అంధేరీలో, కదలామెదలకుండా నిల్చొని ఉన్న రైలుకూ, ఆ రైలు లోపలకు ఎక్కే ప్రయాణీకులు చేసే పెద్ద పెద్ద శబ్దాలకూ మధ్య ఒక విచిత్రమైన వైరుధ్యం కనిపిస్తుంది. రైలు పెట్టెలోకి ప్రవేశించే హడావిడిలో, ప్రయాణీకులు తమ దారికి అడ్డంగా వచ్చే ప్రతిదాన్నీ పట్టుకోవాలని చూస్తారు - అది కంపార్ట్‌మెంట్ తలుపు హ్యాండిల్ కావచ్చు, లేదా మరొక ప్రయాణీకుడి చేయి కూడా కావచ్చు. పెట్టెలో ఉన్న జనమంతా ఖాళీగా ఉన్న సీట్లను ఆక్రమించుకోవడానికి తహతహలాడుతుంటారు. అప్పటికే కూర్చున్నవారిని అభ్యర్థించడం, వాదించడం, సీట్లో కూర్చోవడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను నెట్టడానికి కూడా ప్రయత్నిస్తుంటారు.
ఆ ప్రయాణీకుల వెల్లువలో ఈదుతున్నవాళ్ళలో 31 ఏళ్ల కిషన్ జోగి, పదేళ్ళ వయసున్న అతని కుమార్తె భారతి కూడా ఉన్నారు. భారతి సముద్ర నీలపు రంగు రాజస్థానీ లంగా, జాకెట్టు ధరించివుంది. పశ్చిమ సబర్బ్ లైన్‌లో ప్రయాణించే ఈ 7 గంటల ముంబై లోకల్ రైలు, ఈ సాయంత్రం ఆ తండ్రీ కూతుళ్లు ఎక్కీ దిగిన ఐదవ రైలు.
ఆ రైలు కదిలి వేగంపుంజుకొని, ప్రయాణీకులంతా సర్దుకోగానే కిషన్ వాయిస్తోన్న సారంగి శ్రావ్యమైన ధ్వని అక్కడి గాలిని నింపేసింది.
“ తేరీ ఆఁఖే భూల్ భులైయా … బాతే హై భూల్ భులైయా ...”
అతని కుడి చేతిలో ఉన్న కమాను సారంగి ఫింగర్ బోర్డుకు గట్టిగా బిగించి ఉన్న మూడు తీగెలపై చకచకా కదులుతుండటంతో శ్రావ్యమైన చక్కని ధ్వని వినవస్తోంది. సారంగికి మరొక చివరన ఉన్న చిన్న అర, అతని ఎడమ చేతికీ, ఛాతీకీ మధ్య నిలిచి ఉంది. అతని వాయిద్యం నుండి వెలువడుతున్న 2022వ సంవత్సరం బాలీవుడ్ చిత్రం ' భూల్ భులయ్యా ' లోని జనాదరణ పొందిన పాట, గాలిలో మరింతగా గిరికీలు కొడుతోంది.
రైలు పెట్టెలో కూర్చుని ఉన్న కొంతమంది ప్రయాణికులు ఆ మనోహరమైన రాగాలను వినడంకోసం తమ తమ ప్రపంచాల నుండి కాసేపు బయటికి వస్తుంటారు. మరికొందరు అతని వాదనంను రికార్డ్ చేయడానికి తమ ఫోన్‌లను సిద్ధంగా పట్టుకుంటారు. కొందరు పలుచగా నవ్వుతారు. కానీ చాలామంది చెవులలో ఇయర్‌ప్లగ్‌లు పెట్టుకుని తమ ఫోనులలో మునిగిపోయి ఉంటారు. చిన్నారి భారతి ఆ రైలు పెట్టె మొత్తం తిరుగుతూ అటువంటివారిని చేతితో తట్టి డబ్బు అడుగుతుంటుంది.
'(నా) తండ్రి సారంగిని నా చేతులలో పెట్టివెళ్ళాడు. నేనెన్నడూ బడికి వెళ్ళాలనే ఆలోచన కూడా చేయలేదు. ఇలా వాయిస్తూ పోతున్నానంతే'
"జనం నన్ను చూడగానే, నేను వాయించడానికి వీలుగా కొంత స్థలం ఇచ్చేవారు," కిషన్ కొంచెం విచారంగా చెప్పారు. సుమారు 10-15 సంవత్సరాల క్రితం పరిస్థితులు ఇప్పటికి ఎలా భిన్నంగా ఉండేవో అతను గుర్తు చేసుకున్నారు. "అప్పట్లో చాలా ఎక్కువ విలువనిచ్చేవారు. ఇప్పుడయితే చెవుల్లో ఇయర్ ఫోన్లు పెట్టుకుని, ఫోన్లు చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నా సంగీతంపై ఆసక్తి ఏమాత్రం ఉండటంలేదు,” అతను మరొక మధుర రాగాన్ని వాయించడానికి ముందు ఒక క్షణం ఆగారు.
“నేను జానపద సంగీతం, భజనలు, రాజస్థానీ, గుజరాతీ, హిందీ పాటలను వాయించగలను. ఏదైనా (పాట) అడగండి, నేను దానిని నా సారంగి పై వాయించడానికి ముందు దానిని విని, బుర్రకు ఎక్కించుకోవడానికి నాలుగైదు రోజులు పడుతుంది. ప్రతి స్వరాన్ని సరిగ్గా వచ్చేలా చేసేందుకు నేను చాలా సాధన చేస్తాను,” అంటూ అతను తన తర్వాతి వాదనమ్ కోసం సారంగి లయను సరిచేసుకున్నారు.
మరోవైపు, భారతి దగ్గరకు వచ్చేసరికి ఒక చిన్న నాణాన్నో, లేదా పెద్ద నోటునో ఇవ్వడం కోసం కొంతమంది తమ పర్సుల లోలోపలికి చేతులు పోనిస్తున్నారు. ఆమె రైలు చక్రాలు తిరుగుతున్నంత వేగంగా వాళ్ళ చుట్టూ తిరుగుతోంది. తర్వాతి స్టేషన్‌లో రైలు ఆగే లోపల ఒక్క ప్రయాణీకుడిని కూడా వదలకుండా ఉండేలా చూసుకుంటుంది.
కిషన్ సంపాదన రోజుకూ రోజుకూ మారుతూ ఉంటుంది - కొన్నిసార్లు రూ. 400 ఉంటే, మరికొన్నిసార్లు అది రూ. 1,000 ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు తన ఇంటికి సమీపంలోని నాలాసోపారా వద్ద ముంబై లోకల్ వెస్ట్రన్ లైన్ రైలు ఎక్కినప్పుడు ప్రారంభమైన అతని పరుగు, ఆరు గంటలకు పైగా ఒక రైలు నుండి మరో రైలుకు దూకడంతో ముగుస్తుంది. అతను స్థిరంగా ఒకే మార్గంలో వెళ్ళాలనేం లేదు, కానీ చర్చ్‌గేట్, విరార్ స్టేషన్ల మధ్య ముందుకూ వెనుకకూ తిరుగుతుంటారు. మంచి జనాల గుంపు, వారి మధ్య తాను సారంగిని వాయించే అవకాశమున్న స్థలం బట్టి రైళ్ళు మారుతుంటారు.
"ఉదయంపూట జనం తమ పనుల కోసం పరిగెత్తుతుంటారు, రైళ్లన్నీ నిండిపోతాయి, ఇంక నన్ను ఎవరు వింటారు?" సాయంత్రంపూట రైళ్లనే ఎంపిక చేసుకోవడం గురించి వివరిస్తూ అన్నారు కిషన్. “(ఇంటికి) తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళు కొంత విశ్రాంతిగా ఉంటారు. కొందరు నన్ను దూరంగా నెట్టేస్తుంటారు, కానీ నేను పట్టించుకోను. అంతకంటే నేను చేయగలిగింది మాత్రం ఏముంది?" ఇదే అతనికి తెలిసినదీ, వారసత్వంగా వచ్చినదీ అయిన ఏకైక నైపుణ్యం.

పశ్చిమ సబర్బ్ లైన్‌గుండా సాయంత్రం 7 గంటలకు ప్రయాణించే ముంబై లోకల్ రైలులో సారంగిని వాయించే కిషన్ జోగి , అతని కూతురు భారతి
అతని తండ్రి మితాజీ జోగి, రాజస్థాన్‌లోని లునియాపురా గ్రామంలోని తమ ఇంటి నుంచి ఈ నగరానికి మొదటిసారి వలస వచ్చినప్పుడు, ముంబైలోని లోకల్ రైళ్లలోనూ, రోడ్ల మీదా సారంగి వాయించేవారు. "నా తల్లిదండ్రులు నా తమ్ముడు విజయ్‌తో కలిసి ముంబయికి వచ్చినప్పుడు నాకు కేవలం రెండేళ్ల వయస్సు మాత్రమే" అని అతను గుర్తుచేసుకున్నారు. కిషన్ తన తండ్రిని అనుసరించడం ప్రారంభించేటప్పటికి బహుశా ఇప్పటి భారతి కంటే కూడా చిన్నవయసువాడు.
జోగి సముదాయానికి చెందిన మితాజీ (రాజస్థాన్‌లో ఇతర వెనుకబడిన తరగతిగా జాబితా చేసినది) తనను తాను ఒక ప్రదర్శనకారుడిగా భావించుకున్నారు. గ్రామంలోని అతని కుటుంబం జీవనోపాధి కోసం జానపద సంగీతంలో ఉపయోగించే ఒక పురాతనమైన, కమానుతో వాయించే తీగ వాయిద్యమైన రావణహత్థ ను వాయించేవారు. వినండి: ఉదయపుర్‌లో రావణ పరిరక్షణ
"ఎప్పుడైనా ఒక సాంస్కృతిక సమావేశం, లేదా ఏదైనా మతపరమైన కార్యక్రమం జరిగితే, నా బాప్ (తండ్రి)ను, ఇతర వాద్యకారులను పిలిచేవారు," అని కిషన్ చెప్పారు. "కానీ అది చాలా అరుదు. అలాగే, విరాళంగా వచ్చే డబ్బును వాద్యకారులందరికీ పంపకం చేసేవారు.
సంపాదన తక్కువగా ఉండటం వల్ల మితాజీ, ఆయన భార్య జమునా దేవి తక్కువ కూలీకి వ్యవసాయ కూలీలుగా పనిచేయవలసి వచ్చింది. “మా గ్రామంలోని గరీబీ (పేదరికం) మమ్మల్ని ముంబైకి వెళ్ళేలా చేసింది. గ్రామంలో మరే ఇతర ధందా మజ్దూరీ (ప్రత్యామ్నాయ వ్యాపారం, కూలీ పని) లేదు." అన్నారతను
ముంబైలో, మితాజీకీ ఉద్యోగం ఏదీ దొరక్కపోవడంతో, మొదట తన రావణహత్థా ను, ఆ తరువాత సారంగి వాయించడాన్ని కొనసాగించారు. " రావణహత్థ లో చాలా ఎక్కువగా తీగలు, తక్కువ సుర్ (శబ్దం) ఉన్నాయి" అని కిషన్ అనుభవజ్ఞుడైన కళాకారుడి నైపుణ్యంతో వివరించారు. “కానీ సారంగి కి పదునైన స్వరం ఉంది, తీగలు తక్కువగా ఉంటాయి. జనం ఎక్కువగా ఇష్టపడుతుండటంతో మా నాన్న సారంగి ని వాయించడం మొదలుపెట్టాడు. ఇది సంగీతంలో చాలా విభిన్నతను కూడా అందిస్తుంది."


ఎడమ : కిషన్ ఇంట్లో గోడకు తగిలించివున్న ఆయన తండ్రి మితాజీ ఫొటో , పక్కనే వేలాడదీసివున్న సారంగి. కిషన్ తన తండ్రి నుంచే ఈ సారంగిని వాయించే కళను నేర్చుకున్నారు. కుడి: జనం గుంపులుగా ఉన్న ప్రదేశాలతోపాటు తన వాద్యాన్ని వాయించేందుకు తగినంత చోటు కూడా ఉండేలా చూసుకునేందుకు వివిధ స్టేషన్లలోనూ , రైళ్ళలోనూ కిషన్ తిరుగుతుంటారు
కిషన్ తల్లి జమునా దేవి తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి ఒక చోట నుండి మరొక చోటికి మారుతూనే ఉండేవారు. "మేమిక్కడికి వచ్చినప్పుడు పేవ్‌మెంటే మా ఇల్లు," అని అతను గుర్తుచేసుకున్నారు. "మేం ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పడుకునేవాళ్ళం." అతనికి ఎనిమిదేళ్లు వచ్చేసరికి సూరజ్, గోపి అనే మరో ఇద్దరు తమ్ముళ్ళు పుట్టారు. "నేను అప్పటి రోజులను గుర్తుంచుకోవాలని కూడా అనుకోవడం లేదు," కిషన్ స్పష్టంగా తన అసౌకర్యంగా ప్రకటించారు.
అతను గుర్తుంచుకోవాలనుకునే జ్ఞాపకాలు తన తండ్రి సంగీతానికి సంబంధించినవి మాత్రమే. ఆయన తాను స్వయంగా తయారుచేసిన చెక్క సారంగి పై వాయించడాన్ని కిషన్‌కూ, అతని సోదరులకూ నేర్పించారు. “వీధులూ రైళ్ళూ అతని వేదికలు. అతను ఎక్కడైనా వాయించేవాడు, ఎవరూ అతన్ని ఆపేవాళ్ళుకాదు. ఎక్కడ వాయించినా పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించేవాడు,” కిషన్ ఉత్సాహంగా తన చేతులను విశాలంగా చాపి, జనాల పరిమాణాన్ని ఊహించడంలో మాకు సహాయపడుతూ అన్నారు.
వీధులు మితాజీ పట్ల చూపించినట్లు అతని కొడుకు పట్ల దయ చూపలేదు. జుహు-చౌపాటీ బీచ్‌లో ఒక పోలీసుతో అవమానకరమైన అనుభవం తర్వాత, పర్యాటకుల కోసం సారంగిని వాయించినందుకు అతనికి రూ. 1,000 జరిమానా పడింది. అతను దాన్ని చెల్లించలేకపోవడంతో, అతన్ని ఒకటి రెండు గంటలపాటు లాకప్‌లో పెట్టారు. ఆ సంఘటన తర్వాత రైళ్లలో సారంగిని వాయించడం ప్రారంభించిన కిషన్, “నేను చేసిన తప్పేంటో కూడా నాకు తెలియదు," అన్నారు. కానీ అతని సంగీతం, తన తండ్రికి ఎన్నటికీ సాటిరాలేదని అతను చెప్పారు.
" బాప్ నేను వాయించిన దానికంటే చాలా గొప్పగా, చాలా ప్రేమతో వాయించేవాడు" అని కిషన్ చెప్పారు. కిషన్‌లా పాటకు దూరంగా ఉండకుండా, మితాజీ సారంగి వాయిస్తూనే పాడేవారు. "నేను, నా తమ్ముడు బతుకుతెరువు కోసం వాయిస్తాం." కిషన్‌కు 10 సంవత్సరాల వయసున్నపుడు అతని తండ్రి, బహుశా క్షయవ్యాధితో, మరణించారు. "మాకు తినడానికే చాలినంత ఉండేది కాదు, ఇంక ఆసుపత్రులకు వెళ్ళడానికి ఎక్కడినుంచి వస్తుంది."
కిషన్ చిన్న వయసు నుండే జీవనోపాధి కోసం కష్టపడాల్సివచ్చింది. “మరేదైనా ఆలోచించడానికి సమయం ఎక్కడిది? బాప్ నే సారంగీ థమా దీ , కభీ స్కూల్ కా భీ నహీ సోచా బస్ బజాతే గయా (నాన్న సారంగిని మా చేతుల్లో పెట్టేసివెళ్ళాడు. నేనెప్పుడూ స్కూల్‌కి వెళ్లాలనే ఆలోచన కూడా చేయలేదు. అలా వాయిస్తూ పోయాను)," అని అతను చెప్పారు.


ఎడమ : తన తమ్ముళ్ళలో ఒకరైన సూరజ్‌తో కిషన్ . కుడి : తన భార్య రేఖ , పిల్లలు యువరాజ్ , భారతీలతో కిషన్
అతని తండ్రి మరణించిన తరువాత, అతని ఇద్దరు తమ్ముళ్ళు విజయ్, గోపి తమ తల్లితో కలిసి తిరిగి రాజస్థాన్ వెళ్ళిపోయారు. సూరజ్ నాసిక్ వెళ్ళాడు. "వారికి ముంబై సందడి, హడావుడి ఇష్టముండదు, సారంగి వాయించేందుకు కూడా ఇష్టపడరు," కిషన్ చెప్పారు. "సూరజ్ వాయిస్తాడు, ఇప్పటికీ వాయిస్తుంటాడు, కానీ మిగిలిన ఇద్దరూ మాత్రం జీవించడానికి రకరకాల పనులు చేస్తారు."
"నేను ముంబైలో ఎందుకు నివసిస్తున్నానో నాకు తెలియదు, కానీ ఏదో ఒకవిధంగా నేను నాదైన ఒక చిన్న ప్రపంచాన్ని ఇక్కడ తయారుచేసుకున్నాను," అని కిషన్ చెప్పారు. అతని ప్రపంచంలో ఒక భాగం ముంబయి ఉత్తర శివారులోని నాలాసోపారా పశ్చిమలో అతను అద్దెకు తీసుకున్న ఒక గుడిసె. ఈ మట్టి నేల కలిగివున్న 10 x 10 స్థలం గోడలు ఆస్బెస్టాస్ రేకులతోనూ, పైకప్పు తగరంతోనూ కప్పి ఉంది.
అతని మొట్టమొదటి ప్రేయసి, గత 15 సంవత్సరాలుగా అతని భార్య, వారి ఇద్దరు పిల్లలైన భారతి, యువరాజ్(3)లకు తల్లి అయిన రేఖ, మమ్మల్ని స్వాగతించారు. నలుగురు సభ్యులున్న ఆ కుటుంబం నివసిస్తోన్న ఆ చిన్న గదిలో ఒక వంటగది, ఒక చిన్న టెలివిజన్ సెట్, వారి బట్టలు ఉన్నాయి. అతను ‘నిధి’గా పిలుచుకునే అతని సారంగి , ఒక కాంక్రీట్ స్తంభం దగ్గర గోడ నుంచి వేలాడదీసివుంది
ఆమెకు ఇష్టమైన పాట గురించి రేఖను అడగండి, " హర్ ధున్ ఉస్కే నామ్ (ఆమెను ఉద్దేశించని రాగమనేదే లేదు)" అని కిషన్ త్వరత్వరగా జవాబు చెప్పేస్తారు
"అతను వాయించే ప్రతిదాన్నీ నేను ఇష్టపడతాను, కానీ మేం ఇకపై ఈ ఒక్కదానిపై ఆధారపడలేం," అని రేఖ చెప్పింది. "అతనికి ఒక క్రమబద్ధమైన రాబడినిచ్చే ఉద్యోగం దొరకాలని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు మేమిద్దరం మాత్రమే ఉండేవాళ్లం, కానీ ఇప్పుడు మాకు ఈ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు."

' నిద్రలో కూడా నేను దీన్ని వాయించగలను . ఇదొక్కటే నాకు తెలిసిన విద్య . కానీ సారంగి ద్వారా సంపాదన ఏమీ ఉండటంలేదు ,' అంటారు కిషన్
రైళ్లలో కిషన్‌తో పాటు వెళ్లే భారతి నిలెమోర్‌లోని వారు నివాసముండే ప్రదేశానికి కొద్ది దూరంలో ఉన్న జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. బడి అయిపోయిన వెంటనే ఆమె తండ్రితో కలిసి వెళ్తుంది. "నా తండ్రి ఏది వాయించినా నాకు ఇష్టమే, కానీ ప్రతిరోజూ ఆయనతో కలిసి రావడం నాకు ఇష్టం ఉండదు" అని ఆమె చెప్పింది. "నేను నా స్నేహితులతో కలిసి ఆడుకోవాలనీ, నృత్యం చేయాలనీ అనుకుంటుంటాను."
"నేను ఈమెను తీసుకెళ్లడం ప్రారంభించినప్పుడు ఆమెకు ఐదు సంవత్సరాలు ఉండొచ్చు," కిషన్ చెప్పారు, "ఏం చేయాలి? ఆమెను వెంట తీసుకెళ్లడం నాకూ ఇష్టం లేదు, కానీ నేను సారంగి ని వాయిస్తున్నప్పుడు డబ్బు వసూలు చేయడానికి ఎవరైనా ఉండాలి కదా, లేకుంటే మనం ఎలా సంపాదిస్తాం?"
కిషన్ నగరంలో ఇతర ఉద్యోగాల కోసం కూడా వెతుకుతున్నారు, కానీ ఎలాంటి విద్యార్హతలు లేకపోవడంతో అతని ప్రయత్నాలు ఫలించటం లేదు. రైలులో ఉన్న వ్యక్తులు తన నంబర్‌ను అడిగినప్పుడు, వారు ఏదైనా పెద్ద ఈవెంట్‌లో ప్రదర్శన ఇవ్వడానికి తనను పిలుస్తారేమోనని అతను ఆశిస్తుంటారు. కొన్ని ప్రకటనలకు నేపథ్య సంగీతాన్ని ఇవ్వడం వంటి కొన్ని పనులు దొరికాయి. ముంబై చుట్టుపక్కల ఉన్న స్టూడియోలు, ఫిల్మ్ సిటీ, పరేల్, వెర్సోవా వంటి చోట్లకు కూడా వెళ్ళారు, కానీ అవన్నీ అప్పుడప్పుడూ అతనికి రూ. 2,000 నుండి రూ. 4,000 వరకూ సంపాదించిపెట్టే ఒక్కసారి అవకాశాలుగా మారాయి.
అలాంటి అవకాశాలు వచ్చి కూడా ఇప్పటికి నాలుగేళ్ళు అయింది.


ఎడమ : కిషన్ ఇంటిలో వేలాడదీసివున్న సారంగి . దానిని తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా కిషన్ భావిస్తారు . కుడి : తన ఇంటివద్ద భారతి , యువరాజ్‌లతో కూర్చొని ఉన్న కిషన్
దశాబ్దం క్రితమయితే రోజుకు రూ. 300 నుంచి రూ. 400 సంపాదన బతకడానికి సరిపోయేది, కానీ ఇప్పుడలా కాదు. అతని ఇంటికి నెలవారీ అద్దె రూ. 4,000. ఆపైన రేషన్, నీరు, విద్యుత్ - కలిపి దాదాపు నెలకు రూ. 10,000 వరకూ అవుతుంది; అతని కుమార్తె పాఠశాల రుసుము ప్రతి ఆరు నెలలకు రూ.400 అవుతుంది
భార్యాభర్తలిద్దరూ చిందీవాలే గా – పగటి వేళల్లో ఇళ్ళ నుండి పాత బట్టలు సేకరించి, వేరేవారికి అమ్మటం - పని చేస్తారు. అయితే ఈ ఆదాయం స్థిరంగానూ, ఒక క్రమపద్ధతిలోనూ ఉండదు. పని దొరికినప్పుడు వాళ్ళు రోజుకు రూ. 100 నుండి 500 వరకూ సంపాదిస్తారు.
"నేను నిద్రలో కూడా సారంగిని వాయించగలను. ఇదొక్కటే నాకు చేతనైన పని," అంటారు కిషన్. "కానీ సారంగి వాదన ద్వారా డబ్బులేమీ రావు."
" యే మేరే బాప్ సే మిలీ నిషానీ హై ఔర్ ముఝే భీ లగ్తా హై మై కళాకార్ హుఁ ... పర్ కళాకారీ సే పేట్ నహీఁ భర్‌తా , నా ? ” ("ఇది మా నాన్న నుండి నాకు లభించిన బహుమతి. నన్ను నేను ఒక కళాకారుడిగానే భావిస్తున్నాను ... కానీ కళ ఖాళీ కడుపును నింపదు, అవునా?")
అనువాదం: సుధామయి సత్తెనపల్లి