"మా శరీరాలకు రంగులు వెయ్యడం కష్టం. మేం రాత్రంతా లేచి ఉండాలి (రంగులు వేయించుకోవడానికి)," అంటాడు ఆయుష్ నాయక్, తన దేహానికి మొదటిసారిగా నూనె రంగులు రాసుకుంటూ. "నా శరీరం మండుతున్నట్టు అనిపిస్తోంది. కాబట్టి, మేం ఈ రంగుని కుదిరినంత తొందరగా ఆరబెట్టాలి," అంటాడు పదిహేడేళ్ళ ఈ అబ్బాయి.
కోస్తా కర్ణాటకలో 'పిలి వేష' (లేక హులి వేష ), దసరా జన్మాష్టమి పండుగలప్పుడు చేసే ఒక జానపద నృత్యం. దీని కోసం శరీరాలకు మెరిసిపోయే రంగుల గీతలు వేసుకునే బాలబాలికలలో ఆయుష్ ఒకడు. ఈ ప్రదర్శన చేసేటప్పుడు చుట్టూ గట్టిగా డోళ్ళు మోగుతుంటే పులి ముసుగులు వేసుకుని గట్టిగా గాండ్రిస్తారు, కేకలు వేస్తారు.
కోస్తా కర్ణాటకలో మాట్లాడే తుళు భాషలో పిలి అంటే పులి, వేష అంటే వేషం. "ఎవరూ ఎవరి నించీ ఏమీ నేర్చుకోవక్కర్లేదు. ఇది మా ఆత్మలో ఉంటుంది." అంటారు గత ఇరవై రెండేళ్ళుగా పిలి వేష వేస్తోన్న వీరేంద్ర శెట్టిగార్. "ఆ డోలు చప్పుళ్ళతో పాటు చుట్టూ ఆవరించి ఉండే శక్తి తాళానికి అనుగుణంగా మీ చేత నాట్యమాడిస్తాయి." 30 ఏళ్ళ వయసున్న ఈయన అమెజాన్ పంపిణీదారుడిగా పనిచేస్తారు, తన గ్రామంలోని యువతను ఈ నృత్యం చేయమని ప్రోత్సహిస్తూ ఉంటారు.
నాట్యకారులు పులులలాగా, రకరకాల చిరుతపులులలాగా కనిపించడానికి శరీరమంతా అక్రీలిక్ రంగులతో పసుపు, మట్టి రంగు చారలు వేసుకుంటారు. ఇంతకుముందు రోజులలో పులివేషగాళ్ళు తమ ఒంటిపై వేసుకునే ప్రకాశవంతమైన రంగులకు బొగ్గు, మట్టి, వేర్లు, శిలీంధ్రాలు మూలకాలుగా ఉండేవి .
కొన్నేళ్ళుగా ఈ నాట్యం సంప్రదాయక అడుగులు మరిన్ని విన్యాసాలతో కూడుకున్నవిగా మారాయి. ఇప్పుడు ముందుకూ వెనక్కూ పల్టీలు కొట్టడం, తలతో కొబ్బరికాయల్ని పగులగొట్టడం, నోట్లోంచి మంటలను బయటికి ఊదటం వంటి తమాషా పనులు ఎక్కువయ్యాయి. ఈ కొరియోగ్రఫీకి ఎంత శక్తి కావలసి వస్తోందంటే, వయసుమళ్ళినవాళ్ళు ఈ నృత్యాన్ని చిన్న వయసువారికి వదిలేస్తున్నారు.

కోస్తా కర్ణాటకలో దసరా, జన్మాష్టమి పండుగలప్పుడు చేసే ఒక జానపద నృత్యమైన పిలి వేష కోసం శరీరాలకు మెరిసిపోయే రంగుల గీతలు వేసుకునే బాలబాలికలలో ఆయుష్ ఒకడు
ప్రదర్శనకు ఒక రోజు ముందే ఈ సంప్రదాయ నృత్యం కోసం తయారవ్వడం మొదలవుతుంది. ముఖానికీ శరీరానికీ రంగులు వెయ్యడానికి చాలా గంటల కృషి అవసరం. ఆ రంగుల్ని పండుగ అయిపోయిన రెండు రోజుల తరవాత దాకా కూడా ఉంచుతారు. "మొదట్లో కష్టంగా అనిపిస్తుంది. కానీ డోళ్ళ చప్పుడు వినిపించిన వెంటనే వాటి తాళానికి నృత్యం చెయ్యాలనిపిస్తుంది," అంటాడు పన్నెండవ తరగతిని పూర్తి చేస్తోన్న ఆయుష్.
తాసే (తుళు భాషలో డోలు) నించి ప్రతిధ్వనించే చప్పుడుకు పిలి వేషం వేసుకున్న జనాలు తమ భక్తిభావాన్ని చూపడానికి, ప్రజలను వినోదింపచేయడానికి నృత్యం చేస్తారు. అబ్బాయిలు పులుల్లాగ కనిపించటానికి తమ పూర్తి దేహాన్ని రంగులతో నింపుతారు, కానీ బాలికలు మాత్రం మొహానికి మాత్రమే రంగులు వేసుకొని పులిలా కనిపించే నూలు బట్టలను ధరిస్తారు. ఈ మధ్యకాలం నుంచే అమ్మాయిలు పిలి వేష వేయడం పెరిగింది..
ఇదివరకు ఈ నాట్యకారులకు బియ్యాన్ని, ధాన్యాన్ని - మామూలుగా కోస్తా కర్ణాటకలో పెరిగే పంటలు - బహుమతులుగా ఇచ్చేవారు. ఇవాళ తిండిగింజల చోటులో డబ్బు వచ్చిచేరింది. ప్రతి ప్రదర్శనకారుడు రెండు రోజులకు 2,500 రూపాయలు సంపాదిస్తారు. విన్యాసాలు చేసేవారికి ఉత్సవాలు జరిగే రెండు రోజులకి గాను మరో 6,000 రూపాయులు వస్తాయి. "ఇంతమంది నృత్యం చెయ్యడం చూసిన తర్వాత మీకు కూడా వెంటనే పిలి వేష వెయ్యాలనిపిస్తుంది," అని ఆయుష్ అంటాడు.
ఈ ప్రదర్శనలను మాములుగా గృహసముదాయాల కమిటీలు నిర్వహిస్తాయి. ఆయుష్, అతని బృందం ఉడుపిలోని మణిపాల్‌లో ఏడాది పాటు పిలి వేష వేడుకలకి డబ్బులు ఇచ్చే 'యువ టైగర్స్ మంచి' బృందానికి చెందినవారు. ప్రదర్శనల్ని నిర్వహించడానికి, నాట్యకారులకు, రంగులు వేసేవారికి చెల్లించేందుకు రెండు లక్షల రూపాయల కంటే ఎక్కువ డబ్బు అవసరం అవుతుంది. ప్రయాణాలకు, భోజనాలకు, రంగులు కొనటానికి, దుస్తులకు కూడా ఈ డబ్బు నుంచే ఖర్చుపెట్టాలి.
వినోదాన్ని అందించటమే ఈ నాట్యకారులకు ప్రధానం అయినప్పటికీ, వందల ఏళ్ళ సంప్రదాయమైన ఈ కళ క్రమశిక్షణను కాపాడడానికి వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంతా అయేసరికి "మా ఒళ్ళు చాలా నొప్పెడుతుంది, కానీ జనాల్ని సంతోషపెట్టటానికీ, ఈ కళను సజీవంగా ఉంచడానికీ మేం ఇదంతా చేస్తాం," అంటాడు ఆయుష్.

ప్రదర్శనకు ముందు అశ్విత్ పూజారికి రంగు వేస్తోన్న రంజాన్. వృత్తిరీత్యా ఓ మట్టి బొమ్మల కళాకారుడైన రంజాన్, పిలి వేష సమయంలో సాయానికి వస్తారు

జయకర్ పూజారి పులి చారలు వేస్తుండగా తమ వంతు కోసం ఎదురుచూస్తోన్న నిఖిల్, కృష్ణ, భువన్ అమిన్, సాగర్ పూజారి (ఎడమ నించి కుడికి)

తమ మొదటి విడత రంగులు ఆరడం కోసం ఎదురుచూస్తోన్న శ్రేయన్ శెట్టి, ఆశ్లేష్ రాజ్, కార్తీక్ ఆచార్య (ఎడమ నించి కుడికి). శరీరాలకు, మొహాలకు రంగులు వెయ్యడానికి చాలా గంటల శ్రమ అవసరం

నాట్యకారులు పులుల్లా, చిరుతపులుల్లా కనిపించేందుకు తమ శరీరమంతటా పసుపు, తెలుపు, మట్టి రంగుల అక్రీలిక్ రంగులతో పులిచారలు వేసుకుంటారు. పూర్వకాలంలో రంగులను బొగ్గు, మట్టి, వేర్లు, శిలీంధ్రాలతో తయారుచేసేవారు

పిలి వేష ప్రదర్శనలో నృత్యకారులు చేతితో రంగులు వేసి తయారుచేసిన పులి ముసుగులను ధరించి గాండ్రిస్తూ నృత్యంచేస్తారు

పులి ఆకృతిని తెప్పించడానికి గొర్రె ఉన్నిని రంగు వేసిన శరీరాలపై చల్లుతారు

ప్రదర్శనకు ముందు అశ్విత్ పూజారికి రంగు వేస్తోన్న సందేశ్ శెట్టి. అశ్విత్, అతని బృందం ఉడిపిలోని మణిపాల్ నుంచి వచ్చిన యువ టైగెర్స్ మంచికి చెందినవారు. వీరు ఏడాది పాటు పిలి వేష ఉత్సవాలకు డబ్బు ఇస్తారు

తుళు భాషలో వేష అనేది ఈ జానపద కళలో అంతర్గత భాగం. వేడుకలు అయిపోయిన మరో రెండు రోజుల వరకూ దానిని ఉంచుతారు

ఫ్యాన్ గాలిలో రంగులని ఆరబెట్టుకుంటోన్న భువన్ అమిన్. 'ఇది నేను పిలి వేష చేయటం ఎనిమిదవసారి,' అంటోన్న ఈ పదకోండేళ్ళ అబ్బాయి తన మూడో ఏట నుండి దీనిని ప్రదర్శిస్తున్నాడు

ఎక్కువసేపు పట్టే ఈ ప్రదర్శనలు జరుగుతున్నంతసేపూ నిలిచి ఉంచడానికి తుళు భాషలో 'జట్టి' అని పిలిచే ఒక పొడవాటి తెల్లని గుడ్డని నడుము గుండా కడతారు. విన్యాసాలు చేసేటప్పుడు దుస్తులు జారిపోకుండా ఉండేలా జట్టి కాపాడుతుంది

పదేళ్ళ అభినవ్ శెట్టి మొదటిసారి ఈ నృత్యాన్ని చేస్తున్నాడు. ప్రదర్శన మొదలవడానికి ముందు అభినవ్‌కు భోజనం తినిపిస్తోన్న వాళ్ళమ్మ

ప్రదర్శనకు ముందు, తన చెల్లితో కలిసి ఫోటో తీయించుకుంటోన్న అభినవ్

ప్రదర్శనకు సిద్ధమవుతోన్న సాగర్ పూజారి, రంజిత్ హరిహర్‌పుర, విశాల్, నవీన్ నిట్టూరు (ఎడమ నించి కుడికి)

నూనె రంగులతో రంగులు వేసుకున్న అమిన్‌కి ఇది మొదటి ప్రదర్శన. ప్రదర్శనకు ముందు అమిన్‌కు సూచనలు ఇస్తోన్న, చిన్నవారైనప్పటి అనుభవం ఉన్న, మిగిలిన నాట్యకారులు

తమ పులి నాట్యం కొరియోగ్రఫీని చూపించేందుకు మొత్తం సిద్ధమయ్యాక, ఫొటోలు తీయించుకుంటోన్న యువ టైగర్స్ మంచి బృందం

నల్ల పులి వేషం వేసుకుని, తన విన్యాసాల నైపుణ్యాన్ని చూపిస్తోన్న ప్రజ్వల్ ఆచార్య. ఈ మధ్యకాలంలో ఈ నృత్యంలో సంప్రదాయక అడుగులకు బదులుగా విన్యాసాలకు ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది

ఈ విన్యాసాలలో ముందుకూ వెనక్కూ పల్టీలు కొట్టడం, తలతో కొబ్బరికాయల్ని పగులగొట్టడం, నోటి ద్వారా మంటలను బయటికి ఊదడం కనిపిస్తాయి

ఈ విన్యాసాల కొరియోగ్రఫీకి ఎంతో శక్తి అవసరం కావటంతో, వయస్సు మళ్ళినవాళ్ళు ఈ నృత్య సంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళే బాధ్యతను చిన్నవారికి వదిలేస్తున్నారు

ప్రతిధ్వనించే తాసే (డోలు) తాళానికి అనుగుణంగా పిలిలా రంగులు వేసుకున్న జనాలు తమ భక్తిని చూపడానికి, జనాలను వినోదింపచేయడానికి నృత్యం చేస్తారు

ఇదివరకు ప్రదర్శనకారులకు కోస్తా కర్ణాటకలో పండే పంటలైన బియ్యాన్ని, ధాన్యాన్ని బహుమతులుగా ఇచ్చేవారు. ఇవాళ, తిండి గింజల చోటులో డబ్బు వచ్చి చేరింది

ప్రతి ప్రదర్శనకారుడు రెండు రోజులకు గాను 2,500 రూపాయల వరకూ సంపాదిస్తారు. విన్యాసాలు చేసే నృత్యకారులు అదనంగా 6,000 రూపాయలు సంపాదిస్తారు

సందేశ్ పిలి వేషను ప్రదర్శిస్తుండగా అతన్ని ఉత్సాహపరుస్తోన్న అతని నాన్నమ్మ కమలా శెట్టి, తల్లి విజయా శెట్టి. 21 ఏళ్ళ సందేశ్ ఒక ఫోటోగ్రాఫర్, చిత్రకారుడు కూడా. "గత నాలుగేళ్ళుగా నేను పిలి వేష వేస్తున్నాను, ఇక ముందు కూడా వేస్తాను," అంటాడు సందేశ్

పులి ముసుగును వేసుకుంటోన్న వీరేంద్ర శెట్టిగార్. పులి ముసుగు వేసుకునేవారే సాధారణంగా వారి బృందానికి ప్రధాన పులి అవుతారు

గత 22 ఏళ్ళుగా వీరేంద్ర పిలి వేష వేస్తున్నారు. 'డోళ్ళ చప్పుడు, చుట్టూ ఆవరించి ఉండే శక్తి మిమ్మల్ని ఆ తాళానికి నృత్యం చేసేలా చేస్తాయి,' అంటారు వీరేంద్ర

పులి వేష వేసిన చిన్నపిల్లల్ని ఎత్తుకొని డోలు చప్పుళ్ళకు అనుగుణంగా ఆడుతోన్న గ్రామస్తులు

మొదటి విడత ప్రదర్శనం ముగిసిన తరవాత తన ఆహార్యాన్ని మారుస్తోన్న వీరేంద్ర. 30 ఏళ్ళ వయసున్న ఈయన అమెజాన్ పంపిణీదారుగా పనిచేస్తారు, గ్రామ యువతను ఈ నృత్యం చేయమని ప్రోత్సాహిస్తుంటారు

ప్రజలకు వినోదాన్ని అందివ్వటం పులివేషధారులకు చాలా ముఖ్యమే అయినా, ఈ కళ సంప్రదాయాల్ని కాపాడడానికి వీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు
అనువాదం: సంహిత