ఉత్తర తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా తీరప్రాంతంలో ఉన్న గ్రామాల సరిహద్దులను కన్నిసామి కాపలా కాస్తుంటాడు. మత్స్యకార సముదాయాల సంరక్షకుడైన ఈ దేవుడు సాధారణంగా ఈ వర్గానికి చెందిన వ్యక్తిలానే కనిపిస్తాడు: మెరిసిపోయే రంగు రంగుల చొక్కాలు, వేట్టి (ధోవతి లేదా పంచె) ధరించి, తలపై టోపీ కూడా పెట్టుకొని ఉంటాడు. సముద్రంలోకి ప్రవేశించే ముందు తాము క్షేమంగా తిరిగి రావాలని మత్స్యకారులు ఆయనకు ప్రార్థనలు చేస్తారు.
మత్స్యకార కుటుంబాలు కన్నిసామిని వేర్వేరు రూపాలలో పూజిస్తారు. అంతేకాకుండా, ఇలా పూజించడం ఉత్తర చెన్నై నుండి పళవేర్కాడు (ప్రళయకావేరి లేదా పులికా ట్‌గా ప్రసిద్ధి చెందింది) వరకు అనుసరిస్తూ వస్తోన్న ఒక ప్రసిద్ధ ఆచారం.
ఎణ్ణూర్ కుప్పం మత్స్యకారులు కన్నిసామి విగ్రహాలను కొనుగోలు చేసేందుకు దాదాపు ఏడు కిలోమీటర్ల దూరంలోని అత్తిపట్టుకు వెళ్తారు. జూన్‌లో జరిగే ఈ వార్షిక పండుగ వేడుక ఒక వారం పాటు కొనసాగుతుంది. నేను 2019లో ఈ గ్రామానికి చెందిన మత్స్యకారుల బృందంతో యాత్రకు వెళ్ళాను. మేం ఉత్తర చెన్నైలోని థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో ఉన్న కొసస్థలైయ్యార్ నది ఒడ్డున దిగి, అత్తిపట్టు గ్రామం వైపుకి నడిచాం.
మేం రెండు అంతస్తులున్న ఒక ఇంటికి చేరుకున్నాం, అక్కడ అనేక కన్నిసామి విగ్రహాలు నేలపై పెట్టి ఉన్నాయి. విగ్రహాలను తెల్లటి గుడ్డతో చుట్టి ఉంచారు. 40 ఏళ్ళు దాటిన ఒక వ్యక్తి, తెల్లటి చారల చొక్కా, వేట్టి ని ధరించి, తన నుదుటిపైన తిరునీర్ [విభూతి] పూసుకుని, కర్పూరం వెలిగించి విగ్రహాల ముందు నిలబడి ఉన్నారు. ప్రతి మత్స్యకారుని భుజాలపై ఒక విగ్రహం పెట్టే ముందు అతను ఆ విగ్రహానికి పూజై (పూజ) చేస్తారు.

ఉత్తర తమిళనాడు తీరం వెంబడి మత్స్యకార సంఘాలు ఆరాధించే కన్నిసామి విగ్రహాలను తయారుచేసే డిల్లీ అన్న
డిల్లీ అన్న తో అదే నా మొదటి సమావేశం, అతనితో మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదనిపించి, విగ్రహాలను తమ భుజాలపై మోసుకుంటూ తిరిగి వెళ్తున్న జాలరులతో పాటు తిరిగివచ్చాను. అక్కడి నుండి కొసస్థలైయ్యార్ నదికి నాలుగు కిలోమీటర్ల దూరం. ఆపైన ఎణ్ణూర్ కుప్పంకి తిరిగి వెళ్ళడానికి మూడు కిలోమీటర్ల దూరం పడవ ప్రయాణం చేయాలి.
గ్రామానికి చేరుకున్న తర్వాత, మత్స్యకారులు ఆ విగ్రహాలను ఒక దేవాలయం దగ్గర వరుసగా పేర్చుతారు. ఆచార సంబంధమైన, పూజకు కావాల్సిన సామగ్రినంతా ఆ విగ్రహాల ముందు ఉంచుతారు. సాయంత్రం చీకటి పడేసమయానికి డిల్లీ అన్న కుప్పం చేరుకుంటారు. గ్రామస్థులంతా విగ్రహాల చుట్టూ చేరడం ప్రారంభిస్తారు. డిల్లీ అన్న విగ్రహాలపై కప్పి ఉంచిన తెల్లటి గుడ్డను తీసి, ప్రతీకాత్మకంగా ఈ విగ్రహాల కళ్ళు తెరుచుకున్నట్లుగా, మై [కాటుక] ఉపయోగించి కన్నిసామి కనుపాపలను దిద్దుతారు. అప్పుడతను, ఒక కోడిపుంజు మెడను కొరుకుతారు. ఇది ఒక బలిని సమర్పించే విధానం. ఇలా చేయడం వలన అరిష్టం తొలిగిపోతుందని ఆ గ్రామస్థులు నమ్ముతారు.
ఈ ఆచారాన్ని పాటిస్తూ కన్నిసామి విగ్రహాలను గ్రామం శివార్ల వరకు తీసుకెళ్తారు.
ఎణ్ణూర్ తీరం, మడ అడవుల ప్రాంతమంతా నాకు ఇలాటి చాలామంది వ్యక్తులను పరిచయం చేసింది, వారిలో డిల్లీ అన్న ఒక ముఖ్యమైన వ్యక్తి. ఆయన తన జీవితాన్నంతా కన్నిసామి విగ్రహాల తయారీకే అంకితం చేశారు. నేను 2023, మే నెలలో డిల్లీ అన్న ను తిరిగి కలుసుకోవడానికి అత్తిపట్టులో ఉన్న అతని ఇంటికి వెళ్ళినప్పుడు, అతని ఇంట్లో నాకు ఏ విధమయిన గృహోపకరణాలు గానీ, బీరువాలో ఎటువంటి అలంకార వస్తువులు గానీ కనిపించలేదు. కుప్పలు కుప్పలుగా మట్టి, గడ్డిపొట్టు, విగ్రహాలు మాత్రమే ఉన్నాయి; ఆ ఇల్లంతా కమ్మని మట్టి వాసనతో నిండిపోయివుంది.
కన్నిసామి విగ్రహాన్ని తయారుచేయడానికి ముందుగా ఆ గ్రామ సరిహద్దు నుంచి తీసిన ఒక గుప్పెడంత మన్నును ఈ బంకమట్టితో కలపాలి. "ఇలా చేస్తే ఆ గ్రామానికి దైవశక్తి చేకూరుతుందని ఆ గ్రామస్థుల నమ్మకం," అన్నారు 44 ఏళ్ళ డిల్లీ అన్న . “తరతరాలుగా నా కుటుంబమే కన్నిసామి విగ్రహాలను తయారుచేస్తున్నది. మా నాన్న బతికున్న రోజుల్లో నాకెప్పుడూ ఈ విగ్రహాల తయారీ మీద ఆసక్తి ఉండేది కాదు. 2011లో మా నాన్న చనిపోయాడు. అప్పుడు, మా నాన్న తర్వాత నేనే ఆ బాధ్యత చేపట్టాలని అందరూ అన్నారు... నేనీ విగ్రహాలను చేయడానికి అదే కారణం. ఈ పని చేసేవాళ్ళు ఇక్కడ మరెవరూ లేరు.”

తిరువళ్ళూరు జిల్లా అత్తిపట్టు గ్రామంలోని డిల్లీ అన్న ఇల్లంతా ఈ విగ్రహాల తయారీకి ఉపయోగించే ముడిపదార్థమైన బంకమట్టి కమ్మని వాసనతో నిండివుంటుంది


