చేతితో లాగే రిక్షాలు వెళ్ళేందుకు మాత్రమే సరిపోయినంత స్థలం ఉండే ఉత్తర కొల్‌కతాలోని కుమార్‌టులి ఇరుకైన సందులలో, సాధారణంగా మీరు కలుసుకోగలిగే వ్యక్తులు కుమొర్‌లు (కుమ్మరులు) - నగరంలో విగ్రహాలను తయారుచేసేవారు - మాత్రమే అయుంటారు. దుర్గాదేవి, ఇంకా ఇతర దేవతల విగ్రహాలు ప్రతి సంవత్సరం ఇక్కడి నుండే కొల్‌కతా నగరంలోని వివిధ ప్రాంతాలకు చేరుకుంటాయి.
కార్తిక్ పాల్‌కు ఇక్కడ ఒక కార్యశాల ఉంది. తన తండ్రిగారి పేరున 'బ్రజేశ్వర్ అండ్ సన్స్' అనే పేరున్న ఈ షెడ్డు వెదురుతోనూ, ప్లాస్టిక్ పట్టాలతోనూ కట్టినది. అతను మాకు దీర్ఘమైన, పొరలు పొరలుగా చేసే విగ్రహ ప్రక్రియను గురించి చెప్పారు. విగ్రహాన్ని తయారుచేసే వివిధ దశలలో గంగా మాటీ (నది ఒడ్డు నుండి సేకరించిన మట్టి), పాట్ మాటీ (జనపనార ముక్కలు, గంగా మాటీ మిశ్రమం) వంటి వివిధ మట్టి మిశ్రమాలను ఉపయోగిస్తారు.

కుమార్‌టులిలోని తన కార్యశాలలో కార్తిక్ పాల్
మా మాటలు సాగుతుండగానే కార్తిక్ తడి మట్టితో కార్తిక దేవుడి ముఖాన్ని రూపొందిస్తూ, తన నిపుణమైన చేతులతో ఆ ముఖాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆయన ఒక రంగులద్దే కుంచెను, వెదురును చేతితో మెరుగుపెట్టి తయారుచేసిన చియారి అనే ఒక బొమ్మలు చెక్కే పరికరాన్ని ఉపయోగిస్తున్నారు.
దగ్గరలోనే ఉన్న మరో కార్యశాలలో, ఒక మట్టి దేహనిర్మాణంపై చర్మం వంటి ఆకృతినిచ్చే ఒక సన్నని తువ్వాలు వంటి పదార్థాన్ని అంటించేందుకు గోపాల్ పాల్ జిగురును సిద్ధం చేశారు. గోపాల్ కొల్‌కతాకు ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న నదీయా జిల్లాలోని కృష్ణనగర్‌కు చెందినవారు. ఇక్కడి చాలామంది కార్మికులు - అందరూ పురుషులే - ఒకే జిల్లాకు చెందినవారు; చాలామంది అదే ప్రాంతంలో కార్యశాల యజమానులు ఏర్పాటుచేసిన క్వార్టర్లలో ఉంటారు. సీజన్ ముమ్మరమయ్యే నెలరోజులకు ముందే కూలీలను పనిలోకి తీసుకుంటారు. వారు ఎనిమిది గంటల షిఫ్టులలో పని చేస్తారు. కానీ శరత్కాల పండుగకు ముందు ఈ కళాకారులు రాత్రిపూట కూడా పని చేస్తారు, ఎక్కువ గంటలు పనిచేసినందుకు డబ్బు పొందుతారు.
కుమార్‌టులిలోని మొదటి తరం కుమ్మరులు కృష్ణనగర్ నుంచి సుమారు 300 ఏళ్ళ క్రితం వలసవచ్చినవారు. వాళ్ళు బాగ్‌బజార్ ఘాట్ కు సమీపంలో అప్పుడే కొత్తగా ఏర్పడుతోన్న కుమార్‌టులికి వచ్చి కొన్ని నెలలపాటు ఉన్నారు. అక్కడ ఉంటే నది నుండి మట్టిని సులభంగా తెచ్చుకోవచ్చు. వారు జమీందార్ల ఇళ్ళలో పనిచేశారు. దుర్గాపూజ పండుగకు ముందు వారాల తరబడి ఠాకుర్‌దాలాన్ ( జమీందార్ల నివాస ప్రాంగణంలో మతపరమైన పండుగల కోసం కేటాయించిన ప్రదేశాలు) లలో విగ్రహాలను తయారుచేశారు.
1905లో బెంగాల్ విభజన సమయంలోనూ, అంతకు ముందు కూడా బంగ్లాదేశ్‌లోని ఢాకా, బిక్రమ్‌పూర్, ఫరీద్‌పూర్‌ల నుండి నిపుణులైన కళాకారులు కుమార్‌టులికి వచ్చేవారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చాక జమీందారీ వ్యవస్థ క్షీణించిపోవటంతో, సర్బొజనీన లేదా సాముదాయక పూజ ప్రాచుర్యం పొందింది. ఇదంతా దుర్గామాత ఇరుకైన ఠాకూర్‌దాలన్ల నుంచి బయటకు వచ్చి, ఆమెతో పాటు ఇతర దేవతలకు కూడా విస్తృతమైన, విభిన్నమైన నేపథ్యాలను సృష్టించి వీధుల్లో ఏర్పాటుచేసిన విశాలమైన పండాళ్ళ లోకి వచ్చినప్పుడు జరిగింది.

గంగానది నుంచి తెచ్చిన 'ఎఁటెల్ మాటీ'తో జనపనార ముక్కలను కలిపి 'పాట్ మాటీ' అనే మట్టిని కళాకారులు తయారుచేస్తారు


ఎడమ: విగ్రహానికి ఆధారంగా ఉండేలా ‘కఠమొ’ అనే వెదురు నిర్మాణాన్ని తయారుచేయటంతో విగ్రహాన్ని తయారుచేసే ప్రక్రియ మొదలవుతుంది. కుడి: వెదురు నిర్మాణం సిద్ధమయ్యాక, విగ్రహానికి ఆకృతినివ్వడానికి ఒక పద్ధతి ప్రకారం గడ్డితో చుడతారు; ఇందుకు కావలసిన ముడి పదార్థాలన్నీ దగ్గరలోని బాగ్‌బజార్ మార్కెట్ నుంచి వస్తాయి

గడ్డి నిర్మాణానికి చివరి రూపాన్నివ్వడానికి నల్లటి బంకమన్నును పూస్తోన్న ఒక కళాకారుడు; ఇప్పుడు ఈ మట్టి నిర్మాణాన్ని ఎండటానికి 3 నుండి 4 రోజుల పాటు ఎండలో పెడతారు

ఆకృతి రూపకల్పనకు ఒక రంగులద్దే కుంచె, వెదురును సానపెట్టి చేసిన ఉపకరణం అవసరం

సమీపంలోని మరో కార్యశాలలో, విగ్రహానికి చర్మంలా కనిపించేలా చేయడానికి గోపాల్ పాల్, ఒక సన్నని తువ్వాలు వంటి పదార్థాన్ని ఉపయోగిస్తారు

మహాలయ శుభదినాన దుర్గాదేవి కన్నుల చిత్రీకరణతో, మట్టి విగ్రహాలు ప్రాణం పోసుకుంటాయి
చూడండి: ‘కుమార్‌టులి గుండా ప్రయాణం’ ఫోటో ఆల్బమ్
ఈ వీడియో, కథనం సించిత మాజీ 2015-2016 PARI ఫెలోషిప్‌లో భాగంగా చిత్రీకరించినవి.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి