"నా దగ్గర ఎప్పుడూ డబ్బులుండవు," కుటుంబ బడ్జెట్‌ను రూపొందించుకోవటంలో తన కష్టాల గురించి చెప్పారు బబిత మిత్రా. "నేను తిండి కోసమని డబ్బుల్ని పక్కన పెడితే, అది మందులకు ఖర్చయిపోతుంది. నా కొడుకుల ట్యూషన్ కోసమని ఉంచిన డబ్బు రేషన్ కొనడానికి అవుతుంది. ఇక ప్రతి నెలా నేను పనిచేసే ఇంటివాళ్ళ దగ్గర అప్పు చేయాల్సివస్తోంది...”
కొల్‌కతాలోని కాళికాపూర్ ప్రాంతంలో రెండు ఇళ్ళలో పనిచేసే 37 ఏళ్ళ బబిత మొత్తం ఆదాయం ఏడాదికి సుమారు ఒక లక్ష రూపాయలు కూడా ఉండదు. పశ్చిమ బెంగాల్, నదియా జిల్లాలోని ఆసాన్‌నగర్ నుంచి కొల్‌కతాకు వచ్చేనాటికి ఆమెకు పదేళ్ళు కూడా నిండలేదు. "ముగ్గురు పిల్లలను పెంచగలిగే స్తోమత నా తల్లిదండ్రులకు లేదు. అందుకని, మా ఊరి నుంచి వెళ్ళి కొల్‌కతాలో స్థిరపడిన ఒకరి ఇంట్లో పని చేయటానికి నన్ను కొల్‌కతా పంపించారు."
అప్పటి నుంచి బబిత అనేక ఇళ్ళల్లో ఇంటిపనులు చేస్తూనేవున్నారు. ఆమె కొల్‌కతాలో ఉంటున్నప్పటి నుంచి దేశంలో ఆమోదం పొందిన 27 కేంద్ర బడ్జెట్లు బబితకు గానీ, ఆమె వంటి 42 లక్షల మంది గృహ కార్మికుల (అధికారిక అంచనాలు) పరిస్థితుల్లో గానీ పెద్దగా మార్పేమీ తీసుకురాలేదు. స్వతంత్ర అంచనాల ప్రకారం ఈ శ్రామికుల సంఖ్య 5 కోట్లకు పైగానే ఉంది.
బబిత 2017లో దక్షిణ 24 పరగణాల జిల్లా, ఉచ్ఛేపోతా పంచాయతీ పరిధిలోని భగవాన్‌పూర్ ప్రాంతంలో నివాసముండే నలబైఏళ్ళు దాటిన అమల్ మిత్రాను పెళ్ళి చేసుకున్నారు. అయితే, ఇంటిని నడపటంలో ఒక ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసే ఆమె భర్త సహకారం చాలా తక్కువ కావటంతో పెళ్ళి తర్వాత బబిత బాధ్యతలు రెట్టింపయ్యాయి. బబిత, అమల్‌తో పాటు 5, 6 సంవత్సరాల వయసున్న వారి ఇద్దరు కుమారులు, ఆమె అత్తగారు, 20 ఏళ్ళు దాటిన ఒక సవతి కూతురు - ఇలా ఆరుగురున్న ఆ కుటుంబాన్ని ఆమె ఎక్కువగా తన సంపాదనతోనే నిలబెట్టారు.
4వ తరగతిలోనే బడి మానేసిన బబితకు దేశంలో గత రెండు దశాబ్దాలుగా అమలవుతోన్న 'జెండర్ బడ్జెటింగ్' గురించి తెలియదు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన 2025-26 బడ్జెట్‌లో ప్రకటించిన మహిళల నేతృత్వంలోని దేశాభివృద్ధి గురించి కూడా తెలియదు. కానీ బబిత విజ్ఞత అంతా ఆమె ప్రతిస్పందనలో ప్రకాశిస్తుంది: "కష్ట సమయాల్లో ఎక్కడా కానరాని పక్షంలో, మహిళల కోసం చాలా చేస్తున్నట్టుగా గొప్పలు చెప్పుకునే ఈ బడ్జెట్ వల్ల ప్రయోజనం ఏమిటి?" కోవిడ్-19 మహామారి నాటి భాధాకరమైన జ్ఞాపకాలు ఇప్పటికీ ఆమె మనసులో మండుతూనే ఉన్నాయి.