కన్నిసామి విగ్రహాలను తయారుచేయడానికి డిల్లీ అన్న ఉపయోగించే బంకమట్టి (ఎడమ), గడ్డిపొట్టు (కుడి). ఈ రెండు ముడి పదార్థాలు స్థానికంగా అందుబాటులో ఉంటాయి, కానీ ఇప్పుడు చుట్టూ వస్తున్న మార్పుల వలన వీటిని సేకరించడం కష్టమవుతున్నది
రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తూ డిల్లీ అన్న , 10 రోజుల్లో ఒకేసారి 10 విగ్రహాలను సిద్ధం చేయగలరు. ఒక సంవత్సరంలో అతను దాదాపు 90 విగ్రహాలను తయారుచేస్తారు. “ఒక విగ్రహం తయారుచేయడానికి నాకు 10 రోజుల పని పడుతుంది. ముందుగా గడ్డలుగా ఉండే మట్టిని నలగగొడతాం. ఆ తర్వాత రాళ్ళను తీసి శుభ్రం చేసి, అందులో ఇసుకనూ గడ్డిపొట్టునూ కలపాలి,” డిల్లీ అన్న వివరించారు. విగ్రహం నిర్మాణం గట్టిగా ఉండటానికి గడ్డిపొట్టు ఉపయోగపడుతుంది. ఈ మిశ్రమాన్ని పొరలుపొరలుగా వేసి విగ్రహాలను తయారుచేస్తారు.
“విగ్రహాన్ని తయారుచేయడం మొదలుపెట్టినప్పటి నుండి అది పూర్తయ్యే వరకు, నేను ఒక్కడినే పనిచేస్తాను. ఎవరైనా సహాయకుడిని పెట్టుకోవాలంటే, అతనికి ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు,” అన్నారతను. “ఈ పని మొత్తం ఎండ తగలకుండా నీడలో చేయాలి, లేకపోతే బంకమట్టి అంటుకోదు, విరిగిపోతుంది. విగ్రహాలు సిద్ధం అయిన తరువాత, వాటిని ఆవంలో కాల్చాలి. ఈ పని పూర్తికావడానికి కనీసం 18 రోజులు పడుతుంది.”
అత్తిపట్టు చుట్టుపక్కల ముఖ్యమయిన గ్రామాలయిన ఎణ్ణూర్ కుప్పం, మఖద్వార కుప్పం, తాళాంగుప్పం, కాట్టుకుప్పం, మేట్టుకుప్పం, పాల్‌తొట్టికుప్పం, చిన్నకుప్పం, పెరియకుళం గ్రామాలకు డిల్లీ అన్న ఈ విగ్రహాలను సరఫరా చేస్తారు.
పండుగల సమయంలో, ఈ గ్రామాల ప్రజలు కన్నిసామి విగ్రహాలను తమ గ్రామ సరిహద్దుల్లో నైవేద్యంగా పెడతారు. కొందరు మగ కన్నిసామి విగ్రహాన్ని కోరుకుంటే, మరికొందరు పాప్పాత్తి అమ్మన్, బొమ్మాత్తి అమ్మన్, పిచ్చై అమ్మన్ వంటి వివిధ పేర్లతో పిలవబడే స్త్రీ దేవతలను సమర్పించేందుకు ఇష్టపడతారు. వారు తమ గ్రామ దేవతను గుర్రం లేదా ఏనుగు వాహనం పైన ఎక్కించడాన్ని, కుక్క విగ్రహం పక్కనే ఉంచటానికి ఇష్టపడతారు. దేవతలు రాత్రి సమయంలో వచ్చి ఆడుకుంటారని, మరుసటి రోజు ఉదయం గ్రామ దేవత పాదాలపై పగుళ్ళు కూడా కనిపిస్తాయని ఆ గ్రామస్థులు నమ్ముతారు.
“కొన్ని ప్రదేశాలలో, వాళ్ళు [జాలర్లు] ప్రతి సంవత్సరం కన్నిసామి పాత విగ్రహాల స్థానంలో కొత్తవిగ్రహాలను భర్తీచేస్తుంటారు. మరికొన్ని ఇతర ప్రాంతాలలో వారు [మత్స్యకారులు] రెండు సంవత్సరాలకు ఒకసారి లేదా నాలుగు సంవత్సరాలకు ఒకసారి వాటిని మారుస్తుంటారు,” అని డిల్లీ అన్న చెప్పారు.

విగ్రహాల తయారీ కోసం బంకమట్టిని సిద్ధం చేస్తోన్న డిల్లీ అన్న. ‘తరతరాలుగా మా కుటుంబమే కన్నిసామి విగ్రహాలను తయారుచేస్తోంది’


అనేక తరాలుగా కుటుంబంలో ఉన్న ఒక రోకలిని (ఎడమ) ఉపయోగించి మట్టితో విగ్రహం కాళ్ళ ఆకారాన్ని రూపొందిస్తారు. ఆ మట్టి కాళ్ళను నీడలో (కుడి) ఆరబెడతారు
ఈ గ్రామాలకు చెందిన మత్స్యకారులకు ఈ విగ్రహాలను అమ్మడం ఆగిపోవడమో లేక అమ్మకాలు తగ్గిపోవడమో లేకపోయినా, గత మూడు దశాబ్దాలుగా తాను సాగిస్తోన్న ఈ సంప్రదాయ వృత్తిని ముందు ముందు ఎవరు కొనసాగిస్తారో అన్న సందేహం డిల్లీ అన్న కు ఉంది. ఇది ఆయనకు చాలా ఖరీదైన పనిగా మారిపోయింది: “ఈ రోజుల్లో, ఖర్చులు బాగా పెరిగిపోయాయి... నేను పెట్టిన ఖర్చు ఆధారంగా [విగ్రహం] ధరను చెబితే, వాళ్ళు [కొనేవాళ్ళు] నన్ను ఎందుకు అంత ఖరీదు పెంచి చెబుతున్నావు? అని అడుగుతారు. కానీ, ఇందులో ఉన్న కష్టం గురించి మాకు మాత్రమే తెలుసు.”
ఉత్తర చెన్నై తీరప్రాంతం వెంబడి థర్మల్ పవర్ ప్లాంట్లు పెరగడంతో భూగర్భ జలాలు ఉప్పగా మారుతున్నాయి. ఇది ఇక్కడ వ్యవసాయ కార్యకలాపాలను తగ్గిపోయేలా చేసి, నేల సహజ లక్షణాలను ప్రభావితం చేస్తోంది. "ఈ రోజుల్లో నాకు ఎక్కడా బంక మట్టి దొరకటంలేదు," ముడి పదార్థాల కోసం వెతకవలసి వస్తుండటంతో ఫిర్యాదుగా అన్నారు డిల్లీ అన్న .
బంకమట్టిని కొనడం చాలా ఖర్చుతో కూడుకున్నదని చెప్తూ, “మట్టి కోసం నేను నా ఇంటి దగ్గర [నేలని] తవ్వి, ఆపై ఇసుకతో ఆ గుంటను నింపుతాను,” అంటూ మట్టి కంటే ఇసుక చవకైనదని అన్న వివరించారు.
అత్తిపట్టులో విగ్రహాల తయారీదారుడు ఈయన ఒక్కరే కాబట్టి, బహిరంగ ప్రదేశాల్లోని మట్టిని తవ్వడానికి పంచాయతీని ఒప్పించడం కష్టమైన విషయం. “విగ్రహాలు తయారుచేసే కుటుంబాలు ఒక పదీ ఇరవై దాకా ఉంటే, మేం గుంటల దగ్గరా, సరస్సుల దగ్గరా తవ్వటానికి అనుమతి అడగవచ్చు. పంచాయితీ మాకు మట్టిని ఉచితంగా అందించేది కూడా. కానీ, ఇప్పుడు విగ్రహాలు తయారుచేస్తున్నది నేనొక్కడినే కావటంతో అడగడం నాకూ కష్టమే. అందుకే నేను నా ఇంటి చుట్టూ ఉన్న మట్టిని తీసుకుంటున్నాను.”
చేతితో వరి కోయటం నానాటికీ తగ్గిపోతుండటంతో, డిల్లీ అన్న కు విగ్రహాల తయారీకి కావాల్సిన గడ్డిపొట్టు కరవైంది. “యంత్రాల వాడకం వలన, మనకు ఎక్కువగా గడ్డి పొట్టు రాదు. పొట్టు ఉంటేనే పని ఉంటుంది. లేకపోతే లేదు,” అన్నారతను. “నేను ఎక్కడో అక్కడ వెతికి వరి కోతల ద్వారా పంటను తీసే వారినుండి గడ్డిపొట్టు తీసుకుంటాను. నేను పూల కుండీలను, మట్టి కుంపట్లను తయారుచేయడం కూడా మానేశాను. నిజానికి వాటి అవసరం చాలా ఎక్కువగానే ఉంది, కానీ వాటిని తయారుచేయలేకపోతున్నాను.

విగ్రహం పునాది దృఢంగానూ బలంగానూ ఉండాలి. అలా బలంగా ఉండటానికి డిల్లీ అన్న ఎండుగడ్డి, ఇసుక, మట్టి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. అతను తన ఇంటి చుట్టుపక్కల ఉన్న మట్టిని ఇందుకోసం తీసుకుంటారు. 'ముందుగా మట్టి గడ్డలను నలగగొట్టాలి, తరువాత అందులో ఉండే రాళ్ళను తీసివేసి శుభ్రం చేయాలి, ఆపైన ఆ మట్టిలో ఇసుక, గడ్డిపొట్టు కలపాలి'


విగ్రహాల పునాది పటిష్టంగా ఉండేందుకు మరో పొర మట్టి మిశ్రమాన్ని పూస్తోన్న డిల్లీ అన్న. 'ఈ మొత్తం పనిని నేరుగా ఎండ వేడి తగలకుండా నీడలో చేయాలి, లేకపోతే మట్టి అంటుకోకుండా విరిగిపోతుంది. విగ్రహాలు తయారయిన తరువాత, అవి పూర్తిగా సిద్ధం కావటానికి నేను వాటిని ఆవంలో కాలుస్తాను’
అతను తన సంపాదనను ఇలా వివరించారు: “నేను ఒక గ్రామానికి విగ్రహాన్నివ్వడానికి 20,000 రూపాయలు తీసుకుంటాను, కానీ ఖర్చులు పోగా నాకు రూ. 4,000 మిగులుతాయి. నేను నాలుగు గ్రామాల కోసం విగ్రహాలు చేస్తే రూ. 16,000 సంపాదించగలను.
ఫిబ్రవరి నుండి జూలై వరకు వేసవి కాలంలో మాత్రమే అన్న విగ్రహాలను తయారుచేస్తారు. ఆడి [జూలై] మాసంలో ఉత్సవాలు ప్రారంభమైనప్పుడు, ప్రజలు విగ్రహాలను కొనుగోలు చేయడానికి వస్తారు. “నేను ఆరు నుండి ఏడు నెలల పాటు కష్టపడి తయారుచేసినవి ఒక్క నెలలో అమ్ముడుపోతాయి. మిగిలిన ఐదు నెలలకు ఏ ఆదాయం ఉండదు, నేను విగ్రహాలను అమ్మినప్పుడే నాకు డబ్బు వస్తుంది.” అయితే, ఇంక వేరే పనేదీ చూసుకోనని డిల్లీ అన్న చెప్పారు.
ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు ఆయన పని ప్రారంభమవుతుంది. అలా ఎనిమిది గంటల పాటు ఆ పని కొనసాగుతుంది. ఆరుతున్న విగ్రహాలను ఆయన నిరంతరం గమనిస్తూ ఉండాలి, లేదంటే అవి ఒకోసారి విరిగిపోవచ్చు. తన వృత్తి పట్ల తనకున్న అంకితభావాన్ని గురించి ఆయన నాకు ఒక చిన్న కథ చెప్పారు: “ఒకసారి నేను రాత్రిపూట ఊపిరి పీల్చుకోలేక చాలా అవస్థపడ్డాను. తెల్లవారుజామున ఒంటి గంటకు సైకిల్‌పై హాస్పిటల్‌కి వెళ్లాను,” అని డిల్లీ అన్న గుర్తు చేసుకున్నారు. “డాక్టర్లు నాకు గ్లూకోజ్ [ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్] ఎక్కించారు. స్కానింగ్ కోసం అదే రోజు ఉదయం నా సోదరుడు నన్ను మరొక ఆసుపత్రికి తీసుకెళ్ళాడు, కాని రాత్రి 11 గంటల తరువాతే స్కానింగ్ చేస్తారని అక్కడి సిబ్బంది చెప్పారు." డిల్లీ అన్న స్కాన్ చేయించుకోకుండానే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే "నేను విగ్రహాలను చూసుకోవాల్సి ఉంది."
30 ఏళ్ళ క్రితం డిల్లీ అన్న కుటుంబానికి కట్టుపల్లి గ్రామంలోని చేపాక్కం పల్లెలో నాలుగు ఎకరాల భూమి ఉండేది. “అప్పట్లో నా ఇల్లు చేపాక్కం సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో గణేశ్ గుడి దగ్గర ఉండేది. వ్యవసాయం చేసుకోవటానికి సులభంగా ఉంటుందని మేం మా భూమికి దగ్గరగా ఇల్లు కట్టుకున్నాం,” అని ఆయన చెప్పారు. క్రమేణా భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోవడంతో సాగుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆ ఇంటిని అమ్మేసి వాళ్ళు అత్తిపట్టుకు మారిపోయారు.

బంకమట్టి, ఇసుక, గడ్డిపొట్టుల మిశ్రమం. ఉత్తర చెన్నై తీరప్రాంతం వెంట థర్మల్ పవర్ ప్లాంట్‌లు పెరగటం వలన భూగర్భ జలాలు ఉప్పునీరుగా మారిపోవడంతో ప్రస్తుతం మట్టి, గడ్డిపొట్టు దొరకడం కష్టంగా మారింది. అంతేకాకుండా ఉప్పు జలాల వలన ఇక్కడ వ్యవసాయ పనులు కూడా తగ్గిపోవడంతో గడ్డిపొట్టు తక్కువగా లభ్యమవుతోంది

విగ్రహం కాళ్ళను కలపడం కోసం అదనంగా మరొక పొర మట్టి మిశ్రమాన్ని పూస్తున్న డిల్లీ అన్న. ఆయన చేసే విగ్రహాలు ఎణ్ణూర్ కుప్పం, మఖద్వార కుప్పం, తాళాంగుప్పం, కాట్టుకుప్పం, మేట్టుకుప్పం, పాల్‌తొట్టికుప్పం, చిన్నకుప్పం, పెరియకుళం గ్రామాలకు చేరుతుంటాయి
“మేం నలుగురం [తోబుట్టువులం], అయితే నేను మాత్రమే ఈ సంప్రదాయ పనిని కొనసాగిస్తున్నాను. నాకు పెళ్ళి కాలేదు. ఈ కొద్ది సంపాదనతో నేను నా కుటుంబాన్ని లేదా బిడ్డను ఎలా పోషించగలను?" అంటారతను. ఈ పని వదిలేసి మరేదైనా పనిని చేపడితే మత్స్యకార సముదాయాల కోసం ఈ విగ్రహాలను తయారుచేసేవారు ఉండరని డిల్లీ అన్న భయపడుతున్నారు. "ఇది నా పూర్వీకుల ద్వారా నాకు వంశపారంపర్యంగా సంక్రమించింది. నేను దీనిని విడిచిపెట్టలేను. వారి వద్ద [జాలర్లు] ఈ విగ్రహాలు లేకపోతే, వారు కష్టాలపాలవుతారు."
డిల్లీ అన్న కు విగ్రహాల తయారీ కేవలం వృత్తి మాత్రమే కాదు, ఒక వేడుక కూడా. తన తండ్రి కాలంలో ఒక విగ్రహాన్ని 800 లేదా 900 రూపాయలకు అమ్మేవారమని ఆయన గుర్తు చేసుకున్నారు. విగ్రహం కొనడానికి వచ్చిన వారందరికీ భోజనం పెట్టేవారు. "అది ఒక పెళ్ళిల్లులా ఉండేది," అని ఆయన గుర్తుచేసుకున్నారు.
విగ్రహాలు పగలకుండా కాలితే డిల్లీ అన్న కు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ మట్టి వస్తువులే అతనికి తోడుగా మారాయి. “ఈ విగ్రహాలను తయారుచేస్తున్నప్పుడు నాతో ఒక వ్యక్తి ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. నేను ఈ విగ్రహాలతో మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఈ విగ్రహాలు నాతో కూడా ఉన్నాయి. [కానీ] నాకు కష్టంగా అనిపిస్తుంటుంది... నా తర్వాత ఈ విగ్రహాలను ఎవరు తయారుచేస్తారు?" అడుగుతారతను.

‘ఈ పని మొత్తం నీడలోనే చేయాలి, ఎందుకంటే నేరుగా తగిలే ఎండ వేడికి మట్టి అంటుకోదు, విరిగిపోతుంది’ అంటారు డిల్లీ అన్న


ఎడమ: విగ్రహాల అంచులను సున్నితంగా చేయడానికి ఉపయోగించే నీటిని మోసుకెళ్తోన్న అత్తిపట్టు విగ్రహ తయారీదారుడు; కుడి: అతని పెంపుడు పిల్లి

ఏనుగు, గుర్రాల రూపాలే ఈ విగ్రహాలకు ఆధారం; తీవ్రమైన ఎండవేడిమి నుండి రక్షించేందుకు వాటిని కప్పి ఉంచుతారు


కన్నిసామి విగ్రహం ముఖానికి ఆకారాన్నిస్తూ డిల్లీ అన్న, 'విగ్రహం తయారుచేయడం ప్రారంభించినప్పటి నుండి అది పూర్తయ్యే వరకు, నేను ఒంటరిగానే పనిచేయాలి. సహాయకుడికి చెల్లించడానికి నా దగ్గర డబ్బు లేదు' అన్నారు

రంగులు వేయడానికి సిద్ధంగా ఉన్న ఎండిన విగ్రహాలు


ఎడమ:
తెలుపు రంగు వేసిన కన్నిసామి విగ్రహాలు. కుడి: తన కళాత్మక కృషిని ప్రదర్శిస్తోన్న డిల్లీ
అన్న. అత్తిపట్టు చుట్టుపక్కల ఉండే మత్స్యకారుల కోసం ఈ విగ్రహాలను తయారుచేస్తున్న ఏకైక
కళాకారుడు ఈయనే

డిల్లీ అన్న ఐదు రకాల కన్నిసామి
విగ్రహాలను తయారుచేస్తారు


పూర్తయిన కన్నిస్వామి విగ్రహంతో వాటిని తయారుచేసిన కళాకారుడు (కుడి)

అమ్మకానికి
ముందు విగ్రహాలకు తెల్లటి గుడ్డను చుడుతున్న డిల్లీ అన్న

అత్తిపట్టులోని డిల్లీ అన్న ఇంటి నుండి తెల్లటి వస్త్రం చుట్టిన విగ్రహాలను తీసుకెళ్తున్న మత్స్యకారులు

విగ్రహాలను భుజాలపై మోస్తూ తీసుకువెళ్తున్న మత్స్యకారులు. ఇక్కడి నుంచి వారు పడవలో స్వగ్రామాలకు వెళ్తారు. నేపథ్యంలో ఉత్తర చెన్నైలోని థర్మల్ పవర్ ప్లాంట్ సమీపంలో ఉన్న కొసస్థలైయ్యార్ నది

కన్నిసామి విగ్రహాలతో స్వగ్రామాలకు తిరిగి వచ్చినపుడు ఆచారంలో భాగంగా టపాసులు పేల్చుతున్న గ్రామస్థులు

కన్నిసామి విగ్రహాలను తమ పడవలపై పెట్టుకొని తీసుకెళుతున్న మత్స్యకారులు

పడవలో గ్రామానికి తిరిగివస్తున్న కన్నిసామి విగ్రహాలు

పడవలపై నుంచి విగ్రహాలను తమ ఇళ్ళకు చేరవేస్తూ నినాదాలు చేస్తున్న మత్స్యకారులు

ఎణ్ణూర్ కుప్పం ఉత్సవాల్లో భాగంగా కోడిపుంజును బలి ఇస్తున్న డిల్లీ అన్న

ఇప్పుడు
గ్రామ సరిహద్దుల్లో పెట్టేందుకు సిద్ధంగా ఉన్న విగ్రహాలు
అనువాదం: పద్మావతి నీలంరాజు