యాల్‌నే తీసుకుంటే, ఆయన మాతో ఇలా అన్నారు, “నేను హుగ్లీ జిల్లాలోని ఒక సుదూర ప్రదేశంలో [ఖానాకుల్] నివసిస్తున్నాను. పరీక్షలు చేయించుకోవటం కోసం స్థానిక వైద్యుడి వద్దకు వెళ్ళడమే నాకు సౌకర్యంగా ఉంటుంది. ఈ వైద్యుడికి అర్హతలు లేవని నాకు తెలుసు, కానీ ఏం చేయాలి? నేను నొప్పిని పట్టించుకోకుండా పని చేస్తూనే ఉంటాను. నేనిక్కడికి వచ్చే ప్రతిసారీ నాకు దాదాపు 400 రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని భరించే స్తోమత నాకు లేదు”.
దక్షిణ 24 పరగణాల జిల్లా, పాథర్‌ప్రతిమా బ్లాక్‌కు చెందిన పుష్పరాణి దేవి కూడా ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ఇళ్ళల్లో పనులు చేసుకునే ఆమె గత 10 సంవత్సరాలుగా తన ఇద్దరు పిల్లలతో కలిసి ఒక మురికివాడలో నివసిస్తున్నారు. ఆమె ఇలా చెప్పారు, “నా ఎడమ కన్ను ఎర్రబడడాన్ని పట్టించుకోకుండా నేను తప్పు చేశాను. పరీక్ష చేయించుకోవటం కోసం స్థానిక వైద్యుని దగ్గరకు వెళ్ళాను. ఆ తర్వాత సమస్య తీవ్రమయింది. నేను పని మానేయవలసి వచ్చింది. అప్పుడు నేను ఇక్కడికి [RIO] వచ్చాను. ఇక్కడి వైద్యులకు కృతజ్ఞతలు చెప్పాలి, 3 నెలల సాధారణ పరీక్షల తర్వాత, నేను నా చూపును తిరిగి పొందాను. ఇప్పుడు నాకు పూర్తిగా చూపు రావడానికి శస్త్రచికిత్స [శుక్లపటలం మార్పిడి] అవసరం. కాబట్టి, నేను ఆ రోజు కోసం వేచి ఉన్నాను. ”
శుక్లపటలం మార్పిడి అని పిలిచే శస్త్రచికిత్సలో దెబ్బతిన్న శుక్లపటలం మొత్తాన్ని, లేదా కొంత భాగాన్ని తొలగించి దాన్ని దాత నుంచి సేకరించిన ఆరోగ్యకరమైన కణజాలంతో భర్తీ చేస్తారు. శుక్లపటలం మార్పిడి శస్త్రచికిత్సను కెరాటోప్లాస్టీ, కార్నియల్ గ్రాఫ్ట్ అని కూడా అంటారు. ఈ ప్రక్రియ తీవ్రమైన గాయాలను లేదా ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి, చూపును మెరుగుపరచడానికి, కంటి అసౌకర్యాన్ని, నొప్పిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ ఆశిష్, ఒక నెలలో దాదాపు 4 నుండి 16 శుక్లపటల మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తారు. ఇది ఒక క్లిష్టమైన ప్రక్రియ, 45 నిమిషాల నుండి 3 గంటల వరకు పడుతుంది. డాక్టర్ ఆశిష్ మాట్లాడుతూ “మార్పిడి తర్వాత సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. రోగులు సులభంగా తమ పనులకు తిరిగి వెళ్ళగలుగుతారు. అయితే సమస్య వేరే ఉంది. సరఫరా, డిమాండ్‌ల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. అందుకే నేత్రదానం చేసేందుకు కుటుంబాలు ముందుకు రావాలి. బెంగాల్‌తో సహా భారతదేశం మొత్తంగా డిమాండ్- సరఫరాల మధ్య భారీ అంతరం ఉంది.
"చాలామందికి శుక్లపటల మార్పిడి అవసరం ఉండదని దయచేసి గమనించండి. దయచేసి ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు. దయచేసి ముందుగా మీ స్థానిక నేత్ర వైద్యుడిని కలిసి పరీక్ష చేయించుకోండి. చాలామంది రోగులు మా వద్దకు చివరి క్షణంలో వచ్చి, తమ కంటిని కాపాడమని కోరినప్పుడు మాకు చాలా బాధగా ఉంటుంది. వైద్యులుగా ఇది చూడటం చాలా బాధను కలిగిస్తుంది," అని RIO సంచాలకులు డా. అసీమ్ ఘోష్ సందేశాన్ని అందించారు.
అలాగే, “ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండేలా చూసుకోండి. చక్కెర స్థాయిని తనిఖీ చేయండి. మధుమేహం ఉండటం వలన శుక్లపటలం, ఇంకా ఇతర కంటి సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయటం మాకు మరింత కష్టమవుతుంది," అని డా. ఘోష్ చెప్పారు.
“ఆసుపత్రి కారిడార్‌లో నేను ఆభారాణి ఛటర్జీని కలిశాను. ఆమె వయసు అరవై ఏళ్ళు దాటింది. ఆమె చాలా ఆనందంగా ఉన్నట్టు స్పష్టంగా తెలిసిపోతోంది: “హలో, నేను మళ్ళీ ఇక్కడికి రావలసిన అవసరం లేదు. నా కళ్ళు బాగున్నాయని డాక్టర్ చెప్పారు. ఇప్పుడు నేను నా మనవరాలితో గడపగలను, టివిలో నాకు ఇష్టమైన సీరియల్‌ను చూడగలను."

