" ఆవో ఆవో సునో అప్నా భవిష్యవాణి, సునో అప్నీ ఆగే కీ కహానీ... " జుహూ బీచ్‌లో ఆ సాయంత్రపు గందరగోళం మధ్య అతని గొంతు ఒక మార్మిక శ్లోకంలా ప్రతిధ్వనిస్తోంది. ముంబై శివారు ప్రాంతంలో సూర్యాస్తమయ నేపథ్యంలో సందడిగా ఉన్న ఈ బీచ్‌లో సుమారు 27 ఏళ్ల వయసున్న ఉదయ్ కుమార్, కొన్ని భవిష్యవచనాలను వినమని ప్రజలను ఆహ్వానిస్తున్నాడు.
అతను స్వయానా జ్యోతిష్కుడు కాదు, హస్తసాముద్రికుడు కాదు, రామ చిలుకతో కార్డులు తీయించి జోస్యం చెప్పేవాడు కూడా కాదు. అతనిక్కడ నాలుగు అడుగుల ఎత్తున్న మడతబల్ల మీద ఉన్న ఒక నిగూఢమైన నల్ల పెట్టెపై కూర్చొని ఉన్న రోబోతో నిలబడి ఉన్నాడు. చిన్నగా, సుమారు అడుగు పొడవున్న ఆ రోబోకు అలంకరణ లైట్లు చుట్టివున్నాయి. "దీన్ని జ్యోతిష్ కంప్యూటర్ లైవ్ స్టోరీ" అంటారని ఆ రోబోను ఈ రిపోర్టర్‌కు పరిచయం చేశాడు ఉదయ్.
ఆ పరికరం (గిజ్మో) ఒక వ్యక్తిలో చెలరేగే ప్రకంపనలను విశ్లేషించగలదని, యంత్రానికి సంధించి ఉన్న హెడ్‌ఫోన్‌లను తన వద్దకు వచ్చిన ఆసక్తిగల కస్టమర్‌కు అందజేస్తూ అతను వివరించాడు. కొద్దిసేపు విరామం తర్వాత, హిందీలో మాట్లాడే ఒక స్త్రీ స్వరం భవిష్యత్తులోని రహస్యాలను విప్పుతుంది. ఇదంతా కూడా 30 రూపాయలకే.
కొన్ని దశాబ్దాల క్రితం బిహార్‌లోని గెంధా అనే కుగ్రామం నుండి ముంబైకి వచ్చిన తన చిన్నాన్న రామ్ చందర్ నుండి వారసత్వంగా పొందిన ఈ సాంకేతిక అద్భుతానికి ఉదయ్ ఏకైక సంరక్షకుడు. రామ్ చందర్‌ను నగరంలో రాజు అని పిలిచేవారు. అతని చిన్నాన్న గ్రామంలోని ఇంటికి తిరిగివచ్చిన ప్రతిసారీ తనతో పాటు నగరానికి చెందిన కథలను తీసుకువచ్చేవారు. “తన వద్ద భవిష్యత్తును చెప్పగల అజూబా [ఒక వింత వస్తువు] ఉందని, ఆ విధంగానే తాను డబ్బు సంపాదిస్తున్నాడని చాచా [చిన్నాన్న] మాకు చెప్పేవాడు. ఇదేదో హాస్యానికి చెప్తున్నాడని చాలామంది నవ్వేవారు. నేను మాత్రం అబ్బురపడ్డాను!” గుర్తుచేసుకున్నాడు ఉదయ్. 11 ఏళ్ళ తన అన్న కొడుక్కు రాజు నగర జీవితంలోని అద్భుతాలతో పాటు యంత్రం గురించి కూడా పరిచయం చేశారు.


'జ్యోతిష్ కంప్యూటర్ లైవ్ స్టోరీ' అని తాను పిలుచుకునే భవిష్యత్తు చెప్పే రోబోతో బీచ్‌లో ఉన్న ఉదయ్ కుమార్
ఉదయ్ తల్లిదండ్రులు తమకున్న కొద్దిపాటి బిఘాల భూమిలో కష్టపడి పనిచేసే రైతులు. తరచుగా వచ్చిపడే ఆర్థిక ఇబ్బందుల వలన ఉదయ్ 4వ తరగతిలోనే తన చదువును వదిలేయాల్సివచ్చింది. బిహార్‌లోని వైశాలి జిల్లాలో ఉన్న తన గ్రామాన్ని వదిలి, ముంబై నగరంలో ఉన్న చిన్నాన్న రాజు వద్దకు చేరటంలో ఉదయ్‌కు తన కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలనే ఆలోచన కూడా ఉంది. ఉదయ్ అప్పటికి యుక్తవయస్సుకు కూడా రాలేదు. “ వో మెషీన్ దేఖ్నా థా ఔర్ ముంబై భీ [యంత్రాన్ని చూడాలనుకున్నాను, అలాగే ముంబైని కూడా]!” ఉదయ్ ఇంటిధ్యాసతో ఉన్నట్టుగా అన్నాడు.
తన చిన్నాన్న ఉపయోగించిన యంత్రాన్ని చెన్నై, కేరళలకు చెందిన కళాకారులు రూపొందించారనీ, 90వ దశకం చివరిలో అది ముంబైలోకి రంగప్రవేశం చేసిందనీ ఉదయ్ గుర్తుచేసుకున్నాడు. రాజు చాచా ఒక కళాకారుడిని కలిసి, వ్యాపారంలో ఒక చెయ్యివేసి చూద్దామని ఒక యంత్రాన్ని అతని వద్ద నుండి అద్దెకు తీసుకున్నారు.
"ఈ పనిలో సుమారు 20-25 మంది వరకూ ఉన్నారు," అన్నాడు ఉదయ్. "వారిలో ఎక్కువమంది దక్షిణాది రాష్ట్రాల నుంచి, కొద్దిమంది బిహార్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చినవారు. వాళ్ళందరి దగ్గరా ఇదే రకమైన యంత్రాలు ఉన్నాయి."
రాజులాగే వారంతా ఈ ఆసక్తికరమైన పరికరాలతో నగరంలో తిరుగుతారు, ఈ సంచారులకు జుహు బీచ్ ఒక ప్రత్యేక స్థానం. ఉదయ్ నగరమంతా తిరుగాడే తన బాబాయితో కలిసి తానూ తిరిగేవాడు. అతని బాబాయి సంపాదనలో నాలుగవ వంతు యంత్రానికి అద్దె చెల్లించడానికి వెళ్ళేది. ఉదయ్ చిన్నాన్న రాజు తన వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు ఈ యంత్రం కొనాలంటే చాలా ఖరీదుగా, దాదాపు రూ. 40,000, ఉండేది. కానీ చివరకు ఆయన దానిని కొనగలిగారు.


ఉదయ్ తన ఆసక్తికరమైన పరికరంతో ముంబై అంతా చుట్టబెడుతునప్పటికీ, జుహు బీచ్ మాత్రం అతనికి చాలా ప్రత్యేకమైన ప్రదేశం
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ రోబోని తయారుచేసే కిటుకులేవీ ఉదయ్ నేర్చుకోలేకపోయాడు. చాలా ఏళ్ళ క్రిందట రాజు మరణించాక మాత్రమే అదృష్టాన్ని తెలియచెప్పే ఈ రోబోకు అతను వారసుడయ్యాడు. ఒకప్పుడు తన ఊహలను వశంచేసుకున్న ఆచారాన్ని తానిప్పుడు ముందుకు తీసుకెళ్తున్నట్లు ఉదయ్ భావించాడు.
దశాబ్దం క్రితం ప్రజలు విధి తమకోసం ఏం నిర్ణయించిందో చూడడానికి రూ. 20 చెల్లించేవారు. గత నాలుగేళ్ళలో అది రూ. 30కి పెరిగింది. కోవిడ్-19 ప్రబలటం అతని వ్యాపారాన్ని దెబ్బతీసింది. "కాలక్రమేణా చాలామంది ఈ వ్యాపారాన్ని విడిచిపెట్టారు," అని ఉదయ్ చెప్పాడు. కోవిడ్ తర్వాత ఈ మహత్తర అవశేషానికి అతను మాత్రమే సంరక్షకుడిగా మిగిలాడు.
ఉదయ్‌కు కూడా యంత్రం ద్వారా సంపాదించే సంపాదనతోనే జీవించడం కష్టంగా ఉంది. అతని భార్య, ఐదేళ్ళ కుమారుడు గ్రామంలో నివసిస్తున్నారు. అతను తన కొడుకును ముంబైలో చదివించాలని ఆశపడుతున్నాడు. ఉదయంపూట అతను వివిధ రకాల ఉద్యోగాలు చేస్తాడు - గుమస్తా పనులు, కరపత్రాలు అమ్మడం వంటివి కూడా. ఏ పని దొరికినా చేయడానికతను సిద్ధంగా ఉంటాడు. "నాకు పొద్దుటిపూట ఎలాంటి పనీ దొరకనప్పుడు, ఈ రోబోతో ఇక్కడ నిలబడి కొంత డబ్బు సంపాదించగలను, దానిని నా కుటుంబానికి పంపగలను," అని అతను చెప్పాడు.
ఉదయ్ జుహు బీచ్ తీరాన సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకూ నిలబడి ఉంటాడు. మరెక్కడైనా నిల్చుంటే జరిమానాలు పడతాయేమోనని అతను భయపడతాడు. యంత్రాన్ని మోసుకెళ్ళటం కూడా కష్టమవుతుంది. దివ్య సందేశాలను డీకోడ్ చేయడానికి వారాంతాలు అతనికి ఉత్తమమైన రోజులు. ఎందుకంటే, ఆ రోజుల్లో సాధారణం కంటే ఎక్కువమంది ఆసక్తి కలిగిన అన్వేషకులు వస్తారు. ఆ రోజుల్లో అతని సంపాదన రూ.300 - రూ. 500 వరకు ఉంటుంది. ఈ మొత్తమంతా కలిపి నెలకు రూ. 7,000-10,000 అవుతుంది.