కోవిడ్-19 నాటి బాధాకరమైన అనుభవాలను తలచుకున్నప్పుడు బబితా మిత్రకు ఇప్పటికీ కన్నీళ్ళొస్తాయి. ఆమె గర్భంతో ఉన్నప్పటి చివరి మూడు నెలల్లో ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయం గానీ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) కింద పోషకాహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు గానీ అందకపోవడంతో ఆమె విటమిన్ లోపాలను ఎదుర్కొన్నారు. దాని సంకేతాలు ఇప్పటికీ ఆమె శరీరంలో కనిపిస్తాయి


ఇద్దరు బడికి వెళ్ళే చిన్నారుల తల్లి బబిత, కొల్‌కతాలో రెండు ఇళ్ళలో పనులు చేసి సంపాదించే కొద్దిపాటి ఆదాయంతో సతమతమవుతున్నారు. కేంద్ర బడ్జెట్ మహిళా కేంద్రంగా ఉందని ఎంతగా గొప్పలు చెప్పుకున్నా, ప్రతికూల పరిస్థితుల్లో తనలాంటి మహిళలను ఆదుకోనప్పుడు ఆ బడ్జెట్ వల్ల ప్రయోజనం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు
“ ఒటా అమార్ జీబనేర్ సబ్‌చెయే ఖరాప్ సమయ్. పేటే తఖన్ ద్వితీయో సంతాన్, ప్రథమ్ జొన్ తఖనో అమార్ దూద్ ఖాయ్... శరీరే కోనో జొర్ ఛిలో నా [అది నా జీవితంలో అత్యంత ఘోరమైన సమయం. నేను నా రెండవ బిడ్డతో గర్భవతిగా ఉన్నాను, అప్పటికీ నా మొదటి బిడ్డకు తల్లిపాలు ఇస్తున్నాను. నా శరీరంలో బలం అనేదే లేదు!]" ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆమె ఉక్కిరిబిక్కిరి అయ్యారు. "నేను ఎలా బతికిపోయానో నాకే తెలియదు."
"ఇంత పెద్ద పొట్టతో నిండు గర్భిణిగా ఉన్న నేను, స్వచ్ఛంద సంస్థలు, కొంతమంది దయగల మనుషులు పంపిణీ చేసే రేషన్‌ల కోసం మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేది, ఆ పొడవైన క్యూలలో వేచి ఉండాల్సి వచ్చేది," అని ఆమె చెప్పారు.
“ప్రభుత్వం ఒక 5 కిలోల ఉచిత బియ్యాన్ని [ప్రజా పంపిణీ వ్యవస్థ కింద] ఇచ్చి చేతులు దులుపుకుంది. గర్భిణీ స్త్రీలకు లభించాల్సిన మందులు, ఆహారం [పౌష్టికాహారం, ప్రోటీన్ సప్లిమెంట్లు] కూడా నాకు దొరకలేదు,” అన్నారామె. కోవిడ్ రోజులనాటి పోషకాహార లోపం వల్ల కలిగిన రక్తహీనత, కాల్షియం లోపం సంకేతాలు ఇప్పటికీ ఆమె చేతులపై, కాళ్ళపై కనిపిస్తాయి.
"తల్లిదండ్రుల నుంచి గానీ, భర్త కుటుంబం నుంచి గానీ ఎటువంటి మద్దతు లేని పేద మహిళను సర్కార్ చూసుకోవాలి." రూ.12 లక్షల వరకు ఆదాయపు పన్ను రాయితీకి సంబంధించిన బడ్జెట్ ప్రకటనను ఆమె ఎగతాళి చేశారు: “మా సంగతేంటి? మేం కొనే ప్రతిదానికీ పన్ను కట్టడంలేదా? ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెపుతుంది, కానీ డబ్బంతా మేం చెల్లించే ఖజ్నా [పన్ను] నుంచే వస్తుంది." ఆమె తాను పనిచేసే ఇంటి బాల్కనీలో ఆరబెట్టిన బట్టలను తీయడం కోసం ఆగారు.
“సర్కార్ మా సొమ్మునే మాకు ఇచ్చి, ఇంతగా ఆర్భాటం చేస్తోంది!” అంటూ బబిత మా చర్చకు ముగింపు పలికారు.
అనువాదం: సుధామయి సత్తెనపల్లి