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ అత్యంత ముఖ్యమైన పథకాలలో ఒకటైన స్వాస్థ్య సాథీ యోజన కింద రోగులు RIO వద్ద ఉచిత చికిత్స పొందుతారు. ఇది కార్నియా, ఇంకా ఇతర కంటి చికిత్సా కేంద్రాలలో రోగుల సంఖ్య పెరగడానికి దారితీయటంతో శారీరకంగా, మానసికంగా పెరుగుతోన్న ఒత్తిడిని భరించడం వైద్యులకు కష్టంగా మారింది

కంటి లోపలి భాగాన్ని మెరుగ్గా పరిశీలించటం కోసం కంటి పాపలు విస్తరించేందుకు వైద్యులు కంటి చుక్కలను ఉపయోగిస్తారు. ఈ చుక్కలు సాధారణంగా ఫినైలెఫ్రైన్ లేదా ట్రోపికమైడ్ వంటి మందులను కలిగి ఉంటాయి. ఇవి కంటిపాపల చుట్టూ ఉన్న కండరాల సడలింపుకు సహాయపడతాయి. కంటిపాపలు పెద్దవైనప్పుడు, నేత్ర వైద్యుడు కంటి వెనుక భాగంలో ఉన్న రెటీనా, ఆప్టిక్ నరం, కణాలను చాలా స్పష్టంగా చూడగలరు. మాక్యులర్ డిజెనరేషన్, డయాబెటిక్ రెటినోపతి, నీటికాసులు (గ్లాకోమా) వంటి అనేక కంటి వ్యాధుల నిర్ధారణకు, పర్యవేక్షణకు ఈ ప్రక్రియ చాలా అవసరం

శారీరక వైకల్యంతో పాటు మాట్లాడలేని, వినలేని రోగిని జాగ్రత్తగా పరీక్ష చేస్తోన్న డా. ఆశిష్ మజుందార్

భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 30,000 శుక్లపటల అంధత్వానికి సంబంధించిన కేసులు పెరుగుతున్నాయి

లక్షణాలు కనిపించిన వెంటనే నేత్ర వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం

కార్నియా సమస్యలతో బాధపడుతున్న ఒక చిన్నపిల్లవాడిని పరీక్షిస్తోన్న డాక్టర్ ఇంద్రాణి బెనర్జీ. ఈమె వైద్య కళాశాల నేత్ర నిధిని కూడా పర్యవేక్షిస్తారు

కంటిలో కన్నీటి పరిమాణాన్ని గుర్తించడానికి షీర్మెర్ పరీక్ష ఉపయోగించబడుతుంది. శుక్లపటల అంధత్వానికి ప్రధాన కారణం కళ్ళు పొడిబారిపోవటం

పొరపాటున టాయిలెట్ క్లీనర్ కళ్ళల్లోకి చిందిపడటంతో కార్నియా దెబ్బతిన్న సుబల్ మజుందార్

ఆటలమ్మకు చికిత్స పొందుతున్న సమయంలో పారుల్ మండల్‌కు తీవ్రమైన కార్నియా సమస్య ఏర్పడింది. ఇప్పుడామె ఎంతమాత్రం వెలుతురును చూడలేరు. శస్త్ర చికిత్స చేసినప్పటికీ ఆమెకు చూపు తిరిగి రాకపోవచ్చు

దృష్టి తీక్షణతను కొలవడానికి స్నెల్లెన్ చార్ట్ ఉపయోగించబడుతుంది. దీనిని 1862లో డచ్ నేత్ర వైద్యుడు హెర్మన్ స్నెల్లెన్ కనుగొన్నారు

యాంటీరియర్ సెగ్మెంట్ ఫోటోగ్రఫీని చేస్తోన్న డా. ఆశిష్ మజుందార్. కళ్ళు, కనురెప్పలు, ముఖ నిర్మాణాల వెలుపలి స్థితిని పరీక్షించడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుంది. ఇది సాధారణంగా కంటిలో, లేదా దాని చుట్టుపక్కల కణాలలో ఏవైనా పగుళ్ళు ఉన్నాయా, ముఖ నాడిలో ఏవైనా అసాధారణతలు ఉన్నాయా అనేది అర్థం చేసుకోవడానికి, శస్త్రచికిత్సకు ముందు ఆ తరువాత కళ్ళు, కనురెప్పల పరిస్థితిని రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు

శుక్లపటలం మార్పిడి శస్త్రచికిత్సలో దెబ్బతిన్న కార్నియా మొత్తాన్ని, లేదా కొంత భాగాన్ని తీసివేసి దాని స్థానంలో దాత ఇచ్చిన ఆరోగ్యకరమైన కణజాలంతో మార్పిడిచేస్తారు

కార్నియా మార్పిడి చేయించుకున్న రోగి కళ్ళలో రక్షణ కటకాన్ని చొప్పిస్తున్న డా. పద్మప్రియ

'నేనిప్పుడు బాగానే ఉన్నాను. కళ్ళజోడు అవసరం లేకుండానే దూరం నుండి ఏదైనా చదవగలుగుతున్నాను. ఇకముందు వెలుతురు నన్ను బాధపెట్టదు,' అంటోన్న 14 ఏళ్ళ పింటూ రాజ్ సింగ్

కార్నియా వ్యాధికి చికిత్స చేసిన తర్వాత పూర్తిగా నయమైపోయిన హుగ్లీ జిల్లాకు చెందిన బినయ్ పాల్; అతను తన చూపును తిరిగి పొందారు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి