"ఇదంతా ఒకే ఒక దారంతో మొదలై ఒకే ఒక దారంతో పూర్తవుతుంది," సన్నగా నవ్వుతూ అంటారు రేఖా బెన్ వాఘేలా. ఆమె గుజరాత్‌లోని మోటా టింబ్లా గ్రామంలోని తన ఇంటిలో ఒక సింగిల్ ఇక్కత్ పటోలు ను నేస్తూ తన చేనేత మగ్గం ముందు కూర్చునివున్నారు. "మొదట్లో మేం బాబిన్‌లోకి ఒక దారాన్ని చుడతాము, మళ్ళీ చివరిలో ఇప్పుడు అద్దకం వేసిన దారాన్ని బాబిన్‌లోకి పంపిస్తాం," పేక దారాలు సిద్ధం కావటానికీ, పడుగు దారాన్ని మగ్గంలోకి అమర్చడానికీ ముందు, పటోలా తయారీలో చోటుచేసుకునే అనేక ప్రక్రియలను గురించి వివరిస్తూ అన్నారు రేఖా బెన్.
ఆమె నివసించే సురేంద్రనగర్ జిల్లాలోని ఈ గ్రామానికి చెందిన వణ్‌కర్‌వాసులలో చాలామంది పటోలు అని పిలిచే ప్రసిద్ధ పట్టు చీరల తయారీకి సంబంధించిన ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. కానీ ఈనాడు లీంబడీ తాలూకా లో సింగిల్, డబుల్ ఇక్కత్ పటోలా నేస్తున్న ఏకైక దళిత మహిళ, 40 ఏళ్ళ వయసున్న రేఖా బెన్. (చదవండి: రేఖా బెన్ జీవితపు పడుగూ పేకా... )
సురేంద్రనగర్‌కు చెందిన పటోలా ను ' ఝాలావాడి’ పటోలా అంటారు. ఇవి పాటణ్‌లో తయారయ్యే వాటికంటే చవకైనవి. సహజంగా సింగిల్ ఇక్కత్ పటోలా నేతకు పేరొందిన ఝాలావాడ్‌లోని వణ్‌కర్లు (నేతకారులు) ఇప్పుడు డబుల్ ఇక్కత్ వస్త్రాన్ని కూడా నేస్తున్నారు. "సింగిల్ ఇక్కత్‌లో డిజైన్ పేక పోగులపైనే ఉంటుంది. డబుల్ ఇకత్‌లో డిజైన్ పడుగూ పేకా రెండింటిలోనూ ఉంటుంది," అన్నారు రేఖా బెన్, రెండు రకాల పటోలాల మధ్య ఉన్న తేడాను వివరిస్తూ.
నేత ప్రక్రియను జటిలం చేసేది డిజైన్. రేఖా బెన్ మరోసారి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. "ఒక సింగిల్ ఇక్కత్ పటోలు కు 3500 పడుగు దారాలు, 13750 పేక దారాలు ఉంటాయి. అదే డబుల్ ఇక్కత్‌కు 2220 పడుగు దారాలు, 9870 పేక దారాలు ఉంటాయి," నాడెలోకి పేక దారం ఉన్న బాబిన్‌ను జారవిడుస్తూ చెప్పారామె.

'ఇదంతా ఒక దారంతో మొదలై ఒక దారంతో ముగుస్తుంది' అని గుజరాత్‌లోని లీంబడీ తాలూకాలో పటోలా నేసే ఏకైక దళిత మహిళ రేఖా బెన్ వాఘేలా చెప్పారు. పట్టు నూలుకండెతో మొదలై, చివరి దారం 252-అంగుళాల పొడవుండే పటోలా చీర నేతలోకి వెళ్ళడంతో ముగిసే ప్రక్రియను గురించి ఆమె వివరిస్తున్నారు. ఇది ఆరు నెలల పాటు సాగే శ్రమతో కూడుకున్న పని
బాబిన్‌ని చూడగానే నా కళ్ళ ముందు 55 ఏళ్ళ గంగా బెన్ పర్మార్ చిత్రం కదలాడింది. “మేం ముందుగా ఒక పెద్ద చెక్క పంటెకోల (స్పూల్) పైకి నూలుకండెను తీసుకుంటాం, అక్కడ నుండి దానిని ఒక రాట్నం సహాయంతో ఒక బాబిన్‌కి తీసుకుంటాం. రాట్నం లేకుండా మీరు బాబిన్‌కు చుట్టలేరు,” అని లీంబడీలోని ఘాఘరేటియా గ్రామంలో ఉన్న తన ఇంటిలో ఒక చీరపై పని చేస్తున్నప్పుడు చెప్పారామె.
"ఎక్కడికెళ్ళిపోయారు?" రేఖా బెన్ స్వరం నన్ను మళ్ళీ పటోలా దారాల గురించిన చర్చ వద్దకు తీసుకువచ్చింది. ఆ క్లిష్టమైన ప్రక్రియ గురించి ఆ రోజు ఆమె నాకు వివరించటం ఇది ఎన్నోసారో! "రాయండి," నా నోట్‌బుక్‌పైనే తన దృష్టిని పెట్టిన ఆమె ఆదేశించారు. నేను ఈ ప్రక్రియను పూర్తిగా అర్థం చేసుకున్నానని నిర్ధారించుకోవడం కోసం ఆమె కొంతసేపు తన పనిని ఆపేస్తున్నారు.
నేను దశల ప్రక్రియను రాస్తున్నాను. డజను కంటే ఎక్కువ దశలతో, చాలా క్లిష్టంగా ఉండే ఈ ప్రక్రియ వారాల తరబడి కొనసాగుతుంది, నేతరి ఒక్కరే కాకుండా అనేకమంది కార్మికులు ఇందులో పాల్గొంటారు. పట్టు నూలుకండెతో మొదలై, చివరి దారం 252-అంగుళాల పొడవుండే పటోలా చీర నేతలోకి వెళ్ళడంతో ముగిసే ఈ ప్రక్రియ ఆరు నెలల శ్రమతో కూడుకున్న పని.
"ఏ దశలోనైనా ఒక్క చిన్న తప్పు జరిగినా కూడా అది పటోలు ను పాడుచేస్తుంది," నిశ్చయంగా ప్రకటించారామె.

పట్టు దారాన్ని కండె నుండి పెద్ద చెక్క పంటెకోల పైకి తీసుకువెళుతోన్న ఘాఘరేటియా గ్రామానికి చెందిన 55 ఏళ్ళ గంగాబెన్ పర్మార్. అక్కడ నుండి దారాన్ని ఆమె ఒక రాట్నం సహాయంతో బాబిన్‌లోకి తీసుకువెళ్తారు. 'ముప్పై ఏళ్ళుగా ఈ పనిచేస్తున్నాను. ఈ మధ్య నాకు కంటిచూపులో కొంత ఇబ్బందిగా ఉంటోంది. కానీ నేను ఒక రోజంతా ఇక్కడే కూర్చుంటే మాత్రం 20 లేదా 25 బాబిన్‌లు చుట్టగలను’

తర్వాతి దశ కోసం పాటీ (దారాల సమూహం)ని సిద్ధం చేసేందుకు బాబిన్‌ల నుండి నూలు దారాలను ఆడా అని పిలిచే కొయ్య చీలలున్న పెద్ద చెక్క చట్రంపై సాగదీస్తోన్న మోటా టింబ్లాకు చెందిన గౌతమ్ భాయ్ వాఘేలా

డిజైన్ తయారీకి ముందు సరైన క్లస్టర్లుగా ఏర్పరచడానికి ఆడాపై పరచివున్న పట్టు దారాలు

వేరు చేసిన దారపు క్లస్టర్లను మరొక చట్రంపైకి బదిలీ చేస్తోన్న నానా టింబ్లా గ్రామానికి చెందిన అశోక్ పర్మార్ (30). అక్కడ వాటిని మొదట బొగ్గుతో గుర్తించి, ఆపైన కాగితంపై అప్పటికే రూపొందించివున్న డిజైన్ ప్రకారం కట్టాలి

చట్రంపై పరచివున్న దారాలను గాఠ్ (ముడులు) వేస్తోన్న కటారియా గ్రామానికి చెందిన కిశోర్ మంజీ భాయ్ గోహిల్ (36). ఇందులో గుత్తిగా ఉన్న పట్టుదారాలను నూలు దారంతో కడతారు. ఇది పటోలా తయారీలో ఉపయోగించే రెసిస్ట్-డైయింగ్ పద్ధతి. అద్దకంవేసే ప్రక్రియలో ఈ ముడులు దారం కట్టివున్న భాగాలకు రంగు అంటకుండా చేసి, దారంపై డిజైన్ వచ్చేలా చేస్తాయి

ఇంతకుముందు అద్దకం వేసిన దారపు గుత్తులకు మళ్ళీ ముడులువేసి రెండవసారి అద్దకం వేసేందుకు తీసుకువెళ్తోన్న మహేంద్ర వాఘేలా (25). పటోలులో ఉపయోగించే డిజైన్, రంగులను బట్టి పటోలా నేతలో దారాలను ముడులువేసి, అద్దకం వేసే ప్రక్రియలు అనేకసార్లు కొనసాగుతాయి

అప్పటికే ముడులు వేసి, అద్దకం వేసిన దారాలను హైడ్రో కలిపిన మరుగుతోన్న నీటిలో నానబెడుతోన్న మహేంద్ర వాఘేలా. 'అప్పటికే రంగు అద్దిన దారాలకు ఒక కొత్త రంగును అద్దాలంటే, ఆ దారపు గుత్తులను హైడ్రో (సోడియం హైడ్రో సల్ఫైట్) కలిపిన మరుగుతోన్న నీటిలో నానబెట్టి అంతకుముందు అద్దిన రంగులను తొలగించడమో, పలుచన చేయటమో చేయాలి,' అంటారు రేఖా బెన్

'అద్దకం వేసేటప్పుడు ఆ రంగు ముడులలోకి రాకుండా జాగ్రత్తపడాలి,' అని మహేంద్ర వాఘేలా రెండవసారి అద్దకం వేయటం కోసం ఆవిరిచిమ్ముతోన్న నీటిబకెట్‌లో నూలును ముంచుతూ వివరించాడు. 'ముడులలోకి రంగు ఎప్పుడు చేరుతుందో, ద్రావణాన్ని ఎప్పుడు కదిలించాలో, తదనుగుణంగా నూలును నీటిలో ఎంతసేపు ముంచాలో ఒక కార్మికుడికి అనుభవం ద్వారా తెలుస్తుంది,' అని ఆయన చెప్పాడు

అద్దకం వేసిన నూలును చల్లని నీటిలో ముంచి కడుగుతోన్న మహేంద్ర. 'పటోలులోని ప్రతి ఒక్క పట్టు దారంలోనూ అనేక రంగులు ఉంటాయి, ఈ రంగుల వలన డిజైన్ అందంగా కనిపిస్తుంది. రంగుల సమ్మేళనం చాలా ముఖ్యం. అవి కంటికి నదరుగా ఉండాలి," అన్నారు నేతకారుడు విక్రమ్ భాయ్ పర్మార్

అద్దకం వేసిన తర్వాత రంగుల నూలు నుంచి నీటిని కారిపోనిచ్చి, ఆరబెడతారు. దారపు ముడులను తొలగించడానికి అద్దకం వేసిన నూలును ఒక చిన్న కొయ్య చట్రం మీదకు తీసుకున్న కటారియా గ్రామానికి చెందిన జగదీశ్ రఘు భాయ్ గోహిల్

ఒక చిన్న సూదిని ఉపయోగించి ముడులను విప్పుతోన్న మోటా టింబ్లా గ్రామానికి చెందిన 75 ఏళ్ళ వాలి బెన్ వాఘేలా. ఒక్క పటోలును తయారుచేయాలంటే, నమూనాలోని సంక్లిష్టతను బట్టి ముడులు వేయటం, రంగువేయటం, అద్దకం వేయటం, ముడులు విప్పటం- ఈ ప్రక్రియలన్నీ అనేకసార్లు చేయాల్సివుంటుంది

డిజైన్‌తో సహా తయారైన పడుగు దారాలను ఒక పెద్ద కొయ్య పంటెకోలకు (స్పూల్) చుడుతోన్న జసూ బెన్ వాఘేలా

ఇప్పుడు సిద్ధంగా ఉన్న పడుగు దారాలను మరింత పెద్ద కొయ్య పంటెకోలకు చుడుతోన్న 58 ఏళ్ళ సంతు బెన్ రఘు భాయ్ గోహిల్

బాబిన్‌కు చుట్టేందుకు పంటెకోల నుంచి రంగు వేసిన దారాలను తీస్తున్న కటారియా గ్రామానికి చెందిన హీరా బెన్ గోహిల్ (56). పటోలాను నేసేటప్పుడు సిద్ధంచేసిన బాబిన్లను ఒక నాడెలో అమర్చుతారు

రంగువేసిన నూలును సాగదీసి కడుతోన్న మోటా టింబ్లా గ్రామ నేతకారులు. డబుల్ ఇక్కత్ పటోలాలో పడుగు, పేక దారాలు రెండింటికీ రంగు వేస్తారు, డిజైన్ కూడా ఉంటుంది. అందుకని, నమూనాతో సహా సిద్ధంగా ఉన్న నూలును వీధిలో పాతిన రెండు స్తంభాలకు సాగలాగి కడతారు

సాగలాగి కట్టిన పడుగు దారాలను బలంగా చేయటానికి గంజిపెడుతోన్న మోటా టింబ్లా గ్రామ నేతకారులు

హెడిల్ నుంచి బయటకు వస్తోన్న పాత దారాలతో గంజిపెట్టిన కొత్త దారాలను కలుపుతోన్న మోటా టింబ్లా గ్రామానికి చెందిన వసరమ్ భాయ్ సోలంకి. 'పట్టు దారాలను కలపటానికి బూడిదను ఉపయోగిస్తారు,' అని ఆయన చెప్పారు

రంగువేసిన నూలు ఉన్న దండెను మగ్గంపై ఉంచి, పడుగు దారాలున్న మగ్గాన్ని కొడుతోన్న పుంజా భాయ్ వాఘేలా

కటారియా గ్రామంలో సింగిల్ ఇక్కత్ పటోలాను నేస్తోన్న ప్రవీణ్ భాయ్ గోహిల్ (50), ప్రెమిలా బెన్ గోహిల్ (45). టేకు కర్రతో చేసిన మగ్గం ఒక్కదాని ఖరీదు రూ. 35-40,000 వరకూ ఉంటుంది. ప్రతి నేతరికి దానిని కొనే స్తోమత ఉండదు

కటారియాలో దళిత సముదాయానికి మొదటిసారిగా పటోలా నేతను పరిచయం చేసినవారిలో ఒకరైన దానా భాయ్ దులేరా

సింగిల్ ఇక్కత్ పటోలును నేస్తోన్న అశోక్ వాఘేలా

డబుల్ ఇక్కత్ చీరను నేస్తోన్న మోటా టింబ్లాకు చెందిన భావేశ్ కుమార్ సోలంకి

పడుగుదారాలు మాత్రమే డిజైన్ కలిగి ఉండే సింగిల్ ఇక్కత్ పటోలాలా కాకుండా డబుల్ ఇక్కత్‌లో పడుగు, పేక రెండింటికీ డిజైన్ ఉంటుంది

చేతితో నేసిన పట్టు వస్త్రాలైన పటోలా, తరచుగా చీరలు, వాటి జటిలమైన
డబుల్ ఇక్కత్ నేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి
అనువాదం: సుధామయి సత్తెనపల్లి