క్రోమోజోమ్‌లు మానవులలో లింగాన్ని ఎలా నిర్ణయిస్తాయో జీవశాస్త్ర ఉపాధ్యాయులు వివరిస్తుండటంతో తరగతిగదిలోని విద్యార్థులు నిశ్శబ్దంగానూ శ్రద్ధగానూ వింటున్నారు. “ఆడవారికి రెండు X క్రోమోజోమ్‌లు ఉంటే, మగవారికి ఒక X, ఒక Y క్రోమోజోమ్ ఉంటుంది. XX క్రోమోజోమ్‌లు Yతో జత కలిస్తే, అక్కడ కూర్చున్న వ్యక్తిలాంటివారు పుడతారు,” అని ఉపాధ్యాయుడు ఒక విద్యార్థి వైపు చూపిస్తూ చెప్పారు. ఆ విద్యార్థి ఇబ్బందిపడుతూ లేచి నిలబడడంతో తరగతి గదిలో నవ్వులు విరిశాయి.
ట్రాన్స్ సముదాయంపై నాటకం సండకారంగా (పోరాడాలనే నిశ్చయం)లో ఇది ప్రారంభ సన్నివేశం. తనకు నిర్దేశించిన లింగానికి సరిపోయే విధంగా ప్రవర్తించని కారణంగా తరగతి గదిలో ఒక పిల్లవాడు ఎదుర్కొనే అవమానం, అపహాస్యాల గురించి నాటకం మొదటి భాగం మాట్లాడుతుండగా, రెండవ సగం హింసకు గురైన ట్రాన్స్ మహిళలు, ట్రాన్స్ పురుషుల జీవితాలకు రూపుకడుతోంది.
ది ట్రాన్స్ రైట్స్ నౌ కలెక్టివ్ (టీఅర్ఎన్‌సి) భారతదేశంలోని ట్రాన్స్ సముదాయంలోని దళిత, బహుజన, ఆదివాసీ స్వరాలపై దృష్టి సారిస్తోంది. వారు నవంబర్ 23, 2022న తమిళనాడులోని చెన్నైలో సండకారంగా మొదటి ప్రదర్శనను ఇచ్చారు. గంటసేపు సాగే ఈ నాటకానికి తొమ్మిది మంది ట్రాన్స్ వ్యక్తుల బృందం దర్శకత్వం వహించి, నిర్మించి, ప్రదర్శించింది.
“నవంబర్ 20ని మరణించిన ట్రాన్స్ వ్యక్తుల జ్ఞాపకార్థం అంతర్జాతీయ ట్రాన్స్ డే ఆఫ్ రిమెంబరెన్స్‌గా పాటిస్తారు. వారి కుటుంబాలు వారిని నిర్లక్ష్యం చేయటం, సమాజం వారిని బహిష్కరించటం, అనేకమంది హత్యలకు గురవటమో లేదా ఆత్మహత్యలతో చనిపోవడమో వంటివాటివలన వారి జీవితాలేమంత సరళంగా సాగినవి కావు." అని టిఆర్ఎన్‌సి వ్యవస్థాపకురాలు గ్రేస్ బాను చెప్పారు.

తమిళనాడులోని చెన్నైలో సండకారంగా నాటకం రిహార్సల్‌లో కళాకారులు

తరగతి గది సెట్టింగ్‌లో ట్రాన్స్ సముదాయపు క్రోమోజోమ్‌ల గురించీ, లైంగిక గుర్తింపును గురించీ వివరించే టీచర్ పాత్రను పోషిస్తోన్న రంగస్థల కళాకారులు గ్రేస్ బాను
"ప్రతి సంవత్సరం, ఈ సంఖ్య పెరుగిపోతోంది. ట్రాన్స్ సముదాయంపై హింస జరిగినప్పుడు, ఎవరూ దీనికి వ్యతిరేకంగా మాట్లాడరు. మన సమాజంలో దీనిపట్ల సంపూర్ణ నిశ్శబ్దం ఉంది,” అని కళాకారులు, ఉద్యమకారులు అయిన బాను చెప్పారు. “మేమొక సంభాషణను ప్రారంభించవలసి వచ్చింది. అందుకే మేం (ప్రదర్శనకు) సండకారంగా అని పేరు పెట్టాం.
2017లో ‘సండకారై’గా ప్రదర్శనలిచ్చిన ఈ నాటకం పేరును తర్వాత 2022లో ‘సండకారంగా’గా మార్చారు. "ట్రాన్స్ వ్యక్తులనందరినీ కలుపుకొని వచ్చే విధంగా ఉండేలా మేం ఆ పేరు మార్చాం" అని గ్రేస్ బాను వివరించారు. ఈ నాటకంలోని తొమ్మిది మంది కళాకారులు నొప్పి గురించీ, బాధలను గురించీ వివరిస్తారు. ట్రాన్స్ సముదాయం పట్ల ఉన్న అజ్ఞానం, వారిపై జరిగే మౌఖిక, శారీరక హింసలపై చుట్టుముట్టివున్న నిశ్శబ్దాన్ని ప్రశ్నిస్తారు. "ట్రాన్స్ పురుషులు, మహిళలు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి" అని సండకారంగా రచయిత, దర్శకులు నేహ చెప్పారు.
"మేమెప్పుడూ బ్రతకటం కోసం పెనుగులాటలోనే ఉంటుంటాం. మా నెలవారీ ఖర్చులు చెల్లించడానికి, నిత్యావసరాలను కొనుగోలు చేయడానికి మేం నిరంతరం పని చేస్తుంటాం. ఈ రచనపై పని చేస్తున్నప్పుడు, నేను ఉత్సాహంగా ఉన్నాను కానీ, ట్రాన్స్ పురుషులకు, ట్రాన్స్ మహిళలకు రంగస్థలం మీద, సినిమాల్లోనూ నటించే అవకాశం ఎప్పటికీ రాకపోవడం నాకు కోపాన్ని తెప్పిస్తోంది. మనం జీవించడం కోసం మన జీవితాలను పణంగా పెడుతున్నపుడు, నాటకాన్ని రూపొందించడానికి ఎందుకు రిస్క్ తీసుకోకూడదని నేను అనుకున్నాను,” అని నేహ అన్నారు.
ఈ ఛాయాచిత్ర కథనం ట్రాన్స్ సముదాయపు చెరిపివేసిన చరిత్రను సజీవంగా తీసుకువచ్చే క్షణాలను సంగ్రహిస్తుంది. వారి జీవించే హక్కును తిరిగి పొందడం గురించి, వారి శరీరాల పట్ల గౌరవం కోసం పిలుపునిస్తుంది.


సండకారంగా దర్శకులు, నటులు నేహ చిత్తరువు (ఎడమ), ట్రన్స్ హక్కుల కార్యకర్త గ్రేస్ బాను (కుడి)


ఎడమ: ట్రాన్స్ రైట్స్ నౌ కలెక్టివ్ సాంస్కృతిక సమన్వయకర్త, రంగస్థల నటి, రేణుక జె. కుడి: కాస్ట్యూమ్ డిజైనింగ్, ఫ్యాషన్‌లో మాస్టర్స్ డిగ్రీ అభ్యసిస్తున్న రంగస్థల నటి ప్రస్సి డి


ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తోన్న రంగస్థల నటులు రిజ్వాన్ (ఎడమ), అరుణ్ కార్తిక్ (కుడి). ‘ట్రాన్స్ పురుషులు సమాజంలో అల్పసంఖ్యాకులు, వారి ఉనికి అస్పష్టంగా మారుతోంది. ఈ నాటకం ట్రాన్స్ పురుషుల కథను కూడా చెబుతుంది’ అన్నారు అరుణ్


'ఈ నాటకం విస్తృతంగా వ్యాపించి ట్రాన్స్ ప్రజలకు జీవించే బలాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను' అని ఇంజనీరింగ్ విద్యార్థి, రంగస్థల కళాకారులు, ట్రాన్స్ రైట్స్ నౌ కలెక్టివ్‌లో విద్యార్థుల సమన్వయకర్త అజిత వై. చెప్పారు. రంగస్థల కళాకారిణి రాగిణిరాజేష్ చిత్రం (కుడి)


ఎడమ: ఒక ప్రైవేట్ కంపెనీలో అనలిస్ట్‌గా పనిచేస్తున్న రంగస్థల కళాకారులు నిషాతన జాన్సన్ చిత్రం. 'ఈ నాటకం ట్రాన్స్ వ్యక్తుల అవస్థలను, బాధలను వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, వారి హక్కుల కోసం పోరాడుతూ మరణించిన వారి జీవితాలను కూదా చిత్రీకరిస్తుంది.' కుడి: తమిళనాడులోని చెన్నైలో నాటకం రిహార్సల్‌లో కళాకారులు


ఎడమ: నాటకంలో నిషాతన జాన్సన్, అజిత వై. కుడి: ప్రస్సి డి. తానే స్వయంగా మేకప్ చేసుకుంటారు

విద్యాసంస్థల్లో ట్రాన్స్ సముదాయం అనుభవిస్తోన్న వేధింపులను సండకారంగా చిత్రీకరిస్తుంది

ఒక ట్రాన్స్ మహిళను తన ఇంట్లో ఎలా చూస్తారో చూపిస్తోన్న దృశ్యం

మార్పిడి చికిత్స వల్ల కలిగే బాధాకరమైన బాల్య అనుభవాలను, తమకు నిర్దేశించిన లింగానికి అనుగుణంగా ప్రవర్తించకపోవటం వల్ల కలిగే అవమానాలను, హింసను చూపించే నాటకంలోని ఒక సన్నివేశం

తమిళనాడులోని చెన్నైలో సండకారంగా నాటకం రిహార్సల్‌లో కళాకారులు

ట్రాన్స్ సముదాయం అనుభవిస్తోన్న వేధింపులు, హింస పట్ల మౌనంగా ఉంటోన్న చుట్టూ ఉన్న సమాజాన్ని ఈ నాటకంలో ప్రశ్నిస్తోన్న నేహ

లింగ నిర్ధారణ శస్త్రచికిత్స చేయించుకుంటున్న ట్రాన్స్‌గా గుర్తించిన వ్యక్తి నొప్పినీ, బాధనూ ప్రదర్శిస్తోన్న ప్రస్సి డి

ప్రమాణాలకుభిన్నమైన సమాజంలో అతని ప్రేమ, నిస్పృహ, నొప్పి అనుభవాలను ప్రదర్శిస్తోన్న ట్రాన్స్ మ్యాన్ పాత్రను పోషించిన రిజ్వాన్ ఎస్

పోలీసుల చేతిలో లైంగిక దాడికి గురైన ట్రాన్స్ మహిళ పాత్రను పోషిస్తోన్న గ్రేస్ బాను

ట్రాన్స్ వ్యక్తుల శరీరాలను గౌరవించాలని, ట్రాన్స్ సముదాయం పట్ల జరిపే బాడీ షేమింగ్, ట్రాన్స్‌ఫోబియా, హింసలను అంతం చేయాలని నేహ (నిలబడి ఉన్నవారు) ప్రేక్షకులకు పిలుపునిచ్చారు

ఎన్ని బాధలు, ఎన్ని అవస్థలు పడుతున్నప్పటికీ తమ సముదాయం తమ జీవితాల్లోకి ఆనందాన్ని, వేడుకలను తీసుకువచ్చే మార్గాలను ప్రదర్శిస్తోన్న కళాకారులు

నవంబర్ 2022లో జరిగిన సండకారంగా నాటకం ద్వారా విస్మరించిన ట్రాన్స్ సముదాయపు చరిత్రను వేదికపైకి తెచ్చిన కళాకారుల బృందం

నాటకం మొదటి ప్రదర్శన ముగిసిన రాత్రి, నిలబడి చప్పట్లు కొడుతూ ప్రశంసలందిస్తోన్న ప్రేక్షకులు
అనువాదం: సుధామయి సత్తెనపల్లి