ఉదయ్ కుమార్ ఆ యంత్రాన్ని తన చిన్నాన్న నుండి వారసత్వంగా పొందాడు. అతనింకా యుక్తవయసుకు రాకముందే ముబై నగరపు ఆకర్షణ, ఆ యంత్రం అతన్ని ఈ నగరానికి రప్పించాయి
"గ్రామాల్లో జనం జ్యోతిష్కుల్ని నమ్ముతారు గానీ యంత్రాలను నమ్మరు, అందుకని అక్కడ సంపాదన ఉండదు," తన గ్రామానికి చెందిన సాటి బిహారీలకు ఈ యంత్రం మార్మిక శక్తిపై విశ్వాసం కలిగించాలని తాను చేసిన ప్రయోగాలు విఫలమవటం గురించి ఉదయ్ చెప్పాడు. అయితే అదృష్టాన్ని చెప్పే ఈ ఉపకరణం ముఖ్యంగా వినోదాన్ని కలిగిస్తుంది. బీచ్‌లో ప్రజలు దీన్ని సందేహంగా చూసినప్పటికీ, ముంబై తన వ్యాపారానికి తగిన ప్రదేశం అని అతను చెప్పుకొచ్చాడు.
“కొంతమందికి అది తమాషాగా అనిపించి నవ్వుతారు; కొందరు అదిరిపడతారు. ఇటీవల ఒక వ్యక్తి తన స్నేహితుడు దానిని వినమని బలవంతపెట్టడంతో నమ్మకం లేక ముందు నవ్వాడు గానీ ఆ తరువాత ఇది అతనికి నచ్చింది. తాను పొట్టలో సమస్యతో బాధపడుతున్నట్టు రోబోకు తెలుసునని, పెద్దగా ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పిందని అతను నాతో చెప్పాడు. నిజంగానే తనకు పొట్ట సంబంధిత సమస్యలు ఉన్నాయని అతనన్నాడు. అలా నేను ఇలాంటివారిని చాలామందినే కలిశాను," అని ఉదయ్ చెప్పాడు. “నమ్మాలనుకునే వారు నమ్మొచ్చు."
"యంత్రం ఎన్నడూ తడబడదు," ఈ విషయంలో ఉదయ్ దాని మార్మికమైన లాఘవం గురించి గర్వంగా చెప్పుకొన్నాడు.
ఎప్పుడైనా అది పనిచేయడం ఆగిపోయిందా?
అలాంటిదేదైనా జరిగినప్పుడు దాని చుట్టూ ఉన్న వైరింగును సరిచేసే మెకానిక్ ఉన్నాడని ఉదయ్ చెప్పాడు.
"అది చెప్పేదాన్ని నేను నమ్ముతాను. నా పనిలో కొనసాగటానికి అవసరమైన ఆశను అది నాకు ఇస్తుంది," అన్నాడు ఉదయ్. కానీ ఆ భవిష్యవాణి తన సొంత జీవితం గురించి ఏం చెప్పిందో చెప్పడానికి మాత్రం అతను ఇష్టపడలేదు. "ఇందులో ఏదో ఇంద్రజాలం ఉంది, ఆ యంత్రం నా గురించి చెప్పేదానికి నేనింకా అబ్బురపడుతున్నాను. ఇదంతా నమ్మమని నేను మీకు చెప్పను. మీరే విని నిర్ణయించుకోండి," నవ్వుతూ చెప్పాడతను.

ఎక్కువమంది సందేహంగా చూసేదే అయినప్పటికీ, ఈ భవిష్యవాణి యంత్రం జనాలకు వినోదాన్ని కలిగించే ఒక సాధనం

'గ్రామంలో ప్రజలు జ్యోతిష్కుల్ని నమ్ముతారు కానీ యంత్రాలను నమ్మరు, అందుకే అక్కడ మంచి సంపాదన ఉండదు,' అంటాడు ఉదయ్. అతని వ్యాపారానికి ముంబై సరైన చోటని అతని భావన

కొంతమందికి అది చెప్పేది తమాషాగా అనిపించి నవ్వేస్తారు; మరికొంతమంది అదిరిపడతారని ఉదయ్ అంటాడు, కానీ యంత్రం ఎప్పుడూ తప్పు చెప్పదు

అతను బతకటానికి ఈ యంత్రం ఒక్కటే సాయం కాదు. ఉదయ్ పొద్దుటిపూట రకరకాల పనులు చేస్తాడు, కానీ సాయంత్రానికల్లా తన రోబోతో బీచ్‌లో ఉంటాడు

రూ. 30 చెల్లించి తన భవిష్యత్తును తెలుసుకుంటోన్న ఒక కస్టమర్

కోవిడ్-19 ప్రబలిన కాలంలో అతని వ్యాపారం చాలా దెబ్బతింది. అయినా, ఆ తర్వాతి నుంచి అతను తన వ్యాపారాన్ని కొనసాగించాడు

యంత్రం తన గురించి చెప్పినదానికి ఉదయ్ అబ్బురపడతాడు. 'అది చెప్పినదాన్లో నాకు నమ్మకముంది,' అంటాడతను
అనువాదం: సుధామయి సత్తెనపల్లి